telugudanam.co.in

      telugudanam.co.in

   

మధ్యప్రదేశ్‌

ఓంకారేశ్వర్‌

మధ్యప్రదేశ్‌ రాష్ట్ర రాజధాని నగరం భోపాల్‌ నుంచి 185 కి.మీ. దూరంలో ఉజ్జయిని ఉంది. ఇక్కడ ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటయిన మహాకాళుడు, అష్టాదశ శక్తిపీఠాలలో ఒకటయిన మహాకాళిదేవి ఆలయాలు, ఇంకా అనేక ఇతర ఆలయాలు ఉన్నాయి. ఉజ్జయినికి దక్షిణంగా 80 కి.మీ. దూరంలో ఇండోర్‌ ఉంది. ఇక్కడ ఇంద్రేశ్వర్‌ అనే శివాలయం, అనేక రాజప్రాసాదాలు ఉన్నాయి. ఇండోర్‌కు ఆగ్నేయంగా 80 కి.మీ. దూరంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటయిన ఓంకారేశ్వర్‌ ఉంది. ఓంకారేశ్వర్‌కు పడమరగా మహేశ్వర్‌ అనే పురాతన శైవక్షేత్రం ఉంది. ఇండోర్‌ నుంచి 99 కి.మీ. దూరంలో అద్భుతమైన రాజభవనాలు, మరెన్నో కట్టడాలు ఉన్న మాండు ఉంది. రాష్ట్రానికి ఈశాన్య భాగంలో ఝాన్సీ నుంచి 175 కి.మీ. దూరంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఖజురహో ఉంది. ఖజురహో నుంచి ఉత్తరంగా, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర సరిహద్దును ఆనుకొని రామాయణ కాలం నాటి చిత్ర కూటం ఉంది.


ఉజ్జయిని

చారిత్రక ప్రాధాన్యత కలిగిన ప్రదేశాలు మధ్యప్రదేశ్‌లో చాలా ఉన్నాయి. రాష్ట్ర రాజధాని భోపాల్‌లో ఆసియాలోనే అతిపెద్దగా చెప్పబడే తాజ్‌-ఉల్‌మసీద్‌, ఇంకా అనేక ప్రాముఖ్యత ఉన్న ప్రదేశాలు ఉన్నాయి. భోపాల్‌కు దక్షిణంగా 28 కి.మీ. దూరంలో భోజ్‌పురి అనే చోట 21 అడుగుల ఎత్తు ఉన్న అసంపూర్ణమైన శివాలయం ఉంది. అక్కడి నుంచి మరో 20 కిలోమీటర్ల దూరంలో ఖీమ్‌బెట్‌కా అనేచోట రాతియుగం నాటి గుహలు ఉన్నాయి. భోపాల్‌ నుంచి ఉత్తరంగా 44 కి.మీ. దూరంలో ప్రపంచ ప్రసిద్ధి పొందిన సాంచీ స్ధూపం ఉంది. సాంచీ దాటిన తరవాత ఉత్తరంగా సాగిన రైల్వే మార్గంలో ఝాన్సి నగరం ఉంది. ఈ నగరం నుంచి 16 కి.మీ. దూరంలో వర్ణించడానికి మాటలు చాలని అద్భుతమైన ఆలయాలు అనేకం ఉన్న ఓర్చా ఉంది. ఇది ఒకప్పుడు బుందేలా రాజవంశస్ధుల రాజధాని. ఝాన్సి దాటిన తరవాత మనదేశంలోని కోటలన్నిటిలోకి తలమానికం అనిపించుకున్న గ్వాలియర్‌ ఉంది. పెద్ద పెద్ద కొండలు, అడవులతో నిండిన మధ్యప్రదేశ్‌ ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు. జబల్‌పూర్‌లోని పాలరాతి కొండలు చూడదగినవి. వన్యమృగ సంరక్షణకు ఏర్పాటుచేసిన అనేక అభయారణ్యాలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. వీటిని నేషనల్‌ పార్క్‌లు అంటారు. అందులో బాందవ్‌ ఘర్‌, కన్హా, పన్నా, పెంచ్‌ నేషనల్‌ పార్క్‌లు బాగా ప్రసిద్ధం. గ్వాలియర్‌కు దగ్గరలోని శివపురిలోని మాధవ్‌ నేషనల్‌ పార్క్‌ చూడదగినది.

మూలం: 17-Apr-2009, శుక్రవారం, సాక్షి(ఫ్యామిలీ).

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: