telugudanam.co.in

      telugudanam.co.in

   

బుద్ధుడు

గౌతమ బుద్ధుడు
పేరు : బుద్ధుడు
తండ్రి పేరు : శుద్దోదనుడు
తల్లి పేరు : మాయాదేవి
పుట్టిన తేది : క్రీ.పూ. 563
పుట్టిన ప్రదేశం : లుంబినీ వనం
చదివిన ప్రదేశం :

(తెలియదు).

చదువు : క్షత్రియ విద్య
గొప్పదనం : ధర్మ ప్రవర్తన, అహింసావిధానం, జన్మరహస్యం ఎలా పొందుతారో తెలిపాడు.
స్వర్గస్తుడైన తేది : ఈశాన శతాబ్దం 148 వ సంవత్సరం

హిమాలయ శ్రేణికి దిగువన, మగధకు వాయువ్యాన ఉన్న భూప్రాంతానికి శాక్య వంశజుడైన శుద్దోదనుడు రాజు. కపిలవస్తు అతనికి రాజధాని. అతని భార్య మాయాదేవి. ఆ పుణ్య దంపతుల కడుపు పంటగా అవతరించాడు, కరుణామూర్తి బుద్దుడు. అది జరిగింది క్రీ.పూ. 563 ప్రాంతంలో ఒకసారి కపిలవస్తులో పూర్ణిమోత్సవం జరిగింది. పూర్ణిమకు ఏడురోజులు ముందుగా మాయాదేవి ఆ ఉత్సవాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో, అతి వైభవంగా జరిపింది. ఏడవరోజున పన్నీట పరిమళ స్నానం చేసి ఆమె నాలుగు లక్షల దీనారాలను దానం చేసింది. తరువాత అలంకార భూషితయై, మృష్టాన్నం వచ్చింది. ప్రభపాల బోధిసత్వుడు తెల్ల ఏనుగు రూపంలో ఆమె గర్భంలో ప్రవేశించినట్లు ఆ యిల్లాలు కలగని లేచింది. శుద్దోదనుడు తన రాణి స్వప్న వృత్తాంతం విని బ్రాహ్మణులను పిలిపించి స్వప్న ఫలం అడిగినాడు. అప్పుడు వారు రాజా! మీరేమీ ఆందోళన పడనక్కరలేదు. రాణి గర్భం ధరించింది. మీకు అచిరకాలంలో పుత్రోదయం కలుగనున్నది. అతడు గృహస్తుగానే ఉంటే ప్రపంచానికంతటికి ప్రభువవుతాడు. గృహ పరిత్యాగం చేసి పరివ్రాజక ధర్మం చేపట్టి అజ్ఞాన యవనిక చేధించి పరిపూర్ణ బుద్దుడవుతాడు అన్నారు.

తొమ్మిదినెలలు గడచిన పిమ్మట పదవ నెలలో మాయాదేవి తన పుట్టింకి వెళతానంది. రాజు అందుకు ఆమోదించి కపిలవస్తు నుండి "దేవదేహ" వరకు మార్గాన్ని చక్క చేయించి బంగారు పల్లకీలో పరివార సమేతంగా పంపినాడు. మార్గమధ్యంలో ఉన్న లుంబినీ వనంలో మాయాదేవి కొంత విశ్రాంతి తీసుకోదలచి అక్కడే వున్న ఒక సాలవృక్షం వద్దకు వెళ్ళి దాని కొమ్మనొక దానిని చేతపట్టుకొని నిలబడగానే ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభమయినవి. ఇంతలో నిలబడి ఉండగానే ఆమె పురుష శిశువును ప్రసవించింది. ఆ శిశువు ధర్మబోధన చేస్తున్న ప్రవక్తవలె కరచరణాలను ముందుకు చాచి సోపానపరంపరను అవరోహిస్తున్న వ్యక్తివలే జన్మించాడు. జన్మించగానే లేచి ఏడడుగుల దూరం నడిచి జనన మరణాలవల్ల లోకంలో సంభవిస్తున్న దు:ఖాన్ని నిర్మూలం చేస్తాను అన్నాడట. అప్పుడు ఆకాశములో ఒక దివ్యజ్యోతి వెలిగిందనీ, చెవిటివారికి మాటలు వినబడినాయనీ, మూగవారు మాటలాడగలిగారనీ, కుంటివారు నడిచారనీ చెబుతారు. శుద్దోదనుడు తన కుమారునికి సిద్దార్ధుడని నామకరణం చేసి అల్లారుముద్దుగా అతిగారాబంగా పెంచాడు.

మాయాదేవి అతడు జన్మించిన ఏడవనాడే ఆ ఆనందం తట్టుకోలేక పరమపదించింది. అప్పటి నుండి శుద్దోదనుడి రెండవ భార్య గౌతమి కడుపులో పెట్టుకొని కాపాడింది గౌతముణ్ణి. మహారాజు అతనిని బయటకు ఎక్కడికీ పోనివ్వకుండా రాజప్రసాదంలోనే ఉంచి అతనికి వినోదం కల్పించే నిమిత్తం నలభైవేలమంది నటులను నియమించారు. పరిణత వయస్కుడు కాగానే తన దేశంలోని అయిదు వందల మంది క్షత్రియ రాజకన్యలను రప్పించి వారిలో తనకు నచ్చిన కన్యను వివాహమాడవలసిందని కోరాడు. అప్పుడు సిద్దార్ధుడు మహమంత్రి మహనాముని కుమార్తె యశోధరను వరించాడు. మహానాముడు శాక్యధర్మ ప్రకారం వీరవిక్రమ విహారంలో సర్వరాజకుమారులను జయించిన వానికే తన కుమార్తెనీయ సంకల్పించినానని చెప్పగా సిద్దార్ధుడు వివిధ క్షత్రియ విద్యలలో తనకు గల కౌశల్యాన్ని ప్రదర్శించి యశోధరను చేపట్టినాడు. వివాహితుడై గృహస్త్య జీవితంలోని మాధుర్యం అనుభవించిన కొన్నాళ్ళకి అతనికి రాహులుడని ఒక కుమారుడు కూడా కలిగాడు.

ఒకరోజు అతడు వాహ్యాళికై రాజమందిరం నుండి వెలుపలికి వచ్చి ఒక వృద్దుని చూశాడు. మరొకరోజున ఒకరోగిని, ఇంకొకరోజున ఒక మృతకళేబరమునూ చూశాడు. తనకు కూడా ముసలితనం వస్తుందనీ, తాను కూడా రోగి కావచ్చనీ, తానుకూడా ఒక నాటికి చనిపోతాడనీ తెలియగానే గౌతమునికి యౌవన సుఖాలపట్ల విముఖం ఏర్పడింది. అంతకు ముందుండిన వ్యామోహం తొలగింది. లోకంలోని ఈ అన్మత దు:ఖానికి కారణం ఏమిటి? అది తొలగడం ఎలా? జనన మరణాల రహస్యం ఏమిటి? అని తెలుసుకోవటానికి అతని హృదయం అర్రులు చాచింది. ఆ రాత్రే అతడొక నిశ్చయానికి వచ్చాడు. తన అర్ధాంగినీ అనుంగుపుత్రుని విడనాడి అర్ధరాత్రిలో అతడు అంతఃపురం విడిచి అడవులకు బయలుదేరాడు. తానెక్కివచ్చిన కంటకాశ్వాన్ని చన్నుని ఆధీనం చేసి అతడిని వెనక్కుపంపి కాషాయవస్త్రాలు ధరించి పరివ్రాజకవృత్తి నవలంబించాడు. ఇదే బుద్దుడి జీవితంలోని "మహభినిష్క్రమణం".

తనతో బాటు కృచ్రవ్రతాలు చేసిన అయిదుగురు ఋషులకూ, మొదటగా ధర్మబోధ చేయ సంకల్పించుకొని అతడు మృగదావంలో తపస్సు చేసుకుంటున్న వారి వద్దకు వెళ్ళి వారికి ధర్మోపదేశం చేశాడు. చతురార్య ముగ్దులైన వారికే తెలియక వారు అతనికి ఆర్ఘ్యపాద్యా లిచ్చి ఆదరించారు. ఇదే అతని "ధర్మచక్ర పరివర్తనం". మృగదావంలోనే అతనికి నలభైమంది శిష్యులేర్పడినారు. వారితో తొలి బౌద్ధసంఘం నిర్మించి అతడు బౌద్ద ధర్మ ప్రచార సంకలనంతో ముందుకు సాగి మగధకు వచ్చి అక్కడ బింబిసారునికి బౌద్ద దీక్ష ప్రవచించినాడు. బింబిసారుడు రాజగృహ ప్రాంతంలో బౌద్దబిక్షువుల నివాసం కొరకై రమణీయమైన గొప్ప విహారం ఒకటి కట్టించి యిచ్చినాడు. మహారాజులు, సార్వభౌములు, సామంతులెందరో ఆనాడు బౌద్ధ ధర్మదీక్ష నవలంభించాడు. యశోధర లౌకికవాసన విడనాడి అతని పాదాల నాశ్రయించింది. సంఘంలో తన్ను కూడా చేర్చుకోవాలని ప్రార్ధించింది. తన సంఘంలో స్త్రీలను చేర్చరాదని బుద్దుడు మొదట అనుకున్నా ఆనందుడు మొదలయిన శిష్యుల నిర్భందం వల్ల అతడు వాళ్ళను చేర్చుకోక తప్పిందికాదు. ఈ విధంగా నలభై అయిదు సంవత్సరాల పాటు బౌద్ధ ధర్మప్రచారం చేస్తూ బుద్దభగవానుడు ఎనభై సంవత్సరాలు నిండి బ్రతుకు బ్రతికి తుదకు కుసీ నగరంలో ఈశాన శతాబ్దం 148 వ సంవత్సరంలో వైశాఖ పూర్ణిమ మంగళవారం నాడు మహపరి నిర్వాణం చెందాడు.


ఆంధ్ర బుద్ధక్షేత్రాలు

శిశుపాలఘడము, నాగార్జునకొండ, సాలెహుండము, శ్రీకాకుళం హైస్కూల్ దిబ్బ, నరసన్న పేట, అమరావతి, నాగార్జునకొండ, జగ్గయపేట, గోలి, ఘంటసాల, గుడివాడ, భట్టిప్రోలు, గుంటుపల్లి, ఆదుర్రు, శంకారము, రామతీర్థము,


మూలం: బుద్దుడు జీవితం - అవగాహన, రచన. శ్రీ తిరుమల రామచంద్ర, జయంతి పబ్లికేషన్స్.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: