telugudanam.co.in

      telugudanam.co.in

   

ఈశ్వరచంద్ర విద్యాసాగర్

ఈశ్వరచంద్ర విద్యాసాగర్‌
పేరు : ఈశ్వరచంద్ర విద్యాసాగర్.
తండ్రి పేరు : ఠాకూర్ దాస్
తల్లి పేరు : భగవతీదేవీ
పుట్టిన తేది : 1820 సంవత్సరంలో జన్మించెను.
పుట్టిన ప్రదేశం : బెంగాలులోని వీర్శింగ
చదివిన ప్రదేశం : కలకత్తా.
చదువు : సంస్కృతంలో డిగ్రీ.
గొప్పదనం : సంఘంలో కరుడుకట్టుకుపోయి ఉన్న మూఢాచారాలను తొలగించి, స్త్రీ
పునర్వివాహాలను ప్రోత్సహించి, స్త్రీల చదువు గురించి కృషి చేసి, స్త్రీ జీవితంలో
గణనీయమైన మార్పులను తెచ్చారు.
స్వర్గస్థుడైన తేది : 1899 వ సంవత్సరంలో స్వర్గస్థుడయ్యాడు.

బెంగాల్ రాష్ట్రంలోని, ఒక సాంప్రదాయ కుటుంబంలో జన్మించి, సంఘంలో కరుడుకట్టుకుపోయి ఉన్న మూఢాచారాలను తొలగించి, స్త్రీ పునర్వివాహాలను ప్రోత్సహించి, స్త్రీల చదువు గురించి కృషి చేసి, స్త్రీ జీవితంలో గణనీయమైన మార్పులను తీసుకొచ్చిన ఈశ్వరచంద్ర విద్యాసాగర్ గురించి అందరూ తెలుసుకోవాలి. ఎక్కడైతే స్త్రీ పూజింపబడుతుందో అక్కడ సిరిసంపదలు ఉంటాయని గాఢంగా విశ్వసించాడు ఆయన.

ఈశ్వరచంద్ర బెంగాలులోని వీర్శింగ అనే గ్రామంలో 1820 లో ఒక పేద కుటుంబంలో జన్మించాడు. తండ్రి ఠాకూర్ దాస్ సంస్కృతంలో పాండిత్యం గలవాడు. తల్లి భగవతీదేవీ మహాభక్తురాలు. చదివించడానికి స్థోమత లేకపోవటం వలన తండ్రి ఇంట్లోనే అతనికి విద్యాబుద్ధులు నేర్పసాగాడు. ఈశ్వరచంద్ర గ్రహణశక్తిని, చదువుపై గల అత్యంత శ్రద్దను చూసి ముచ్చటపడిన కొందరు స్నేహితులు అతనిని కలకత్తా పంపించి మంచి పాఠశాలలో చేర్పించి చదివించమని ప్రోత్సహించారు. మిత్రుల బలవంతంతో ఠాకూర్ దాస్ కొడుకుని వెంటబెట్టుకుని కలకత్తా చేరాడు. ఒకపూట తింటూ, మరొకపూట పస్తులు పడుకొని, మొత్తానికి సంస్కృతంలో ఉన్నత విద్యను అభ్యసిస్తూ, అధ్యాపకుల అభిమానాన్ని తెల్లదొరల అనురాగాన్ని పొందగలిగాడు ఈశ్వరచంద్ర. అతని పద్దెనిమిదవ సంవత్సరంలో సంస్కృతంలో డిగ్రీతీసుకొని, విద్యాసాగరుడయ్యాడు. ఆ రోజుల్లో విద్యారంగంలో బాగా చదువుకున్న వారికి విద్యాసాగర్ అనే బిరుదునిచ్చేవారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ చదువు అనంతరం విలియం కాలేజీలో పండితుడిగా చేరాడు. అచిర కాలంలోనే యాజమాన్యం అభిమానాన్ని పొందారు. అతనిలో అసాధారణ ప్రజ్ఞను గుర్తించి వారు అతని సలహాలను తీసుకునేవారు. కొంత కాలం కాలేజీ ప్రిన్సిపాల్ గా చేశారు. కాలేజీలో విద్యాసాగర్ అనేక మంచి మార్పులు చేశారు. విద్యార్ధులలో క్రమశిక్షణ, అధ్యాపకులలో అంకిత భావన పెంపొందించడానికి ఆయన చేసిన కృషి ఎంతో ప్రశంశనీయమైనది. దురదృష్టవశాత్తు మతపరమైన అభిప్రాయబేధాలు రావటం వలన విద్యాసాగర్ రాజీనామా చేసి తన జీవితాన్ని సంఘ సేవకై వినియోగించాలని నిర్ణయించుకున్నాడు.

ఆ కాలంలో స్త్రీలు చదువుకొనటానికి సమాజం అంగీకరించేదికాదు. స్త్రీలు ఇంట్లోనే ఉండి ఇంటి పనులుచేస్తూ, భర్తను భగవంతుడిలా పూజిస్తూ, ఒక క్రమబద్దమైన జీవితానికి అలవాటుపడాలని శాసించేవారు. దానిని వ్యతిరేకించిన వారిని సంఘం నుంచి వెలివేసేవారు. మగవారైనా, ఆడవారైనా స్త్రీ విద్య గురించి ప్రస్తావించడానికి ధైర్యం చేసేవారు కారు. అటువంటి సమయంలో ఒక సనాతన కుటుంబంలో జన్మించి, సంస్కృతం అభ్యసించి పండితుడిగా ప్రశంసలను పొందిన ఈశ్వరచంద్ర స్త్రీ విద్యను ప్రోత్సహించాలని ఒక పుస్తకం రాసి సంచలనం సృష్టించారు. ఆది చదివిన ప్రజల్లో కొందరు ఉగ్రులయ్యారు. మరికొందరు 'అతనికి పోయేకాలం దాపురించింది' అన్నారు. కొంతమంది స్త్రీలు కూడా 'కలికాల మహత్యం ఇది. అందుకే అతనికి వెర్రిమొర్రి ఆలోచనలు వస్తున్నాయి' అని వాపోయారు. అతి తక్కువ మంది మాత్రమే ఆయన రచనను సమర్థించారు. అయితే పైకి చెప్పే ధైర్యం ఎవరికీలేకపోయింది.

ఆ సమయంలో ఈశ్వరచంద్ర కొంతమంది ఆంగ్లేయుల సహాయం తీసుకొని 'హిందూ బాలికా విద్యాలయం' స్థాపించాడు. కుల, మత, భాషా బేధాలు లేకుండా ఆ పాఠశాలలో బాలికలను చేర్పించమని ఇంటింటికీ తిరిగి చెప్పాడు. మొదట్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ రాను రాను కొంత మార్పు రాసాగింది. ఆ సమయంలో ఈశ్వరచంద్ర స్త్రీ విద్యపై అనేక వ్యాసాలు రాసి, ప్రసంగాలు చేసి వారిలో చైతన్యతను తీసుకు రాగలిగాడు. అయిదు సంవత్సరాల తరువాత మరి కొన్ని విద్యాలయాలు స్థాపించి చాలా మందికి ప్రీతిపాత్రుడయ్యాడు. కానీ కొంతమంది మాత్రం అతనిపై విమర్శలు చేస్తూనే ఉండేవారు. స్త్రీ విద్య అనంతరం అతను చేపట్టిన మరో బృహత్కార్యం స్త్రీ పునర్వివాహం. దానికి ప్రజల నుంచి మరింత తీవ్రమైన అభ్యంతరాలు వచ్చాయి. చివరకు స్త్రీలు కూడా అంగీకరించలేదు. కానీ అప్పటికే దేశంలోని కొన్ని ప్రాంతాలలో రాజా రామమోహన్‌రాయ్ వంటి ప్రముఖులు చేసిన సంఘ సంస్కరణల గురించి విన్న కొందరు మేధావులు ఈశ్వరచంద్ర తలపెట్టిన ఉద్యమాన్ని ముందుకు నడిపించాలని భావించారు. అది తెలుసుకొని వెంటనే వారిని కలుసుకుని వారి సహకారాన్ని ఆర్ధించాడు. వారందరి సహకారంతో 1815 నవంబరు 17న మొట్ట మొదటి వితంతు వివాహం జరిపించాడు.

'యత్ర నారీయత్తు పూజ్యంతే తత్ర రమంతే దేవతా' అనే సూక్తిని త్రికరణ శుద్ధిగా నమ్మిన ఈశ్వరచంద్ర, మూఢాచారాల వలయంలో చిక్కుకొని విలవిలలాడిపోతున్న ఎందరో స్త్రీలకు విముక్తిని కలిగించి నూతన జీవితం ప్రసాదించాడు. ఈశ్వరచంద్ర సంఘ సంస్కరణలే కాకుండా సాహిత్యపరంగా కూడా తనవంతు సేవచేశాడు. సుందర శైలిలో చక్కని సాహిత్యం అందజేశాడు. వంగ సాహిత్యంలో వ్యాకరణం రాసి మార్గదర్శకుడయ్యాడు. భేతాళ పంచ వింశతి, సీతావనవాస్ వంటి రచనలతో పాటు, షేక్‌స్పియర్ నాటకాలను అనువదించి తన తరువాత తరం వారికి పరభాషా సాహిత్యంలో కూడా ఆసక్తి కలిగించాడు. వితంతు వివాహాలు, స్త్రీ విద్య గురించి ఆయన రచించిన వ్యాసాలకు లెక్కలేదు.

స్త్రీ జనోద్ధరణకై తన సుఖమయ జీవితాన్ని త్యాగం చేసి, సంఘంలో అనేక అవమానాలను ఎదుర్కొని చివరకు అనుకున్నది సాధించగలిగాడు ఈశ్వరచంద్ర విద్యాసాగర్ ఆయన 1899 వ సంవత్సరంలో స్వర్గస్థుడయ్యాడు.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: