telugudanam.co.in

      telugudanam.co.in

   

సరోజినీ నాయుడు

సరోజిని నాయుడు
పేరు:సరోజినీ నాయుడు.
తండ్రి పేరు:అఘోరనాధ ఛటోపాధ్యాయ.
తల్లి పేరు:శ్రీమతి వరద సుందరీదేవీ.
పుట్టిన తేది:1879 వ సంవత్సరంలో జన్మించెను.
పుట్టిన ప్రదేశం :హైదరాబాద్‌.
చదివిన ప్రదేశం :ఇటలీ, స్విట్జర్లాండ్.
చదువు :మెట్రిక్యులేషన్.
గొప్పదనం :ఈమె భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనటమేగాక, స్త్రీ విమోచన కోసమూ,
అస్పృశ్యతా నివారణ కోసమూ కృషి చేశారు.
స్వర్గస్తురాలైన తేది:2-3-1949.
రచించిన రచనలు:'గోల్డెన్ త్రెషోల్డు', 'బర్డ్సు ఆఫ్ టైం', 'ఫెదరర్ ఆఫ్ ది డాన్'

"హిందూ ముస్లిం భాయి భాయి అనే నినాదంతో సభల్లోనూ, సమావేశాల్లోనూ ప్రసంగాలు ఇచ్చి ప్రజల్లో సహజీవనం చేసిన మహనీయ మహిళ సరోజినీ నాయుడు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనిన ఆధునిక భారతదేశ ప్రముఖ స్త్రీలలో ఈమె ఒకరు. ఈమె హైదరాబాద్‌లో 1879 వ సంవత్సరంలో జన్మించెను. సరోజినీ తండ్రి పేరు అఘోరనాధ చటోపాధ్యాయ. బెంగాలు దేశానికి చెందిన వ్యక్తి. వృత్తిరిత్యా హైదరాబాదులో స్థిరపడ్డాడు. తల్లి వరదసుందరీదేవీ. తల్లిదండ్రులిద్దరూ విద్యావేత్తలు కావటంవలన విద్యావ్యాప్తికి ఎంతో కృషి చేసేవారు. ఆ రోజుల్లో స్రీ విద్య గురించి అనేక ఆంక్షలుండేవి పెద్ద కుటుంబాల వారెవ్వరూ తమ ఆడపిల్లలను పదవ తరగతి మించి చదివించేవారు కాదు. అటువంటి సమయంలో వారిద్దరూ స్త్రీ విద్య గురించి ప్రజల్లో ఉన్న అపోహలను తొలగించి వారిని పై చదువులు చదివించడానికి ప్రోత్సహించారు. సరోజినీదేవికి అయిదుగురు సోదరులుండేవారు.ఆమె సోదరీ మణులు ముగ్గురు. అందరూ బాగా చదువుకున్నవారే అవటం వలన వారి ఇంట్లో జరిగే చర్చలు ఎంతో విజ్ఞానపరంగా ఉండేవి.

1891లో జరిగిన మెట్రిక్ పరీక్షలో మొత్తం రాష్ట్రంలో ప్రధమ స్థానం సరోజినీదేవి చేజిక్కించుకుని, అందరి ప్రశంసలు పొందటంతో, నిజాం నవాబు ఉప్పొంగిపోయి, ఆమెను విదేశాలకు పంపి చదువు చెప్పించాలని నిర్ణయంచుకొని, ఆమె తండ్రికి ఆ విషయంచెప్పి, ఒప్పించి తాను అనుకున్నది సాధించాడు. సరోజినీదేవికి చిన్నతనం నుంచి కవిత్వమంటే ఎంతో ఇష్టం.

1898 వరకు ఆమె విదేశాల్లో ఉండి అపారమైన విజ్ఞానాన్ని సంపాదించింది. ఇంగ్లాండు, ఇటలీ, స్విట్జర్లాండ్ వంటి దేశాలు తిరిగి వారి నుండి ఎన్నో విషయాలను నేర్చుకుని మంచి స్నేహితురాలిగా, కవయిత్రిగా వారి నుంచి ప్రశంసలు అందుకొని భారతదేశం తిరిగి వచ్చింది. ఇక్కడకు వచ్చిన తరువాత డాక్టర్ గోవిందరాజులు నాయుడుగారిని ప్రేమించి వివాహమాడి, ఎందరికో ఆదర్శ మహిళ అయింది. గాంధీజీ ఉప్పుసత్యాగ్రహం ప్రకటించటంతోటే, ఈమె దానిలో పాల్గొనింది. సరోజిని నాయుడు 1925 లో భారతీయ కాంగ్రెస్‌కు అధ్యక్షురాలిగా ఎన్నికైన మొదటి భారతీయ మహిళ. ఈమె స్త్రీ విమోచన కోసమూ, అస్పృశ్యతా నివారణ కోసమూ, ఆసక్తితో కృషి చేశారు. ఈమె గొప్ప కవయిత్రి. ఈమె అనేక పద్యాలను, ఆంగ్లంలో 'గోల్డెన్ త్రెషోల్డు', 'బర్డ్సు ఆఫ్ టైం', 'ఫెదరర్ ఆఫ్ ది డాన్' అనే గ్రంథాలను రచించారు. ఈమెను 'భారతదేశపు కోకిల' అన్నారు. 1947 లో భారతదేశం స్వాతంత్ర్యం పొందిన తరువాత ఉత్తరప్రదేశ్ గవర్నరుగా నియమితులైనారు.

1912లో ఆమె గోపాలకృష్ణ గోఖలేని కలిసింది. వారితో మాట్లాడినప్పుడు ఎంతో ఉత్తేజం పొందింది. హిందూ ముస్లిం ల సఖ్యత గురించి ఆయన అభిప్రాయాలను తెలుసుకొని ఎంతో సంతోషించి, తన శేష జీవితాన్ని ఆ అద్భుత కార్యాన్ని నెరవేర్చటం కొరకు అంకితం చేయాలని ఆక్షణంలోనే నిర్ణయించుకుంది. అదే సంవత్సరం మార్చి నెల 22న లక్నోలోనే జరిగిన ముస్లింలీగ్ మహాసభలో పాల్గొనడానికి వెళ్ళింది. ఆనాటి సభలో సరోజినీ నాయుడు ప్రసంగిస్తూ "సోదర సోదరీ మణులారా! ఒక గడ్డపై పుట్టిన మన మధ్యలో మతం అనే అడ్డు గోడ మన ఐక్యమత్యానికి అడ్డువస్తుంది. మన ఆచారవ్యవహారాలు ఒకటే, మనందరి రక్తం ఒకటే, మనం మొదట భారతీయులం. అది అందరూ గుర్తించాలి, అలాగే భగవంతుడనేవాడూ ఒక్కడే ఉంటాడు. అది వారి విశ్వాసాలను బట్టి వుంటుంది. కొందరు "రామ" కొందరు "రహీం" కొందరు "జీసస్" అంటారు. ఇలా పలురకాలుగా ప్రార్ధిస్తుంటారు. ఎవరి విశ్వాసాలు వారివి, ఎవరి ఆచార వ్యవహారాలు వారివి. ఒక మతం వారు మరొక మతం వారిని విమర్శించడానికి ఏమాత్రమూ హక్కులేదు, అది అధర్మం మన మందరం ఒక కుటుంబ సభ్యులుగా ఉందాం, మనపై అధికారం చెలాయిస్తున్న ఆంగ్లేయ రాక్షసులను తిప్పికొడదాం. రండి ఏకం కండి హిందూ ముస్లిం భాయి భాయి" అంటూ అనర్గళంగా ప్రసంగించింది, ఆమె వాగ్ధాటికి ముగ్ఢులై ప్రేక్షకులు "హిందూ ముస్లిం భాయి భాయి" అనే నినాదం మిన్నంటేలా చేశారు. ఆ సమావేశంలో ఆ ప్రసంగం గొప్ప మార్పు తీసుకువచ్చింది. మహమ్మదీయులు ఆనాటి సభలో హిందువులతో కలసి జీవించడానికి, ఆంగ్లేయులను దేశమునుంచి పంపివేయడానికి గట్టినిర్ణయం తీసుకున్నారు. ఆ నాటి నుంచి స్వాతంత్ర్యం పొందే వరకు ఆమె నిర్విరామంగా కృషి చేసింది. 1949 మార్చి 2వ తేదీన అర్ధరాత్రి లక్నోలో కన్నుమూసింది ఆ నారీమణి.


మూలం: 5 వ తరగతి పుస్తకం లోనిది.

[ వెనుకకు ] [ ముందుకు ]

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: