telugudanam.co.in

      telugudanam.co.in

   

అంబేద్కర్

అంబేద్కర్‌
పేరు : డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్.
తండ్రి పేరు : రాంజీ శక్ పాల్.
తల్లి పేరు :

(తెలియదు)

పుట్టిన తేది : 14-4-1891.
పుట్టిన ప్రదేశం : "మే" అనే గ్రామంలో (మహరాష్ట్రం) లో జన్మించాడు.
చదివిన ప్రదేశం : బొంబాయి.
చదువు : న్యాయశాస్త్రంలో డిగ్రీ.
గొప్పదనం : అస్పృశ్యలతో సహ నిమ్నజాతుల వారందరి నిమిత్తం
కృషి చేశారు.
ప్రారంభించిన పత్రిక : మూక్ నాయక్.
స్వర్గస్తుడైన తేది : 1956.

భారత జాతీయ సాంఘీకోద్యమ చరిత్రలో డాక్టర్ అంబేద్కర్ కి విశిష్టమైన స్థానం ఉంది. భారత రాజ్యంగ నిర్మాతగా ఆయన చేసిన కృషి అభినందనీయం. మనిషికి, మనిషికి మధ్య ఉన్న తేడాలను రూపుమాపి సర్వసమానత్వం కొరకు కృషిచేసిన కారణజన్ముడు అంబేద్కర్. అస్పృశ్యతా నిర్మూలనలను ఒక మహోద్యమాన్నిగా నిర్వహించి, దేశవ్యాప్తంగా దళితులలో సాంఘిక,రాజకీయ, విద్యా చైతన్యాన్ని కలిగించిన ఘనత ఒకే ఒక వ్యక్తికి దక్కింది. ఆయనే డాక్టర్ భీం రావ్ రాంజీ అంబేద్కర్. భీం రావ్ రాంజీ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14న మహా రాష్ట్రంలో "మహర్" అనే హరిజన తెగలో జన్మించాడు. అతని తండ్రి రాంజీ శక్ పాల్ సైన్యంలో చిన్న ఉద్యోగంలో ఉండేవాడు. వారిది ఒక పేద కుటుంబం. తండ్రి జీతం తిండి బట్టలకే సరిపోయేది కాదు. ఇంక పిల్లల్ని ఏం చదివించగలరు? అయినా రాంజీ శక్ పాల్ పట్టుదలతో ఆ గ్రామములోని ఒక పండితుని సహయంతో భీమారావును పాఠశాలలో చేర్పించాడు.

చిన్నతనం నుంచి అతను చాలా తెలివైన విద్యార్ధిగా పేరు తెచ్చుకున్నాడు. అతని మేధాశక్తికి, సమయస్పూర్తికి ఉపాధ్యాయులు విస్తుపోతుండేవారు. ఇద్దరు ఉపాధ్యాయులు అతనికి కావలసిన పుస్తకాలను, బట్టలను ఉచితంగా ఇచ్చి, అతని బాగా ప్రోత్సాహించారు. చదువు, టీచర్ల ప్రోత్సాహం బాగానే ఉంది కానీ, సమాజంలో మాత్రం వారి కుటుంబానికి సరయిన స్థానం లేకపోవటంతో ఆ చిన్నారి మనసు ఎంతగానో బాధపడేది. వారికి దేవాలయంలో ప్రవేశం లేదు. అందరూ నడిచే రోడ్లమీద నడవడానికి వీలులేదు. అందరూ భుజించే హొటల్లో కూడా ప్రవేశంలేదు. ఈ సాంఘిక దురాచారాలను గమనించి, అతనిమనసు మూగగా రోదించేది. "ఏ మహానుభావుడైనా ప్రజల్లో ఉన్న అస్పృశ్యతా పిశాచిని సమూలంగా నాశనం చేస్తే ఎంత బాగుండును." అని అనుకునేవాడు. అయితే ఆ పని అతనే చేస్తాడని అతను కలలో కూడా అనుకోలేదు.

ప్రాధమిక విద్య అనంతరం భీం రావ్ 'సతారా' నుండి బొంబాయికి మకాం మార్చాడు. ఒక సువర్ణ పండితుడి సహకారంతో బొంబాయి ఎలిఫిన్ష్టన్ హై స్కూల్లో చేరాడు. ఆ పండితుడు అతనికి అన్ని విషయాలలోనూ చక్కని సలహాలిస్తూ, అతనిలో ఆత్మవిశ్వాసాన్ని కలిగించి, ఆత్మబలంతో ముందుకుపోవటానికి ప్రోత్సాహమిచ్చారు. ఆ పండితుని పేరు అంబేద్కర్. అప్పటి నుంచి భీం రావ్ తన ఇంటి పేరును అంబావడేకర్ కు బదులుగా ఆయన మీద గౌరవంతో అంబేద్కర్ గా మార్చుకున్నాడు. అంబేద్కర్ పాఠశాలలో చదువుకుంటున్నప్పుడు తన పుస్తకాలు ఫీజుల గురించి ఎప్పుడూ ఇబ్బంది పడలేదు. తెల్లవారే లేచి, తెలిసిన వాళ్ళిళ్ళల్లో పశువులను కడిగి పాలు పితికి, చిన్నచిన్న పనులు చేసి సంపాదించుకునేవాడు. ఎలాగైనా బాగా అభివృద్దిలోకిరావాలనే తపనతో కష్టపడి చదివి మొత్తానికి హైస్కూలు చదువు అత్యధిక మార్కులతో పూర్తి చేశాడు.

ఆ రోజుల్లో "అంటరానివారు" అనబడే వారిలో కూడా చిన్న, పెద్ద అనేవి ఉండేవి. అత్యధిక మార్కులు వచ్చినందుకు అంబేద్కర్ కి బహుమతి అందించడానికి పాఠశాలకు ఒక రాజకీయ నాయకుడు వచ్చాడు. ఆయన అంబేద్కర్ కన్నా కొంచెం పెద్ద కులమట! అతని కులం తెలుసుకున్నాక "నేను అతనిని ముట్టుకొని నా దేహాన్ని మైలపరచుకోను, క్షమించండి" అని ఖండితంగా చెప్పి వెళ్ళి పోయాడు. ఆ సంఘటన అంబేద్కర్ హృదయాన్ని ఎంతో గాయపరచింది. తనలో తనే కుమిలికుమిలి ఏడ్చాడు. అయితే, తను అటువంటి కులంలో పుట్టినందుకు దురదృష్టవంతుడినని భావింపలేదు. ఈ వర్ణవ్యవస్థ కేవలం మానవుడు కల్పించినవే, కొందరు స్వార్ధపరులు కల్పించిన ఈ ఆచారాలు ఖండించాలి. అందరిలోనూ ఎర్రని రక్తమే ప్రవహిస్తుంది. ఎక్కువ, తక్కువ అనే భావం మనలో ఉండకూడదు. దీనిని ఒక ఉద్యమంగా చేపట్టాలి! అని మనసులో నిశ్చయించుకున్నాడు. కానీ అటువంటి కార్యక్రమం చేపట్టాలంటే ముందు చదువు ముఖ్యం. అందుచేత ఉన్నత విద్యనభ్యసించాలి అనుకున్నాడు. డిగ్రీలో అత్యధిక మార్కులు రావటంతో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చదవటానికి అవకాశం వచ్చింది. కొలంబియా విశ్వవిద్యాలయంలో యం.ఏ. డిగ్రీ పొందాడు. తర్వాత పి.హెచ్.డి.డిగ్రీని న్యాయశాస్త్రంలో డిగ్రీని పొందాడు.

1913లో అమెరికావెళ్ళి నీగ్రోల పరిస్థితిని చూసిన అతనికి భారతదేశంలో హరిజనులు గుర్తుకువచ్చారు. ఆఫ్రికాలో పుట్టిన నీగ్రోలను, అమెరికా ప్రజలు బానిసలుగా కొనుక్కొని వారిని హీనంగా చూడటం సహించలేకపోయాడు. అబ్రహంలింకన్ వంటి ప్రముఖులు, వారి ఐక్యతకు ఎంతో పాటుపడిన ప్రజల్లో ఇంకా ఆ బేధభావాలు అంతగా తగ్గలేదు. ఆ సమయంలో అమెరికా రాజ్యంగంలో కొన్ని ప్రత్యేక సవరణలు అంబేద్కర్ ను విశేషంగా ఆకర్షించాయి. భారతదేశంలో కూడా అటువంటి చట్టాలను ప్రవేశపెట్టడానికి ప్రయత్నాలు చేయాలని కంకణం కట్టుకున్నారు. 1917లో పి.హెచ్.డి. పూర్తిచేసి, అక్కడ నుండి యూరపుఖండంలోని అన్ని ముఖ్య దేశాలు తిరిగి, అక్కడ రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేశాడు.

1920లో లండన్ వెళ్ళి అక్కడ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ నుంచి డాక్టరేట్ తీసుకొని 1928లో బారిష్టరు పరీక్షలో ఉత్తీర్ణుడయి భారతదేశము తిరిగి వచ్చాడు. హరిజనులలో బారిష్టరు అయిన మెదటి వ్యక్తి డా|| అంబేద్కర్ భారతదేశంలో పరిస్థితులేమీ మారలేదు. ఎక్కడేసిన గొంగళి అక్కడే ఉన్నట్లు హరిజనుల స్థితిగతులేమీ మారలేదు. అతను బారిష్టరైనా సమాజం మాత్రం అంటరానివాడిగానే చూసింది. చివరకు అతనికి నగరంలో ఇల్లు కూడా దొరకడం దుర్లభమయ్యింది. తప్పనిసరిగా నగరు శివారులోని హరిజనవాడలో ఇల్లు తీసుకొని ప్రాక్టీసు ప్రారంభించాడు. హరిజనుల మధ్య ఉండటం వలన వారి స్థితిగతులను, సమస్యలను అర్ధం చేసుకోవడానికి మంచి అవకాశం వచ్చింది.

సంఘంలో అస్పృశ్యులనే వారికి సరయిన స్థానం లభించాలంటే, "విద్య, సంఘంలో ఆందోళన" అవసరం అని ఉద్భోధించి వారిలో చైతన్యం కలిగించి "బహిష్కృతి హితకారిణి సభ" అనే సంస్థను స్థాపించాడు. మహాత్మాగాంధీ, అంబేద్కర్ ను కలిసి అంటరాని వారి హక్కుల సాధనకై పోరాడుతానని హామీ ఇచ్చారు. ప్రపంచంలో ఏ దేశంలో చూసినా మనుషుల్లో మంచివారున్నారు, చెడ్డవారున్నారు, అలాగే గొప్పవారున్నారు, బీదవారున్నారు. అంతేకాకుండా మేధావులున్నారు, నిరక్ష్యరాసులున్నారు. అయితే భారతదేశంలో మాత్రం వీరందరూ కాకుండా అగ్రకులాల వారు, అంటరాని వారు అనే వర్గీకరణ ఉండేది. ఒకే గడ్డపై పుట్టి, ఒకే గాలి పీలుస్తూ కూడా రెండు వర్గాలుగా చీలి, ఒకరు ఆనందసౌఖ్యాలననుభవిస్తూ, మరొకరిని అణగదొక్కిన దురాచారం మనదేశంలోనే ఉండేది. ప్రస్తుతం అటువంటి స్థితిలేదు. కాని ఒకప్పుడు మన ఈ మూఢాచారం చాలా తీవ్రంగా ఉండేది. దానిని రూపుమాపడానికి ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా సఫలీకృతులు కాలేదు. బ్రిటీషు ప్రభుత్వం కూడా ఆ రోజుల్లో చెప్పుకోదగ్గ కృషేమీ చేయలేదు. కానీ 1947లో భారతదేశానికి స్యాతంత్ర్యం లభించింది.

గాంధీజీ కోరికమేరకు అంబేద్కర్ కు న్యాయ కార్మికశాఖ మంత్రిగా నియమించారు. అప్పటి ప్రధాని శ్రీ నెహ్రూ అనంతరం భారత రాజ్యాంగ పరిషత్తునియమించిన రాజ్యాంగ రచనా సంఘానికి అంబేద్కర్ ను అధ్యక్షునిగా నియమించారు. అదే ఆయన జీవితంలో మహొజ్వల ఘటన చరిత్రలో శాశ్వతమైన స్థానాన్ని కల్పించి మహత్తరమైన మలుపు రాజ్యాంగరచనలో హెచ్చుభారాన్ని స్వీకరించి, అస్పృశ్యతను శిక్షార్హమైన నేరంగా నిర్ణయిస్తూ ఒక సూత్రాన్ని చేర్చారు. సర్వసమానత్వంకోసం కృషి చేసి ముఖ్యంగా దళితుల ఉద్దరణకు పాటు పడిన రాజకీయ విద్యా సాంఘీక రంగాలలో వారికి సమాన హక్కులు కల్పించి వారి పాలిట దైవంగా అవతరించిన ఆ మహావ్యక్తి 1956 డిసెంబరు 6న మరణించారు.


మూలం: జాతిరత్నాలు, బి.వి.పట్టభిరాం, శ్రీ మహలక్ష్మి పబ్లిషింగ్ హౌస్ ; దళితుల వైతాళికుడు అంబేద్కర్, మండవ శ్రీరామమూర్తి * పోలుసత్యనారాయణ, జయంతి పబ్లికేషన్స్.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: