telugudanam.co.in

      telugudanam.co.in

   

గురువాయూర్‌

ఆంధ్రులకు తిరుపతిలాగానే, కేరళీయులకు గురువాయూరు శ్రీకృష్ణుడు ఆరాధ్యదైవం. భౌగోళికంగా కేరళ రాష్ట్రం పొడవుగా సొరకాయలాగ ఉండి, అరేబియా సముద్రతీరం అంచునే ఆనుకొని వుంది. రాష్ట్రానికి పూర్తిగా దక్షిణ కొసను త్రివేండ్రంలోని అనంత పద్మనాభస్వామి, ఉత్తరకొసను కాకపోయినా, సుమారు ఛాతి భాగంలో గురువాయూరు శ్రీ కృష్ణుడు వున్నారు. త్రివేండ్రానికి కొంచెం ఉత్తరంగా తీరానికి దూరంగా శబరిమలై అయ్యప్ప వున్నప్పటికి, శబరిమలై యొక్క ప్రాముఖ్యం ఈ మధ్యకాలంలో విస్తరించింది. పైగా శబరిమలై దర్శనం సంవత్సరంలోని కొన్ని రోజులకే పరిమితం. గురువాయూరు, త్రివేండ్రం కాక ఇంకా కేరళలో అంబళపురం, పట్టాంబి, కాలడి మొదలైన పుణ్యక్షేత్రాలున్నా, అవి స్థానికుల వరకే పరిమితం. ఆది శంకరాచార్యులవారి జన్మస్థలం గనుక, ప్రత్యేకమైన ఆసక్తివున్న కొందరు మాత్రం కాలడి దర్శిస్తుంటారు. ప్రతి ముఖ్యమైన ప్రదేశాన్నుంచి గురువాయూరుకు సరాసరి బస్సులు వున్నాయి. రైలు మీద వచ్చేవారు త్రిశూర్‌(త్రిచూర్‌) స్టేషనులో దిగాలి. త్రిచూర్‌ నుండి గురువాయూరు సుమారు ముప్పై కిలోమీటర్లు వుంటుంది. గంట లేక గంటన్నరలోపు ప్రయాణం. త్రిశూర్‌ నుంచి గురువాయూర్‌కు రైలు మార్గం కూడా ఉంది. గురువాయూరు తర్వాత కాలడి వెళ్ళాలనుకునేవారికి, గురువాయూరు నుంచి, త్రిచూర్‌ నుంచి సరాసరి బస్సులు వున్నాయి. రైలులో వెళ్ళేవారు త్రిచూరు నుంచి కొచ్చిన్‌ వైపు వెళ్ళే రైలులో వెళ్ళి 'అంగమలై' అనే స్టేషన్‌లో దిగాలి. త్రిచూర్‌ నుంచి అంగమలై నలభయి ఆరు కిలోమీటర్లు. సుమారు గంట లేక గంటంపావు ప్రయాణం. అంగమలై నుంచి కాలడి ఎనిమిది కిలోమీటర్లు. బస్సులో వెళ్ళాలి. అరగంట ప్రయాణం. ఈ అంగమలైలో సూపర్‌ ఫాస్ట్‌రైళ్ళు తప్ప, ఎక్స్‌ప్రెస్‌ రైళ్ళతో సహా అన్ని రైళ్ళు ఆగుతాయి. త్రిచూరు రైల్వేస్టేషన్‌ ఆవరణలో నుంచే గురువాయూరు వెళ్ళే బస్సులు కొన్ని బయలుదేరుతాయి. లేదంటే, స్టేషను ఆవరణ దాటి కేవలం ఒక వంద గజాలలోపు వస్తే, ఒక పెద్ద మెయిన్‌రోడ్‌ తగులుతుంది. ఆ జంక్షన్‌లో నుంచుంటే, గురువాయూరు వెళ్ళే బస్సు అక్కడే ఎక్కచ్చు. లేదంటే, ఆ జంక్షన్‌ కుడిప్రక్కగా మరో వంద గజాల దూరంలోనే బస్‌స్టాండు వుంది. గురువాయూరు వెళ్ళే బస్సు అక్కడే బయలుదేరుతుంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: