telugudanam.co.in

      telugudanam.co.in

   

అద్వైత త్రయం

దేవుడు ఉన్నాడని అంగీకరించే మతం ఆస్తిక మతం. ఆస్తికులలో జీవులు చేతులు, కాళ్ళు మొదలైన వివిధ శరీరావయవాలులాగా దేవుని చేరి ఉంటారని చెప్పేవారు విశిష్టాద్వైతులు. జీవుడికీ, దేవుడికీ అన్ని కాలాల్లోనూ, అన్ని అవస్థలలోనూ భేదం ఉంటుందని వాదించేవారు ద్వైతులు. రెండు విధాలు కానిది, భేదం లేదని వాదించేవారు అద్వైతులు. ఈ వాదాన్ని ప్రతిపాదించినవారు శ్రీ శంకరాచార్యులు. అద్వైత వాదాన్నే "మాయా వాదం" అంటారు. దీనినే ప్రచ్చన్న బౌద్ధం అని కూడా అంటారు. ఈ దేహమే దేవాలయం. అందులో జీవుడే దేవుడు. దేహం పోయినా జీవుడు ఉంటాడని అద్వైతుల వాదన. దేహం నశించాక జీవుడు వేరే శరీరంలో ప్రవేశిస్తాడు. లేకపోతే ప్రకృతితో అంతర్లీనమైపోతాడు. పాలలో ఉండే వెన్నను తీసేస్తే ఆ వెన్న తిరిగి పాలలో కలవదు. అలాగే దేవుడు నుండి జీవుడుని వేరుచేస్తే ఆ జీవుడు తిరిగి దేవుడులో కలవడు. కాబట్టి జగత్తు సత్యం, జీవుడు సత్యం అంటుంది విశిష్టాద్వైతం. విశిష్టాద్వైత వాదాన్ని ప్రతిపాదించినవారు శ్రీరామానుజాచార్యులవారు.

అద్వైత విశిష్టాద్వైతాల తరువాత ద్వైతమతం ఆవిర్భవించింది. ఈ మతాన్ని స్థాపించింది ఆనందతీర్ధులు. వీరినే మధ్వాచార్యులు అని కూడా అంటారు. వీరు జగత్తు సత్యం, దేవుడు సత్యం, జీవుడు సత్యం అంటారు. జీవుడూ, దేవుడూ ఎప్పటికీ ఒక్కటి కాజాలరు. భక్తి చేతనే జీవుడు తరిస్తాడు అని ద్వైతులు అంటారు. వీరికి వేదాలు ప్రమాణమైనా భాగవతం వీరి బోధనలకు ముఖ్యం. రెండుగా ఉండడం అంటే జీవాత్మ, పరమాత్మలకు భేదం చెప్పే మతం ద్వైతం. జీవాత్మ, పరమాత్మలకు భేదం చెప్పేవాడు ద్వైతవాది.

అద్వైతం జీవులలో పరస్పర భేదాన్ని నిర్దేశిస్తూ ఈశ్వరునితో కూడా భేదాన్ని నిర్దేశిస్తుంది. అద్వైతం జీవులలో మాయను తొలగించి శుద్ధ చైతన్య రూపంలో సర్వానికి అభేదాన్ని ఋజువు చేస్తుంది. అంటే ఆత్మ శుద్ధ చైతన్య రూపం అనీ, సర్వాన్నీ తెలుసుకోగల శక్తి సర్వసాక్షి అనే సంకేతంలో ఉందని, జీవులందరూ తదితర వస్తువులందు భేదాన్ని సాధించే సదుపాయాలన్నీ కల్పితాలు అని తెలుస్తుంది. అంతా మాయ అని తెలుస్తుంది. అద్వైతం, భావాద్వైతం, క్రియాద్వైతం, ద్రవ్యాద్వైతం అని మూడు విధాలుగా ఉంటుంది. మూల రూపానికి వివిధ అవతార రూపాలకి పరస్పర భేదం లేదని తెలుసుకుని ప్రవర్తించడం భావాద్వైతం. బట్టకీ, బట్టలో ఉండే నూలు పోగులూ ఏవిధంగా అభేదంగా ఉంటాయో అదే విధంగా కారణ కార్యగత రూపాలకి ఏమీ తేడా ఉండదు. ప్రకృతి, ప్రపంచం కూడా స్వతంత్రంగా ఏ కార్యాన్నీ పుట్టించడం లేదు. కారణ కార్యాలలో భగవంతుని రూపాలు సన్నిహితమై ఉండటం వల్ల కార్యాలు ఉద్భవిస్తున్నాయి. కారణ కార్యగతమైన భగవద్రూపాలకి పరస్పరం భేదం లేదని చింతన చేయడం భావాద్వైతం.

ఇంద్రియ వ్యాపారాలు భగవంతుడు లేనిదే జరగవు. అన్ని కర్మలూ భగవంతునికీ, భగవంతుని అధీనంలో ఉన్న బుద్ధితో సమర్పించడం క్రియాద్వైతం. జ్ఞాన కర్మేంద్రియాలతో చేసే పనులన్నీ శ్రీమన్నారాయణుడే చెప్పి ఆయావిధాలుగా చేయిస్తున్నాడని తెలుసుకోవడం క్రియాద్వైతం. నేను కర్తను కాదు, హరియే కర్త అని తెలుసుకోవడం క్రియాద్వైతం. కుటుంబం, భార్య, బిడ్డలు, ఇతర వస్తువులు సర్వమూ భగవంతుని అధీనం అని తెలుసుకుంటూ సర్వమూ ఆ పరమాత్మునికే అర్పించికోవడం ద్రవ్యాద్వైతం. ధనాది ద్రవ్యాలలో శ్రీనారాయణుడు నామ, రూప, అక్షరాలలో వ్యాప్తుడై ఉంటాడనే ఐక్య భావన ద్రవ్యాద్వైతం.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: