|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
మళ్ళీ వచ్చేశా...
కెవ్వున అరిచినంత పనిచేసింది మధుర మీనాక్షి. పెళ్ళయిన తరువాత తన జీవితంలో పెళ్ళాం నోటి నుంచి వచ్చే ఆ అరుపులలోని తికమకల్ని ఎప్పుడూ పసికట్టలేకపోతూన్న మార్కండేయులు ఉలిక్కి పడ్డాడు.
మళ్ళీ ఏం కొంపలంటుకు పోయాయో అన్న భయంతో భార్య ఇచ్చిన కాఫీ కషాయాన్ని ప్రక్కన పడేసి గదిలోంచి చటుక్కున బయటకు వచ్చాడు.
ఆవిడ ఆనందమో! ఆవేశమో!! తెలియని అదో విధమైన భావంతో కేరింతలు కొడుతోంది.
"మధురా! ఏమిటి అమ్మాయి నుండి ఏదైనా ఉత్తరం వచ్చిందా!!" తడబడుతూ అన్నాడు మార్కండేయులు
"ఉత్తరం ఏమిటండీ సాక్షాత్తు అమ్మాయి, అల్లుడూ వస్తేను".
దీనంగా అటు చూశాడు.
చెక్క బండి దిగి ఇవ్వడానికి జేబులోంచి చిల్లర డబ్బులు తీసి లెక్కపెడుతున్న జిగురు మూర్తి కంటపడ్డాడు.
పై ప్రాణంపైనే ఎగిరిపోయినట్లు అయింది మార్కండేయులుకి.
"మమ్మీ" చేతి బ్యాగ్ పట్టుకుని పరుగులాంటి నడకతో లోపలికి వచ్చింది జిలేబి అనబడే జిగురు లీలాభవాని. మొద్దులా ఉండే లీలాభవానిని మొగుడు ముద్దుగా జిలేబి అని, పిలుస్తుండటంతో అది ఆమెకు సార్ధక నామధేయమై పోయింది.
"ఎన్నాళ్ళయిందే అమ్ములూ నిన్నుచూసి" అంటూ అక్కున చేర్చుకొంది మధురమీనాక్షి. పెనంలో బుసబుస లాడుతున్న నూనెలా.
"మొన్న పదిహేను రోజుల క్రితమేగా అల్లుడు రంజాన్ పండుగకి వచ్చి వెళ్ళింది. అప్పుడే వచ్చేయలా!" పైకి అనలేదు గానీ లోలోపల వాపోతున్నాడు మార్కండేయులు. కానీ జిలేబి కూడా రావడంతో కొంత తమాయించుకున్నాడు.
"మమ్మీగారు కులాసానా?" నవ్వుతూ లోపలకి వచ్చాడు జిగురుమూర్తి.
ఆనాడు గబ్బిలాల వారబ్బాయి కదాని గురుమూర్తిని ఏరికోరి అల్లుడుగా తెచ్చుకున్నాడు మార్కండేయులు. కానీ గబ్బిలంలా వచ్చి అతుక్కుపోతుంటాడని ఊహించలేదు.
మొత్తానికి "గులాబీల" వారి ఇంటి ఆడపడుచు "గబ్బిలాల" వారి కోడలుగా వెళ్ళీ 'జీ' లనుమాత్రం ప్రోది చేసుకోగల్గింది. అప్పటినుంచే భార్యను 'జిలేబి' అని పిలుచుకుంటున్నాడు.
అందరూ తనను జిగురుమూర్తి అని పిలుస్తుంటే జిగురులా అతుక్కుపోవటం అలవాటు చేసుకున్నాడు.
టెలిగ్రాఫ్ ఆఫీసులో ఎల్‌డిసిగా పనిచేసే అల్లుడు ఎప్పుడూ టెలిగ్రాఫ్ బాషనే వాడుతుండటంతో మధుర మీనాక్షి కాస్తా 'మమ్మీ' అయిపోయింది.
అత్తయినా అమ్మతో సమానమే అని సర్ధుకుపోయింది ఆవిడ. అల్లుడు ఏదో ఆఫీసు పనిమీద వచ్చి ఉంటాడులే అని సముదాయించుకున్నాడు మార్కండేయులు. ఎంత తనను తాను సర్ధి చెప్పుకుంటున్నా గుండెల్లో పడ్డరాయి కరగడంలేదు ఆయనకి.
"మీ అల్లుడికి సంపాదన ఏమీలేదా! ఎప్పుడూ ఇక్కడే తిరుగుతుంటుంటాడు." ప్రక్క ఇంటి పార్ధసారధి నిలేసి అడిగే సరికి ముఖం మున్నూరు లాకుల్లో పెట్టుకోవలసి వచ్చింది మార్కండేయులకి.
తను పనిచేస్తున్న ఎలిమెంటరీ స్కూలు మాష్టారి ఉద్యోగానికి భయపడలేదు ఎప్పుడూ. పిల్లల్ని చెప్పుచేతల్లోనే ఉంచుతున్నాడు. మధ్యహ్న భోజన తయారీకి అంతకన్నా వెరవడం లేదు. వంటామె రాకపోతే తానే గరిటె ప్రతాపం చూపిస్తున్నాడు. విద్యాకమిటి చైర్మన్లు చెలరేగితే మాటాల తూటాలతో గిరికీలు కొట్టిస్తున్నాడు. అటువంటిది దశమగ్రహానికి దాసోహం అనడం మార్కండేయులకు అంతుబట్టటంలేదు.
జిగురుమూర్తి చేతులోని బ్యాగ్ అందుకోబోయాడు. అప్పటికే అతను లోపలకి నడిచాడు.
"మామగారూ! మొన్న రంజాన్‌కి వచ్చినప్పటి బట్టలు టైలర్ ఇచ్చాడా!!" అల్లుడు దర్పాన్ని ఒలకబోస్తూ అన్నాడు గురుమూర్తి.
మామ పెట్టిన గుడ్డల్ని మామగారి ఊరి టైలరు దగ్గరే కుట్టించుకోవాలనుకొనే అల్లుడ్ని చూస్తే వళ్ళుమండుతోంది మార్కండేయులుకి.
ఎంత తల కొట్టుకుంటున్నా అర్ధాంతరంగా ఊడిపడ్డ అల్లుడి రాకలోని ఆంతర్యం అర్థం కావడంలేదు మార్కండేయులుకి.
ఆలోచిస్తున్నాడు. తలక్రిందులవుతున్నాడు.
మళ్ళీ మళ్ళీ పరికించి చూస్తున్నాడు. సమాధానంలేని విషయవేదన ఆయన్ని చుట్టుముట్టి అతలాకుతలం చేస్తోంది. శరీరంలోని ఇంద్రియాలు సహకరించని పరిస్థితి ఆయనలో.
పండుగలు, పబ్బాలమీద పడి బ్రతికే ఇలాంటి అల్లుళ్ళుంటే, కూతుళ్ళు తల్లులెలా అవుతారా? పెద్దవాళ్లు అమ్మమ్మలెలా అవుతారు. కూతుర్ని తలుచుకొంటే గుండె తరుక్కుపోతోంది మధుర మీనాక్షికి.
జిగురుమూర్తి మావగారి కంటికి నలుసు అయి కూర్చున్నాడే గాని, కూతురు కడుపున ఓ నలుసు పడేయటం లేదు.
ఎప్పటినుంచో మనవడి కోసం రోదిస్తోంది మధుర మీనాక్షి మనసు. పుట్టేవారి కోసం ఆవిడ జోలపాట ప్రాక్టీసు చేసుకుంటోంది. లాలి పాటలు నేర్చుకుంది.
ట్యూన్స్ కట్టి నెలల తరబడి రిహార్సల్స్ చేసుకుంటోంది. కాని కూతురు నెల తప్పటం లేదు.
అల్లుడు ప్రతి పండక్కి వచ్చి వాలిపోతున్నాడనే ఉక్రోషం ఆయనకి. కానీ ఒక్క విషయంలో బాగా ఆశ్చర్యపరుస్తున్నాడు. జాతీయతను ఆచరించి అన్ని మతాలను ఆదరిస్తాడు. అందుకే స్వాతంత్ర దినోత్సవమైనా, రిపబ్లిక్‌డే అయినా జయంతులైనా, వర్ధంతులైనా సరే మావగారితోనే జరుపుకుంటాడు.
దసరా, శ్రీరామనవమి, దీపావళి, సంక్రాంతి, మహాశివరాత్రి, నాగుల చవితి, రధసప్తమి, క్రిస్టమస్, గుడ్ ఫ్రైడే, మిలాదినబి, రంజాన్, బక్రీద్ పండుగలనాడు అత్తగారి ఆదరణతో ఆనందిస్తుంటాడు.
భిన్నత్వంలో ఏకత్వ సిద్ధాంతాన్ని తు.చ.తప్పక పాటించే జిగురుమూర్తి కులమతాలకు అతీతంగా అన్ని పండగల్ని మామగారితో కలిసి జరుపుకోవడం ఒక బాధ్యతగా భావిస్తాడు.
ఏ పబ్బ మొచ్చినా కూతుర్ని ఇచ్చినందుకు మామగారికి తుమ్మజిగురే అవుతున్నాడు.
వెంకట్రామ అండ్ కో కేలెండరు చూసి ఆ రోజు తనకు తెలియని పండుగ ఏదైనా వ్రాశారేమోనని వెత్తుక్కోసాగాడు మార్కండేయులు. ఎక్కడా ఏమి కనబడలేదు.
అల్లుడి అర్థాంతర రాకలో ఆంతర్యమేమిటో. ఆయన కంటి రెప్పలు అదురుతున్నాయి. "ఏమిటి అల్లుడా! ఈ ఊరిలో ఆఫీసు పని ఏదన్నా ఉందా!". హాలులో పేపరు చూస్తున్న గురుమూర్తిని అడిగాడు మార్కండేయులు.
చిన్నగా నవ్వాడు జిగురుమూర్తి.
"ఎలాగూ వచ్చావు కదా! కాసేపు రెస్ట్ తీసుకో. అలా స్కూలికి పోయి వస్తాను. ఇవాళ ఇన్‌స్పెక్షన్ ఉంది." బయటకు నడిచాడు మార్కండేయులు.
'వచ్చిన తరువాత కనీసం అరడజను రోజులైనా అతుక్కుపోయే అల్లుడు ఈసారి ఎన్నాళ్లకు కరుణిస్తాడో'. ఎలిమెంటరీ స్కూలులో సింగిల్ టీచర్ అయిన మార్కండేయులు సింగిల్ మనసు గిజగిజలాడిపోతుంది.
అల్లుడు కదా అని ఉన్నంతలో బాగానే చూస్తున్నాడు. కానీ తనకు తెలియని పండుగలకి, కేలెండర్ వాళ్ళు రాయని పండుగలని కూడా తెలుసుకొని వచ్చి వాలిపోవడంలో చికాకు అనిపిస్తోంది.
ఓసారి తనలోని సర్వశక్తుల్ని కూడదీసుకొని అడిగింది మధుర మీనాక్షి "అల్లుడూ నీకు ఇన్నిరోజులు సెలవలు ఉంటే అమ్మాయిని తీసుకొని అలా హనీమూన్‌కి వెళ్ళిరావచ్చుగా!".
నవ్వు కాని నవ్వు నవ్వాడు జిగురుమూర్తి.
"సెలవెక్కడ మమ్మీ, జిలేబికోసం డ్యూటీకి ఎక్కువ ఆబ్సెంట్ అవుతున్నానని మెమోలు ఇస్తున్నాసరే వచ్చి వాలుతున్నాను" అన్నాడు. తనేదో త్యాగం చేస్తున్నట్లు ఫోజు పెట్టి.
ఏమీ చేయలేని మార్కండేయులు అల్లుడు మర్యాద ప్రొటోకాల్ ప్రకారం మరోసారి సరుకులన్నీ తెచ్చి దీనంగా ఇంట్లో పడేసాడు.
"అల్లుడూ! బిల్ క్లింటన్ ఇండియాకు ఎందుకొచ్చాడో గ్రహించగలనుగాని, ఈసారి నువ్వు ఎందుకొచ్చావో తెలియడం లేదోయ్! మధుర మీనాక్షి ఆకులో అన్నం వడ్డిస్తుంటే అన్నాడు మార్కండేయులు.
'అదేమిటి మామగారు! అల్లుడికి అత్తాశ..........పండుగకి మామగారింటికి రావడం నా జన్మహక్కు.'
"అద్సరేలేవోయ్....ఇప్పుడు పండుగలేమీ లేవుగా"
"ఏకోపాధ్యాయ స్కూలు టీచర్, మీకు వేరే పండుగ చెప్పేదేముంది మామగారు. రేపటి నుండి చదువుల పండుగ కదా?!"
అరిటాకులోని పాయసం గొంతు దిగలేదు ఆయనికి.
ఆనందంగా ఉంది మార్కండేయులకి.
ఈ అయిదు రోజుల చదువుల పండుగ ఒక్కడే ఎలా నెట్టుకు రావాలా అని మదన పడ్డాడు.
కానీ జిగురుమూర్తిని బలవంతంగా ఇన్‌వాల్వ్ చేయడంతో అల్లుడిమీద మొదటిసారిగా నెగ్గగలిగాడు.
మొదటిరోజు ర్యాలీలోను, స్లోగన్స్ చెప్పించటంలోను, తప్పక పాల్గొన్న జిగురుమూర్తి రెండోరోజు పేరెంట్స్, పాఠశాల విద్యాకమిటీల సమావేశాలలో సహాయం చేయమని అడిగే సరికి తెల్లముఖం వేశాడు.
మూడోరోజు గ్రామంలోని బడి వయసు పిల్లల్ని స్కూలుకి తీసుకు రమ్మనడంతో తలప్రాణం తోకకు వచ్చినట్లయింది. ఇంటింటికి వెళ్ళి పేరెంట్స్‌ని బ్రతిమాలే అవసరం రావడంతో వారి మాటలు గుబులు పుట్టించసాగాయి.
పిల్లలతో క్లబ్‌లు ఏర్పాటు చేయడం, ముసలమ్మల చేత కధలు చెప్పించడం వంటివి చేయవలసి రావడంతో ఎప్పుడు బస్సేక్కేద్దామా అనిపించసాగింది జిగురుమూర్తికి.
పిల్లలకు ఆటల పోటీలు, క్విజ్‌లు నిర్వహించడం, సరోజినీ నాయుడు, మధర్ ధెరిస్సా వంటి వాళ్ళను గురించి వివరించడం చేతగాక తికమక పడ్డాడు. చివరగా ముగింపు సభ మొదలైన తర్వాత మామగారి బలవంతం మీద వివిధ అంశాలను నిర్వహించవలసి రావడంతో రెమ్మ తిరిగిపోయింది.
'జాయిన్ డ్యూటీ ఇమిడియట్లీ! "మా మేనేజరు లీవ్ క్యాన్సిల్ చేసుకొని వెంటనే డ్యూటీలో జాయిను కమ్మని టెలిగ్రాం పంపాడు మామయ్య" చూపిస్తూ అన్నాడు జిగురుమూర్తి.
దానిని నిశితంగా పరిశీలించాడు మార్కండేయులు. ఈ ఊరిలోనే అరగంట క్రితం ఇచ్చిన టెలిగ్రాం అది. ఈ బాధ భరించలేక తనే వెళ్ళి టెలిగ్రాం ఇచ్చి వచ్చిన అల్లుణ్ణి అదోలా చూశాడు మార్కండేయులు.
"అల్లుడూ ప్రతీ ఏడాదీ మిగతా పండుగలకి రాకపోయినా పర్వాలేదు. చదువుల పండక్కి మాత్రం తప్పక రావాలోయ్'. నాకు సహాయకారివిగా వుందువు.
" ఈ సారి అవాక్కయి పోవడం అల్లుడి వంతు అయింది.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in