telugudanam.co.in

      telugudanam.co.in

   

బ్రతికున్న మనిషి

కాలవేగానికి సంకేతం కాబోలు రైలు....

ఊహలకి నిర్వచనాన్నిస్తూ, కనిపిస్తూన్న దాన్ని ఇట్టే వెనక్కి గతం‌లోకి తోసేసి, అనిశ్చితంగా అంధకారంలో ఉన్న భవిష్యత్తుపై వెలుగురేఖల్ని ప్రసరించి, వర్తమానంలోకి తెచ్చి ఆశ్చర్యంతో ముంచెత్తి దాన్ని కూడా దాటుకుంటూ శరవేగంతో ముందుకు మునుముందుకు దూసుకుపోవడంలో....

ఒక విధంగా మురళికి ఆ రైలు ప్రయాణం బాగుంది.

ఆ మనిషి తాలూకు జ్ఞాపకాల దొంతరలలోకి దొర్లి మనసు మూగగా మూలుగుతోంది. ఉదయం ఆ విషయం తెల్సినప్పటి నుండి హృదయం ఓ ప్రక్కన విలవిలలాడుతూనే ఉంది.

'అది నిజమా!' ఓ ప్రక్కన కాదని అన్పిస్తోంది.

కానీ పతంజలిగారు కాలం చేయడం పచ్చినిజం.

ధన్‌ధనాధన్‌ మంటూ ఎత్తయిన వంతెనల మీంచీ, ఇరుకైన వంకరలోంచీ నిరంతరంగా శబ్దం చేసుకుంటూ, అడవి గాంభీర్యాన్ని చీల్చుకుంటూ తిక్కరేగిన రాకాసిలా పరుగెడుతోంది ఆ ఎక్స్‌ప్రెస్ ట్రైన్.

కిటికీ దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నాడు మురళి. ఊహలు అంతరాయానికి గురవుతున్నాయి. ఎటువైపుకు ఊగిసలాడినా అన్నిటా ఆయనగారే నిండి ఉన్నారు.

జీవితాన ఎన్నో కల్లబొల్లి కబుర్లు చెప్పి చివరకు స్వార్థపరులైపోయిన మనుషులు జ్ఞప్తికి వచ్చినప్పుడలా వారి మీద ఏహ్యాభావం కల్గుతోంది మురళికి. చిన్నప్పటి నుండి ఓ విధమైన నిర్లప్తతకు యాంత్రిక జీవనానికి అలవాటుపడిన తనకు ఓ విధంగా పతంజలి గారి ప్రేరణ పెద్ద మలుపు అనే చెప్పాలి. నిజం చెప్పాలంటే జీవితం గురించి నిర్దిష్టంగా ఆలోచించుకోవడం ప్రారంభించింది అప్పుడే. ఏదో మధురాలోచనలు పుష్పసౌరభ్యంతో జోడై మస్తిష్కాన్ని ముప్పిరిగొంటున్నాయి. మురళికి గాలిలో తేలిపోతున్న ట్లుగా ఉంది. చిన్నగా కులాసాగా నవ్వుకున్నాడు. చుట్టూ ఘనీభవించిన బాధల బరువులా......తెలియని అజ్ఞానంలా నల్లగా.....చిక్కగా.....దట్టంగా పరుచుకున్న ప్రాంతం అది. మధ్యమధ్య అన్ని బంధాలూ వదుల్చుకొని నిటారుగా నిలబడి నిశ్చలంగా తపస్సు చేస్తున్న మహర్షుల్లా తెల్లని కొండలూ.....ఎత్తయిన నున్నని బండలూను. ఉండుండి జాతి పతనావస్థని స్ఫురింపజేసే లోయలూ.......అగాధాలూ.....అన్ని అవరోధాల్ని దాటుకుంటూ, ఎత్తుపల్లాల్ని లెఖ్ఖ చేయకుండా, ధైర్యంగా ముందుకు సాగిపోయే ధీరోదాత్తుడిలా రైలు పరుగులు తీస్తోంది. జ్ఞాననేత్రం లాంటి తన హెడ్‌లైట్‌తో ముందున్న రైలుమార్గాన్ని తేజోవంతం చేస్తోంది.

రైలుతో బాటుగా సాగిపోతున్నాయి మురళి ఆలోచనలు. అసలు ఈ రైలుప్రయాణాలే మురళిని పతంజలి గారికి దగ్గర చేశాయని చెప్పొచ్చు. "ఏరా మురళీ! సీనియర్ సిటిజన్స్ నాల్గవమహాససభ చీరాలలో జరగుతోంది తోడువస్తావేమిటి!!!' తాను సీనియర్ సిటిజన్‌ కాదు అన్పించినా తలూపాడు. పతంజలి గారితో రైలుప్రయాణమంటే మురళికి చాలా ఇష్టం. పెద్దవాళ్లతో మాట్లాడే వారు, వాళ్ళకి తనని పరిచయం చేసేవారు. చక్కగా ఫస్టక్లాస్ ఏసిలో ప్రయాణం. ఆయన ఫ్రీడమ్‌ ఫైటర్ కావడంతో తన ట్రైన్‌పాస్ మీద మరొకర్ని ఎప్పుడు వెంట తీసుకుపోతూ ఉండేవారు. అందరిలోను మురళి అంటే ఎక్కువగా మక్కువ చూపించేవారు. అక్కడ చీరాలలో అంతర్జాతీయ సీనియర్ సిటిజన్స్ దినోత్సవ సందర్భంగా వేదిక మీద జిల్లా కలెక్టరు గారి ప్రక్కన ఆసీనులై చేసిన పతంజలి గారి ప్రసంగం ఈనాటికీ చెవులలో మారుమ్రోగుతూనే ఉంది. 'భవిష్యత్తు గురించి ఆందోళన చెందక గత జీవితంలోని మధురక్షణాలను నిరంతరం నెమరు వేసుకుంటూ మనుషుల్ని ప్రేమించడం మొదలు పెడితే అరవైలో ఇరువై జీవితాన్ని పొందవచ్చన్నది ఆయన సందేశం'. అందుకే వయోభారాన్ని లెఖ్కచేయక ప్రయాణాలు చేస్తూ ఎప్పుడూ నవ్వుతూ కళకళలాడుతూ తలమానికంగా ఉండి ఆదర్శంగా కన్పిస్తాడు. 'షిర్డీకి పోతున్నాను. ఆ సాయినాధుని దర్శనం చేసుకుందువు రాకూడదూ!'

దీపావళి సెలవలు కావడంతో తన తల్లిదండ్రుల్ని ఒప్పించడం కష్టం కాలేదు మురళికి. షిర్డీ దర్శనం, శనిసింగనాపూర్, గోదావరి నది జన్మస్థలం నాశిక్ మొదలైనవి ఆనాడు పతంజలిగారితో తిరిగి చూడగలిగాడు. అవన్నీ ఈనాటికీ తన మనస్సులో భద్రంగా దాచుకున్న జ్ఞాపకాలు. అవకాశమున్నప్పుడల్లా ఫ్రీ పాస్ మీద తనను తీసుకెళ్ళే పతంజలిగారంటే క్రమంగా ఆరాధనాభావం ఏర్పడసాగింది మురళికి. 'వేగవంతమైన జీవతంలో సమానంగా పరుగెట్టాలంటే మనిషి అలసత్వం వీడాలి! కాలం ఓ నర్తకి లాంటిది.......వేషాలు రంగులూ మారుస్తూ ముందుకు సాగిపోతుంటుంది. ఏ వేషానికి తగ్గట్టు ఆ తాళం వేయగల్గితేనే మనం మనుగడ సాధించగల్గేది. నాశిక్ దగ్గర త్రయంబకేశ్వర దేవాలయం దర్శనం చేసుకున్న తరువాత ధ్వజస్థంభం దగ్గర కూర్చున్నప్పుడు అన్న పతంజలి గారి మాటలు మురళిని ఎంతగానో ప్రభావితం చేశాయని చెప్పొచ్చు. 'సార్! కాలనర్తకిని నాతోనే అన్వయించుకుంటే.......నేను చదువుకుంటున్నాను. రేపోమాపో డిగ్రీపాసవుతాను. తర్వాత బ్రతకడానికి ఓ వ్యాపకం......నా కాళ్ళమీద నేను నిలబడి రంగులు మారుస్తున్న నర్తకిని నాకనుగుణంగా నర్తింపచేయగలను!!'

'పెద్దిరాజు సంగతి నాకు తెలియంది కాదు. అన్నీ ఉండి కూడా కొడుకుల్ని పెద్దగా పట్టించుకోని అలసత్వం వాడిది. ఇంకా చెప్పాలంటే రేపు ఏదో బి.యస్సీయో, బీ.కామో పాసవుతావ్. తర్వాత ఓ గుమస్తా గిరి.......ఎదుగూ బొదుగూ లేని జీతం........జీవితం....' '........... 'అదే మీ నాన్నను తీసుకుంటే ఏం లోటు చెప్పు. తల్చుకుంటే నిన్ను ఏ డాక్టరో, ఇంజనీరో చేయగలడు. అందునా ఐదు ఎకరాల పేరున్న భూస్వామి'.'.............' అదే నన్ను తీసుకో. ఆనాడు మావాడికి ఇంజనీరింగ్ చెప్పించాను. వాడికోసమని ఎంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. వాడి చదువుకోసం ఉన్న కొద్దిపాటి పొలాన్ని తెగనమ్మి ఫీజులు కట్టాను. ఆ రోజు ధైర్యం చెశాను కాబట్టి నా కొడుకు ఈ రోజు ముప్పైవేలు రూపాయల జీతగాడయ్యాడు. '...........' అందుకే పై చదువులకోసం మీ నాన్నను నిలెయ్యి. ఇంజనీరింగ్ చదువుతానని పట్టుబట్టు. కావాలంటే రెండు ఎకరాల పొలం అమ్మి అయినా సరే చదివించమను. కాదూ కూడదంటే నీ వాటా నీకిచ్చేయమను.

వేళాకోళానికన్నమాటలు వింతగా అన్పిస్తున్నాయి. మురళికి. ఆయన కళ్ళలోకి చూశాడు. తన బాగుకోసం, బంగారు భవితకోసం ఓ మంచి సలహాతో ఆదుకుంటూన్న ఆత్మబంధువులా అన్పించసాగాడు. అదే విషయం ఇంటికెళ్ళి తండ్రికి చెప్పాడు. ఏదో సాటివాడనుకుంటే ఆ పతంజలి నీకు ఇచ్చే సలహా ఇదా......దిక్కుమాలిన చదువుల కోసం ఉన్న ఆస్థిని అమ్ముకోమంటాడా......ఏదోలే ముసలాడు.....టికెట్ లేదు కదాని తోడుగా పంపిస్తూంటూ.....కాని మాటలతో నీకు మత్తుమందు చల్లుతున్నాడు. ఉండు వాడి సంగతి తేలుస్తా!' అవును.....స్వాతంత్రోద్యమ మంటూ జైలుకెళ్ళొచ్చిన పెద్దమనిషి......పోనీలే అనుకుంటే మనకే ఎత్తులు పెడుతున్నాడు......ఆస్తి పంపకాలంటూ ఎసను దోస్తున్నాడు. మనలోమనకి చిచ్చు పెట్టి ఉన్న పొలాన్ని అమ్మించే యాలని కుట్ర పన్నుతున్నాడు. 'అది కాదమ్మా!' 'ఏది కాదు ఇలా వదిలేస్తే రేపు అమ్మానాన్నల్ని కూడా వదిలేసిపొమ్మంటాడు. చదివింది చాలు. పెద్దాడు చూడు. చక్కగా పొలం పనులు చేసుకుంటున్నాడు. రేపు కార్తీకపౌర్ణమి నాటికి నీచేత కాడెద్దుల్ని పట్టిస్తే సరి!' అమ్మ వాదన వేదన కల్గిస్తోంది మురళికి.

పొలం అమ్మి అయినా సరే చదువుకోమని ఓ ఉచిత సలహా పడేసిన పతంజలి గారంటే అమ్మానాన్నలకు ఉక్రోషం పొడుచుకొచ్చింది గానీ ఆయన మాటలలో ఓ సహేతుకమైన అంశం కన్పిస్తోంది మురళికి. అవును! డిగ్రీ అయింతరువాత నాన్న తనను వ్యవసాయపు పనులలో పెట్టేయడం ఖాయం. తర్వాత అన్నయ్యతో కలిసి అరకుదున్నుతూ భూమిని పండించి బ్రతుకును వెళ్ళదీయడం.... ఆలోచిస్తే ఇంటర్మీడియెట్‌లో మంచిమార్కులతో పాసయ్యాడు. తనో పెద్ద ఇంజనీర్ కావాలని కలలు కన్నాడు. కానీ ఆ దిశగా తండ్రి ఆలోచించకపోవడం మురళిని కలవరపెడుతూనే ఉంది. "నాన్నా ఐఐటిలో సీటు వస్తుంది నాకు. అక్కడ చదువుకొని మంచి ఉద్యోగం సంపాదిస్తా!' నువ్వు అటుపోతే పొలంపుట్రా చూసేది ఎవర్రా! నేను ఇంజనీర్‌ని కాదు. నీ తాత, నీ అన్న ఇంజనీర్లు కారు. మనకు ఇంజనీర్ల ఆనవాయితీ లేదు. అయినా అంతపై చదువులు చదివించే స్తోమత లేదు నాకు'. రెండు ఎకరాలు అమ్మేస్తే సరి.....' 'కుదరదు' 'లేకుంటే నా ఆస్తి పంచేస్తే.....' నోట మాట పూర్తికాలేదు. మురళి చెంప ఛెళ్ళుమనిపించాడు పెద్దిరాజు. తండ్రి తనమీద చేయి చేసుకున్నప్పటి నుండి తిండి మానేశాడు. మురళి పరిస్థితి ఆందోళన కల్గిస్తోంది వాళ్ళకి. 'పెద్ద చదువులు చదివి పైకొస్తానంటున్నాడు....!' భార్య మాటలు పెద్దిరాజుని ఆలోచనల్లో పడేశాయి. అసలు పట్టుదల అంతా పతంజలి అన్న మాటల గురించే....

'పైరు మీద వచ్చిన పైకం పెట్టుబడులకే సరిపోతోంది. దాళ్వా, సార్వా రెండూ తే తెమ్మంటూంటే వీడికెక్కడి నుండి తెచ్చిపెట్టేది.' 'రేపు పై చదువు చదివి పెద్ద ఇంజనీరు అయితే వాడే తెచ్చిపడేస్తాడు. అప్పటిదాకా మురళి మాటల్లోనే....రెండు ఎకరాలు అమ్మిపడేస్తే......' '..........' 'పెద్దిరాజుకి చాలా బాధగానే ఉంది. 'అసలు ఆ పతంజలిని నిలేయాలి! అప్పుడు తెల్లదొరలు జైలులోపెట్టడం కాదు. ఇప్పుడు పడేస్తే గొడవలేకపోయేది. 'మారు సలహా ఆయన్నే అడిగితే సరి!' భార్యమాటలు సహేతుకంగానే అన్పించాయి. అటుగా అడుగులు వేశాడు పెద్దిరాజు. జ్ఞాపకాల ధ్యానాన్ని వీడి అటుగా చూశాడు మురళి. పుట్టి బుద్ది ఎరిగాక కన్పిస్తూన్న పంట చేలు, పళ్ళతోటలు పండు ముత్తయిదువులా కలకల్లాడే కృష్ణాగోదావరి ప్రాంతాలు........అన్నీ తనకు ఎరుకే అయినా ఈనాటి ప్రయాణం నూతనంగా అన్పిస్తోంది. అయితే మనసంతా పతంజలి గారి తాలూకు ఏదో కొత్తకోణంతో నిండిపోయి ఉంది.

ఆనాడు చివరికి పెద్దిరాజును ఒప్పించి తాను జామీనుగా ఉంది ఎడ్యుకేషన్‌ లోన్ ‌ఇప్పించాడు పతంజలి. అప్పుడు మురళి కాలేజీ ఫీజులకి డబ్బుసమకూర్చి ఉండకపోతే తానీనాడు మంచి ఉద్యోగంలో స్థిరపడగలిగేవాడా? రైలు అదుపుల్నీ, కొండల్నీ దాటుకుంటూ మహావేగంగా ముందుకుపోతోంది. ఒక్కసారిగా పంటచేలూ లేవు. . . పండ్లతోటలూ లేవు. వాతావరణం అంతా ఏదోబోసిగా అలంకారాలన్నీ తీసేసిన అందమైన అమ్మాయిలా అనిపించింది. చిత్రవిచిత్రుగా ఉంది మురళి మనసు. ఓ ప్రక్క పతంజలిగారి మరణవార్త జీర్ణించుకోలేకపోతున్నాడు. సంద్యాలలో ఉన్న కొడుకు దగ్గర చిన్న నలత చేసి పోయారట. ఆ విషయం నమ్మ శక్యంగాలేదు. అసలు ఆయన చనిపోవడమేంటి? కాబోతే కొన్ని సంవత్సరాల గ్యాప్ తరువాత చూడబోతున్నానంతే. . . ఎదురుగా కనిపిస్తూన్న కొత్త ప్రదేశం. . . వాగులూ. . . కొండలూ. . . బండలూ వాటిలో మమేకమై ఉన్న పతంజలి గారి మంచితనం. . . విలక్షణ వ్యక్తిత్వం. . . ఓ విధమైన ఉద్వేగం ఉత్సాహంతో ఊగిసలాడుతున్నాడు. 'మురళీ జీవితంలో ఎదురయ్యే ప్రతిసంఘటన గురించి మనం ఆలోచించలేము. అట్లా ఆలోచించగేటందుకు, దాని నుండి వాస్తవితకను గ్రాహ్యం చేసుకునేటందుకు ఈ జీవితకాలం చాలదేమో! కానీ ఓక్కొక్కప్పుడు దొరికిన స్వల్ప వ్యవధే ఈ అవకాశాన్నిస్తూ ఉంటుంది. అందులో సహజత్వం ఉన్న చోటనే ఆలోచనకు తావెక్కువ!' పతంజలి గారి మాటలు జ్ఞప్తికి వచ్చి హృదయం ద్రవించింది. 'అనురాగం, ఆదరణ ఉన్నచోట మానవుడు జీవించాలనుకుంటాడు. అవిలేని చోట బ్రతుకు దుర్లభం. అవును పతంజలి గారి ద్వారా తానెన్నో జీవిత సత్యాల్ని చవిచూశాడు. తనకు తోడుగా తీసికెళ్ళిన ప్రతిసారి ఆయా ప్రదేశాల గురించి, అక్కడి జీవన విధానాల గురించి వివరించి తన మనోవికాసానికి ఎంతగానో తోడ్పడ్డాడు.

గుంభనంగా, గంభీరంగా ఉండే పతంజలిగారిలోని నిగూఢ భావుకత, ఉదాత్తత, మాటల్లో చొరవ మురళిని నిరంతరం ప్రభావితం చేస్తూనే ఉన్నాయి. 'ఈ కాంపిటీషన్ ప్రపంచంలో నిలబడి మంచి ఉద్యోగం సంపాదించగలనా. . . ఏమో ఈ స్పీడు యుగానికి నా మేనరిజమ్స్, సరిపోయే పరిష్తితి కన్పించడం లేదు.' మొదటి సారి ఇంటర్వ్యూ ఫెయిలైన సందర్భంలో పతంజలి గారి దగ్గర వాపోయాడు. 'ఆత్మను, కించపరుచుకోవడానికి మించిన అనామకుడిగా బాధపడే నీలాంటి వారిలో ఎంత అవివేకముందో నీ మాటల్లో అంత ఆత్మనింద ఉంది. వ్యక్తిగా మనగల వారికుండవలసింది ఆత్మగౌరవం కాని ఆత్మనింద కాదు. జీవితాన్ని ప్రేమించలేని వాడు మనము దేనినీ తారకమంత్రంలా అన్పించసాగాయి. అతన్ని సమూలంగా కదిలించి వేసిన భావన నెలకొంది. ఆనాటి నుంచి ఆ స్నేహబంధం మురళి మనస్సుకు ఎంతగానో బలాన్ని ఇచ్చినైతిక విజయానికి బారులు తెరుస్తోంది. చీకటి బాగా కమ్ముకుందేమో చెట్టులూ గుట్టలూ స్పష్టంగా కన్పించడం లేదు. వేగంతో ముందుకు దూసుకుపోతూన్న రైలు క్రమంగా స్లో అవుతోంది. ఒక్కసారి ప్రయాణీకుల్లో కోలాహలం. విషయం తెలియక పరికించి చూసాడు. అవును సంద్యాల స్టేషన్ వచ్చేసింది. బ్యాగ్ తీసుకొని నెమ్మదిగా దిగాడు. చాలా సంవత్సరాల తర్వాత పతంజలి గారిని చూస్తున్నందుకు ఓ విధమైన ఉద్వేగం.

అడుగులు వేగంగా పడుతున్నాయ్! 'మురళీ!' గట్టికేకతో అటు తిరిగాడు. పతంజలి గారబ్బాయి ప్రభాకరం. చాలాకాలం తర్వాత చూశాడేమో ఒక్కక్షణం పోల్చుకోలేకపోయాడు. ఓ మాదిరిగా నెరిసిన జుట్టు తన పెద్దరికాన్ని తెలియజేస్తోంది. కొంచెం అటుఇటూగా పతంజలిగారిలానే అగుపిస్తున్నాడు. 'నాన్న మమ్మల్ని ఒదిలి వెళ్ళిపోయాడూమురళి చేతులు పట్టుకొని గొల్లమన్నాడు. ఫ్లాట్‌ఫాం మీద మనుషులు వింతగా చూస్తున్నారు. 'మొన్ననే నిన్ను తలుచుకొని చూడాలనుందన్నారు. కబురు పెడతానన్నాడు. ఇంతలోనే ఈ ఘోరం జరుగుతుందనుకోలేదు!' చిన్నపిల్లాడిలా వెక్కివెక్కి ఏడుస్తున్నాడు ప్రభాకరం. 'ఊరుకో, మాష్టారి టైము అయిపోయిందంతే. . . అదృష్టవంతుడు!' అతను భుజం మీద చేయి వేసి దగ్గరకు తీసుకొని బయటకు నడిచాడు మురళి. బంధుమిత్రులతో కోలాహలంగా ఉంది. అయిన వారంతా వచ్చేశారు. అందరి ముఖాలలోను ఎంతో విషాదం తాండవిస్తోంది. 'వచ్చావా నాయనా! మీ పతంజలి మాష్టారు. . . 'ఘోల్లుమని ఏడిస్తోంది ఆయన భార్య. నోటి మాటలు రావడం లేదు మురళికి. ఖిన్నుడైపోయాడు. 'ఈ మధ్య నిన్ను చూడాలన్న యావ ఆయనకు ఎక్కువయింది. ఫోన్ చేద్దామనుకున్నాం. . . మొత్తనికి చూడకుండానే వెళ్ళిపోయారు.' అంతా శోక సముద్రంలో మునిగిపోయి ఉన్నారు. ఆ మాతృదేహం వైపు కనార్పకుండా చూస్తుండి పోయాడు. . . అలా ష్తాణూవులా నిలబడ్డ మురళికి ఆయన నిద్రపోతున్నట్లుగానే ఉంది. అది శ్వాసత నిద్ర అన్పించడం లేదు.

చూసి కొన్ని సంవత్సరాలయినా ఆయన రూపంలో హావభావాల్లో ఏమీ మార్పు వెలిగించి పెట్టిన ద్వీపపు వెలుగులో మరిన్ని జిలుగుల్ని వెదజల్లుతున్నాడు. పతంజలిగారి మంచితనం గురించి, వ్యక్తిత్వం గురించి అక్కడ అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ సమయంలో అందరినోళ్ళతోను విసేషంగా కొనియాడబడుతున్నాడు. పోయినోళ్ళందరూ మంచోళ్ళే మరి. 'తాతగారు పోయినందుకు మేమందరం తెగబాధపడుతున్నాం! నీకేమీ అన్పించడం లేదా!' ఓ చిన్న అమ్మాయి అమాయకంగా అడిగింది. తన కళ్ళ తడుముకున్నాడు మురళి. కళ్లు ఎండిపోయి ఉన్నాయి. 'అవును పతంజలి గారిని నేను ఓ కట్టెగా చూడటం లేదు. నా అంతరాత్మగా చూసుకుంటూన్నా. ఆయన మాటలతో నా అంతరంగం ఎంతగానో ప్రభావితం చెందిఉంది. నా ఊహల నిండా ఆయనే! ఈ జీవితంలో ప్రతి మలుపుకీ. . .ప్రతి విజయానికీ ఓ పునాదిగా ఆయన మాట. . . మనసు నా దగ్గరే ఉంది. ఆయన సజీవి. . . 'చెప్పుకుపోతున్నాను మురళి. ఆమాటల్లో ఎంతో నిజాయితీ నిండిన ఉద్వేగం కన్పిస్తోంది.

'మురళీ! మనిషి బ్రతుకులో ఎదురయ్యే ప్రతి సంఘటన గురించి మనం ఆలోచించలేము. అట్లా ఆలోచించగలిగేటందుకు, దాని నుండి వాస్తవికతను గ్రాహ్యం చేసుకునేటందుకు ఈ జీవితకాలం చాలదేమో!! కానీ ఒక్కొక్కప్పుడు దొరికిన స్వల్ప వ్యవధి ఈ అవకాశాన్నిస్తూ ఉంటుంది. అందులో సహజత్వం ఉన్న చోటనే ఆలోచనకు తావెక్కువా మురళి చెవుల్లో ఆయన మాటలు మళ్ళీమళ్ళీ మారుమ్రోగుతూనే ఉన్నాయి. తల్లిదండ్రుల పొత్తిళ్ళలోంచి ఇప్పుడిప్పుడే తల్లెత్తుతూ ఈ లోకంలో నవ్వుల పువ్వులేరుకున్నట్లుగా ఉంది. దాహనాల ధూమగుచ్ఛాల నెరుగని నికృష్ణ పరిస్థితులు మురళి మస్తిష్కంలో ఏమీ కానరావడం లేదు. పతంజలి తిరిగి రాని లోకాలకు తరలి పోయారని అందరూ గగ్గోలు పెడుతున్నా ఆయనతోటి ఆ స్మృతిపధం, మురళిలో సజీవునిగా నిలబెడుతూనే ఉంది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: