telugudanam.co.in

      telugudanam.co.in

   

చిత్తరంజన్ దాస్

చిత్తరంజన్‌ దాస్‌
పేరు : చిత్తరంజన్ దాస్
తండ్రి పేరు : భువనమోహన్ దాస్
తల్లి పేరు : నిస్తారాణి దేవి
పుట్టిన తేది : 5-11-1870.
పుట్టిన ప్రదేశం : కలకత్తా.
చదివిన ప్రదేశం : కలకత్తా.
చదువు : బారిష్టరు
గొప్పదనం : ఆర్థిక, సామాజిక ఇబ్బందుల్లో చిక్కుకున్న వారి సమస్యలను సానుభూతితో
అర్థంచేసుకొని, వారి కష్టాలలో పాలుపంచుకుని, వారికి మానసికంగా,
ధైర్యం కలిగించి, చేతనైనంతా సహయం చేశారు.

ఏ రాజకీయనాయకుడు చేయని గుప్తదానాలు చిత్తరంజన్ దాస్ గారు చేశారు.
స్వర్గస్తుడైన తేది :

(తెలియదు).


చిత్తరంజన్ దాస్ 1870 నవంబరు 5న కలకత్తాలో జన్మించాడు. తండ్రి భువనమోహన్ దాస్ కలకత్తా హైకోర్టులో పని చేసేవాడు. తల్లి నిస్తారాణి దేవి ఆత్మవిశ్వాసం మెండుగాగల స్త్రీ. తండ్రి బ్రహ్మసామాజికుడు, ఆడంబరాలు లేనివాడూ. తల్లి మహా భక్తురాలు. హిందూ సంప్రదాయాలను గౌరవిస్తూ, అన్న, పాన, ఆచార వ్యవహారాలను కఠినంగా పాటించేది. ఈ విషయంలో భార్యాభర్తలు భిన్నమార్గాలు అనుభవించినప్పటికీ ఆమె పరమ పతిభక్తి పరాయణురాలు అయితే వీరిద్దరూ ఒక విషయంలో పూర్తిగా ఏకీభవించేవారు. అదేమంటే ఆపదలో ఉన్నవారికి ఆర్థిక సహయం చేయటం. తమకు ఉన్నదాంట్లోనే కొంత ఇచ్చి ఉదార స్వభావాన్ని చాటుకునేవారు. బహుశా చిత్తరంజన్ దాస్ ఆ గుణాన్నే పుణికి పుచ్చుకున్నారు అని అనిపిస్తుంది.

చిత్తరంజన్ దాస్ మొదటి నుంచి ఉత్తమ విద్యార్ధిగా గుర్తింపు పొందాడు. చదువు పట్లే కాకుండా సాహిత్యం, ఆటపాటలందు కూడా ఎప్పుడూ మొదట ఉంటూ తన ప్రత్యేకతను నిలుపుకునేవాడు. ఖాళీ సమయాలలో కాలాన్ని వృధా చేయక, హిందూ మత గ్రంథాలతోపాటు, ఇతర మత గ్రంథాలను చదివి, వాటిల్లో మంచి సూక్తులను తన డైరీలో రాసుకుని స్నేహితులకు వినిపించేవాడు. ముఖ్యంగా దానం, సహయం, గురించి ఉన్న ఉదంతాలు ఆసక్తితో రాసుకొని స్నేహితులకు చెప్పేవాడు. వారందరినీ ఒక సంఘంగా ఏర్పరిచి తమవద్ద ఉన్న డబ్బును పోగుచేసి క్లాసు పుస్తకాలు కొని, అవి లేనివారికి బహుకరించేవారు. ఒక సారి ఒక హరిజన బాలుడికి అలా పుస్తకాలు ఇచ్చినప్పుడు, కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఆ విషయం తెలుసుకొని ఉగృలై పాఠశాలకు వచ్చి, ఉపాధ్యాయుని ఛడా మడా తిట్టారు. పాపం ఆయన మాత్రం ఏంచేయగలడు? ఆయనకు తెలియకుండా పిల్లలు ఆ పనిచేశారు. అసలు ఆ పిల్లలు అటువంటి దానకార్యక్రమాలు చేస్తున్నారని కూడా ఆయనకు తెలియదు. వెంటనే దాసుని పిలిపించి గట్టిగా ప్రశ్నించారు.

దాసు ఏమాత్రం తొణకలేదు. వాళ్ళు తిట్టడం అయిన తరువాత 'ఇంతమంది పెద్దలు కలిసి నేనేదో మహపరాథం చేశానని నిందిస్తున్నారు. మీరు పెద్దవారు అవటం వల్ల నేను తిరిగి సమాధానం చెప్పే హక్కు కూడా నాకు లేదు. కానీ ఇప్పుడూ నేను చేసినది తప్పు అని నేను అనుకోవటం లేదు. అవసరం ఉన్న వ్యక్తి ఏ మతానికి చెందిన వాడయినా, ఏ వర్గానికి చెందినవాడయినా సహయం చెయ్యమని అనాదిగా మత ప్రవక్తలు భోధిస్తున్నారు. సర్వం తెలిసిన మీలాంటి పెద్దలే నన్నిలా దూషించటం దురదృష్టంగా భావిస్తున్నాను. అయితే ఇక ముందు ఎప్పుడూ ఇలాంటి పనులు చేయను అని మాత్రం మీరు అనుకోవద్దు. తుది శ్వాస వరకు నేనీ బాటను మాత్రమే అనుసరిస్తాను' అని ఖండితంగా చెప్పేశాడు. అక్కడ చేరిన పెద్దలు శిలావిగ్రహాల్లా అవాక్కయిపోయారు. దాసు పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అతని తండ్రి మాత్రం 'శభాష్ దాసూ! మంచి పని చేశావు' అని మెచ్చుకున్నాడు.

ఒకసారి సరదాగా పిల్లలందరూ ట్రాము (కలకత్తాలోని లోకల్ బండి) ఎక్కి, పిక్నిక్ కి వెళుతుండగా, దారిలో ఒక చోట ఆగింది. అక్కడ ఒక గుడ్డివాడు దీనాతిదీనంగా ముష్టి అడుగుతున్నాడు. దాసు జేబులో నుంచి ఒక నాణేం తీయబోతుండగా ట్రాము కదిలింది. అయినా దాసు ఆ నాణాన్ని వేగంగా ఆ గ్రుడ్డివాని వైపుకు విసిరాడు. అది చూసి పిల్లలు అలా ఎందుకు వేశావు? మరో ముష్టివాడికి రేపు వేయవచ్చుకదా! అంత తొందరేముంది అని ప్రశ్నించారు. అప్పుడు దాసు ' మనకు ఆలోచన వచ్చినప్పుడే ఆచరణలో పెట్టాలి. ఆలస్యమైతే ఆ అవసరం దాటి పోవచ్చు. లేదా మనసు మారిపోవచ్చు. అతని వాక్పటిమకు, మేధాశక్తికి ఉపాధ్యాయులు కూడా ఆశ్చర్యపడేవారు. ఒక్క విద్యార్ధి తన వాక్చాతుర్యంతో మిగతా పిల్లలను చక్కగా తీర్చిదిద్దటం వారికొక అద్భుతంగా అనిపించింది.

దాసు బి.ఎ. చదువు అనంతరం లండన్ వెళ్లి బారిష్టరు చదివి తిరిగి వచ్చి కలకత్తాలో ప్రాక్టీసు ప్రారంభించాడు. అతి తక్కువ సమయంలోనే అతను కొమ్ములు తిరిగిన న్యాయవాదుల కోవలోకి చేరుకున్నాడు. ఆలీపూరు బాంబు కేసులో ఇరికించిన అరవిందఘోష్ తరపున పనిచేసి ఆయనను నిర్దోషిగా ఋజువు చేయటంతో చిత్తరంజన్ కీర్తి నలుదిశలా వ్యాపించింది. దానితో బాటు బిపిన్ చంద్రపాల్, బ్రహ్మ బాంధనోపాధ్యాయ వంటి ప్రముఖులపై మోపిన కేసులు కూడా వాదించి జయంపొంది, తనకు తనే సాటి అని నిరూపించుకున్నాడు.తన సంపాదన పెరగటం మొదలయింది. దాసు దానితో తృప్తిపడి ' ఫ్రీ లీగల్ ఎయిడ్ ఫర్ పూర్ ' అనే నినాదం ప్రారంభించి పేదవారికి ఉచితంగా న్యాయసలహాలు ఇవ్వటం ప్రారంభించారు. తన ఆదాయంలో లెక్కలేనంత సొమ్మును విద్యా సంస్థలకు విరాళంగా ఇచ్చాడు. అనేక మందికి గుప్తదానాలు చేసినప్పుడు దాసు ఎంతో ఆత్మానందం పొందేవాడు. ఒకానొక దశలో ఆయనకూడా ఆర్థిక సమస్యలలో చిక్కుకున్నారు. అయినప్పటికీ ఒకసారి ఒక స్త్రీ తన కుమార్తె వివాహం కొరకు సహయం చేయమని కోరినప్పుడు, తన వేలి వుంగరం అమ్మి ఆ సొమ్మును ఆమెకు ఇచ్చాడు.

ఆర్థిక, సామాజిక ఇబ్బందుల్లో చిక్కుకున్న వారి సమస్యలను సానుభూతితో అర్థంచేసుకొని, వారి కష్టాలలో పాలుపంచుకుని, వారికి మానసికంగా ధైర్యం కలిగించి, చేతనైనంతా సహయం చేశారు. ఏ రాజకీయనాయకుడు చేయని గుప్తదానాలు చిత్తరంజన్ దాస్ గారు చేశారు.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: