telugudanam.co.in

      telugudanam.co.in

   

డాక్టర్‌ కె. యల్‌. రావు

పేరు : డాక్టర్‌ కె. యల్‌. రావు.
తండ్రి పేరు :

(తెలియదు).

తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 15-07-1902.
పుట్టిన ప్రదేశం : కంకిపాడు, ఆంధ్రప్రదేశ్‌.
చదివిన ప్రదేశం : లండన్.
చదువు : 1939, సివిల్‌ ఇంజనీరింగ్‌లో పి. హెచ్‌డీ.
గొప్పదనం : ఆంధ్రరాష్ట్రం గర్వించదగ్గ గొప్ప ప్రాజెక్ట్‌ డిజైన్‌ ఇంజనీర్‌.

1963లో రాష్ట్రపతి నుంచి ' పద్మ భూషన్‌ ' అవార్డు గ్రహించారు.

రచనలు : " స్ట్రక్చరల్‌ ఇంజనీరింగ్‌ అండ్‌ రీయిన్‌ఫోర్స్‌డ్‌ కాంక్రీట్‌ ".
స్వర్గస్తుడైన తేది : 18-05-1986.

ఆంధ్రజాతి గర్వించదగిన ప్రముఖులు అన్ని రంగాలలో ఉన్నారు. అలాంటి వారిలో ప్రముఖ ఇంజనీరుగా పేరెన్నికగన్న డాక్టర్ కె. యల్‌. రావు ఒకరు వీరి పూర్తి పేరు కానూరి లక్ష్మణరావు. ఈయన బెజవాడ సమీపానగల కంకిపాడు గ్రామంలో 1902లో జన్మించారు. వీరి తండ్రి గ్రామ కరణం. చిన్నతనం నుండే రామకృష్ణ పరమహంస, మహాత్మా గాంధీ, వివేకానందుడు మొదలైన మహాపురుషుల జీవిత చరిత్రలు చదివి వారిలాగా ఆదర్శంగా జీవించాలనుకొనేవారు. వీరికి చిన్నతనంలోనే తండ్రి చనిపోవటం జరిగింది. హైస్కూల్‌ చదువు బెజవాడలో జరిగింది. ఈ తరంవారు నమ్మలేనంత చౌక రోజులవి. ఆ రోజుల్లో నెలకు ఎనిమిది రూపాయలతో ముప్పూట భోజనం టిఫెనూ పెట్టేవారు. అక్కడ మంచి మార్కులతో యస్‌. యస్‌. యల్‌. సి. పాసయ్యారు. మద్రాస్‌ ప్రెసిడెన్సీ కళాశాలలో లెక్కల గ్రూపులో సీటు లభించింది. బాగా చదివి ఇంటర్మీడియట్ గూడా డిస్టింక్షన్‌లో పాసయ్యారు. మెడిసిన్‌లోనూ, గణితశాస్త్రం బి. ఎ. ఆనర్సులోనూ, ఇంజనీరింగులోనూ సీటువచ్చింది. తన కోరిక ఇంజనీరు కావాలని, గిండీ ఇంజనీరింగు కళాశాలలో చేరారు. సివిల్‌ ఇంజనీరింగులో శ్రద్ధ ఎక్కువ. అయినా ఇంజనీరింగులో అన్ని విభాగాలు అధ్యయనం చేశారు. ఇంజనీరు కోర్సు పూర్తిచేశారు.

విశాఖపట్నం జిల్లా బోర్డులో సహాయ ఇంజనీరుగా ఉద్యోగం దొరికింది. సాధారణంగా ఇంజనీర్లకు పై సంపాదన ఉంటుంది. కంట్రాక్టర్లు తమ లబ్ధికోసం లంచాలిస్తుంటారు. ఒక సందర్భంలో ఒక కంట్రాక్టరు తన లోపం కప్పిపుచ్చుకోవడం కోసం ఈయనకు లంచం ఎర చూపాడు. రావుగారు మండిపడి ఆ కాంట్రాక్టు రద్దు చేస్తానని హెచ్చరించారు. అతను భయపడి పారిపోయాడు బయటకి. అదీ రావుగారి నిజాయితి. ఈ నిజాయితీ జీవితమే ఆయన ఆఖరివరకు కొనసాగించారు. తన జీవిత చరిత్రలో యిలా వ్రాశారు. " ఎవరైనా లంచం ఇవ్వజూపితే వారిపై అసహ్యభావం కలుగుతుంది. అది పాపకార్యమనీ, అతిహీనమైన పని అనీ నా మనసులో పాతుకొని పోయింది. ఆ భావమే నన్ను ఆ దశలో రక్షించింది. " ఎంత నిజాయితీ! గాంధీజీ, వివేకానందుల ప్రభావం ఊరికే పోలేదు.

రంగూన్‌లో కార్మిక సంఘ నాయకుడు నారాయణరావనే తెలుగువాడు, రావుగారు రంగూర్‌ వచ్చినందుకు నిరుత్సాహపరిచాడు. అయినా ఈయన అధైర్యపడలేదు. స్వశక్తితో నీటి సరఫరా శాఖలో ఉద్యోగం సంపాదించాడు. ఆ ఉద్యోగం కూడా వదిలేసి ఇండియాకు తిరిగివచ్చి మెట్టూరు ప్రాజెక్టులో జూనియర్ ఇంజనీరుగా చేరాడు. గాంధీ అన్నా, కాంగ్రెస్‌ పార్టీ అన్నా ఈయనకు చాలా ఇష్టం. అయ్యదేవర కాళేశ్వరరావుగారూ, కొమర్రాజు అచ్చమాంబగారూ మొదలైన బంధువులందరూ కాంగ్రెస్‌లో ఉన్నారు. తాను కూడా చేరాలన్న సంకల్పంతో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా యిచ్చాడు. అధికార్లు అంగీకరించలేదు. గిండీ ఇంజనీరింగు కాలేజీకి బదిలీ చేశారు. లెక్చరర్‌గా చేరాక ఇంజనీరింగ్‌లో రీసెర్చి (పరిశోధన) చేయాలని కోరిక కలిగింది. రీసెర్చి కోసం ఇంజనీరింగు ఎం. యస్సీ. లో చేరాడు. పరిశోధన విభాగం (రీసెర్చి) డైరక్టరు కె. సి. చాకో అనే గొప్ప ఇంజనీరు. లండన్‌ విశ్వవిద్యాలయంలో పరిశోధన చేసిన వ్యక్తి. వీరి సలహా సహకారాలతో సిద్ధాంత వ్యాసం సమర్పించారు రావుగారు. ఆ సిద్ధాంత వ్యాసాన్ని ఇంగ్లాండు పంపారు. అక్కడ ఇంజనీరింగు నిపుణులైన ఆండ్రూస్‌, ఆస్కార్‌. ఫేజర్‌, బెట్టో అనే వాళ్లు దాన్ని చదివి ఆశ్చర్యపోయారు. ఇంజనీరింగులో పరిశోధన సిద్ధాంత వ్యాసాన్ని సమర్పించి డిగ్రీ పొందిన భారతీయుల్లో రావు ప్రధములు.


మేధాశక్తికి తొలి విజయం :

మద్రాసు సెంట్రల్‌ రైల్వేస్టేషన్‌ కూవంనది గట్టున వుంది. మద్రాసు నగరం ఉత్తర, దక్షిణ ప్రాంతాలను కలిపే కీలకమైన బ్రిడ్జి యీ నదిపై నిర్మింపబడి వుంది. సముద్రం ఉప్పు గాలి ప్రభావం వల్ల బ్రిడ్జి కింది భాగం కాంక్రీటు వూడి పోయి ఇనుప కమ్ములు బయటపడ్డాయి. బ్రిడ్జీ బలహీనపడిందన్న భావంతో ప్రభుత్వం ఆ బ్రిడ్జీపై రాకపోకలు నిలిపివేసింది. ప్రత్యామ్నాయపు ఏర్పాట్లు పరిశీలిచవలసిందిగా చీఫ్ ఇంజనీరు రావును కోరారు. రావుగారు బ్రిడ్జీని పరిశీలించి పధకం ఆలోచించాడు. అప్పుడప్పుడే కాంక్రీటు విద్యలో ప్రజ్ఞను సంపాదించుకుంటున్న రావుగారు సన్న కంకరతో కాంక్రీటు తయారుచేయించి తుపాకి గొట్టం లాంటి గొట్టాలతో కిలుమును గీకేసిన కమ్ములపై పిచికారీ చేయించాడు. సిమెంటు బాగా మెత్తుకొనేలా చేశాడు. ఇంకేం ! బ్రిడ్జీ బాగుపడింది. రాకపోకలు నిర్భయంగా జరిగాయి. రావు కీర్తి దేశమంతా వ్యాపించింది. ఈ విజయంతో కాంక్రీటు కట్టడాలపైనా ఆ విద్యపైనా శ్రద్ధ పెరిగింది రావుగారికి. ఈ విద్యలో ప్రపంచ ప్రసిద్ధుడైన ఫ్రెస్సియెనెట్‌ అనే ఇంజనీరు ఫ్రాన్సులో వున్నాడు. ఆయన దగ్గర ఈ విద్య చదవాలని రావులో పట్టుదల కలిగింది. అధికారులు అందుకు అనుమతించలేదు. అయినా వెళ్ళడానికే నిశ్చయించుకున్నాడు. భార్య వరలక్ష్మితో ఫ్రాన్సు బయలుదేరాడు.

ఫ్రాన్సు చేరి ఫ్రెస్సియెనెట్‌ను కలిశాడు. తన కోరిక కొంతవరకు నెరవేరింది. 1939లో ఫ్రాన్సు నుండి లండన్‌ చేరాడు. నేర్చుకున్న కాంక్రీటు విద్యలో అనుభవం సంపాదించాలని " కాంక్రీటు ఇంజనీరింగు" సంస్థలో చేరాడు. అక్కడ చీఫ్ ఇంజనీరు రెనాల్డ్స్ మరొక ఇంజనీరు టన్నరు. అది శిక్షణా కేంద్రం కదా! డబ్బు కట్టి శిక్షణ పొందవలసి వచ్చింది. ఈ డబ్బు కోసమూ తన కుటుంబ పోషణ కోసమూ కష్టాలను లెక్కించక సాయంకాల సమయాల్లో కాలేజీల్లో లెక్చర్లు ఇచ్చి డబ్బు సంపాదించేవారు.

1939 వ సంవత్సరం హిట్లర్‌ యుద్ధాన్ని ప్రకటించాడు. యుద్ధ వాతావరణంలో బాంబుల నుండి రక్షించుకోవడం కోసం నేలను త్రవ్వి షెల్టర్స్ కట్టడం అధికమైంది. ఈ కట్టడాలకు సంబంధించి కాంక్రీటుపై పరిశోధన ఎక్కువైంది. రావు లెక్కల్లో ఘటికులు. కానీ డిజైన్స్ వేయడంలో అంత మేధావికాదు. ఇది పెద్ద లోటు అనిపించింది రావుగారికి. లండన్‌ ప్రక్కనేగల థేమ్స్ నదిపై ప్రత్యేక తరహాలో కట్టబడిన బ్రిడ్జీని ప్రతి రోజూ పరిశీలించి (డిజైన్స్) రూపకల్పన చేయడం నేర్చుకున్నాడు. లండన్‌ ప్రక్కనేగల ఒక పట్టణంలోని కళాశాలలో సీనియర్‌ లెక్చరర్ ఉద్యోగం లభించింది. అతి కష్టం మీద ఒక చిన్న ఇల్లు అద్దెకు లభించింది. ఈ కళాశాలలో రావు విద్యార్ధులను బాగా ఆకట్టుకున్నారు. తాను బోధించిన కఠినమైన సబ్జక్టుల్లోనే ప్రధమశ్రేణిలో పాసయ్యేటట్లు చేశారు. తన పరిశోధన బాగా సాగిందిక్కడ. " రీయిన్‌ ఫోర్స్‌డ్‌ కాంక్రీటు " పైన గ్రంథం వ్రాశాడు. ఒక ప్రముఖ కంపెనీ ప్రచురించింది. కంపెనీ ప్రచురించిందంటే అది ఒక ప్రత్యేకత అన్నమాట. పుస్తకం పై మంచి రాయల్టీ కూడా వచ్చింది. మద్రాసులో కూడా ఈయన కీర్తి వ్యాపించింది. ఆయనపై మరింత గౌరవం పెరిగింది. రావు అమెరికా వెళ్లి " సెల్యూలార్‌ కాఫర్‌ డ్యాం " విషయమై వివరాలు సేకరించాలని మద్రాసు నుండి చీఫ్‌ ఇంజనీరుగారు ఉత్తరం వ్రాశారు.


సెల్యూలార్‌ కాఫర్‌ డ్యాం :

జల ప్రవాహంతో ఉన్న నదులకు ఆనకట్ట లేదా వంతెన కట్టాలంటే నదిలో ఒక వైపున ముందు నీరు లేకుండా చేసుకోవాలి గదా! కాఫర్‌ డ్యాంలు కట్టి మధ్యలో నుండి నీరు తీసేసి పునాదులు వేస్తారు. ఒకవైపు పూర్తికాగానే మరోవైపు కాఫర్‌ డ్యాం కట్టి నీరు తీసేసి అక్కడ గూడా పునాదులు వేస్తారు. పునాదులపైన గోడగానీ, స్తంభాలుగానీ కట్టడం పూర్తి అయినాక వీటిని తొలగించి వేస్తారు. యుద్ధం రోజుల్లో అమెరికా వెళ్ళడానికి ఇంగ్లండు ప్రభుత్వం అంగీకరించలేదు. ఎలాగో ఇండియా ప్రభుత్వం జోక్యంతో ఇంగ్లాండువారి అనుమతి సంపాదించి అమెరికా వెళ్లాడు. అమెరికాలోని అన్ని రకాల నిర్మాణాలను నిశితంగా పరిశీలించాడు. అమెరికాలోని కొలరెడోనదిపై కట్టిన డ్యాం ప్రపంచలోకెల్లా ఎత్తయినది. ఎక్కువ కాంక్రీటు ఉపయోగించి కట్టిన మరొక డ్యాం గ్రాండ్ లవ్‌లీ డ్యాం. ఈ రెండింటినీ రూపకల్పన చేసినవారు (డిజైనర్‌) విశ్వవిఖ్యాత ఇంజనీరు జె . యల్‌. సాలేజ్‌గారు. రావుకు వీరి సలహాలూ, సహకారమూ లభించాయి. అన్ని విషయాలు కూలంకషంగా అధ్యయనం చేసి మంచి రిపోర్టు తయారు చేశారు రావుగారు. దాన్ని మద్రాసు పంపించారు. తాను ఇంగ్లాండు వచ్చేశారు.


శ్రీ రాంపాదసాగర్‌ ప్రణాళిక :

గోదావరి నదిపై పోలవరం దగ్గర ప్రాజెక్టు కట్టాలని మద్రాసు ప్రభుత్వం ఆలోచించింది. ప్రభుత్వ చీఫ్ ఇంజనీరు గోవిందరాజ అయ్యంగారు తెలుగువారు కాదు. గవర్నరు సలహాదారు యస్‌. వి. రామమూర్తి. ముఖ్యమైన ప్రాజెక్టులను పరిశీలించడానికి చీఫ్ ఇంజనీరును అమెరికా వెళ్ళమని ప్రభుత్వం కోరింది. ఆయన అమెరికా వెళ్తూ ఇంగ్లడులో ఆగి రావుగారిని తనతో కూడా రమ్మన్నారు. తన కుటుంబ పరిస్థితి అనుకూలించకపోయినా అనుకోకుండావచ్చిన అవకాశాన్ని వదులుకోదలంచలేదు రావుగారు. అదే ఆయన ప్రత్యేకత. రెండవసారి అమెరికా వెళ్ళాడు. చీఫ్‌ ఇంజనీరు అయ్యంగారితో కలిసి అనేక ప్రాజెక్టుల రూపకల్పనను (డిజైన్‌లను) అధ్యయనం చేసి రిపోర్టు తయారుచేశారు. అయ్యంగారు ఇండియా వచ్చారు. రావు ఇంగ్లండు వెళ్లిపోయారు.

తరువాత కొన్ని రోజులకు రావుగారికి ఒక ఉత్తరం వచ్చింది. అందులో తాను ఇండియాకు వచ్చి పోలవరం ప్రాజెక్టు పనులు చూడవలసిందనీ త్వరలో మద్రాసు రావలసిందనీ ఉంది. రావుగారు సంతోషంగా బయలుదేరారు. ఏడేళ్ల తరువాత ఇండియాలో కాలుమోపారు. అంటే 1946 లో అన్న మాట. శ్రీరాం పాదసాగర్‌ డ్యాం డిజైన్‌ ఒక సంవత్సరంలోనే ముగించాడు. అమెరికాలోని అంతర్జాతీయ ఇంజనీరింగు కంపెనీలో, సాలేజ్‌ గారిని కలిసి, డిజైన్‌ ఖారారు చేసుకొని భారతదేశం తిరిగి వచ్చారు. అయితే రాజకీయంగా ఆనాడు వచ్చిన మార్పుల కారణంగా ఆ నిర్మాణం ఆగిపోయింది.


ఖోస్లా కమిటీ - రావుగారి పాత్ర:

లోయర్‌ భవానీ, మలంపూరా, ఇంకా మరికొన్ని డ్యాంల ' డిజైన్‌ ' చేయవలసిందిగా రావుగారిని ప్రభుత్వం కోరింది. కృష్ణానదిపై పులిచింతల, సిద్ధేశ్వరం నిర్మాణానికి సంబంధించిన పనులను గూడా పర్యవేక్షించమని కోరింది. ఈ సమయంలోనే " సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ కమిషన్‌ " లో డైరెక్టరుగా నియమిస్తూ రావుగారికి ఉత్తర్వులందాయి. కేంద్రప్రభుత్వం ఒరిస్సాలోని హీరాకుడ్ ప్రాజెక్టు పర్యవేక్షణ వారికి అప్పజెప్పింది. భారతదేశమంతటా నీటి పారుదల ప్రాజెక్టులూ జలవిద్యుత్‌ ప్రాజెక్టులూ పరిశీలించారు. పులిచింతల ప్రాజెక్టు కోసం మొదటి నుండి ఆందోళన చేస్తున్న ముక్య్తాలరాజాతో పాటు ఆ ప్రాంతాన్ని దర్శించి నందికొండ సరియైన స్థలం అని నిర్ణయించారు.

ఈ సమయంలో ప్రాజెక్టుల పరిశీలనకు ఖోస్లా కమిటీ ఆంధ్రప్రాంతానికి వచ్చింది. పులిచింతల ప్రాజెక్టువల్ల మద్రాసు ప్రాంతానికి ఏ రకంగాను లాభం లేదన్న దృష్టితో ఆనాటి ముఖ్యమంత్రి రాజగోపాలచారి సైతం ఈ ప్రాజెక్టుకు అడ్డు చెప్పారు. రావు తన మేధాశక్తితో ఆ ప్రాజెక్టు అన్ని విధాల తగినదని నిరూపించి ఖోస్లా కమిటి చేత అంగీకరింపజేశారు. కాని స్థలం పులిచింతలకు మారుగా నందికొండకు మార్చారు. అదే నాగార్జున సాగర్. ఇవేగాక కాటన్‌ బ్యారేజీ, ప్రకాశం బ్యారేజీ, శ్రీశైలం, ఇడుక్కీ, కొయ్నా, భీమా,యున్‌యీ, కోసీ బ్యారేజీ, గండక, నర్మదా, బలికుల, భాక్రానంగల్‌ మొదలయిన అనేక నదీలోయ ప్రాజెక్టుల రూపకల్పనలోనూ, నిర్మాణంలోనూ రావుగారికి ప్రమేయం వుంది. 1954లో సెంట్రల్‌ వాటర్‌ అండ్‌ పవర్‌ కమిషన్‌కు చీఫ్ ఇంజనీరుగా పదోన్నతి పొంది ఆ తరువాత 1956లో ఆ కమిషన్‌లోనే సభ్యుడుగా కూడా అయ్యారు.


అవార్డులు - రివార్డులు :

తన కృషికి గుర్తింపుగా 1947 - 48లోనూ, 1953 - 54లోనూ రావుగారు రాష్ట్రపతి అవార్డు పొందారు. 1951 - 61 మధ్యలో ఒక అంతర్జాతీయ సదస్సుకు ఉపాధ్యక్షుడయ్యాడు.
1959 - 60లో విద్యుచ్ఛక్తి మరియు నీటి పారుదల కేంద్ర మండలికి అధ్యక్షుడయ్యాడు.
1960లో ఆంధ్ర విశ్వవిద్యాలయం డాక్టర్ ఆఫ్ సైన్స్ బిరుదు ఇచ్చి సత్కరించింది.


రాజకీయ జీవితం :

మేధావులు రాజకీయాల్లో ఉంటే దేశాభివృద్ధికి దోహదంగా ఉంటుందని ఒక సభలో రావుగారన్నారు. ఆనాటి సభకు ముఖ్య అతిధిగా విచ్చేసిన నెహ్రూగారు ఆ మాట విన్నారు. అది 1961వ సంవత్సరం. విజయవాడ పార్లమెంటు సీటుకు కాంగ్రెస్‌ పార్టీ టికెట్ యిప్పించారు సంజీవరెడ్డిగారు. అయ్యదేవర కాళేశ్వరరావుగారూ, కొమర్రాజు అచ్చమాంబగారూ రావుగారి పక్షాన విశేషంగా కృషిచేశారు. మొత్తానికి ఇరవైవేల ఓట్ల మెజార్టీతో రావుగెలిచారు. పార్లమెంటులో ' ఎస్టిమేషన్‌ కమిటీ మెంబరు ' గా నియమింపబడ్డారు. అభివృద్ధి పొందుతున్న దేశాలకు సంబంధించి బెర్లిన్‌లో ఏర్పాటు చేసిన ఒక అంతర్జాతీయ సమావేశానికి భారతదేశ ప్రతినిధిగా హాజరయ్యారు రావుగారు. 1963 జూలై నెలలో నెహ్రూగారి నుండి నాగార్జున సాగర్‌లో వున్న రావుగారికి ఫోను వచ్చింది. నీటి పారుదల, విద్యుత్‌ శాఖలకు మంత్రిగా నియమిస్తున్నానని నెహ్రూగారు చెప్పారు. 19-7-63 వ తేది మంత్రిగా ప్రమాణం చేశారు. 1964 లో నెహ్రూగారు చనిపోయి శాస్త్రిగారు ప్రధాని అయినపుడూ, శాస్త్రిగారు మరణించి ఇందిరాగాంధీ ప్రధానిగా వచ్చినపుడూ కూడా వీరు మంత్రివర్గంలో కొనసాగారు. మంత్రిగా కొనసాగడమే కాదు వీరిశాఖ ఎవరూ మార్చలేదు. అదీ వీరి ప్రాముఖ్యం. తిరిగి 1967 ఎన్నికల్లో రావుగారు విజయవాడ నియోజకవర్గం నుండి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇది వారి మంచితనానికీ, గొప్పతనానికీ, నియోజక అభివృద్ధికి వారు చేసిన కృషికీ తార్కాణం.

కృష్ణా, గోదావరి నదీజలాలు పంపకంలో కొన్ని తగాదాలు వచ్చాయి. మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఈ విషయంలో వైషమ్యాలు రాసాగాయి. రావుగారు న్యాయం మాట్లాడినా ఆంధ్రేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులూ, నిపుణులూ వీరిని అనుమానంగా చూడసాగారు. ప్రాంతీయ దురభిమానం లేకుండా దేశక్షేమాన్ని మాత్రమే కాంక్షించి నిరంతరం నిష్పాక్షికంగా కృషి చేస్తున్నప్పటికీ నిందలు తప్పలేదు. ఈ పరిస్థితులలో పదవి కొరకు ప్రాకులాడటం రావుగారికి నచ్చలేదు. తనకు తానే రాజీనామా యిచ్చి ఇంటికి వచ్చారు. " నిరంతర కృషితో కార్యదీక్షతో అలసిపోయారు కాబట్టి ఇక విశ్రాంతి తీసుకోండి " అని సహధర్మచారిణి వరలక్ష్మమ్మ సంతోషంగా పలికింది.
ఈ మహనీయుడు తన 85 వ యేట 1986 లో మరణించారు. గతంలో కాటన్‌ ప్రభువూ, మెకంజీ లాంటి వాళ్లు సూచించిన విధంగా, గంగా కవేరీ కలపాలన్న రావుగారి వాంచ నెరవేరకుండానే పోయారు. భౌతికంగా ఆయన లేకపోయినా, జలవిద్యుత్‌ ప్రాజెక్టులు ఉన్నంత కాలం ఆయన ప్రజా హృదయాల్లో జీవించే వుంటారు.


మూలం : ఆణిముత్యాలు, తెలుగు ఉపవాచకం

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: