telugudanam.co.in

      telugudanam.co.in

   

అల్లూరి సీతారామరాజు

అల్లూరి సీతారామరాజు
పేరు : అల్లూరి సీతారామరాజు
తండ్రి పేరు : శ్రీ వెంకట రామరాజు
తల్లి పేరు : శ్రీమతి సూర్యనారాయణమ్మ
పుట్టిన తేది : 4-7-1897.
పుట్టిన ప్రదేశం : కృష్ణా జిల్లాలోని భీమవరంకు ఆరు మైళ్ళ దూరంలో మోగల్లు
అనే గ్రామంలో జన్మించాడు.
చదివిన ప్రదేశం : రాజమండ్రి, నర్సాపురం, కాకినాడ.
చదువు : నాల్గవ ఫారం.
గొప్పదనం : బ్రిటీషు వారిని ఎదిరించి దేశం కోసం తన ప్రాణాలను అర్పించాడు.
స్వర్గస్తుడైన తేది : 7-5-1924.

నేటి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం తాలూకా, నాడు కృష్ణాజిల్లా లోనిది. భీమవరంకు ఆరు మైళ్ళ దూరంలో మోగల్లు అనే గ్రామం వుంది. ఆ గ్రామమే రామరాజు స్వగ్రామం. సీతారామరాజు ముత్తాత గోపాల కృష్ణం రాజు. తాత వెంకట కృష్ణం రాజు. సూర్యనారాయణమ్మ పూర్వీకులు అనకాపల్లి దగ్గర "పాండ్రంకి"లో స్థిరపడిపోయారు. 1902 లో వారి కుటుంబం రాజమహేంద్రవరంలో స్థిరపడిపోయింది. ఫోటోగ్రాఫర్ గా వెంకట రామరాజుగారికి మంచి పేరు వచ్చింది. ఆదాయం కూడా క్రమంగా పెరుగ సాగింది. ఫోటోలు తీసేవారు చాలా తక్కువమంది కావడం చేత ఆయనకు చేతినిండా పనివుండేది. రాజమండ్రి సెంట్రల్ జైల్లోని ఫోటోలను ఆయనే తీసేవారు. అప్పుడే తిలక్, లాలాలజపతిరాయ్ వంటి ప్రముఖుల ఫోటోలను తీయడం జరిగింది. 1905 లో వంగ రాష్ట్రవిభజన జరిగింది. స్వదేశీ ఉద్యమం ప్రారంభమయింది. వెంకట రామరాజుని కూడా ఈ ఉద్యమం ఆకర్షించినా ఆయన పాల్గొనలేదు. దేశభక్తి ఆయనను ఆవరించినా కుటుంబ పోషణభారం వల్ల ఆయన స్టూడియోలోనే ఉండేందుకు నిర్ణయించుకొన్నాడు. కానీ జాతీయ భావంతో కూడిన నినాదాలు ఇంటిలో చేస్తూనే, "వందేమాతరం" అని పాడుతూనే ఉండేవాడు.

1906లో రామరాజుకు, సోదరుడు సత్యనారాయణ రాజు జన్మించాడు. ఆయన ప్రభావం కుమారుడైన రామరాజు మీద పడింది. రామరాజు చిన్నతనం నుండే ఎంతో అందంగా వుండేవాడు. బంగారు రంగుతోనున్న అతని శరీరంలో ఆకర్షణీయమైన తేజస్సు వుండేది. చిన్ననాటినుండి రామరాజులో ఓ ప్రత్యేకత కనిపించేది. జీవరాసులపట్ల ప్రేమ, దయ చూపేవాడు. చిన్నప్పటి నుండే రామరాజులో స్వతంత్ర భావం, జాతీయ భావం ఉండేది. దానికి కారకుడు తండ్రే.. రామరాజుకు తల్లిదండ్రులే మార్గదర్శకులు. ఒక రోజు సాయంత్రం రాజమహేంద్రవరంలో రామరాజు తండ్రితో కలిసి వీధిలోకి వెళ్ళే సమయంలో ఓ తెల్లదొర గుర్రం మీద ఎదురు రావడం జరిగింది. చుట్టు నున్న వారు నమస్కరించేందుకు చేతులెత్తడం చూచి రామరాజు కూడా యెత్తబోయాడు. కాని తండ్రి ఆ చేతులపై కొట్టి "తెల్లవాడికి నమస్కరింపరాదు" అని మందలించాడు. ఆ పసి హృదయంలో ఆ మాటలు నిలచిపోయాయి. మోగల్లులో వున్నప్పుడే రామరాజుకు అయిదవ సంత్సరంలోనే విద్యాభ్యాసం జరిగింది. చిన్న తరగతుల్లోనే ఎంతో తెలివిగా మెలిగేవాడు. అందుచేత ప్రాధమిక పాఠశాలలో మూడవ తరగతి నుండి అయిదులో వేశారు. రాజమహేంద్రవరంలో స్థిరపడిన తరువాత దేశ పరిస్థితులలో మరింత మార్పు కనిపించింది. స్వాతంత్ర సమరం మరింత వేగం పుంజుకుంది. 1907లో బెంగాలులో ఉద్యమాలు ప్రారంభం అయ్యాయి. తిరుగుబాట్లు జరిగాయి. ప్రభుత్వంపై బాంబులు వేశారు. ఆ సంచలన వాతావరణ ప్రభావం కూడా రామరాజు మనో ఫలకం పై చెరగని ముద్ర వేసింది. పెద్ద పెద్ద నాయకులను చూడడం, వారి సభలకు హాజరవటం రామరాజుకు అలవాటుగా మారింది.

1908 వసంవత్సరంలో పుష్కర సంవత్సరం కావడంచేత కోలాహలంగానే వుంది. అప్పుడు రామరాజు ఆరవ తరగతి చదువుతున్నాడు. అకస్మాత్తుగా కలరా వ్యాధి వ్యాపించింది. ఎందరో ఆ వ్యాధి కోరల నుండి బయట పడలేకపోయారు. చివరకు రామరాజు తండ్రి కూడా కలరా వ్యాధితోనే మరణించారు. స్థిర చరాస్తులు ఏమీ మిగలలేదు. ధైర్య సాహసాలు, దేశభక్తి మాత్రమే అతనిలో మిగిలిపోయిన స్థిరచరాస్థులయ్యాయి.తండ్రి మరణం రామరాజును క్రుంగదీసింది. మరో ప్రక్క పేదరికపు నీడలు తరుముతూ వుంటే తన తల్లి బిడ్డలతో కలసి అన్ని కష్టాలూ అనుభవించింది.

ప్రధమ సంతతి రామరాజు కావడం చేత రాజును "చిట్టిబాబు" అని ముద్దుగా పిలిచేవారు. తండ్రిలేని రామరాజు పట్ల మిత్రులకు సానుభూతి వుండేది. అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. రామరాజు మీద అతని తల్లి కూడ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కాని ఆమె అతి గారాబం చేత రామరాజులో గట్టి పట్టుదల వుండేది. ఆమె చెల్లెలు భీమవరం తాలూకాలోని కొవ్వాడ గ్రామంలోవుంది. 1909 లో తన చెల్లెలి దగ్గరకు చేరింది. రామరాజును భీమవరం మిడిల్ స్కూల్లో 1వ ఫారంలో చేర్పించాడు.ప్రతి రోజు కొవ్వాడ నుండి భీమవరం నడచి వెళ్ళి రావడం జరిగేది. ఆ రెండు గ్రామాల మధ్య దూరం రెండు మైళ్ళే అయినా నడిచేందుకు సరైన మార్గం వుండేది కాదు. దారి నిండా ముళ్ళపొద, చిన్న చిన్న కాలువలుండేవి. ఆ మార్గంలో నడిచి వెళ్ళేవాడు.

1910వ సంవత్సరం జూన్ లో రామరాజు రాజమండ్రిలో ఆరవ తరగతి చదివేందుకు చేరాడు. పినతండ్రిగారు ఆర్ధికంగా సహాయపడుతూ వుండేవాడు. 1911వ సంవత్సరం ఆరవతరగతి యందు ఉత్తీర్ణుడయ్యాడు. ఆ సంవత్సరమే పినతండ్రి రామకృష్ణం గారు రామచంద్రపురం మేజిస్ట్రేటుగా రావడం జరిగింది. చదువు పట్ల శ్రద్ద కనిపించని రామరాజు విషయమై తల్లి మరింత ఆందోళన చెందింది. ఆమెను,రామరాజును రామచంద్రపురం రప్పించి రామరాజు అక్కడ చదివే యేర్పాటు చేశారు రామకృష్ణంగారు. ఎంతో కష్టపడి చదివి రామరాజు యేడవ తరగతి ఉత్తీర్ణుడయ్యాడు. 1912 లో రామకృష్ణం గారు కాకినాడ బదిలీ చెయ్యబడడంతో రామరాజు కూడా కాకినాడలోని పిఠాపురం రాజా హైస్కూలులో మూడవ ఫారంలో చేరాడు. తునిలో తల్లి, తమ్ముడు, చెల్లెలు ఉండేవారు. ఉచిత భోజన సౌకర్యము, వసతి సౌకర్యము కాకినాడలో వుండేవి.

ఆ రోజులలో 5వ జార్జి చక్రవర్తి పట్టాభిషేక వార్షికోత్సవం డిశంబరు 12వ తేదీన జరుగుతూ వుండేది. ఆ రోజున రకరకాల వేడుకలు, సాంస్కృతిక కార్యక్రమాలు జరిగేవి. ఆ సంవత్సరం కూడా యధాప్రకారమే వేడుకలు కాకినాడ పిఠాపురం రాజా కళాశాలలోనూ జరిగాయి. విధ్యార్ధులు "శశిరేఖా పరిణయం" అను నాటకాన్ని ప్రదర్శించారు. ఆ నాటకంలో రామరాజు శశిరేఖాపాత్రను, నారదపాత్రను అత్యద్భుతంగా పోషించాడు. రూపు రేఖావిలాసాలతోను, గానాభిమానంతోనూ సభాసదులను ఆనందాశ్చర్యాలలో ముంచెత్తాడు. అందరూ ఆ పాత్రల పోషణను కొన్నారు. కానీ ఆ నాటకమే ఆయన భావాలలో కొన్ని మార్పులను తెచ్చింది. రామరాజుకు 14వ సంవత్సరంలో అన్నవరం కొండపై ఉపనయనం జరిగింది. కాకినాడలో చదివే సమయంలో తీయబడిన ఒక గ్రూపు ఫోటోలో రామరాజు ఒక పతకాన్ని ధరించినట్లు కనిపిస్తాడు. అది అయిదవ జార్జి చక్రవర్తి నాటకము. నాటకంలో వేషం వేసినందుకు రాజు పొందిన పతకం అది. ఆ పతకాన్ని రామరాజు ధరించి "తెల్లవాడు మన గుండెపై తిష్టవేసినాడు, ఆ విషయాన్ని హెచ్చరిస్తున్నట్లు నేను దీన్ని ధరిస్తాను" అని చెప్పెను. అంత లేత వయసులోనే అతడెంతటి లోతుభావాలు కలిగి యుండేవాడో యీ మాటలవల్ల తెలుస్తుంది. కొండల్లోనో, అడవుల్లోనో తపస్సు చేసుకోవాలని ఆలోచిస్తూ వుండేవాడు. ఆయనలో క్రమంగా రాజకీయపరిజ్ఞానం పెరుగసాగింది. సన్యాసం తీసుకోవాలన్న ప్రభావం యెలా వున్నను ఆ సంవత్సరం ఎనిమిదవ తరగతి పరీక్షలో రామరాజు ఉత్తీర్ణుడయ్యాడు.

1920 సెప్టెంబరు 20 వ తేదీన ఏ.వి.యన్. కళాశాలలో చేరి నాల్గవఫారం చదువసాగాడు. కాని అకస్మాత్తుగా రామరాజుకు కలరా వ్యాధి సోకింది. అతి కష్టం మీద కోలుకున్నాడు. కానీ చదువు దెబ్బతింది. హజరు సరిపోలేదు. కుటుంబ పరిస్థితి నానాటికి దిగజారి పోతూనేవుంది. ఆ సమయంలో రామరాజు పినతండ్రి రామకృష్ణం గారు నర్సాపురంలో తహసీల్దారుగా పనిచేస్తూ వున్నారు. రామరాజును నర్సాపురం పంపించేందుకే తల్లి నిశ్చయించుకుంది.

విశాఖపట్నంలో చదువుకొనే రోజుల్లో రామరాజు వయస్సు 16 సంవత్సరాలు. యవ్వనంలో అడుగుపెట్టే దశ అది. ఆ దశలోనే అతని హృదయంలో ఒక యువతి రూపం చోటుచేసికొందని, ఆమె "వెలను" కులమునకు చెందిన శ్రీమంతుని కుమార్తె అని, ఆర్ధికస్థితిగతుల బేధంవల్ల వారి వివాహం జరుగలేదని, ఆమెను మరచిపోలేని రామరాజు ఆ సుందరి పేరు "సీత" ను తన పేరు "రామరాజు" కు ముందుకు చేర్చుకొని " సీతారామరాజు"గా నిలచిపోయాడని అంటారు. ఆమె కోసం రామరాజు భగ్న ప్రేమతో బాధపడ్డాడని అంటారు. తుదిక్షణం వరకూ రామరాజు కఠోర బ్రహ్మచర్యం అవలంబిస్తూ వుండిపోయాడు. రామరాజు మానవతావాది. కులాల తేడాలు లేవు. సీతను ప్రేమించిన ఆ హృదయంలో మరో స్త్రీకి చోటివ్వక రామరాజు తన ప్రేమ ఎంతటి విలువైనదో తెలియజేశాడు. ఆ సంవత్సరం నాల్గవ ఫారం పరీక్షలలో రామరాజు ఉత్తీర్ణుడుకాలేదు. ప్రేమ పరీక్షలోనూ ఉత్తీర్ణుడు కాలేదు. కాని అతని జీవితంలో ఆమె గుర్తుగా మిగిలిపోయింది. రామరాజు పేరుతో కలిసి ఆమెపేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.రామరాజు సీతారామరాజుగా నిలచిపోయాడు.

విశాఖపట్నంలో చదువుకు స్వస్తిచెప్పిన తరువాత రామరాజు నరసాపురంకు పంపించబడ్డాడు. 1913వ సంవత్సరము జూలై నెల రెండవ తారీకున నరసాపురంలోని టైలరు హైస్కూలులో రామరాజు మళ్ళీ నాల్గవ ఫారం చేరాడు. కానీ యధాప్రకారమే చదువుపట్ల అనాసక్తి చూపుతూ, చించినాడ వెళ్ళి చేరాడు. గుర్రపుస్వారీ మీద ఆసక్తి రెట్టింపు అవుతూవుండేది. రామరాజును పెద్ద చదువులు చదివించి మంచివ్యక్తిగా, గొప్ప ఉద్యోగిగా చేయాలని పినతండ్రి కోరుకునేవాడు. కానీ అతని అంచనాలన్ని తారుమారయ్యాయి. పినతండ్రి అంటే రామరాజుకు భయం వుండేది. ఆ భయంతో రోజు బడికివెళ్ళినా, ప్రతి రాత్రి వెలుతురులో చదివినా, మనస్సు కుదుటపడక ఏదీ తల కెక్కేదికాదు.

1913వ సంవత్సరంలో "అంతర్వేది" తిరునాళ్ళకు తల్లితో కలిసివెళ్ళి తిరిగి ఇంటికి రాకుండా చించినాడ వెళ్ళాడు. రెండు రోజులు గడిచాయి. తర్వాత రామరాజు ఇంటికి చేరాడు. అంతవరకు ఆదుర్దాతో ఉన్న పినతండ్రి కోపం పట్టలేక బంట్రోతుల ముందే చేయి చేసుకున్నాడు. ఆ సంఘటన రామరాజులో పౌరుషాన్ని కల్గించింది. ఎంతో అవమానం జరిగినట్లు భావించాడు. ఎంతో బాధపడి మరుసటిరోజే తుని గ్రామానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో తన తల్లి తునిలో నివసిస్తూ వుంది. నర్సాపురంలో ఉన్నప్పుడు రామరాజు పినతండ్రి చేయిచేసుకున్న తరువాత వచ్చిన దగ్గర నుండి ఒక్కసారి మాత్రమే ఆ ఇంటికి రామరాజు వెళ్ళాడు, అది కూడా రామకృష్ణం రాజు గారి పెద్ద కుమార్తె వివాహానికి. అంత పట్టుదల కలవాడు రామరాజు. కాని పినతండ్రికి రామరాజు అంటే ప్రేమ, అభిమానం ఎక్కువ. తునిలో చదువుతున్నాడని తెలిసికొని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుని పేర కొంతసొమ్ముని రామరాజు ఖర్చులకై పంపుతూ వుండేవాడు. క్షేమ సమాచారాలు తెలియజేయమంటూ ఉత్తరం వ్రాసేవాడు. ప్రధానోపాధ్యాయుడు సమాధానం యిస్తూ అలాంటి దేశదిమ్మరికి సొమ్మును వ్యయపర్చటం మంచిది కాదని తెలియజేశాడు.

రామరాజు ప్రవర్తనలో మార్పు రాలేదు. నానాటికీ ముదిరిపోతుంది. అదంతా కళ్ళారా చూస్తున్న ప్రధానోపాధ్యాయునికి విపరీతమైన కోపం వచ్చింది. ఆ కోపంతో ఒకనాడు పాఠశాలకు వచ్చిన రామరాజును బెత్తంతో కొట్టాడు. ఆ రోజు నుండి రామరాజు ఆ బడికి రాలేదు. మరేబడికి పోలేదు. చదువుకు శాశ్వతంగా సున్నా చుట్టాడు. 1913 నుండి 1918 వరకు వారి కుటుంబం తునిలోనే వుంది. రాజు మాత్రం కొండల్లోనే తిరిగేవాడు. నీపాద్రిరాజు గారిని "కవిరాజు" అని పిలిచేవారు. ఆయన రామరాజు జాతకచక్రాన్ని చూసి "ఇతడు కీర్తివంతుడౌతాడని" సూర్యనారాయణమ్మతో చెప్పాడు. ఆయన వద్దనుండి నేర్చుకొన్న 'జాతకం చూచే విద్యను' నిరర్ధకం చేయక కొండజాతుల వారికి జాతకాలు వ్రాసి యిచ్చేవాడు.

1917 మార్చి 17న గోల్కొండ తాలూకా పదభైరవి భూపతి అగ్రహారం చేరాడు. సూరి సుబ్బయ్యశాస్త్రి ఆ అగ్రహారంలో మహా పండితుడు. వారాలు చేసుకుంటూ ఆయన దగ్గర సంస్కృతులు, శాస్త్రాలు, ఇంద్రజాలాన్ని నేర్చుకొని వనమూలికలను వాడే పద్దతిని అధ్యయనం చేశాడు. దేశయాత్ర చెయ్యాలన్న ఆలోచన వచ్చింది. విద్యకు సంబంధించిన విషయాలన్నీ పూర్తిగా విస్మరించాడు. ఉత్తరదేశ యాత్ర 1916 ఏప్రియల్ 26న కాలినడకతో ప్రారంభయయింది. ఉద్యోగం కోసం డబ్బుకావాలని తల్లిని అడిగి యాత్రకు బయలుదేరాడు. కాలినడకతోనే నెలరోజులు ప్రయాణం చేసి కలకత్తా నగరానికి చేరుకున్నాడు. భారతదేశానికి బెంగాలు ప్రాంతం వరప్రసాదం. ఆ ప్రాంతం నుండి ఎందరో మహానుభావులు ఉద్భవించారు. అలాంటి మహపురుషులలో సురేంద్రనాథ్ బెనర్జీ ఒకరు. స్వాతంత్ర్య సమరయోధుడు. జీవితాంతం బ్రహ్మచర్యం అవలంభించిన యోగి ఆయన. బెనర్జీకెన్నో మంచి అలవాట్లుండేవి. ప్రతి రోజూ ఒక అతిధికి అన్నం పెట్టడం ఆ అలవాట్లలో ఒకటి. అతిధితో కలిసి భోజనం చేస్తూ ఉండేవాడు.

1916లో జాతీయకాంగ్రెసు మహసభ లక్నోలో జరిగింది. ఆ సభకు రామరాజు హజరయ్యాడు. అప్పటికి రామరాజు వయస్సు 20 సంవత్సరాలే. అంతచిన్నవయసులోనే కాలి నడకన అన్ని ప్రదేశాలు చూడటం గొప్ప విశేషమని చెప్పవచ్చు. రామరాజులో యోగి రూపం పూర్తిగా వచ్చింది. సుమారు 5 అడుగుల 4 అంగుళాల ఎత్తున వుండేవాడు. రామరాజు అగ్నిదేవతను పూజించేవాడు. శ్రీరామభక్తుడు, కాళీఉపాసకుడైన రామరాజు కొండజాతి ప్రజలను మరింత ఆకర్షింపగలిగాడు. కృష్ణదేవపేట దగ్గరలో "కొంగసింగి" అనే గ్రామం ఉంది. అక్కడకు వస్తూవుండే ఏజన్సీని ప్రజల స్థితిగతులను రామరాజు గమనిస్తూ వుండేవాడు. వారి కష్ట సుఖాలను స్వయంగా అడిగి తెలుసుకొంటూ వుండేవాడు. అక్కడ ప్రజలు బానిస బ్రతుకులు బ్రతికేవారు. తమ జాతి స్త్రీలతో అధికారులు అసభ్యంగా ప్రవర్తించినా, ఎదురుతిరిగే అవకాశం మగవారికి వుండేది కాదు. ప్రజలకెన్నో విధాలుగా నచ్చచెప్పి వారిలో ధైర్యసాహసాలను పెంచేందుకు ప్రయత్నించాడు. రామరాజు అండ చూసుకొని ప్రజలు అధికారులను ఎదిరించసాగారు. ప్రజలందరికి రామరాజు మంచి అలవాట్లను నేర్పించసాగాడు. 1921-22సంవత్సరంలో మన్యంలోనే ప్రజలను సమీకరించి విల్లంబులతోను, రకరకాల ఆయుధాలతోను పోరాట పద్దతులను నేర్పి పోరాటం సాగించేందుకే నిర్ణయించుకున్నాడు విప్లవ వీరుడు రామరాజు.

ఆరోజు 1924 మే 6వ తేది. ఆ రోజున రామరాజు అనుచరులతో పాటు మన్య ప్రాంతంలోని "కొండపల్లి" గ్రామంలో వున్నాడని గూఢచారి శాఖకు చెందిన ఇన్ స్పెక్టర్ ఉపేంద్ర పట్నాయక్ కు వార్త తెలిసింది. వెంటనే అస్సాం, మలబారు సిబ్బందులు అక్కడకు చేరి ఆ గ్రామాన్ని ద్వంస్వం చేయసాగాయి. ఆరోజున రామరాజు అక్కడ లేడు. అగ్గిరాజుకు ఆ వార్త తెలిసింది. అగ్గిరాజు పోరాటంలో నిప్పులు చేరగేవాడు. విప్లవ వీరులను గురించి ప్రభుత్వానికి ఆచూకీ చెప్పిన వారిపట్ల అగ్గిరాజు కఠినంగా ప్రవర్తించేవాడు. ఒకనాడు కొయ్యూరు ముఠాదారు అధికారులకు విప్లవ వీరుల రహస్యాలను తెలియపరచి బహుమతి తీసుకున్నాడు. ఆ వార్తను విన్న అగ్గిరాజు ఆ ముఠాదారుని కుమారుని కాలుని విరుగగొట్టాడని, ముఠాదారుని ముక్కు చెవులు కోసి వేశాడన్న వదంతి వుంది. అంతటి ఆవేశం గల అగ్గిరాజు కొండపల్లిలో మే నెల 6 వ తేదీన శత్రువుల నెదుర్కొన్నాడు. తుపాకి యుద్దం చాలాసేపు జరిగింది. రెండువైపులవారికి తీవ్రంగా గాయాలయ్యాయి. అగ్గిరాజు ముందు వెనుక ఆలోచించకుండా తదేకదీక్షతో పోరాటం చేస్తూనే వున్నాడు. మందు గుండు పూర్తిగా అయిన తరువాత కర్తవ్యం గుర్తుకు వచ్చింది. నాయకుని ఆజ్ఞప్రకారం శత్రువుల చేతిలో ప్రాణాలు పోగొట్టుకోకూడదు. శత్రువుల చేతికి ప్రాణాలతో చిక్కకూడదు. అగ్గిరాజు పారిపోయేందుకే నిర్ణయించుకున్నాడు. శత్రువులు వెన్నంటి తుపాకులు కాలుస్తూ అనుసరించసాగారు. పరుగెత్తే అగ్గిరాజుకు ఒక బావి కనిపించింది. దానిలో దూకి వీరమరణం పొందాలని నిర్ణయించుకున్నాడు. బావిదిక్కుగా పరుగెత్తసాగాడు. అంతలోనే ఒక తుపాకు గుండు వచ్చి కాలికి తగిలింది. అగ్గిరాజు నేలకు ఒరిగిపోయాడు. ప్రాణాలు పోలేదు. నడువలేని స్థితిలోనున్న అగ్గిరాజు నేలపై వడివడి గా ప్రాకుతూ సైన్యం వచ్చేలోగా బావిలో దుమికాడు. కాని ప్రాణాలతోనే పట్టుబడ్డాడు. ఏ నేరారోపణ చేయకుండానే విచారణ లేకుండానే అండమాను దీవులకు పంపబడ్డాడు.

అగ్గిరాజు పట్టుబడటం, మల్లుదొర లొంగిపోవడం మన్యం ప్రజలలో నిరుత్సాహాన్ని కల్గించాయి. రామరాజు జాడమాత్రం ఎవరికీ తెలియలేదు. ప్రభుత్వాధికారులు తమకు పట్టుబడిన వీరులను రామరాజు జాడ కోసం చిత్రహింసలు చెయ్యసాగారు. విప్లవవీరులకు సహకరించిన ప్రజలను హింసించసాగారు. రెండు సంవత్సరాలు జరిగిన ఆ పోరాటంలో మన్యం ప్రజలు అలసిపోయారు. శక్తి సన్నగిల్లింది. అందుకు కారణం సైనికులు విజయగర్వంతో, వీర విహరంతో వికటాట్టహాసాలు చేస్తూవుంటే అమాయక ప్రజల గుండెలు దడదడ లాడసాగాయి. ఆ రోజు మే7వ తేదీ. ఉదయాన్నే రామరాజు యేటి ఒడ్డున స్నానం చేస్తూ వున్నాడు. మంప మునసబు ఒక కోయబాలుని ద్వారా రామరాజుకు పాలు పంపించాడు. ఆ బాలుని ద్వారానే రామరాజు ఒక లేఖను సైనిక శిబిరానికి పంపించాడు. సెలయేటి దగ్గర తన గుంపుతో పోలీసులు రామరాజును చుట్టు ముట్టారు. రామరాజు ఎలాంటి ప్రతిఘటన చెయ్యలేదు. పోలీసులు రామరాజును కొట్టాలని ప్రయత్నించారు. కాని అళ్వానర్ నాయుడు కొట్టనివ్వలేదు. తన మకాంకు తీసుకొని వెళ్ళాడు. రామరాజు తాగేందుకు నీళ్ళు అడిగాడు. ఇన స్పెక్టరు పాలను యిప్పించాడు. మానవాతీత శక్తులు రామరాజుకు వుండవన్న నమ్మకం వారికుంది. అందుచేత రామరాజును మంచంమీద పరుండపెట్టి త్రాళ్ళతో కట్టివేశారు. ఆ మధ్యాహ్న సమయానికి రామరాజును మంచంతో పాటే కొయ్యూరు అనే గ్రామానికి తీసుకొనివెళ్ళారు. కొయ్యూరులో మేజర్ గుడాల్ కొంత సైన్యంతో ఉన్నాడు. ఆ మేజర్ సమక్షంలో రామరాజును వుంచారు. ఆ వీరుని, ఆవిధంగా కట్టి తీసుకొని వచ్చినందుకు గుడాల్ ఇనస్పెక్టర్ ను, జమేదార్ ను మందలించాడు. కట్లు విప్పించి, రామరాజుతో కరచాలనం చెయ్యాలని చూశాడు. కాని తెల్లవాడైన గుడాల్ ను తాకేందుకే రామరాజు యిష్టపడలేదు. అదే విషయాన్ని గుడాల్ తో నిర్భయంగా చెప్పాడు.

రామరాజును మందలిస్తున్న ధోరణిలో గుడాల్ మాట్లాడసాగాడు. కాని రామరాజు రెచ్చిపోయాడు. తెల్లవారిని నిందించటం ప్రారంభించాడు. వారివల్లనే తన దేశానికీ దుర్భర పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. రామరాజు పలికే ఒక్కొక్క మాటకు గుడాల్ లో ఆవేశం పెరుగసాగింది రెచ్చిపోయాడు. రామరాజు తొందరపాటు చర్య వల్లనే అమాయకులైన మన్యం వాసులకు అన్నికష్టాలు వచ్చాయని చెప్పాడు. మేజర్ వైఖరి మారిపోయింది. కోపం అవధులు దాటింది. రామరాజును గొలుసులతో చెట్టుకు కట్టించాడు. ఆ ప్రదేశమంతా నిశబ్ధమయింది. ఆ చెట్టుకు నలు వైపులా సాయుథులైన మలబార్తు పోలీసులు, అస్సాం సైన్యం సిద్దంగా వున్నారు. "కోర్టు మార్షల్" ఆజ్ఞ నిచ్చాడు. గుడాల్, ఏర్పాట్లన్నీ సిద్దంగా వున్నాయని, తాను రివాల్వర్ తో కాల్చబోతున్నానని భగవంతుని స్మరించుకోమని చెప్పాడు. బంధుమిత్రులకు ఏమన్నా చెప్పవలసి వుంటే చెప్పమని గుడాల్ చెప్పాడు. తాను చెప్పేదేమీలేదని, చెప్పదలచుకుంది ప్రభుత్వంకి చెప్పుకుంటానని, గుడాల్ తన విరోధి కాదని, విరోధి అయినా ప్రభుత్వానికే చెప్పడం జరుగుతుందని ఆ వాంగ్మూలం వినేందుకుగాని, శిక్షించేందుకుగాని, రక్షించేందుకు గాని గుడాల్ అధికారం ఏమాత్రం చాలదని రామరాజు చెప్పాడు.

రామరాజు బ్రిటీషుజాతికే ద్వేషి అని, చంపేందుకు గుడాల్ ఒక్కడేకాక పై అధికారి రూధర్ ఫర్డ్, ఆ పై అధికారి గవర్నరు వున్నారని, అది వ్యక్తిగతమైన సమస్యకాదని, తన చావులో పై అధికారులకు భాగం పంచకుండా ఒక్కడే చెయ్యడము యేమిటని రామరాజు ప్రశ్నించాడు. రామరాజు మాటలు చెవిన పెట్టకుండా గుడాల్ ఆజ్ఞ యిచ్చాడు. జమేదార్ చేతిలో తుపాకీనుండి గుండు దూసుకువచ్చి ఎడమ చెయ్యి పై భాగంలో తగిలింది. గురి తప్పిందని గుడాల్ జమేదార్ మీద మండిపడ్డాడు. తనే స్వయంగా కాల్చేందుకు నిశ్చయించుకున్నాడు గుడాల్. తుపాకీ చేతిలోకి తీసుకున్నాడు. దృష్టిని నిల్పి గురిచూచి కాల్చాడు. పాదంలో దిగిన తూటాను రామరాజు చూడలేదు. ఆ గాయం నుండి స్రవించే రక్తాన్ని కూడా చూడలేదు. బాధను లెక్కచేయకుండా గుడాల్ నే చూస్తూ గంభీరంగా పలుకుతూనే వున్నాడు. గుడాల్ చేతిలోని తుపాకి నిర్విరామంగా కాల్చబడూతూనే వుంది. చుట్టూఉన్న ఉద్యోగులు, సైనికులు రెప్పవేయకుండా అలాగే చూస్తూనే వుండిపోయారేగాని, ఒక్క మాటైనా పలుకలేదు. మోకాళ్ళు దాటిన తూటాల గాయాలు తొడలను తొలుచుకుంటూ వెళ్ళసాగాయి.గుడాల్ కు తనివి తీరలేదు. కోపాగ్ని చల్లారలేదు. నరరూప రాక్షసునిగా గుడాల్ వ్యవహరించసాగాడు. రామరాజు శరీరం అంతా చిన్నాభిన్నమయింది. గుడాల్ తుపాకి రామరాజు నాభికి అభిముఖంగా గురి పెట్టబడి వుంది. ట్రిగ్గర్ మీద వేలు నొక్కేందుకు సిద్దంగా వుంది.

రామరాజు గొంతు ఖంగుమంది. " గుడాల్! చంపదల్చుకుంటే, ఇదుగో యిక్కడ కాల్చు" అని గుండెను చూపాడు రామరాజు. గుడాల్ చేతిలోని తుపాకీ రామరాజు నాభి నుండి పైకి గురి పెట్టవడింది. చేతిలోని తుపాకీ పేలింది. అగ్ని గోళంలాంటీ తూటా వెలువడింది. రామరాజు గుండెను చీల్చుకొని పోయింది. ప్రాణాలు అనంత వాయువుల్లో లీనమైపోయాయి. విప్లవవీరుని తల ఒరిగిపోయింది. తోటి ఉద్యోగులతో కలిసి గుడాల్ వచ్చి రామరాజును పరీక్షించాడు. రామరాజు మరణించినట్లు నిర్ధారణ చేసికొన్నాడు. ఆంధ్రగడ్డపై అభిమన్యునివలె పోరాడిన రామరాజు జీవితంలో అంతిమ అధ్యాయం ముగిసింది. అప్పటికి రామరాజు వయస్సు కేవలం 27 సంవత్సరాలు మాత్రమే. ఆ విప్లవవీరుని మరణవార్తను ప్రజలు విశ్వసించలేదు. దానికి తోడు ప్రభుత్వం వారు కూడా సందిగ్దంగా ప్రకటించారు. అందుచేతనే ప్రజలలో రకరకాల వదంతులు వెలువడ్డాయి. రామరాజు పేరుతో ఒక యోగి పట్టుబడ్డాడని రామరాజును పోలిన కంసాలి ఒకడు కృష్ణదేవు పేటలో వున్నాడని, అతడే పోలీసుల దగ్గరకు వెళ్ళి తానే రామరాజునని చెప్పి వశమైపోయాడని రకరకాల వదంతులు వ్యాపించాయి.

ఆ రోజు (7-5-1924) సాయంత్రానికి "రాజు పట్టుబడ్డాడని" వార్త విన్న స్వీనీ, కలెక్టరు రూధర్ ఫర్డు, మరి కొంతమంది ఆఫీసర్లు కొయ్యూరు వచ్చారు. ఒక మిలటరీ ఉద్యోగి అయిన గుడాల్ రామరాజును చంపి కీర్తి ప్రతిష్టలు పొందినందుకు వారంతా అసూయపడ్డారు. గుర్తు తెలియని విధంగా చిత్రవధ చేయబడ్డ రామరాజు ఎవరో కూడా వారికి అంతుచిక్కలేదు. పరీక్షించేందుకు పంపితే ప్రమాదమని, రామరాజు మరణ వార్త విషయంలో ప్రభుత్వం అంగీకరిస్తుందా?లేదా? అని తమ అనుమానాలను వ్యక్తపరచసాగారు. అసలు సజీవంగా, తనకు తానే పట్టుబడిన వ్యక్తిని ఆ విధంగా చిత్రవధ చేసినందుకు గుడాల్ ను మందలించారు. రామరాజు పారిపోతుండగా కాల్చి చంపినట్లు కథను సృష్టించారు. వీపు మీద గాయాలు తగిలినట్లు నర్సీపట్నం హస్పటల్ ముఖ్య వైద్యుని చేత నకిలీ రిపోర్టును తయారు చేయించారు.

8-5-1924 రామరాజు శరీరం దహనం చేయబడింది. రామరాజు మరణవార్తతో ఆంధ్రదేశమంతా అట్టుడికిపోయింది. భారతమాత కీర్తికిరీటంలో మణిహరమై నిలచి పోయింది. 27 సంవత్సరాల వయసులోనే దేశంకోసం ప్రాణం అర్పించిన వీరుడు రామరాజు. చిన్నతనం నుండి జాతీయ భావంచే ఆకర్షింపబడిన వ్యక్తి రామరాజు. 14 సంవత్సరాల వయసులోనే "తెల్లవాడు మన గుండెలపై తిష్ట వేసినాడని గుర్తు చేస్తూ" , అయిదవ జార్జి చక్రవర్తి పతకాన్ని ధరించిన వ్యక్తి రామరాజు. 17,18 సంవత్సరాలవయసులోనే కాశీ, హరిద్వారం, బ్రహ్మకపాలం మొదలైన ప్రదేశాలన్నీ కాలినడకన నడచి వచ్చిన యోగి రామరాజు. ప్రజాదృష్టిలో దైవసమానుడై, ప్రభుత్వదృష్టిలో రాజద్రోహిగా యెంచబడినవాడు. 25 సంవత్సరాల వయస్సులో మన్యప్రజలను సమీకరించి అతి స్వల్పమైన దళంతో ప్రభుత్వాన్ని గడగడలాడించిన వీరుడు రామరాజు. "విప్లవం నా జన్మహక్కు" అని తెలుగు గడ్డపై గర్జించిన వీరుడు. గురి తప్పిన అధికారికి గుండెలు చూపి కాల్చమన్న వీరాధి వీరుడు రామరాజు. 27 సంవత్సరాల వయసులోనే దేశంకోసం ప్రాణాలర్పించిన రామరాజు చరిత్ర అమరచరిత్రగా నిలిచి పోతుంది. భారత స్వాతంత్రోధ్యమం చరిత్రలోనే రామరాజు తిరుగుబాటు మహొజ్వలఘట్టం.


మూలం: జాతిరత్నాలు, బి.వి, పట్టాభిరాం, శ్రీమహలక్ష్మీ పబ్లిషింగ్ హౌస్ ; విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు, రచన డి,కె. ప్రభాకర్, జయంతి పబ్లికేషన్స్.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: