telugudanam.co.in

      telugudanam.co.in

   

కందుకూరి వీరేశలింగం

కందుకూరి వీరేశలింగం
పేరు : కందుకూరి వీరేశలింగం.
తండ్రి పేరు :

(తెలియదు).

తల్లి పేరు :

(తెలియదు).

పుట్టిన తేది : 16-4-1848.
పుట్టిన ప్రదేశం : రాజమండ్రి.
చదివిన ప్రదేశం : రాజమండ్రి.
చదువు :

(తెలియదు)

గొప్పదనం : బాల్యవివాహాలను అరికట్టి, వితంతువుల పునర్వివాహలను ప్రోత్సహించారు.
స్వర్గస్తుడైన తేది : 27-5-1919.

ఆంధ్రప్రదేశ్ కు చెందిన ప్రముఖ సాంఘీక సంస్కర్త కందుకూరి వీరేశలింగం. 1848 ఏప్రిల్ 16 న రాజమండ్రిలో ఒక సంపన్న కుటుంబంలో ఇతడు జన్మించెను. పాఠశాలలో చాలా చురుకుగా ఉండేవాడు. ఇతడు నాలుగోతరగతి చదువుతుండగా, ఉత్తమ విద్యార్ధి ఎవరు ఆనే ప్రస్తావన వచ్చినప్పుడు, విద్యార్ధుల్లో చాలా మంది ఇతని పేరును సూచించారు.

తల్లి క్రమశిక్షణ, ఉపాధ్యాయుల విద్యాబుద్దులు వీరేశలింగాన్ని సన్మార్గంలో నడిపించి, అతి చిన్న వయసులోనే అందరి మెప్పు పొందేలా చేశాయి. కందుకూరి వీరేశలింగం చదువు అనంతరం కొంతకాలం ఉపాధ్యాయుడిగా పనిచేస్తూ, తన దృష్టిని స్త్రీ విద్య మీదకు ప్రసరింపచేశారు. స్రీ విద్యావ్యాప్తికి నడుంకట్టి, దానిని ఆచరణలో పెట్టారు. "వివేకవర్ధిని" అనే పత్రికను స్థాపించి, సమాజంలో స్రీకి జరుగుతున్న అన్యాయాలను ఖండిస్తూ, స్త్రీకి సమాన సంథానం యివ్వాలని పోరాడారు. అంతేకాదు, బాల్య వివాహాలను తీవ్రంగా విమర్శిస్తూ వాటిని కొంతవరకు అరికట్టగలిగారు. వీరేశలింగంకు 13వ సంవత్సరంలోనే వివాహం జరిగింది. ఇతని భార్యకు 9 సంవత్సరాలే. బాల్య వివాహాలను మానవలెనని ఇతడు ప్రచారం చేసెను.

వారి సంఘ సంస్కరణా కార్యకలాపాలలో అందరినీ విశేషంగా ఆకర్షించినదీ, ఆశ్చర్యపరచినదీ వితంతు వివాహం. భార్యపోయిన భర్త రెండవ వివాహం చేసుకోవచ్చు కానీ, భర్తపోయిన భార్య రెండవ వివాహం ఎందుకు చేసుకోకూడదు? అని ఆయన వేసిన ప్రశ్నకు సమాజం సమాధానం చెప్పలేకపోయింది. కందుకూరి వీరేశలింగం కొంతమంది మిత్రులతో కలసి "వితంతు పునర్వివాహ సంఘం స్థాపించి, అనేక వ్యాసాలు రాసి, ఉపన్యాసాలు చేసి 1881 డిసెంబరు 11వ తేదీన మొట్టమొదటి వితంతు వివాహం జరిపించారు. బంధుమిత్రులు, పురోహితులు ఎవ్వరూ రాలేదు. ఆ వివాహానికి వచ్చిన వారల్లా కందుకూరి మిత్రులు, అల్లరి జరిగితే అణచటానికి వచ్చిన అరవై మంది పోలీసులు, ఆరుగురు ఆంగ్లేయ అధికారులు. అయినా అధైర్యపడక వీరేశలింగమే వివాహాతంతు జరిపించారు. ఆక్షణం నుండి ఆయన విశ్రమించక చివరి శ్వాసవరకు వితంతు వివాహాలు అనేకం చేయించి, ప్రజలలో పేరుకుపోయిన అంధ విశ్వాసాలను మట్టుపెట్టారు.

ఆనాటి సంఘంలో ఆయన అన్ని సంస్కరణలు చేయటానికి ఆయనలోని రచనా పటిమ దోహదకారి అయిందనడానికి ఏమాత్రం సందేహం లేదు. నీతిదీపిక, బ్రాహ్మణ వివాహము, రాజశేఖర చరిత్ర, హస్య సంజీవిని, సతిహిత బోధిని వంటి ఎనిమిది పత్రికలు నడిపి గొప్ప మానవతావాదిగా ఘనతకెక్కిన కందుకూరికి ఆనాటి బ్రిటీషు ప్రభుత్వం "రావుబహదూర్" బిరుదునిచ్చి ఘనంగా సత్కరించింది.

స్వార్ధరహిత సేవతో సమాజంలోని అంధ విశ్వాసాలను అంత మొందించడానికి నడుంకట్టి చివరి క్షణం వరకు పోరాడిన "రావుబహదూర్" కందుకూరి వీరేశలింగం 1919 మే 27న స్వర్గస్థులయ్యారు.


మూలం: జాతిరత్నాలు, బి.వి.పట్టభిరాం, శ్రీ మహలక్ష్మీ పబ్లిషింగ్ హౌస్ ; 5 వ తరగతి పుస్తకంలోనిది.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: