|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
విటమిన్లు ఖనిజాలు గల క్యారెట్
విటమిన్లు, ఖనిజాలు రెండింటి ఉత్తమ సమతౌల్యంగల కూరగాయ క్యారెట్. తాజా క్యారెట్ లో మనశరీరానికి అత్యంత ముఖ్యంగా కావలసిన 12 ఖనిజ లవణాల సమతౌల్యాన్ని మనం ఇందులో చూడగలం. మితంగా ఉపయోగపడే పరిమాణములో క్యారెట్ విటమిన్ బి, సి, జి లను ఇస్తూ శరీరానికి అవసరమైన పొటాషియం, ఐరన్, మెగ్నీషియం, సోడియం, మాంగనీస్, సిలికాన్, అయోడిన్ లతో పాటు సల్ఫర్, భాస్వరం, క్లోరిన్ వంటి ఖనిజాలను సరఫరా చేస్తుంది. అతి ఉత్తమమైన, సహజమైన కాల్షియం (సున్నం) చక్కటి సమతౌల్యాన్ని అద్భుతంగా ఇది ఇవ్వగలదు. ఇది మంచి పటిష్టమైన పళ్ళకూ ఎముకలకు, మంచి చర్మానికీ కావలసిన అత్యావశ్యకమైన పదార్ధం. అంతేకాదు మంచి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. వయసు పెరిగే కొద్దీ దృష్టి మందగించడం సాధారణం. తగినంత బీటా, కెరోటిన్, జింక్, ఎ, సి విటమిన్లు తీసుకుంటే అరవై ఏళ్ళు దాటాక కూడా 35 శాతం వరకూ దృష్టి మందగించే నమస్య ఉండదని తాజా పరిశోధనలు చెప్తున్నాయి. నట్స్, వంటనూనెలు, గుడ్లు, ధాన్యాల నుంచి ఎ విటమిన్, సముద్ర ఆహారపదార్ధాల నుంచి, కోడిమాంసం, పాల ఉత్పత్తుల నుంచి జింక్, నిమ్మ జాతి పండ్ల నుంచి విటమిన్ సి లభిస్తుంది. వయసు పెరుగుతుంది ఇది మామూలే అనుకోకుండా ఈ ఆహార పదార్ధాలు పుష్కలంగా తీసుకొంటూ దృష్టి లోపాలకు దూరంగా ఉండమని పరిశోధకుల సూచన.
క్యారెట్‌లో ఉండే పోషకాలు
మనం ప్రతిరోజు తినే కూరగాయల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి. వాటిని అశ్రద్ద చేయకుండా తింటుంటే పలు అనారోగ్యాల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. కళ్ళు, చర్మం, జుట్టు, పళ్ళు ఇవన్నీ అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే క్యారెట్ తింటే చాలు. క్యారెట్‌లో ఉండే ఫైటో కెమికల్స్ యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేస్తాయి. మన జీవితం నిత్యం ఒత్తిడికి గురవుతుంది ముఖ్యంగా సాయంత్రం అయ్యేసరికి శరీరం, మనసూ రిలాక్స్ కావాలంటే ఒక గ్లాసు చల్లటి క్యారెట్ జ్యూస్‌ని తీసుకోవాలి. క్యారెట్‌లో ఉన్న పీచుపదార్ధం జీర్ణశక్తిని వృద్ది చేస్తుంది. చిన్న పిల్లలకు ఉదయాన్నే రెండు పచ్చి క్యారెట్లు ఇచ్చి తినమని చెప్పాలి. పచ్చి క్యారెట్లు తినటం వల్ల కంటి చూపుకి శక్తినిచ్చే విటమిన్ 'ఎ' సమకూరుతుంది. చిన్నా పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరు క్యారెట్‌ని తినవచ్చు. పచ్చివి ఇష్టపడనివారు వాటిని ఉడకబెట్టుకొని తినవచ్చు.
క్యారెట్‌లో ఉండే పోషకాలగురించి తెలుసుకుందాం
శక్తి 48 కేలరీలు, పీచు 1.5 గ్రాములు, ప్రొటీన్లు 1 గ్రా, కొవ్వు 0 శాతం, సోడియం 52 మిల్లీ గ్రా., విటమిన్ సి 24 శాతం, పొటాషియం 108 మిల్లీ గ్రా., నీరు 88 శాతం, కాల్షియం 80 మి.గ్రా., ఐరన్ 1 మి.గ్రా.
క్యారెట్లు కళ్లకూ పోషణ
చాలా మంది క్యారెట్లు తింటే కళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉంటాయని నమ్ముతుంటారు. ఆ మాట నిజమే. అయితే నిజానికి ఒక్క క్యారెట్లే కాదు కళ్ళను చక్కగా పరిరక్షించుకునేందుకు ఉపయోగపడే ఆహార పదార్ధాలు ఇంకా చాలా ఉన్నాయి. అదృష్టవశాత్తు ఇవన్నీ మనకు తేలికగా లభించేవే. అంత ఖరీదైనవీ కాదు. కాబట్టి మన కంటికీ పోషకాహారం అవసరమని గుర్తించి నిత్యం ఈ పదార్ధాలను మన ఆహారంలో ఉండేలా చూసుకోవటం మంచిది. కంటి నిర్మాణం చాలా సున్నితమైనదే కాదు. చాలా చిత్రమైనది కూడా. ఎందుకంటే శరీరంలోని ఇతర భాగాలతో పోలిస్తే కంటిలోని రెటీనా పొరకింద ఉండే కణజాలానికి రక్త ప్రసారం చాలా ఎక్కువగా ఉంటుంది. తర్వాత కంటిలో పారదర్శకంగా ఉండే కార్నియా, లెన్సు వంటి వాటికి ప్రత్యక్షంగా రక్త ప్రసారం ఉండదు. కాబట్టి అవి తమకు కావల్సిన పోషకాల కోసం కంటిలోని ద్రవాల మీద ఆదారపడతాయి. వీటన్నిటినీ దృష్టిలో ఉంచుకొని చూస్తే మన కంటి పోషణ కోసం ప్రత్యేక శ్రద్ద అవసరమని అర్ధమవుతుంది.
క్యారెట్లలో బీటకెరోటీన్ ఉంటుంది. ఇదే మన శరీరంలో విటమిన్ 'ఎ' తయారీకి దోహదం చేస్తుంది. కంటి రెటీనా పొరలో ఉండే 'ఫోటోరెసెప్టార్స్' కాంతిని గ్రహించిన తర్వాత తిరిగి పునర్తేజం పొందేందుకు విటమిన్ 'ఎ' చాలా అవసరం. విటమిన్ 'ఎ' లోపిస్తే రేచీకటి వస్తుంది. కళ్ళు తరచూ పొడి బారుతూ దురదల వంటి బాధలు మొదలవుతాయి. కాబట్టి విటమిన్ 'ఎ' లోపం రాకుండా చూసుకొనేందుకు క్యారెట్లు బాగా తీసుకోవచ్చు. ఇది బొప్పాయి, మామిడి, గుమ్మడి వంటి ముదురు పసుపు రంగు పండ్ల ద్వారా కూడా లభిస్తుంది. కొంత వరకూ ఆకుకూరల్లోనూ ఉంటుంది.
కనువిందు చేసే క్యారెట్
వేరు దుంపలను కాయగూరగా వాడేవానిలో క్యారెట్ ఒకటి. ఆరంజి వర్ణములో కంటికి సుందరముగా కనిపించే దుంపలు క్యారట్. అంతేకాక ఇవి శంఖాకారంలో (కోనికల్) ఆకర్షణీయంగా వుండును. ఇది ఏక హర్షిక గుల్మముగ దుంపలకొరకు సాగుచేయుదురు. లేకున్న బహు వార్షిక. ఇది ధనియాలకు చెందిన 'అంబెల్లి ఫెరే' కుటుంబంలోనిది. క్యారట్‌ను శాస్త్రీయపరంగా 'డాకస్ కరోటా' అందురు. అసలు క్యారెట్ అనగానే కరొటిన్, కరొటిన్ అనగానే విటమిన్ 'ఏ' గుర్తుకు వస్తుంది. ఇందులో విటమిన్ 'ఏ'కు మూలమగు కరొటిన్ అధికము. అంటే కళ్లకు చాలా మంచిది. వీటిని సలాడ్‌గాను, కాయగూరగాను వాడెదరు. ముఖ్యంగా బంగాళదుంపలతో, బఠానీలతోను కలిపి చేసినా చాలా రుచిగా వుండును. అలాగే క్యారెట్ దుంపలను హల్వాగ కూడ చేయుదురు. నల్ల క్యారెట్ నుండి 'కంజీ' అనబడు పానీయమును తయారుచేయుదురు. ఇది ఆకలిని పుట్టించు గుణమును చూపును. ఇంతేకాక గుర్రములకు ప్రత్యేక ఆహారముగ కూడ ఈ దుంపలను వాడెదరు.
నూరు గ్రాముల క్యారెట్ దుంపలలో ఈ క్రింది పోషకవిలువలు ఉంటాయి.
మాంసకృత్తులు -
0.9 గ్రా. క్రొవ్వు పదార్ధము -
0.2 గ్రా. పీచు పదార్ధము -
1.2 గ్రా. ఖనిజములు -
1.1 గ్రా. కార్బొహైడ్రేట్స్ - 1.06 గ్రా. శక్తి - 47 క్యాలరీలు విటమిన్ ' సి ' - 4 మి.గ్రా.
ఇవికాక విటమిన్ 'ఏ', ధయామిన్, రిబోఫ్లేవిన్ నియాసిన్, విటమిన్ 'సి' కూడ కలవు. అన్నిటికన్నా విటమిన్ 'ఎ' అధికము. కంటి జబ్బులు, దృష్టి మందము అధికంగావున్న ఈ కాలంలో కంటికి మేలు చేయు, దృష్టికి తోడ్పడు క్యారెట్‌ను విరివిగ తీసుకోవడం శ్రేష్టం. మూఖ్యంగా పిల్లలకు పచ్చివి తీసుకునే అలవాటు చేయటం తల్లుల కర్తవ్యం.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in