www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

రక్తదానము

సుప్రసిద్ద ఆంగ్లేయ వైద్యుడు, శరీర శాస్త్రజ్ఞుడు విలియం హార్వే (1578 - 1657) మానవ శరీరంలో రక్త ప్రసార విధానాన్ని కనుగొన్నాడు. రక్త ప్రసార కార్యక్రమాన్ని ఇతడు ప్రత్యక్షంగా నిరూపించాడు. దీనిని తెలుసుకున్న తరువాత మానవుని యందు రక్తదానము, శరీరంలోకి నెత్తురు ఎక్కించుట అనే విషయాలపై అభిలాష, ఆసక్తి పెరిగింది. ఇంతకుముందు శరీరంలో రక్తం పోటుతో ప్రవహిస్తుందనే సిద్ధాంతం ప్రచారంలో ఉండేది. హార్వే రక్త ధమనుల, నాళముల ధర్మాన్ని ప్రత్యక్షంగా రుజువుచేసి సూక్ష్మ నాళముల (కెపిలరీల) ఆవశ్యకతను కనుగొన్నాడు.

తీవ్రమైన రక్త నష్టము ఏర్పడినప్పుడు మానవుని ప్రాణాలను రక్షించడానికి రక్తాన్ని శరీరంలోకి ఎక్కించి నష్టాన్ని పూర్తి చేయడం ఆవశ్యకమని 1665 వ సం||రంలో రిచర్డ్‌లోవర్ మొట్టమొదట  ప్రతిపాదించాడు.

మొట్టమొదట  రక్తాన్ని ఎక్కించిన ఘనత 1667 వ సం.లో 14 వ లూయి చక్రవర్తికి స్వంత వైద్యుడు డా. జీన్ బాఫ్‌టిఫ్టేకి దక్కుతుంది. జూన్ 12. 1667 న ఇతడు 14 సం.ల వయస్సు గల బాలుని శరీరంలో తీవ్రమైన ఉష్ణాన్ని తగ్గించడానికి బాలుని శరీరం నుంచి కొంత పరిమాణం రక్తాన్ని స్రవింపజేసి తరువాత 9 ఔన్నుల రక్తాన్ని శరీరంలోకి ఎక్కించాడు. బాలుని పరిస్థితి తాత్కాలికంగా అభివృద్ధి పొందింది. ఇతడు మేకపిల్ల సీరం  నుంచి తీసిన రక్తాన్ని ఉపయోగించాడు. రక్తాన్ని ఎక్కించడం తెలుసుకోవడానికి ఆ తరువాత 150 సంవత్సరాలు పట్టింది.

1818 వ సంవత్సరం సెఫ్టెంబరు నెలలో లండన్ ప్రసవ వైద్య నిపుణుడు జేమ్‌బ్లండెల్ తొలిసారి ఒక మానవుని నెత్తురు మరియొక మానవునికి ఎక్కించాడు. ఇతడు కొంతమంది యువకుల నుండి 14 ఔన్సుల రక్తాన్ని గ్రహించి తీవ్రరోగంతో మరణావస్థలో ఉన్నవానికి ఎక్కించాడు. కానీ రోగ తీవ్రతవల్ల రోగిని బ్రతికించలేక పోయాడు.

తొలిసారి 1825 వ సం.లో నెత్తురు ఎక్కించడం విజయవంతంగా కొనసాగింది. లండన్ లో డా.డాబల్‌డే అనే వైద్యుడు ఒక వ్యక్తికి నెత్తురు ఎక్కించి ప్రాణనష్టం కలగకుండా రక్షించాడు. నాటినుండి రక్తదానం, రక్తాన్ని నిల్వ ఉంచడం, రక్తాన్ని ఎక్కించడం అనే ప్రక్రియలు పరిపూర్ణంగా సంసిద్ధి పొందడానికి ఒక శతాబ్దకాలం పట్టింది.అమెరికాలో కార్ల్‌లాండ్ స్టీనెర్ (1868- 1943) వివిధ బ్లడ్ గ్రూపులను తెలుసుకున్నాడు. 1900 వ సం.రం. లో ఇతడు మానవ శరీరం నెత్తురులో నాలుగు ముఖ్యమైన గ్రూపులను పోలికపట్టి తెలుసుకోగలిగాడు. ఇతడు ఫిజియాలజీ అండ్ 'మెడీసిన్ లో 1930 వ సం.పు నోబెల్ బహుమతి  పొందాడు. డా. జాన్స్కే అనే నార్వే దేశపు శాస్త్రజ్ఞుడు బ్లడ్ గ్రూపింగ్‌ను సమగ్రవంతం చేసాడు. ఇటీవల 1908 వ సంవత్సరంలో డా. రూబెన్ ఆట్టోబెర్గ్ అనే వైద్యుడు క్రాస్ మాచింగ్ విధానాన్ని అభివృద్ధిపరచి ముందు తరం వారికి బ్లడ్ ట్రాన్స్‌ప్యూజన్  నిరపాయకరం చేసాడు.

సోడియం సిట్రేటు కలిసి నెత్తురు గడ్డ కట్టకుండా నిరోధించవచ్చని బెల్జియంకు చెందిన డా. బుస్టిన్ నిరూపించాడు. మార్చి 27, 1914 న ఇది బ్రుసెల్స్‌లో సెంట్ జీన్ హాస్పిటలులో ప్రత్యక్షంగా ప్రతిపాదించాడు. కానీ ఆనాడు రక్తం కొన్ని గంటలసేపే నిల్వ ఉండేది. దీర్ఘకాలాల పాటు రక్తాన్ని నిల్వచేయడం అమేరికాలో 1917 వ సం.లో            డా. ఆస్వాల్డ్ రాబర్ట్‌సన్ తెలుసుకున్నాడు.

మొట్టమొదటి బ్లడ్ బాంక్‌ను 1931 వ సం.లో యుఎస్ఎస్ఆర్ రాజధాని నగరం అయిన మాస్కోలో డా. పెర్‌జెయుడిన్ ప్రారంభించాడు. పూర్వం రక్తం తీయడానికి సక్షన్ కప్పులు, వెండిగొట్టాలు, పక్షుల ఈకలు, జంతువుల ప్రేగులు మొదలైనవి ఉపయొగించేవారు.

శరీరంలో ప్రాణవాయువును చేరదీయడానికి ధమనులలోను, నాళాలలోను ఎర్రటి రక్త ద్రవము ముఖ్యం. ఇది లేకపోతే ప్రాణమే ఉండదు. ప్రాణ నిర్వహణకు కొంత పరిమాణం రక్తప్రసారం అవసరం. కొన్ని రోగాలవల్ల, శస్త్రచికిత్సవల్ల, ప్రసవంవల్ల, విపత్తువల్ల రక్తనష్టం కలిగినప్పుడు ప్రాణాలను కాపాడి రక్షించడానికి రక్తం ఎక్కించడం ఆవశ్యకం. లాబొరేటరీలలో నెత్తురును తయారు చేయడానికి విజ్ఞానం ఇంకా అభివృద్ధి పొందాలి.  కాబట్టి రక్తంతో ఒక ప్రాణాన్ని రక్షించడానికి మానవ శరీరమే రక్తానికి ఆధారం.


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in