telugudanam.co.in

      telugudanam.co.in

   

వన్యలోకం

అక్కడికి వెళితే నిజంగానే ప్రకృతి ఒడిలో ఉన్నట్లే. చుట్టూ ఆకుపచ్చని గడ్డి మైదానాలు, అగాధాల వంటి లోయలు, నీలాకాశం, ఎత్తయిన కొండలు, వాటిపైన చిక్కటి దుప్పటిలాంటి వనం, దానినిండా దట్టమైన ఫల ,పూల ఫృక్షాలు, చ ల్ల గాలి, ఆ వాతావరణం మనసును వశపరచుకోవడానికి ఎంతో సమయం పట్టదు. అది ప్రసిద్దిగాంచిన బి.ఆర్.కొండల మాటున ఉన్న ప్రముఖ అభయారణ్యం, బి.ఆర్.కొండలు, అక్కడి అరణ్యం ఒకప్పుడు అడవిదొంగ వీరప్పన్ రహస్య స్థావరాలుగా ఉండేవి. కాబట్టి పర్యాటకుల పెద్దగా అటుకేసి దృష్టి సారించలేదు. ఇప్పుడు మెల్లమెల్లగా వన్యప్రాణి అభిమానులు, ప్రకృతి ప్రేమికులు అరుదైన ఈ సహజ ఉద్యానవనాన్ని సందర్శిస్తున్నారు. దక్షిణ భారతదేశంలో అటు పశ్చిమ కనుములకు, ఇటు తూర్పు కనుములకు మధ్య కర్ణాటక నేలలో విస్తరించినవే బి.ఆర్.కొండలు. ఆకురాల్చే సతత హరిత,గడ్డి మైధాన అడవులకు బి.ఆర్.కొండలు ప్రసిద్దిగాంచినవి.ఏ కొండల గుండె రాగమైనా ఒక అపురూప అనుభవం.అక్కడి స్వచ్చమైన ప్రకృతి కల్మశం లేని హృదయం వంటిది. మైసూరుకు 90కి.మీ.దూరంలో బి.ఆర్.కొండలు ఉన్నాయి.దేశంలోని ప్రముఖ అభయారణ్యాలలో ఇదొకటి. సముద్ర మట్టానికి 5,091 అడుగుల ఎత్తున,సుమారు 500 చదరపు కి.మీ.మేర విస్తరించి ఉన్న ఈ వనాలలో దాదాపు 270 రకాల వృక్షాలు ఉన్నాయి. అభయారణ్యంలో సుసంపన్నమైన పుష్ప, ఫల వృక్ష సంపదకు కొదువలేదు .ఏనుగుల నివాసానికి ఇదొక ఆదర్శ ప్రాంతమనీ అంటారు. ఆసియా ఏనుగులు, పులులు చిరుతలకు ఇది ప్రసిద్ది.ఎక్కడ చూసినా పక్షుల కిలకిలారావాలు, వన్యజీవుల విహారాలు కనువిందు చేస్తాయి.

రాష్ట్ర అటవీశాఖ సందర్శకులకోసం ప్రత్యేక కాటేజీలను అడవి మధ్య కూడా ఏర్పాఉ చేసింది. అక్కడి దాకా జీవులలో వెళ్ళవచ్చు. కాకపోతే దారి ఎగుడు దిగుడుగా అస్తవ్యస్తంగా ఉంటుంది. లోతైన లోయలు, ఎత్తైన కొండల అంచుల మీదుగా, దట్టమైన అడవి గుండా సాగే యాత్ర ప్రకృతి ప్రేమికులకు ఒక అద్వితీయ అనుభూతిని ఇస్తుంది. ఎప్పుడు ఏ పొదల నుండి ఏ వన్యజీవి, మృగం వస్తుందో తెలియని ఉద్విగ్న పరిస్థితి. కావేరి నది బి.ఆర్.కొండలకు ఆగ్నేయం వైపున గల కొల్లేగల్ వద్ద ఒక క్లిష్టమైన మలుపు తిరిగి ఉత్తరం వైపునకు ప్రవహిస్తుంది. బి.ఆర్.హిల్స్ వన్యప్రాణి అభయారణ్యం అనేక అడవి జంతువులకు నిలయంగా ఉంది. విభిన్న రకాల వృక్షజాతులు, జంతుజలాలు ఇక్కడ నివాసమేర్పరచుకున్నాయి. లేళ్ళు, దుప్పులు, సరీసృపాలు, ఎలుగుబంట్లు, చిరుత పులులు, ఏనుగులు, పులులు, రకరకాల పక్షులు పెద్ద సంఖ్యలో ఇక్కడ ఉన్నట్లు చెబుతారు .అడవి తేనె తుట్టెలతో కూడిన చెట్లు అనేకం కనిపిస్తాయి. అభయారణ్యంలోని కాటేజీలో చేసే విడిది ఒక అరుదైన థ్రిల్ నిస్తుంది .చీకటి పడిందంటే చాలు,రాత్రి సంచార జీవుల సందడి మొదలవుతుంది.రాత్రి పూట ఒక అడవి ఎలా నిద్రపోతుందో స్పష్టంగా తెలుస్తుంది.

ఇక్కడి కాటేజీలో జనరేటర్స్ ద్వారా విధ్యుత్ సౌకర్యం ఏర్పాటు చేశారు. అయితే అది రాత్రి పదింటి వరకే ఉంటుందని, తర్వాత నిద్రపోయే నిశిరాత్రివేళ అడవి నిశ్శబ్ధంలో బి.ఆర్.కొండలు, వన్యప్రాణుల గుండెరాగాలు చెవులకు సోకుతాయని, అదొక అద్భుతమని అనుభవజ్ఞులైన పర్యాటకులు అంటారు.ఇక్కడి అభయారణ్యంలో టేకు,దేవదారు తదితర్ వృక్షాలు ఆకాశానికి ఎగబాకినట్లు ఉంటాయి.సుమారు 2000 సంవత్సరాల కిందటిదిగా భావిస్తున్న చెంపక్ చెట్లు ఈ అడవిలో ఉన్నట్లు చెబుతారు."సోలిగస్"గా పిలిచే గిరిజన తెగ ప్రజలు ఈ అడవి వృక్షాన్ని పవిత్రంగా భావించి పూజిస్తారు.


అడవిలో ఆలయం

బి.ఆర్.కొండలు అభయారణ్యాన్ని సందర్శించిన వారు అక్కడి రంగనాథస్వామి ఆలయాన్ని విధిగా దర్శిస్తారు. దీనిని చూడకపోతే అసలు యాత్ర పూర్తి కానట్టేనన్న అభిప్రాయం కూడా యాత్రికులలో ఉంది. ఎత్తైన ఈ పరిసరాల నుండి కనిపించే కొండశ్రేణుల దృశ్యం అత్యద్భుతం. ఒక జీవ వైవిధ్యంతో కూడిన బి.ఆర్.కొండలు ప్రశాంతమైన ప్రకృతి గొప్పదనాన్ని పర్యాటకులకు బోధిస్తాయి. సహజమైన ప్రకృతి ప్రాంతాలను సందర్శించాలనుకునే వారు చూడదగిన ప్రదేశమిది.ముఖ్యంగా పిల్లలతో కలిసి చూడాల్సిన పర్యాటక ప్రాంతమిది.ఇక్కడి పక్షులు, అభయారణ్యంలోని వైదిధ్యమైన సుందర దృశ్యాలు పిల్లల్ని అలరిస్తాయి. వారికి ఆనందాన్ని ఇస్తాయి. వివిధ రకాల జంతుజాలాన్ని దగ్గరగా చూడడం వల్ల ప్రకృతి గమనం వారికి బోధపడుతుంది. అందువల్లనే ఈ రకమైన యాత్రల్ని ప్లాన్ చేసుకోవాలి. పచ్చటి పర్యావరణాన్ని తిలకిస్తూ కొత్త అనుభూతులు ప్రోది చేసుకోవాలనుకునేవారికి ఇలాంటి యాత్రలు అహ్లాదాన్ని ఇస్తాయి.


వసతి సౌకర్యాలు

అభయారణ్యంలో పర్యాటకులకు కొన్ని వసతి సౌకర్యాలు లేకపోలేదు. అడవిలోని అందమైన ప్రదేశాలలో అటవీ శాఖ నిర్మించిన కాటేజీల నుండి వన్యప్రాణులు, అపురూప వన దృశ్యాలను చూడవచ్చు.వీటికి తోడు జంగిల్ లాడ్జిలు,రిసార్ట్స్‌లలోనూ వసతి సౌకర్యాలు ఉంటాయి.ఈ యాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలకు కర్ణాటక అటవీశాక అధికారులను సంప్రదించవచ్చు.


వార్త సౌజన్యంతో

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: