telugudanam.co.in

      telugudanam.co.in

   

కాపరి తెలివి

గుండూరావు గణితశాస్త్రంలో దిట్ట. అతి తెలివి కాస్త ఎక్కువ. ఓ రోజు బంధువుల పెళ్లికి ఓ పల్లెటూరెళ్లాడు. సాయంత్రం సరదాగా షికారుకెళుతూ, ఒక గుట్ట దగ్గర గడ్డిమేస్తున్న గొర్రెలమందను చూశాడు. ఒంటినిండా ఉన్నితో ఎంతో బొద్దుగా ముద్దుగా ఉన్నాయవి. వాటిలో ఒకదాన్ని తన తెలివితో సంపాదించాలనుకున్నాడు. "నీ మందలోని గొర్రెలను లెక్కించకుండా మొత్తం ఎన్ని ఉన్నదీ చెబుతాను. అది సరైనదైతే ఒక గొర్రెనిస్తావా?" అనడిగాడు అక్కడున్న కాపరిని. 'సరే' నన్నాడు కాపరి అయిష్టంగానే. గుండూరావు వెంటనే మందలోని వరుసల వైపు చూసి "అన్నీ కలిపి తొంభై తొమ్మిది" అన్నాడు. కాపరి అతనివైపు ఆశ్చర్యంగా చూసి, "నిజమే" అన్నాడు. "అయితే గొర్రెనిస్తావా మరి?" అన్నాడు గుండూరావు. "సరే, మీరే తీసుకోండి" అన్నాడు కాపరి. గుండూరావు ఆనందంగా మందలో అన్నింటికన్నా బలంగా ఉన్న ఒక గొర్రెను తీసుకుని భుజాల మీద వేసుకుని, అక్కడినుంచి కదలబోతుండగా కాపరి "నేను మీ వృత్తిని ఊహించి చెబుతాను. నిజమైతే నా గొర్రెను నాకిచ్చేస్తారా" అన్నాడు. గుండూరావు తనలో తను ముసిముసిగా నవ్వుకుంటూ "సరే, చెప్పు" అన్నాడు. "మీరు ఒక లెక్కల మాష్టారు కదా" అన్నాడు కాపరి. గుండూరావు ఆశ్చర్యంతో "నిజమే, ఎలా కనుక్కున్నావు" అన్నాడు.

"మీరు మందలోని గొర్రెలను లెక్కపెట్టకుండా వరుసను బట్టి సరిగానే చెప్పేశారు. కానీ మందలోనుంచి ఒక దానిని ఎంచుకోమంటే నేను కాపలాకి తెచ్చుకున్న కుక్కని ఎత్తుకున్నారు మరి!" అన్నాడు.

గుండూరావు తన భుజాలమీదున్న కుక్కను చూసి సిగ్గుపడి, దాన్ని కిందికి దించి కాపరి ఈరన్న తెలివికి ఈర్ష్యపడ్డాడు.


నీతి: మన తెలివి చూసి మనమే విర్రవీగకూడదు, అవతలి వారిని తక్కువ అంచనా వేయకూడదు.


మూలం : 06-05-2012, సాక్షి (ఫ్యామిలీ).

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: