|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
ఫోన్ కొనేటప్పుడు, ఉపయోగించేటప్పుడు
ఈ రోజుల్లో ఫోను వాడకం తప్పనిసరి అయ్యింది. కొన్ని కుటుంబాల్లో మూడు నాలుగు రకాల ఫోన్లు ఉంటాయి. సాధారణంగా ల్యాండ్ లైన్ ఒకటి ఇంట్లో ఉంటుంది. ఇది కాకుండా కొందరి ఇళ్ళల్లో పిల్లల దగ్గరకూడా ఫోన్లు ఉంటున్నాయి. ఒకే మనిషి రెండూ, మూడు ఫోన్లు కూడా మెయింటెయిన్ చేస్తున్నాడు. సెల్‌ఫోను కంపెనీలు రకరకాల ఆఫర్లలో ముందుకు వస్తున్నాయి. దీనితో కొందరు ఫోన్లని కూడా మార్చేస్తున్నారు. కొత్త ఫోన్లు కొంటున్నారు. ఆఫర్ల ఆకర్షణకు లోనయి అవసరమున్నా లేకున్నా మరో సెల్ కొంటున్నవారి సంఖ్య బాగానే పెరుగుతుంది. దీనితో నెలవారీ ఫోను బిల్లులు బాగానే చెల్లించాల్సి వస్తుంది. మధ్యతరగతి కుటుంబాల వారికి ఈ బిల్లులు కొన్నిసార్లు భారంగా తయారవుతున్నాయి. అలాగే ఫోన్లు కొనడంలో, వాడకంలో, నిర్వహణలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే నెల తిరిగేసరికి ఫోను బిల్లు తడిసి మోపెడు అవుతుంది. పర్సు బరువు తగ్గుతుంది.
ఇంట్లో ల్యాండ్ లైన్ ఉంటుంది. బయట భర్త లేదా భార్య దగ్గర ఉన్న సెల్‌కు ఫోను చేస్తుంటారు. అయితే ల్యాండ్ లైన్ నుంచి సెల్‌ఫోనుకు ఫోను చేస్తే చార్జి ఎక్కువ పడుతుంది. కనుక సెల్ టు సెల్ చేయటమే ఉత్తమం. లేదంటే అవసరమున్నంతవరకే మాట్లాడాలి. మాట్లాడటం అయిన తరువాత నువ్వు పెట్టు అంటే నువ్వు పెట్టు అని భార్యాభర్తలు వంతులకు పోతే బిల్లు ఎక్కువవుతుంది.
సెల్, ల్యాండ్‌లైన్ ఉన్నవారు ఎప్పుడైనా బిల్లు ఎక్కువ రాగానే ఏదో ఒకటి తీసేయాలనుకుంటారు. బిల్లు ఎక్కువ వస్తుంది కాబట్టి ఏదో ఒక ఫోను కట్ చేయడం మార్గంగా తలపోస్తారు. కానీ ఇది పరిష్కారం కాదు. ఎందుకంటే ల్యాండ్ లైన్ ఉండగా సెల్ ఎందుకు తీసుకుంటారు. అవసరం కాబట్టి. అవసరాల్ని తగ్గించుకోవడం కాకుండా అవసరమయినంత మేరకు ఉపయోగించుకోవడం మంచిది.
ఇంట్లో సెల్, ల్యాండ్‌లైన్ ఉన్నప్పుడు ల్యాండ్‌లైన్ నంబర్స్‌కి ల్యాండ్‌లైన్ నుంచి చేయాలి, సెల్ ఉన్నవారికి సెల్ నంబర్స్‌కే చేయాలి. సెల్ నుంచి ల్యాండ్‌లైన్‌కి చేసినా, ల్యాండ్ లైన్ నుంచి సెల్‌కు చేసినా కాల్ చార్జీలు ఎక్కువ పడతాయి.
దూరదేశాలకి, దూరప్రాంతాలకి ఫోను చేసినప్పుడు బిల్లు పెరుగుతుందన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. అవతలి వ్యక్తులు చేసినప్పుడు సోది చెప్పకుండా నేరుగా అసలు విషయాలే మాట్లాడాలి.
మీరు అందిచాల్సిన సమాచారం చిన్నదయితే ఎస్. ఎం. ఎస్ (SMS) ఇవ్వండి. అత్యవసరమైతేనే ఫోను చేయండి.
దూరప్రాంతాల్లో ఉన్న ఫ్రెండ్‌కి సమాచారం అందజేయడానికి ఫోను చేయడం కన్నా ఈమెయిల్ ఇస్తే మంచిది. అత్యవసరం కాని విషయాన్ని చెప్పడానికి ఈ రకమైన పద్దతిని అనుసరించాలి.
పిల్లలకు కూడా ఫోనుల్లో ఎంతసేపు మాట్లాడాలో చెప్పాలి.
అవసరమైనంత మేరకు మాత్రమే మాట్లాడే అలవాటు చేయాలి. అనవసర విషయాలన్నీ ఫోనులో ఏకరువు పెట్టడం మంచిది కాదని తెలియజేయాలి.
ఒక ఫ్రెండ్‌ని కలిసి గంటసేపు మాట్లాడాల్సిన విషయాల్ని ఫోనులో మాట్లాడటం కన్నా కలిసి మాట్లాడటం మంచిది. ఫోనులోనే మాట్లాడక తప్పని సమయమయితేనే ఫోనులో ఎక్కువసేపు మాట్లాడాలి.
కొన్ని మొబైల్ ఫోను కంపెనీలు కొన్నాళ్ళపాటు ఔట్ గోయింగ్ కాల్స్‌ని ఉచితంగా అందజేస్తున్నాయి. అందుకని కొందరు రెండో సెల్ కొంటున్నారు. ఈ విధంగా రెండవ ఫోను కొనేటప్పుడు ఆలోచించుకోవాలి. ఆఫర్ ఉందని కొన్నా దానివల్ల ప్రయోజనం ఉందో లేదో తేల్చుకోవాలి.
కొందరు తమకు ఉన్న సెల్‌ఫోన్ స్థానంలో కొత్తది కొనాలనుకుంటారు. మార్కెట్లోకి రకరకాల స్కీములతో ఎప్పటికప్పుడు కొత్తరకాల ఇన్స్ట్రుమెంట్స్ వస్తున్నాయి. వీటిని కొనాలని చాలా మంది ఆశపడుతుంటారు. కానీ తమ అవసరాన్ని ప్రాతిపదికగా తీసుకోవాలి. తాత్కాలికంగా చేతిలో డబ్బులు ఉన్నా వాటిని కొనడం ఎంతవరకు అవసరమో ఆలోచించాలి. అలాగే తమ ఆర్థిక ప్రాధాన్యాల్ని దృష్టిలో వుంచుకోవాలి.
ఫోన్లు ఉండటం వల్ల సంబంధ బాంధవ్యాలు పెరుగుతాయి. మనుషులు సన్నిహితులవుతారు. సమాచారం తెలుస్తుంటుంది. అందుకని ఫోన్లు ఉండాలి. అయితే బిల్లులు పెరగకుండా చూసుకోవాలి. సమ్యమనంతో వాడటం నేర్చుకోవాలి. అపరిచితులయిన వారి సెల్‌కు ఫోను చేసినప్పుడు వారితో ముందుగా 'ఎక్స్ క్యూజ్మి (క్షమించాలి) అంటూ సంభాషణ ప్రారంభించాలి.
ఇతరుల అనుమతి లేకుండా ఎవరి సెల్ నెంబరు కూడా మరొకరికి ఇవ్వకూడదు.
ఉదయం ఎనిమిది గంటల లోపు, రాత్రి పదిగంటల తర్వాత అత్యవసరమైతే తప్ప ఫోను చేయకూడదు. అలాగే మధ్యాహ్నం సమయం, ముఖ్యంగా ఆదివారం మధ్యాహ్నాలు ఎంతో పనివుంటే తప్ప ఎవరికీ ఫోను చేయకూడదు.
మూలం : వార్త ఆదివారం 21 మే 2006.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in