telugudanam.co.in

      telugudanam.co.in

   

లాల్ బహదూర్ శాస్త్రి

లాల్ బహదూర్ శాస్త్రి
పేరు : లాల్ బహదూర్ శాస్త్రి.
తండ్రి పేరు : శారదాప్రసాద్ రాయ్ .
తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 2-10-1904.
పుట్టిన ప్రదేశం : ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో జన్మించారు.
చదివిన ప్రదేశం : మొగల్ సరాయ్
చదువు :

(తెలియదు).

గొప్పదనం : బ్రిటీషు వారిని ఎదిరించి, దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో సత్యాగ్రహలు చేశాడు.
స్వర్గస్థుడైన తేది : 1966 వ సంవత్సరంలో స్వర్గస్థుడైనారు.

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొగల్ సరాయ్ గ్రామంలో లాల్ బహదూర్ 1904 అక్టోబర్ 2న జన్మించారు. తండ్రి శారదాప్రసాద్ రాయ్ ఒక నిరుపేద. బతకలేక బడిపంతులు అని అనుకుంటున్న ఆ రోజుల్లో ఆయన బడిపంతులు వృత్తిని చేపట్టి అతికష్టంగా తన కుటుంబాన్ని పోషిస్తూ కాలం గడిపేవాడు. ఇద్దరు ఆడపిల్లల తరువాత జన్మించిన లాల్ బహదూర్ ను చూసుకొని ఆ తల్లిదండ్రులెంతో మురిసిపోయారు. బ్రిటీషు దాస్యశృంఖాలలో మగ్గిపోతున్న భారతదేశాన్ని స్వంతంత్రంగా చేయాలని అప్పటికే కృషి చేస్తున్న మహాత్మాగాంధీ గారి జన్మదినమైన అక్టోబరు 2వ తారీఖునే, తమకు కుమారుడు కలగటం, ఆ దంపతులకు మరీ ఆనందం కలుగచేసింది. చరిత్ర ప్రాధాన్యంగల మహొన్నత దినంలో జన్మించిన తమ కుమారుడు గాంధీ గారి అడుగుజాడల్లో నడుస్తూ భరతమాత బిడ్డలలో ముఖ్యుడు కాగలడనీ, దేశ స్వాతంత్ర్యం కోసం కృషి చేయగలడనీ ఆ పుణ్య దంపతులు ఆ రోజే ఊహించారు. దురదృష్టవశాత్తు కొడుకు పుట్టిన ఏడాదిన్నరకే లాల్ బహదూర్ తండ్రి మరణించడంతో, ఆ కుటుంబం దిక్కులేని నావలా నిరాధారమైంది. ఆ కుటుంబాన్ని లాల్ బహదూర్ తాతగారు ఆదుకుని వారికి ఆశ్రయం కలిగించారు.

తాతగారింట భయభక్తులతో పెరిగిన లాల్ బహదూర్ తన పాఠశాలలో ఎంతో నిరాడంబరంగా ఉంటూ ఉపాధ్యాయుల ప్రేమాభిమానాలను చూరగొన్నాడు. తోటి విధ్యార్ధులు తనకు తండ్రి లేడని గేలిచేస్తూ హేళన చేస్తున్నప్పటికీ ఆ దు:ఖాన్ని దిగమింగి, ఉపాధ్యాయులకు ఫిర్యాదుచేయక, వారితో పాటు ఆడుతూ, పాడుతుండేవాడు. అది గమనించిన టీచర్లకు లాల్ బహదూర్ పై ప్రేమ ఇంకా ఎక్కువైంది.

నిరాడంబరతకు తోడు ఎంతో అభిమానవంతుడైన లాల్ బహదూర్ స్కూలుకు వెళ్ళటానికి ప్రతి రోజు గంగానదిని దాటి వెళ్ళవలసి ఉండేది. నది దాటించే పడవ వాడికి ప్రతి రోజు కొంత పైకం యివ్వాలి. అది స్వల్పమే అయినా లాల్ బహదూర్ దగ్గర అప్పుడప్పుడు ఉండేదికాదు. పడవ మనిషిని అడిగితే ఊరికే నది దాటించగలడు. అయినా అభిమానవంతుడైన లాల్ బహదూర్ అలా ప్రాధేయపడటం ఇష్టంలేక తన బట్టలను విప్పి, వాటిలో పుస్తకాలను చుట్టి మూటలా కట్టి, తన వీపునకు తగిలించుకుని, ప్రాణాలను సైతం తెగించి అవతలి ఒడ్డుకు ఈదుకుని వెళ్ళేవాడు.

అలా కష్టపడి చదువుకుంటూ, అతి నిరాడంబరముగా జీవితం గడుపుతూ పై చదువుల కొచ్చేసరికి, మహాత్మాగాంధీ పిలుపు నందుకొని చదువుకు స్వస్తి చెప్పి బ్రిటీష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సహాయ నిరాకరణోద్యమంలో చేరి అనేక సార్లు జైలు శిక్ష ననుభవించాడు. జైలు శిక్ష అనంతరం కాశీలోని వైద్యపీఠంలో అద్యయనం చేసి "శాస్త్రి" అనే పట్టా అందుకున్నాడు. అప్పటినుంచి లాల్ బహదూర్ శాస్త్రి అయ్యాడు. జైలులో ఉన్నప్పుడు, విద్యాపీఠంలో ఉన్నప్పుడు సుప్రసిద్ద గాంధేయవాదులు, స్వాతంత్ర్య సమరయోధుల సాంగత్యంతో అతనిలో దేశ స్వాతంత్ర్యం కొరకు ప్రాణాలయినా అర్పించాలనే దృఢ నిర్ణయం ఆనాడే నాటుకుంది.

బ్రిటీషు దొరలు భారతీయుల్ని బానిసలుగా చేసి, పెత్తనం చెలాయించడానికి ముఖ్య కారణాలు, మనలో చదువుకున్న వారు చాలా తక్కువ. శుచి శుభ్రతల గురించి తెలియదు. పైగా తిండి, బట్టకు కూడా కరువైన దరిద్రనారాయణులు అసంఖ్యాకంగా ఉండటం. కాబట్టి వీటిని రూపుమాపిన నాడు ఆ దొరలను తరిమికొట్టవచ్చుననే తలంపుతో శాస్త్రి నగర శివారలోని మురికివాడలలో అత్యంత దీనాతిదీన స్థితిలో ఉన్న హరిజనులను కలసి, వారికి విద్యాబుద్దులు నేర్పించి, వారి కష్ట నష్టాలలో పాలుపంచుకుంటూ వారికి చేదోడు వాదోడుగా ఉండేవాడు.

కాంగ్రెస్ లో చేరి తన సత్‌ప్రవర్తనతో, కార్యదీక్షతో, నిరాడంబరతతో మేధావుల మెప్పును పొంది, లాలా లజపతిరాయ్, జవహర్ లాల్ నెహ్రూ, మహాత్మాగాంధీ, పండిట్ గోవిందవల్లభ్, పండిట్ వంటి మహాత్ముల ఆశీస్సులు పొంది, ఇటు ప్రజలలోనూ, అటు నాయకులలోనూ ఉత్తమ నాయకుడనే పేరు పొందిన శాస్త్రి ఉత్తరప్రదేశ్ రాజకీయాలలో చురుకుగా పాల్గొని అనేక పదవులు సమర్ధవంతంగా నిర్వహించి, బ్రిటీషు వారి పక్కలో బల్లెంగా తయారయ్యి దేశ స్వాతంత్ర్యం సమరంలో అత్యంత కీలకమైన పాత్ర వహించాడు. శాస్త్రి రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు 1956లో "అరియలూరు" లో రైలు ప్రమాదం జరిగినప్పుడు అది తన పదవి నిర్వహణా కాలంలో జరిగింది కనుక, తాను రాజీనామా చేయటం నైతిక భాద్యత అని ప్రకటించి మంత్రివర్గం నుంచి తప్పుకున్నాడు. ఆ విషయంలో నెహ్రూ నచ్చజెప్పినా సంతృప్తి పడక శాస్త్రి తన నిర్ణయం మార్చుకోలేదు.

అత్యంత నిరాడంబరుడు, మితభాషి, కార్యవాది, యుక్తాయుక్తా పరిజ్ఞానం గల శాస్త్రి, 1964లో నెహ్రూ అకాల మరణం వలన ప్రధాన మంత్రి పదవిని అధిష్టించి తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు. ప్రధాన మంత్రిగా రష్యా పర్యటించినప్పుడు, శ్రీ శాస్త్రిని అతి నిరాడంబరంగా మామూలు కాలిజోళ్ళు, సామాన్య దుస్తులతో చూసి రష్యా ప్రజలు నివ్వెరపోయారు. సూటు, బూటు, హేటులతో ఆడంబరంతో ఆర్భాటంతో పర్యటిస్తాడని అనుకున్న వారికి శాస్త్రి వాలకం "ఆశ్చర్యం" కలిగించింది.

నిరుపేద కుటుంబంలో పుట్టి, ఉన్నత పదవులను అలంకరించినా నిరాడంబరంగా జీవించి 1966 స్వర్గస్థులైన శ్రీ శాస్త్రి జీవితం అందరికీ ఒక చక్కని సందేశం.


మూలం: జాతిరత్నాలు, బి.వి.పట్టభిరాం, శ్రీ మహలక్ష్మీ పబ్లిషింగ్ హౌస్ ;

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: