telugudanam.co.in

      telugudanam.co.in

   

మగత మనుషులు

'సకల చరాచర జీవరాశులలోని ఓ జంతువును మనిషిని చేసింది ఓ సంకల్పం' బుద్ధి వివేచనలకు సాయుధమై . . . భావోద్వేగాలకు సంస్కారవంతమైన మాధ్యమమై మనిషిగా తీర్చిదిద్దుతూ. . . ఆలోచనలకు ఒక నిర్ధిష్టరూపాన్నీ. . .అనుభూతులకు ఒక సున్నిత భాష్యాన్ని ఇచ్చి, పలుకు పలుకులో తేనెలొలుకుతూ మానవ జీవితాన్నీ, గమనాన్నీ రసమయం చేసేది ఓ సంకల్పమూ. . .ఓ లక్ష్యమూను. ఆదివారం ఉదయం పూట భార్య ఇచ్చిన టాటా టీని చప్పరిస్తూ పేపరు ప్రత్యేక అనుబంధాన్ని చేతిలోకి తీసుకున్నాడు భిక్షపతి. శీర్షిక పేరు 'ఛ'. 'ఛఛ' అనుకుంటూ ఒకింత విసుగ్గా పేజీలను త్రిపబోయాడు. ఆలోచనలకు అనుభూతులకు నిర్థిష్ట రూపం అంటూ ఉన్న పదాల దగ్గర తనకు తెలియకుండానే ఆగిపోయాడు భిక్షపతి. అవ్యక్త భావమేదో అతన్ని అప్రమత్తం చేసింది. నిటారు అయి చరాచర జీవరాశులని, జంతువులని తనలో తాను బేరీజు వేసుకోసాగాడు.

'మళ్ళీ ఏమయింది!' టీ చల్లారిపోతోంది. వెచ్చపెట్టి అందించలేక ప్రతిసారీ ఛస్తున్నాను!!' ఒకింత విసుగ్గా సణిగింది సరోజిని. చరాచర జీవరాశులలోని ఓ జంతురూపానికి వివేకాన్నద్ది. . .మాటను భావాలను అందించి ఒక సంస్కారవంతమైన ప్రాణిగా నిలబెట్టాలట చూడు. ఛఛ. అసలు ఏం మనుషులో!' సర్లేండి సంబడం. కాంట్రాక్టరు కారుణ్య మూర్తి ఫోన్‌ చేశారు. రాత్రి మయూరి హొటల్లో మీకోసం చాలాసేపు ఎదురుచూశారట. పార్టీకి రాలేదని చాలా బాధపడ్డాడు. 'పార్టీలు ఇచ్చి అందరి కంట్లో పడేలా చెయ్యాలా ఏంటి? అయినా ఆయనకి మనిల్లు కొట్టిన పిండే!' రతివారం కొంచెం ఆలస్యంగా నిద్ర లేచినపుడు ఏర్పడ్డ మగత ...కిటికీ కర్టెన్ల సందులోంచి చొచ్చుకొచ్చిన రవి లేలేత కిరణాలు ముఖానికి తాకేసరికి కొంత వికారం, కొంత ఆహ్లాదం నెలకొంది భిక్షపతిలో. పిలల్ని పట్టకపోయే ముఠా కదలికలు పట్టణంలో ఎక్కువగా అగుపిస్తున్నాయి. ఈమధ్య ఎక్కువగా పిల్లలు తప్పిపోతున్నారు. వీధుల్లో జులాయిగా తిరిగే పిల్లలు ఈమధ్య ఎక్కువగా కన్పించడం లేదన్న వార్త పేపర్లోను, టీవీల్లోనూ విరివిగా వస్తోంది. జాగ్రత్తగా ఉండమని ఎవరైనా కొత్తవాళ్ళు అగుపిసే తెలియజేయమని చెబుతునారు'. ఆ వార్త బాగా ఆకర్షించింది భిక్షపతిని. అదేమాట సరోజినితో చెప్పాడు.

'ఈకాలనీలో తరచుగా తిరిగే ముసలిదాని మీద నాకు చాలా అనుమానంగా ఉంది. చూడ్డానికి రివటలా, చికాకుగా ఉంటుంది. కానీ దానికి అన్నీ కావాలి. ఓ పోలీసు కంప్లైంట్‌ పడేస్తే సరి. ఇటువంటి వాళ్ళని నలుగురు తిరిగే ప్రాంతాలలో తిరగనిస్తే పిల్లల్ని తోలుకు పోవడమే కాదు. ఇళ్ళని కూడా దోచుకుపోతారు.' పేపర్లోని వంచకుల వార్తకి, భార్య చెప్పే ముసలిదానికి దగ్గర సంబంధం అగుపిస్తోంది భిక్షపతికి. 'అవును ఇటువంటి వాళ్ళను ఒకంట కనిపెట్టకపోతే మన కంటితో మనల్నే పొడిచి పారేస్తారు'. చూరు సందుల్లోంచి చొచ్చుకొని వస్తూన్న ఎండ కిరణం చురుక్కు మనిపించింది. కిటికీ రెక్క బార్లా తెరిచాడు. ఎదురుగా రోడ్డు మీద ఆ ముసల్ది ప్రత్యక్షమయింది. నడవలేక నడుస్తోంది. తూలి పడబోతూంటే చేతికర్ర ఆమెక ఆధారమవుతోంది. చూపు కన్పించక నానాయాతన పడుతున్నప్పుడు కంటి రెప్పలకి చేతిని అడ్డుపెట్టుకొని తీక్షణంగా పరికిస్తోంది. రోడ్డుమీద మునిసిపాలిటీ ట్రక్కు ఆగి ఉంది. ప్రక్కనే పందులు, కుక్కలు రొద చేస్తూ పరుగులు తీస్తున్నాయి. ఇద్దరు మనుషులు ట్రక్కులోంచి క్రిందకు దిగారు. చెత్త ఎత్తిపోసే క్రమంలో వెదురుతట్టల్ని బయటకు తీశారు.

'ఏయ్‌ ముసలీ! ఓ రక్క ఇటు పడేయ్‌!! నీ చెయ్యి పడిందంటే తొట్టి తొట్టీ ఇట్టే నిండుకుంటుంది.' ఎడం జేబులోని బీడీ కట్టను తీసి ఒక బీడీని పెదాలమధ్య వెలిగిస్తూ అన్నాడు. ముసల్ది కాదనలేదు. వంగిపోయిన వంటిని నిటారుగా చేసుకొంది. కర్రతో తూలుతుంటూ నొక్కిపట్టి కుదుటపడింది. కళ్ళలోని సత్తువను కాళ్ళలోకి తెచ్చుకొంది. చేతుల్ని గుప్పెటన పట్టు బిగించింది. బీడీ కాలుసూన్నవాడు ప్రక్క చప్టామీద కూర్చోని హాయిగా దమ్ములాగుతున్నాడు. పారతో తవ్వి ట్రాక్టరు తొట్టిలో పారబోస్తోంది అవ్వ. క్షణంలో తొట్టిని ఖాళీచేసి పడేసింది. 'ఛఛ పొద్దున్నే చెత్తమనుషుల్ని చూశాను. అసలు దీనికి ఎవరుంటారు. ఉన్నా ఇటూవంటి మోసగాళ్ళను ఎవరు చేరనిస్తారు.

పైగా చావడానికి సిద్ధంగా ఉంది" అలాగ సణుక్కుంటున్నాడేగాని ఆ ముసలి కళ్లలోని చురుకుదనం, తీక్షణత భిక్షపతికి స్పష్టంగా అగుపిస్తూనే ఉన్నాయి. చాలా కాలం నుండి ఆమెను చూస్తున్నాడు. కానీ ఆమెను ఇప్పుడు ఓ కొత్తకోణంలోంచి గమనిస్తున్నాడు. ఏదో మంచి పని చేస్తున్నట్టు, జనాల్ని ఉద్ధరిస్తున్నట్లు నటించి మోసాలు చేస్తున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేస్తున్నా రోజూ ఇటువంటివి జరుగుతూనే ఉన్నాయి. అవడం ముసలిదే, కానీ తీసికెళ్ళి మక్కెలు విరగ్గొడితే అసలు రంగులు బయటపడతాయి. లేకపోతే రోడ్లు ఊడవడాలు, మురికి కూపాలలో మ్రగ్గుతూన్న వాళ్ళకి సేవ చేస్తున్నట్లు నటించడాలు, చివరికి పిల్లల్ని ఎత్తుకుపోయి వాళ్లని బిచ్చగాళ్ళుగా మార్చి, చేతివాటానికి పాల్పడేవాళ్ళు ఎక్కువవుతున్నారు. సెల్‌ఫోన్‌లో కారుణ్యమూర్తి నంబర్‌ డయిల్‌ అవుతోంది. "సార్‌! నిన్న సాయంత్రం మీకోసం చాలాసేపు ఎదురుచూశా!!" మయూరి హొటల్లో మీరు అడిగిన లెఖ్కలూ, లెఖ్కనీ కూడ రేడీ చేశాను. చిన్న సంతకం పడేస్తే రేపు ఆఫీసులో పేమెంట్‌కి అప్లై చేస్తాను. ఆదివారం రిలాక్స్‌గా ఉంటారని ఫోన్‌ చేశా! ఇప్పుడైనా రమ్మంటరా!!"

"వచ్చేటప్పుడు చికెన్‌ బజార్‌లో తాజా ఐటమ్స్ రెండు కిలోలు ఎత్తుకురా! వారం గడిచి పోతాది" అతను ఇచ్చే పదివేల రూపాయల కవరు తాలుకు ప్లానింగ్‌ అప్పుడే భిక్షపతి బుర్రలో మొదలయింది. లంచం ఇచ్చే వాడుంటే . . .తీసుకోవడంలో తప్పేమీ కన్పించడం లేదు భిక్షపతికి. తన ఉద్యోగి పరిధిలో డిమాండ్‌ని కూడ ఓ భాగంగా చేసుకున్నాడు. ఆ డిమాండ్‌ని ఆవలి మనషి కూడ మన్నిస్తూనే ఉన్నాడు. అతని అవసరం అతనిది. తన అవసరం తనది. ఒక్కమాటలో చెప్పాలంటే కారుణ్యమూర్తి తనద్వారా పైకి ఎదుగుతున్నాడు. తనను నిలబెడుతున్నాడు. ఎదుటి మనిషిలోగాని, వ్యవస్థలోని, లోపాలుగాని, తప్పిదాలుగాని, ఓ ఛత్రంగా మారి తనలోని గతుకుల వాస్తవికతను పూడ్చిబెట్టి సమాజపరంగా మనిషిగా నిలబెడుతూందన్న వితండ సూత్రాన్ని ఎక్కువగా నమ్మే భిక్షపతి ఆ ముసలిదాని మీద అలవోక నిందల్ని తనతో అన్వయించుకొని కొంత లబ్ధిని, మరికొంత ఆనందాన్ని అనుభవిస్తూనే ఉన్నాడు.

తద్వారా ఆమెలోంచి ఓ అక్రూరమైన వెలుగు తాపాన్ని బయటకు ఎసనుదోయడానికి నిర్ణయించుకుంటూనే ఉన్నాడు.'మదర్‌ ధెరిస్సా శిశు సంరక్షక క్షేత్రం' ఊరికి దూరంగా ఎవరూ అటుగా పెద్దగా దృష్టిసారించి మురికివాడలోని ఆ పూరిపాక ముందు బోర్డు చదువుతున్నాడు. మొదట్లో అర్థం కాలేదు భిక్షపతికి. ఆ ఊరికి ఈమధ్యనే కొత్తగా ట్రాన్స్‌ఫరై వచ్చిన తాను ఆ ప్రాంతాన్ని అంతగా పట్టించుకోవాల్సిన అవసరమూ కలగలేదు ఇన్నాళ్ళు. 'అమ్మా ప్రేమాలయం' గోడకు అంటించిన చిత్తు కాగితం సగం వ్రేలాడుతూ కన్పిస్తోంది. ఓ ఆరేళ్ళ కుర్రాడు . . . చాలా చికాకుగా ఉన్నాడు. మధర్‌ ధెరీస్సా గురించి పుస్తకాన్ని గట్టిగా చదువుతున్నాడు. ఆమె త్యాగ నిరతిని, సమాజం పట్ల తనకున్న సేవాదృక్పధాన్ని చెప్పే పాఠం ఆలోచింపజేస్తోంది . . .ఆ ముసలామెతో సహా పాతికమంది వరకు అక్కడున్న వాళ్ళు శ్రద్ధగా ఆలకిస్తున్నారు. ఆ ముసలిదాని కళ్ళలో అదే మెరుపు, చురుకుదనం అగుపిస్తున్నాయి భిక్షపతికి. అంత వార్థక్యపు జీవితంలోను ఓ ఆశయం తాలూకు హరివిల్లు ఆ మురికివాడలోని బురదకలువలాంటి అవ్వలో కన్పిస్తోంది. అదంతా ఓ నాటకంగా కొట్టి పడేశాడు భిక్షపతి. తల్లిదండ్రులు దూరమైతే వాళ్ళ ఆలనాపాలనా మీదవేసుకొని అనాధ బాలలను అక్కున జేర్చుకొని తన ముసలి పేద బ్రతుకులో దారి చూపాలన్న తపన అగుపిస్తోంది అక్కడ.

చిట్టిపొట్టి చిన్నారులు నాగరికఛాయల నెరుగక వంచింపబడి అక్కడకు చేరిన వైనం తేటతెల్లమవుతోంది. క్రుంగ దీస్తూన్న వయసులో ఓ ముసలి చిరునవ్వు సతమతమవుతూ ఉంది. హృదయ విదారకమైన మానసిక వికలాంగులు, వాళ్ళుపెట్టే కేకలు చేష్టలను ఎంతో ధైర్యంగా ఓపికగా అక్కువ చేర్చుకుంటోంది ఆముసలి అవ్వ. ఆలయాల దగ్గర యాచన చేసేవాళ్ళు, ఇళ్ళనుండి పారిపోయి వచ్చినోళ్ళు, మనోవికాసం లేని విధివంచితులు, వీధి బాలల అభ్యున్నతి కోసం శ్రమటోడుస్తూన్న అభ్యుదయం అగుపిస్తోందక్కడ. వాళ్లను తీర్చిదిద్దాలంటే దృకృధం, వారి సంక్షేమంకోసం తాను హీనమై చుట్టు ప్రక్కలవారి సాయం అర్థించడం, పదో పరకో అడుక్కునైనా తెచ్చివాళ్ళను పోషించడం అనేవి సుస్పష్టంగా ఉన్నాయక్కడ. మానసిక శారీరక వికలాంగులకోసం దాచుకోలేనంత తల్లిప్రేమ అక్కడ అగుపిస్తోంది. అందుకు నోచుకోని వాళ్లందరూ అక్కడ పిల్లలుగా చలామణీ అవుతున్నారు.

నమ్మశక్యంగా లేదు భిక్షపతికి. మగత ఆలోచనలు మనసునిండా కమ్మేసి మంచిగా ఆలోచించనీయడం లేదు. సమాజంతో పాటు ఎదుగూతున్న దుర్నీతికి ఆవల మరో పార్శ్వమేదో అవగత మవుతోంది భిక్షపతికి. కానీ పుట్టమునిగిన అసంబద్ధ వ్యక్తిత్వంలో ఆ అవ్వలోని నిజాయితీ అంగీకరింపబడటం లేదు. ఆ మనుషులు, ఆ సేవాదృక్పధం అతని విచక్షణ లేమిలో సమాధికాబడుతున్నాయి. ఆ చేష్టల వెనుక, ఆమె నిరంతరం సేవ వెనుక ఏదో ఒక చికటి ప్రయోజనం కోసం వెతుకుతూనే ఉన్నాడు. 'అవును భిక్షపతిగారూ! మీరేమనుకున్నా సరే అవ్వ ఈఊరి మదర్‌ ధెరీస్సా!! తన రెక్కల కష్టాన్ని భగవత్‌ సేవగా భావిస్తోంది. లేమితనాన్ని, వార్థక్యపు సమస్యల్ని సయితం లెఖ్కచేయక ఎన్నో ప్రతిబంధకాలు ఎదురవుతూన్న జనాల్ని, నాగరికతను దూరమై మ్రగ్గుతూన్న శ్రామిక జనుల్ని అక్కున జేర్చుకుంటూన్న అమృత మూర్తి అవ్వ. మనిషి మనిషిలో ప్రేమతత్వాన్ని నింపే సత్సంకల్పంతో ఆవిర్భవించి . . .'

కారుణ్యమూర్తి మాటలు అర్థంకావడం లేదు. భిక్షపతికి. ఒక ప్రక్క బుర్ర సుడులు తిరిగిపోతోంది. "మీరు నొచ్చుకోకుంటే ఒక మాట. మీ ఆఫీసులో నేనో చిన్న కాంట్రాక్టర్ని దానిని లంచం అన్నా బహుమతి అన్నా మీ ఇష్టం. మేము చేసే పనుల్లో పదిశాతం మీకు సమర్పించుకోందే నేను మన గలగలేని పరిస్థితి. ఒక స్వార్థం, అవినీతి కోణాలకు ఆవలివైపు మేము మనుషులుగా మరో పార్శ్వాన్ని స్పృశిస్తూనే ఉన్నాం. అంటే మీకు పదిశాతం లంచంగా సమర్పించుకుంటే, ఆమె మనుగడకు . . .కొన్ని ప్రశ్నార్థకమైన జీవాలకు ఒక్క శాతం బహుమతిగా ఇచ్చుకుంటున్నాం. ఈ పది . . .ఆ ఒకటిలకు తేడా ప్రక్కన సున్నా! ఒక్క సున్నా తేడా అయినా అది ఎన్నో కొన్ని జీరో బ్రతుకుల్ని నిలబెడుతూనే ఉంది. 'అంటే శూన్యమనుకొన్న సున్నా జీవితాల్ని సంతరించుకుంటోందన్నమాట' పకపకా నవ్వాడు భిక్షపతి. కానీ ఆ నవ్వులో జీవం లేదు.

సకల చరాచర జీవరాశులలోని ఓ జంతువును మనిషిని చేసిందీ ఓ సంకల్పమే! బుద్ధి వివేచనకు సాయుద్ధమై, భావోద్వేగాలకు మాధ్యమమై ఓ సంస్కారవంతమైన జీవిగా తీర్చిదిద్ద బడడానికి . . .మానవ జీవిత గమనాన్ని రసమయం చేసేదీ . . . ఆ సంకల్ప లక్ష్యమే! ఇంతకు ముందు చదివిన కధలోని మాటలు గుర్తుకు వస్తున్నాయి. 'ఛ' అనుకున్నాడు. తన మగత మనిషితనంతో. కానీ అల్లంత దూరంలో చేతికర్ర సాయంతో రోడ్లు శుభ్రం చేస్తూన్న ఆ ముసలి అవ్వలో ఓ అమ్మ. . .ఓ మదర్‌లు అగుపిస్తూనే ఉన్నారు భిక్షపతికి.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: