|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
అనంతం
'చంకలోనిబిడ్డ నీ బిడ్డేనా! మడత నోటితో మాట్లాడావంటే మూతిని కుట్టిపడేస్తాను!!'
'................'
నిడదవోలు జంక్షన్ వదిలిన సర్కార్ఎక్స్‌ప్రెస్ గుడివాడ జంక్షన్‌కి చేరాలంటే నాలుగున్నర గంటలు పడుతుంది. మధ్యలో భీమవరం జంక్షన్ కూడ వదిలిపోయింది.
అయినా ఆ జగడం అలాగే సాగుతోంది. విషయం చివరగా ఉన్న లేడీస్ కంపార్టుమెంట్‌లో వాళ్ళకి ఎలాతెల్సిందో! అత్తిలి స్టేషన్‌లో సర్కారు ఆగేసరికి కొందరు ఆడంగులు అక్కడినుండి ఈ బోగీలోకి మారిపోయారు.
'అనుమానం లేదు! అయినా ఇటువంటివాళ్ళని ఊరికే వదిలితే...' కోపంతో ఊగిపోతోంది ఆ ఊబకాయ శరీరం ఆంటీ.
'ఇందాకణ్ణుంచి ఆ దొంగచూపులు చూడండి. నాకూచాలా అనుమానంగా ఉంది.'
'ఏ తల్లి కన్న కొడుకో వీడు. ఈ మాయలేడి వలలో చిక్కాడు'. ఎదుటి సీట్లో కూర్చున్న పెద్దమనిషి నుంచొని మరీ స్పీచ్ యిస్తున్నాడు.
'మొన్నటికిమొన్న మా తణుకు ప్రక్కన ఖండవల్లి ప్రయివేటు హాస్పిటల్‌లో పురిట్లోని పసిగుడ్డు మాయమైపోయాడు.
ఇలాంటోళ్ళు మత్తుపెట్టేసి పిల్లల్ని తీసుకెళ్ళిపోతున్నారు. వినిపిస్తున్న ఆ మాటలన్నింటికీ మౌనమే సమాధానమయింది ఆమెకు. బక్కచిక్కిపోయివున్న శరీరం, లోతుకు పీక్కుపోయిన కనుబొమ్మలు, చప్పిదవడలతో ఆమె వికృతంగా ఆగుపిస్తోంది. కట్టుకున్న గుడ్డలు బాగా పీలిపోయి ఉన్నాయి. ఆ కళ్లు ఆందోళనగా, భయంగా దిక్కుల్ని లెక్క పెడుతున్నాయి. కాళ్ళూ చేతులూ వణుకుతున్నాయి.
అక్కడ తనకు అనుకూలంగా ఎవరూ మాట్లాడటంలేదు. వాళ్ళ ఎత్తిపొడుపు మాటలకి ఉక్కిరిబిక్కిరి అవుతోంది.
'నిన్నేనే అడిగేది! నీ పేరు!!'
'............అనంతం!' చెప్పడం యిష్టంలేదు. అయినా వాళ్ళు పెట్టే ఒత్తిడికి భరించలేక పెదవి విప్పింది. ఆ గొంతులో సన్నని జీర సుస్పష్టంగా అగుపిస్తోంది. రైలు ఎక్కిన తర్వాత కూర్చోడానికి సీటు బాగానే దొరికింది. కానీ అందరూ నిలదీసి మాట్లాడుతుంటే అనంతం అదిరిపోతోంది.
'వాడికీ దీనికీ పోలికేలేదు. ఈమె వాడికి తల్లంటే ఎలా నమ్మేది. ఎక్కడినుండి ఎత్తుకు వచ్చిందో!' ఎదుటి సీట్లోని ఆమె బాధిస్తోంది.
పేపర్లో పడిన పసిపిల్లల దొంగతనం అంశాన్ని బిగ్గరగా చదువుతున్నాడు ఒకతను. కాలం సాగిపోతోంది. స్టేషన్‌లు వెనక్కిపోతుంటే రైలుముందుకు సాగిపోతోంది. వాటితోబాటు వారి అనుమానాల పరంపర కూడా బలపడి నిర్విరామంగా సాగుతోంది. చేతిలోని పసికందు ఏడుస్తున్నాడు. అంతమందిలోను అతృతగా శుష్కస్తన్యాన్ని అందించింది. ఓ ఎడారి మైదానంలా ఉంది అనంతం అంతరంగస్థితి.
అక్కడ ఏదో మత్తుమందు రాసివుంటుంది! ఈ దెబ్బతో వాడు సరి!! తన అనుమానాన్ని అందరిముందు ఉంచుతున్నాడు ఆవైపు సీట్లో అప్పటిదాకా ఏదో పుస్తకం చదివిన పెద్దాయన.
'అవునండోయ్! ఇటువంటి మాయ లేడిని ఊరికే వదలకూడదు. కట్టిపడేయ్యాలి!! అంటూ ఆ పసికందుని లాగిపడేసింది ఒకామె.
అనంతం కళ్ళలో నీళ్ళు చిప్పిల్లినాయ్! తర్వాత స్టేషన్‌లలో ఎక్కిన ప్రయాణీకులకు అది సీటుకోసం జరిగే సాధారణ గొడవ అని భావించినా తర్వాత నెమ్మదిగా విషయం తెలుస్తోంది.
సమోసాలఅబ్బి, పల్లీల అమ్మి అందరూ వాళ్ళవాళ్ళ వ్యాపారాలను కాసేపు ప్రక్కనపెట్టి జరుగుతున్న తతంగాన్ని గమనిస్తున్నారు.
'నువ్వు పిల్లలని అమ్ముకునే దానిలా ఉన్నావ్!' ఓ మహిళ పెద్దపెద్దగా మాట్లాడుతుంటే అనంతం గుండెలు అదిరిపోతున్నాయి.
ఆ రొద రైలుశబ్దాన్ని డామినేట్ చేసింది. బోగిలోని ప్రయాణీకులను, ఆగిన ప్రతి స్టేషన్‌లోని ఫ్లాట్‌ఫారం మీదవున్న ప్రజలదృష్టికి అటువైపుకు మళ్ళిస్తూనే ఉంది. అన్నింటినీ మౌనంగా భరిస్తోంది అనంతం.
ఓ సందేహం........భయం తాలూకు నీలినీడలు ఆమెను నిలువ నీయడం లేదు. ఆ శిశువును గుండెలకు హత్తుకోబోయింది. "మంచి నాటకాల గత్తెవే!" వెక్కిరిస్తున్నాడు కిటికీ దగ్గర నుంచున్న కుర్ర ప్యాసింజరు. ఏదో చెప్పబోయింది అనంతం.
'ఇక్కడ కాదు. పోలీస్ స్టేషన్‌లో పెట్టి నాలుగు తగిలించిన తర్వాత చెబుదువు'.
'ఇంతవరకు ఎంతమందిని కాజేశావ్!' సాగదీసింది వెనకబోగీలోంచిమారిన ఆవిడ.
వణికిపోతూ రెండు చేతుల్ని ముఖానికి అడ్డంగా పెట్టుకొంది.
'ఓ పదిమంది వరకూ ఉంటార్రా!' ఆమె చేతివేళ్ళను లెక్కిస్తూ అంటోంది ఆమె.
ఆమె వాలకం చూస్తుంటే కాసింత సానుభూతిని ప్రకటించిన వాళ్ళకి కూడా అనుమానం కలుగజేస్తోంది.
'ఈ బిడ్డ నీ బిడ్డేనా'?
'అవును' ఆమె ముక్తసరి సమాధానానికి అంతా రెచ్చిపోతున్నారు.
'ఎన్ని రోజుల క్రితం కాన్పు అయింది!'
'నెల!!'
'ఈ శిశువుకు కనీసం ఆరునెలలుంటాయి!!!'
'ఈమె పిల్లల్ని అమ్ముకొనే దానిలా ఉందిసార్! ఇప్పుడు కూడా ఎక్కడి నుంచో పిల్లల్ని ఎత్తుకొచ్చింది! గుడివాడ స్టేషన్‌లో చుట్టుముట్టిన పోలీసుల ముందు వాగ్మూలం ఇస్తోంది ఓ ఆడమనిషి.
నాలుగు గంటల నుండి ట్రైన్‌లో భాగోతం చూస్తున్న వారంతా శృతి కలిపారు. అక్కడ ఈ సందర్భంగా బండి ఐదు నిమిషాలు ఎక్కువగా ఆగిపోయింది. మహిళా పోలీసులు రంగప్రవేశం చేశారు.
'మీ సెల్‌లో మెసేజ్ ఇచ్చి మంచి పనిచేశారు.' పబ్లిక్ సహకారం ఉంటేనే మేము ఇటువంటివి అరికట్టగల్గేది!' హెడ్ కానిస్టేబుల్ ఆ కుర్రాడికి కితాబునిస్తున్నాడు. ఏదెదో చెప్పబోతోంది అనంతం. అంతమంది మందలో ఆమె వేదన, గాబరా అంతా అప్రస్తుతంగా మారాయి.
'ఈ మాయలేడీ కట్టూబొట్టూ చూస్తే తెలియడంలా. . . పైగా నోరు మెదపక మౌనమొకటి.' ఆమె చేతిసంచీ మొత్తం వెతుకుతూ అంటోంది ఆడ కానిస్టేబుల్. సద్ది అన్నం, కారంముద్ద, చీకిపోయిన పాతచీరల్ని చూసి జుగుప్సగా దూరంగా విసిరేసింది.
బాలింతరాలివయితే శిశువుకు బట్టలు ఏవంట! లేని అనుమానాల్ని ప్రదర్శిస్తోంది ప్లాట్‌ఫాం మీద ఉన్న మరో ఆడమనిషి.
వీళ్ళందర్నీ అక్కడే వదిలేసి రైలుమటుకు ముందుకు సాగిపోయింది. కొంతమంది ప్రయాణీకులు ఆగిపోయారు. వాళ్ళ మొహాలలో ఏదో ఒక చెడును నియంత్రిస్తున్నామన్న అతిశయం కనిపిస్తోంది.
బలవంతంగా రైలులోంచి దింపబడ్డ అనంతం ఇప్పుడు పోలీస్ స్టేషన్‌కి అనుకోని అతిధి. ఆమెను అనుమానించిన వారందరూ వందిమాగధుల్లాగ అనుసరించారు.
'నీ భర్త ఎవరు? ఎక్కుడుంటాడు??........ ఏమీ చేస్తాడు? మీ ఊరేది?' లాంటి ప్రశ్నలు ఆమెను అతలాకుతలం చేస్తున్నాయి.
'అసలు చంకలో ఉన్నది నీ బిడ్డ అనడానికి రుజువేంటి?
'చనుపాలు పిండిచూస్తే సరిపోతుంది!'. 'గుంపులోంచి ఎవరో ఆకతాయి ఆరిచాడు.
'మంచి సలహా!' ఆడపోలీసు ఆమె చేతిలోని శిశువును లాగి పడేసింది.
అందరిముందు ఆడది అన్న కనీస ధ్యాసకరువై.....స్తన్యపరీక్ష జరిగిపోయింది. అవమానంతో బిక్క చచ్చిపోయింది అనంతం. భూమి క్రుంగి మట్టిలో తాను మమేకమైతే చాలునన్నంత ఆక్రోశం ఆమెలో.
పదిమంది ముందు చిరుగులచీరతో కప్పబడిన తన శుష్కఅంగాంగానికి శల్యపరీక్ష... ఓ కీచక నైజంలా!
ఆమెలోని నిగూఢమైన ఆడతనం అనాదిగా...అనంతంగా బిక్కచచ్చి క్షోభకు గురవుతూనే ఉంది.
ఎగతాళిలు....అపహాస్యాలు....హేళనలు....ఈసడింపులు అన్నీ జడలు విప్పుతున్నాయి. ఏవీ ఆమె అంతరంగానికి పట్టడంలేదు. తన ఆత్మాభిమానం పూర్తిగా అవహేళన చేయబడుతోంది. మొత్తానికి శుష్కమైన స్తన్య పరీక్షలో రెండు పాలబొట్లు రాలాయి. తను పరీక్షలో నెగ్గింది. కానీ అనంతం గుండెల్లో అవి రెండు బిందువులు.
'పాలు వచ్చాయి కాబట్టి ఈమెను వదిలేయవచ్చు!' పోలీసులు చేతులు దులుపుకున్నారు.
'మా వాళ్ళలో ఒకామెకి కాన్పు వచ్చిన మూడేళ్ళకి కూడా పాలు వచ్చాయి. అలాచూస్తే ఇటీవలే వీణ్ణి ప్రసవించిందని భావింపనక్కరలేదు.' దాంతో మరిన్ని చిత్రవధలు ఆమెను చుట్టుముడుతున్నాయి.
'అవును.....ఈమె అనంతం. నాకు తెలుసు!'
'.............' అదే మా ఊరి సారయ్య పెళ్ళాంగా తెలుసు' ఆ ఊరి ఎస్.ఐ గారు అన్న మాటలు వాళ్ళని ఆలోచనల్లో పడేస్తున్నాయి.
'కాదు సార్! ఈ మాయలేడి ఎక్కడి నుంచో సంవత్సరం కూడా నిండని శిశువును ఎత్తుకుని వస్తూ రైలులో పట్టుబడింది. కనీసం టికెట్ కూడా లేకుండా ప్రయాణం చేస్తున్న మనిషిని చూసి ఏమనుకోవాలి సార్!'
'ఆమె ఇంట్లోంచి పారిపోయి వచ్చింది!' చౌదరిగారి మాటలు చిత్రంగా ఉన్నాయి. చౌదరిగారు సబ్ ఇన్‌స్పెక్టర్ అయినా ఆయన అంత ఉదాసీనంగా మాట్లాడటం వాళ్ళు ఎప్పుడూ చూడలేదు.
'అవును. సారయ్య, అనంతం మా కాలనీలోనే నివసిస్తున్నారు. రిక్షాతొక్కే సారయ్యకి సారాయి బలహీనత ఉంది. ఆ బలహీనతను చాలావరకు ప్రోత్సహించింది నేనే.
నాభార్య.....'సునందామహిళామండలి'కి ప్రెసిడెంట్. తన పేరుతోబాటు ఆ సంఘానికి సర్వం ఆమే! తన అందచందాలు, అలంకరణలు, పేరు ప్రతిష్టలు, డబ్బు, హొదా ఆమెకు ముఖ్యం.
తల్లి అయిన తర్వాత పుట్టిన శిశువుకు ఒంటిపాలు ఇస్తే తన అందం అంతా తరిగిపోతుందని ఎవరో సలహా ఇచ్చారు. అది బాగా ఒంటిపట్టించుకొంది. పోతపాలు, పుట్టిన శిశువు పెరుగుదలకు, ఆరోగ్యానికి అంతగా మంచిదికాదని డాక్టర్లు సలహ ఇచ్చారు. అయినా విన్పించుకోలేదు. చాలాసార్లు నేను కూడా చెప్పిచూశాను.
అందచందాలు, పరపతి, హొదా మాత్రమే సర్వస్వం అనుకొనే సునందకు నేను, నాకొడుకు పరాయి వాళ్ళుగానే అగుపిస్తున్నాము. తల్లిపాలు అందక అల్లాడే పురిటిలోని పసిగుడ్డుని చూడలేకపోతున్నాను. వాడు ఆకలితో అలమటిస్తున్నాడు. అది స్వార్ధం అన్పించినా ఆ సమయంలో ఈమెను ఓ ఎరగా ఎంచుకోక తప్పదు.
ఈమెకూడా ఆ మధ్యనే ఓ బిడ్డను ప్రసవించింది. వీళ్ళది మా ఇంటికి ఎదురుగా ఉండే పూరిగుడిసె. ఈమెను రోజూ గమనిస్తూనే ఉన్నాను. ఒకరోజు వెళ్ళి నాబిడ్డకు పాలుపట్టించమని ప్రాధేయపడ్డాను. డబ్బు ఆశచూపాను. నాకొడుక్కి రోజూవచ్చి తల్లిపాలు అందిస్తే కావలసినవన్నీ ఇస్తానన్నాను. అనంతం ఒప్పుకోలేదు.
కానీ నా అవసరం నాది. సారయ్య బలహీనత నాకు తెలుసు. కన్నతండ్రిగా నాకొడుకు కోసం వాడి బలహీనతను బాగా ప్రోత్సహించాను. చిత్తుగా త్రాగించాను. కావల్సినంత డబ్బును పడేశాను.
కాదన్నప్పుడల్లా అనంతాన్ని బాగా చితకబాదేవాడు. దాంతో నా ఇంటికి వచ్చి నాకొడుక్కి పాలు పట్టించిపోయేది. క్రమంగా నాకొడుకు బాగా ఎదుగుతున్నాడు. ఆమె కొడుక్కి పోతపాలు డబ్బాలు బాగానే సమకూర్చిపెడుతున్నాను.
కానీ మాతృత్వం, మమకారం ఈనాడు ఇలా పసిగుడ్డుతో సహా ఇల్లువదిలి పారిపోయేలా చేసింది!'
'.........'
ఒక్కక్షణం ఆగాడు ఇన్‌స్పెక్టర్ అమరయ్య చౌదరి. విషయం తెలిసే ఆయన ఆ ఊరునుండి గుడివాడకు బయలుదేరి వచ్చాడు.
తమ పై ఆఫీసరు చేసిన నిర్వాకం అక్కడి వాళ్ళకు బాగానే అర్థం అవుతోంది. కానీ పై అధికారి....బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్.......!
కన్న ప్రేగును తనలో మమేకం చేసుకోవాలన్న ఓ నిశ్శబ్ద ఘొషవైపుగా అనంతం! ఆమె ఓ అనంతమైన అమ్మ.
తత్వం..........దైవత్వం........ప్రాపంచిక ప్రామాణాలు కలబోసిన సిసలైన అమ్మ........
కానీ తన బానిస బ్రతుకు......పీడిత జీవితం.......కన్నవాడికి తన స్తన్య ఫలాలనందించి కనీసం లాలించుకోలేని అసహాయత.....మొగుడి ద్వారా దుర్భరమైన బ్రతుకు......కనిపించని అమరయ్య ఆధిపత్యం........ఒడిలోకి చూసుకొంది. శుష్కించిపోయి ఉన్నవాడు మగతనిద్రలోకి జారుకొని ఉన్నాడు. పల్చటి కన్నీటి చారల మధ్య పరికిస్తున్న ఆమెకు తనూ, తన నిర్భాగ్య జీవితం నిరంతరంగా పునరావృతమవుతూనే ఉంది. అక్కడ తన పూరిగుడిసెలోని శిశువు అదేపనిగా ఆకలితో శోకాలు పెడుతున్నాడు. ఎదిరింటి మేడమీది అయినింటి కుర్రాడు దానిని ఆనందంగా ఆలకిస్తున్నాడు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in