telugudanam.co.in

      telugudanam.co.in

   

జవహర్ లాల్ నెహ్రూ

నెహ్రూ
పేరు : జవహర్ లాల్ నెహ్రూ.
తండ్రి పేరు : మోతీలాల్ నెహ్రూ.
తల్లి పేరు : శ్రీమతి స్వరూప రాణి.
పుట్టిన తేది : 14 -11 - 1889.
పుట్టిన ప్రదేశం :

(తెలియదు).

చదివిన ప్రదేశం : ఇంగ్లాండు, ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ.
చదువు : బారిష్టరు.
గొప్పదనం : శ్రీ పటేల్ సహాయంతో సంస్థానాధీశులను సంప్రదించి ఐక్యమత్యం గురించి ఉద్భోదించి వారి సంస్థానాలు భారతదేశంలో విలీనం అయ్యేలాగా కృషి చేశాడు. రచించిన రచనలు 'ఎ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్ ', 'డిస్కవరీ ఆఫ్ ఇండియా', 'గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ', 'ప్రపంచ చరిత్ర సంగ్రహదర్శనాలు'.
స్వర్గస్తుడైన తేది : 27-5-1964.

జవహర్ లాల్ నెహ్రూ 1889వ సంవత్సరం నవంబరు 14న జన్మించారు. ఈయన తండ్రి మోతీలాల్ నెహ్రూ. నెహ్రూ వాళ్ళది సాంప్రదాయ కాశ్మీరీ బ్రాహ్మణుల కుటుంబం. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ అప్పట్లో పేరు మోసిన లాయరు. మామూలుగా మనదేశ స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న నాయకులందరూ మధ్యతరగతి, సాధారణ కుటుంబం నుంచే వచ్చారు. కానీ నెహ్రూ మాత్రమే మంచి డబ్బున్న కుటుంబం నుంచి వచ్చారు. నెహ్రూ గారి బాల్యమంతా ఆయన ఇంట్లోనే గడిచింది. ఆయనకు విద్యను నేర్పడానికి అప్పట్లోనే ప్రత్యేకంగా మస్టార్లు ఇంటికి వచ్చి చేప్పేవారు. ఆ తర్వాత ఈయన తన ఉన్నతాభ్యాసం కొరకు ఇంగ్లాండు వెళ్ళి అక్కడి ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో తన చదువు కొనసాగించారు. ఆ తర్వాత నెహ్రూ గారి వివాహం 1916వ సంవత్సరం ఫిబ్రవరి 8న ఢిల్లీలో ఓ మంచి సంపన్న కుటుంబంలో జన్మించిన "కమలా నెహ్రూ" తో వివాహమయ్యింది.

ఆ తరువాత నెహ్రూ గారు అనిబిసెంట్ గారి మాటల వలన ప్రభావితులై స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్నారు. జలియన్ వాలాబాగ్ లో డయ్యర్ జరిపిన హెచ్చరికలేని కాల్పుల వలన వేలాది మంది అమాయక ప్రజలు మరణించటం, గాయపడటం జరిగింది. ఈ సంఘటన తరువాత నెహ్రూ గారు, మహాత్మాగాంధీకి సన్నిహితంగా మెలగసాగారు. 1921వ సంవత్సరంలో నెహ్రూ సహాయనిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకు అరెస్టయ్యారు. 1934వ సంవత్సరంలో జాతీయ కాంగ్రెస్‌కు అనుబంధ సంస్థగా కాంగ్రెస్ సోషలిష్ట్ పార్టీ ఏర్పడటంలో నెహ్రూ కీలక పాత్ర పోషించారు. ఆ తరువాత 1936వ సంవత్సరంలో నెహ్రూజీ జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా కూడా పని చేశారు. నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూ కూడా కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్యవహరించారు. తండ్రితో కలసి నెహ్రూ కూడా కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటుండేవారు. దేశ స్వాతంత్ర్యం పోరాటం కోసం నెహ్రూ కుటుంబం ఆస్థినంతా దారపోసింది. చివరకు తన ఇంటిని సైతం కొంత భాగం హాస్పటల్ గా మార్చి స్వాతంత్ర్య పోరాటంలో గాయపడిన వారికి వైద్య చికిత్సలు అందించేవారు.

స్వతంత్ర్య భారతదేశానికి తొలి ప్రధానిగా 1947వ సంవత్సరం నుంచి తాను మరణించేదాకా సుమారు 17 సంవత్సరాలు ప్రధానిగా వ్యవహరించారీయన. చైనాతో కలసి "పంచశీల" సూత్రాలను ప్రతిపాదించారీయన. ఈయన ప్రధానిగా ఉన్న కాలంలోనే స్టీలు పరిశ్రమలు, పెద్ద పెద్ద కర్మాగారాలు, హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టుల నిర్మాణాలు జరిగాయి. దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలైన "ఇండియన్ ఇన్సిటిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐ.ఐ.టి.) లు, పరిశోధన సంస్థలు" ఏర్పాటుకు ఆయన తీవ్ర కృషి చేశారు. పండిట్ నెహ్రూ మంచి రచయిత కూడా. ఈయన 'ఎ బంచ్ ఆఫ్ ఓల్డ్ లెటర్స్', 'డిస్కవరీ ఆఫ్ ఇండియా', 'గ్లింసెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ', వంటి సుప్రసిద్ధ రచనలు చేశారు. ఈయనకు తన కూతురు ఇందిరా ప్రియదర్శిని (ఇందిరాగాంధీ) అంటే చాలా అభిమానం. తాను జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమెకు లేఖలు వ్రాసేవారు. వాటిలో ఆయన వ్రాసిన మాటలు ఆయన వ్యక్తిత్వాన్ని తెలియచెప్తాయి. సాహిత్యం మీద ఆయనకు విపరీతమైన అభిమానముండేది. నెహ్రూకు పిల్లలన్నా, గులాబీలన్నా చాలా ఇష్టం. అందుకే ఆయన తన కోటు పై ఎప్పుడూ గులాబీ పువ్వును పెట్టుకునేవారు. పిల్లలపై ఆయన అభిమానానికి గుర్తుగా ఆయన పుట్టిన రోజును బాలల దినోత్సవంగా జరుపుకుంటాం మనం. 1964 వరకు ప్రధానిగా ఉన్నారు. వీరి నాయకత్వంలో దేశం చాల పురోగమించింది. నెహ్రూను "చాచా నెహ్రూ" అని అంటారు. ఎందుకంటే వీరికి పిల్లలంటే ఎంతో మక్కువ.

మే 27 వ తేది 1964వ సంత్సరంలో పండిట్ నెహ్రూ భౌతికంగా మనకు దూరమయ్యారు. కానీ ఆయన దేశాభివృద్దికి పడిన శ్రమ, స్వాతంత్ర్య పోరాటంలో ఆయన పాత్ర శాస్త్ర సాంకేతిక రంగాలలో భారత్ ను అగ్రస్థానానికి చేర్చాలన్న ఆయన అభిలాష, దేశం కోసం యావదాస్తిని కర్పూరంలా అర్పించిన ఆయన నిస్వార్ధత ఇవన్నీ ఆయనను భారతీయుల గుండెల్లో చిరకాలం కొలువుండేలా చేశాయి.


మూలం: జాతిరత్నాలు, బి.వి.పట్టభిరాం, శ్రీ మహలక్ష్మీ పబ్లిషింగ్ హౌస్.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: