telugudanam.co.in

      telugudanam.co.in

   

తెలివైన వ్యాపారి

ఒక ఊరిలో ఒక తెలివైన వజ్రాల వ్యాపారి ఉండేవాడు. ఒకసారి ఆయన వ్యాపార నిమిత్తం రైలులో ఢిల్లీకి ప్రయాణం చేస్తున్నాడు. కొద్దిసేపటి ప్రయాణం తర్వాత ఆ రైలు భోగిలోని ప్రయాణికులు ఒకరితో ఒకరు పరిచయం చేసుకుని కబుర్లు చెప్పుకోసాగారు. వ్యాపారి కూడ తన గురించి అక్కడున్న వారితో చెప్పాడు. ఆయన వజ్రాల వ్యాపారం చేస్తాడని చెప్పగానే అక్కడున్న వారంతా నిజమైన వజ్రాలు ఎలా ఉంటాయో చూడాలని ఉబలాట పడ్డారు. వారిలో ఒక దొంగ కూడా ఉన్నాడు.

వ్యాపారి తన కోటు జేబులోంచి మఖమల్‌తో చేసిన చిన్న చేతి సంచిని బయటకు తీశాడు.అందులోంచి చాలా ఖరీదైన వజ్రాలను తీసి జాగ్రత్తగా ఒక్కొక్కరికి చూపించాడు. దొంగ వజ్రాలను ముట్టుకుని చూడగానే వాటి విలువను అంచనా వేశాడు. ఆ ఒక్క దొంగతనం చేస్తే జీవితంలో మళ్ళీ దొంగతనం చేయాల్సిన అవసరం లేకుండా హాయిగా బ్రతికేయవచ్చని అనుకున్నాడు. గమ్యం చేరేలోపు ఆ వజ్రాలను తస్కరించాలని నిర్ణయించుకున్నాడు దొంగ.

చీకటి పడింది. అందరూ నిద్రకుపక్రమించారు. వ్యాపారి కూడా తన కోటును రైలు భోగీకి ఉన్న కొక్కానికి తగిలించి పడుకున్నాడు. దొంగ తన బెర్తుపై పడుకుని నిద్రపోతున్నట్లు నటించసాగాడు. అర్ధరాత్రి దాటింది. దొంగ నిశ్శబ్ధంగా లేచి వజ్రాల కోసం వ్యాపారి కోటు వెతికాడు. కాని అతనికి వజ్రాల సంచి కనిపించలేదు. గాఢ నిద్రలో ఉన్న వ్యాపారిని కూడా సోదా చేశాడు. కాని ఫలితం కనిపించలేదు.

తెల్లవారాక రైలు ఢిల్లీకి చేరింది. అందరూ వీడ్కోలు చెప్పుకున్నారు. స్టేషన్‌ బయట వ్యాపారి టాక్సీ ఎక్కబోతుంటే దొంగ ఆయన దగ్గరకు వెళ్ళాడు.

"నన్ను క్షమించండి. నేనొక దొంగని. నేను మీ వజ్రాలను దొంగిలించాలనుకున్నాను. నాకు వీలైనంతగా ప్రయత్నించాను. కాని వజ్రాలను చేజిక్కించుకోలేకపోయాను. మీకు అభ్యంతరం లేకపోతే ఆ వజ్రాలు ఎక్కడ దాచారో చెప్పగలరా?" అని అడిగాడు దొంగ.

వ్యాపారి చిన్నగా నవ్వాడు. "నిన్ను చూడగానే దొంగతనం నీ వృత్తి అని పసికట్టగలిగాను. నువ్వు తప్పకుండా నా వజ్రాలు దొంగిలించటానికి ప్రయత్నిస్తావని ఊహించాను. నువ్వు టీ తాగడానికి ఒక స్టేషన్‌లో రైలు దిగినప్పుడు నీ దిండు క్రింద వజ్రాల సంచిని దాచాను. అంతకు మించిన భద్రమైన స్థలం నాకు ఇంకోటి కనిపించలేదు. రాత్రంతా దొంగతనం ధ్యాసలో నిద్రపోని నువ్వు వేకువజాములో గాఢనిద్రలోకి జారిపోయావు. అప్పుడు నీ దిండు క్రింద నుంచి నా సంచిని నేను తీసుకున్నాను." అని చెప్పి వ్యాపారి టాక్సీ ఎక్కి వెళ్ళిపోయాడు.


మూలం : 30-10-08, గురువారం, సాక్షి, ఫ్యామిలీ.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: