www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

మరో ఉప్పెన

"వీణ్ణి చూస్తూంటే చాలా అసూయగా ఉందే నాకు!" తల్లిని కరుచుకొని ఒదిగి పడుకున్న కొడుకును చూస్తూ అన్నాడు వెంకటరమణ. ఆ దగ్గరితనాన్ని తాను కోల్పోయిన భావం కనిపించింది అతడి గొంతులో. మంచాన్ని ఆనుకొని తనకు దగ్గరగా కూర్చున్న భర్త బుగ్గ మీద కొంటెగా పొడిచింది అమృత. కొడుకు తలను నిమురుతూ "వీడు అసలు నాకు పుట్టిన వాడేనా అమృతా!" అన్నాడు వెంకటరమణ. అతడి పెదాల మీద చిరు మందహసం. వెంకటరమణ చెవిని ఒక గుంజు గుంజింది అమృత. "పరాచికమా?". "అది కాదు. ఎప్పుడూ అమ్మా అమ్మా అంటూ నీ ఊసేగాని నాన్న అంటూ ఒక వెధవ ఉన్నాడని వీడికి తెలియదే !". గాలికి కొట్టుకుంటున్న కిటికీ రెక్కలకేసి చూసింది అమృత . ఇంటి పైకప్పు పెంకుల పగ్గుళ్ళలోంచి మెరుపులు స్పష్టంగా కనిపిస్తూంటే ఉరుముల శబ్దానికి కదిలిన  చెట్టుకొమ్మల గలగలలు వింతగా వినిపిస్తున్నాయి. "నిన్నా మొన్నా లేదు. ఇప్పుడు గాలికూడా మొదలయినట్లుంది. "కిటికి తలుపులు వేయడానికి లేచాడు వెంకటరమణ. ఆ పెంకుటిల్లు మధ్యతరగతికి స్థితిగతులకు నిలువుట్టదంలా ఉంది.

ఇంటి వాకిలి లేమితనానికి ప్రతీకలా కనబడుతోంది . పెళ్లలుగా రాలిపోతున్నా మట్టిగోడలు, కూలిపోవడానికి సిద్దంగా ఉన్నా వసారా వాళ్ల ఆర్ధిక స్ధితిగతుల్ని చెప్పకనే చెబుతున్నాయి .  ప్రేమాభిమానాలకు ప్రతీకలా ఇంటి చుట్టూ అల్లుకున్న పచ్చని తివాచిలా కనిపిస్తున్నాయి. ఇంటిలోని సామాగ్రి వెంకటరమణ ఓ సాధారణ గృహస్తు అని చెబుతుంటే, వాటిని చక్కగా  సర్దుకున్న విధం అమృత ఓ దొడ్డ ఇల్లాలు అని చాటుతోంది.  అది సముద్రానికి చేరువగా ఉన్న ఎదురు మొండి గ్రామం. ఆశ్చర్యంగా అక్కడ వశుధ మాత్రం ఇసుకుపొరలను కాదనుకొని వంటి నిండా నల్ల రేగడ కవచంతో అలరాలుతోంది. ఒళ్ళంతా పచ్చదనపు పరిమళాలు. తుఫాను హెచ్చరికా  కేంద్రం వంటివి వున్నా వాటన్నిటినీ తలదన్నుతూ ఆ ప్రాంతం మట్టివాసనలతో మనిషిమేధకి సవాలుగా నిలుస్తోంది. భూమి రాబోయే వసంతాన్ని కూడా, ఉధృతాన్ని గాని సూచించే సాంప్రదాయక  పరికరమవుతోంది  రెండు రోజుల నుంచి విపరీతంగా కురుస్తున్న వర్షం. గోడల నిండాచెమ్మ జోరుగా వీస్తున్నఅంత గాలిలో కూడా దగ్గరలోని సముద్రపుజోరు వినిపిస్తోంది. నేల వాసన నెమ్మదిగా మారుతోంది. "ఈ గాలికి కరెంటు కూడా తీసేస్తాడేమో" అమృత మాట పూర్తి కాలేదు, కరెంటు పోయింది. "తుఫాను కాదుకదా ! " వెంకటరమణ తనలో తాను గొణుక్కున్నాడు. ఆ చీకటిలోనే అమృతకు దగ్గరగా వచ్చాడు.  "ఏమిటదీ! పిల్లవాణ్ణి తననుండి విడదీస్తూంటే అంది అమృత. పెదిమలకు దగ్గరగా ఉన్న అమృత బుగ్గను ముద్దుపెటుకొని "ముచ్చట" అన్నాడు. అంతటి చలిలో భర్త పెదాల వెచ్చదపు స్పర్శ అమృతను మరింక వారించనివ్వలేదు. పిలవాణ్ణి పక్క మంచం మీదకు మార్చి వెంకటరమణ అమృత పక్కన సర్దుకుపోయాడు.

"అన్నం తిందువు గాని రా! "బాబూ" శ్రీను తల నిమురతూ లాలనగా అంది రామసీత. ఏడుస్తూనే అడ్డంగా తలవూపాడు శ్రీనూ వద్దని.  "నాకు అమ్మ కావాలీ  . . . అన్నం వద్దు. అది రామకృష్ణ సేవా సదనం " ఆలనా పాలన నోచుకోని అనాధ పిల్లల  ఆశ్రమం. కనివిని ఎరుగని ఉప్పెన సృష్టించిన ప్రళయంలో చిక్కుకుని అల్లాడిన ఎదురు మొండి గ్రామంలో కూడా మిగతా గ్రామంలో మాదిరిగానే సహాయక చర్యలు చేప్పటింది సేవా సమితి.  తల్లీ, తండ్రీ , అయినవాళ్ళు లేకుండా మిగిలిపోయిన పిల్లలకు సమితి తమ ఆధీనంలో రక్షణ కల్పించింది. ఆ పిల్లలో శ్రీను ఒకడు. అందరిలోకి చిన్నవాడు కూడా కావడంతో అక్కడ పనిజేసే సిబ్బందికి శ్రీను కంటే ఒకింత ఎక్కువ  అభిమానం, ఆయా రామసీతకైతే మరీనూ రామసీత శ్రీను ముఖం తుడుస్తూ, "శ్రీను గొడవ  చేయకుండా అన్నం తిన్నాడన్నమాట. నేను తరువాత వాళ్ళమ్మ దగ్గరకు తీసుకెళుతాన్నన మాట". అంటూ బుజ్జగించడానికి ప్రయత్నిస్తోంది. "అబద్దం" నీళ్ళు నిండిన కళ్ళతో చూస్తూ అన్నాడు శ్రీను. " . . . " రోజు ఇలాగే చేప్తున్నావ్! అన్నీ అబద్దాలే" మనం రేపు తప్పకుండా మీ ఊరు వెళదాం. మీ అమ్మను చూద్దాం" ఈసారి మాట తప్పన్ననట్లు హామీ ఇస్తూ అన్నం ముద్ద వాడి నోటి కందించింది.

అన్నట్లే శ్రీనును తీసుకుని ఎదురుమొండి వెళ్ళింది రామసీత. ఉప్పెన తాలూకు ఛాయలు ఎదురుమొండిని ఇంకా వీడలేదు. రామకృష్ణ సేవా సమితి, స్వచ్చంద సంస్థల కార్యకర్తలు ఎదురుమొండికి కొత్తరూపం ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రజల ముఖాల్లో ఉప్పెన తాలూకు విషాద ఛాయలు ఇంకా కనబడుతూనే ఉన్నాయి.  శ్రీను తమ ఇల్లును గుర్తు పట్టలేకపొయాడు. ఊరంతా కొత్తగా, అసలు పరిచయం లేనట్లుగా అనిపించింది శ్రీనుకు. "ఇది మా ఊరు కాదు "ఏడుపు గొంతుతో అన్నాడు. "మీ ఊరే! సముద్రంలో ఉప్పెన వచ్చి ఇలా మారిపోయింది అంతే. అందుకే నువ్వు గుర్తు పట్టలేక పోతున్నావు . "ఊరి మధ్యలోగుండా నడుస్తూ పడమట దిక్కున ఊరికి కొంత దూరంలో ఉన్న పంచాయితీ పాఠశాల దగ్గరకు తీసుకెళ్ళింది. ఆ ఇదే నా బడి . . . "అవును ఇది మా ఊరే" రామసీత చేయి విదిల్చుకొని లోపలికి పరిగెత్తాడు శ్రీను. గదిలోపల బల్లదగ్గరకు వెళ్ళి "ఇదే నా సీటు" అంటూ తట్టి చూపించాడు బల్లను. రామసీత లోపలకు వచ్చే లోపలే దిగి బయటకు పరిగెత్తి " ఇక్కడే మా అమ్మ నా కోసం అన్నం తెచ్చి కూర్చునేది " . . . " అక్కడ తల్లి కూర్చునట్లే ఫీలయ్యాడు. "అమ్మా! అమ్మా!" అంటూ అక్కడే నిలబడి వెక్కి వెక్కి ఏడ్చాడు.

వాడి వేదన చూసి రామసీత కళ్ళు చెమ్మగిల్లాయి. తల్లి కూర్చునే బండకు దగ్గరగా ఇసుకలో కూలబడ్డాడు శ్రీను.  వేదనతో వెతుకుతున్న వాణ్ణి జాలిగా చూసి పైకి లేపి చీర చెంగుతో వాడి ముఖం తుడిచింది రామసీత. ఆమె వెంట నడుస్తున్న శ్రీను కాలికి సగం ఇసుకులో కూరుకుపోయి ఉన్న చిన్న ప్లాస్టిక్ కవర్ తగిలింది. వంగి చేతిలోకి తీసుకున్నాడు. "మా అమ్మ ఫొటో " అంటూ అరచినంత పని చేశాడు. 'ఎoత చక్కని రూపం' రామసీత తనలో తాను అనుకుంది. శ్రీను తల్లి పోలికే. చొక్కాతో ఫోటోను శుభ్రం చేసి ముద్దుపెట్టుకొని జేబులో దాచుకున్నాడు. వాడి గొంతులో సన్నగా వేదన.  రామసీత అమృత గురించి ఊళ్లో ఎవరినడిగినా సరైన సమాధానం లభించలేదు. శ్రీను తండ్రి వెంకటరమణ మాత్రం గుట్టలైన శవాల మధ్యలో ఒకటిగా మిగిలి అగ్నికి ఆహుతి అయ్యాడు. ఆ విషయాన్ని పంచాయితీ ద్ర్రువీకరించింది. కానీ అమృత . . . పక్కన తడిమి చూసుకుంది. శ్రీను లేడు. పట్టుమని ఐదు సంవత్సరాలు కూడా నిండని కొడుకు. అమృత హృదయం కీడును శంకించింది. అసలేం జరిగింది కళ్ళు మూతలు పడుతున్నాయ్. మనసులో, శరీరంలో ఒకేసారి వణుకు ప్రారంభమవటం వల్ల తట్టుకోలేకపోతుంది. శ్రీనును భర్త వేరుచేసి పడుకోవడం, అతడు తన పక్కన చేర్చడం, ఆ పారవశ్యం నుండి తేరుకొనే లోపలే పెద్ద పెద్దగా కేకలు . . . ఉదృతమైన వేగంతో వీస్తున్న గాలి ప్రపంచమంతా ప్రళయంతో తల్లడిల్లిపోతున్న భావన దూరాన భీకరంగా గర్జిస్తున్న సముద్రం అక్కడ ఏదో అయిపోతున్నట్లు ఏదో మీద విరుచుకు పడుతునట్లు ఆ చీకటిలో తమ ఒంటరిదైన భావన . . . కాలు కింద పెట్టేసరికి నీళ్ళు ఆ చీకటిలోనే శూన్యంలోకి చేతుల్ని ఆధారం కోసం విసిరి "శ్రీనూ . . . రమణ" అని కేకలు పెట్టింది. గొంతునాళాలు చిట్లిపొయేలా అరిచింది. విలవిలలాడింది. కాళ్ళు గుంజినట్లే కుప్పకూలింది.

తరవాత ఏదో అలికిడి విని కళ్ళు తెరిచింది అమృత. తను పడుకున్న గదిలో రెండు పక్కలా ఉన్న మంచాలు, మంచాలపై మనుష్యుల్ని గమనించిన తరువాత తనున్నది హాస్పటల్ అని అర్ధమయిందామెకు. పక్కన వెంకటరమణ కనబడలేదు. ఎదురుగా తెల్లకోటు, నుదుట పెద్దబొట్టు, ముఖాన చిరునవ్వు ఆ నవ్వు ఓదారుస్తున్నట్లుంది ."ఇప్పుడెలా ఉంది అమృత నుదుట మీద చేయి వేసి అడిగింది డాక్టరమ్మ. "శ్రీను ఎక్కడ?" భయం భయంగా మంచం మీద నుంచి లేస్తూ అడిగింది అమృత " శ్రీనునా...!అతడెవరు? "నా కొడుకు" అమృత పెదాల చివరినుండి ఏడుపు తీగలుగా సాగింది. ఆమె భుజం మీద చేయివేసి ఓదార్పుగా అంది డాక్టర్. "ఉప్పెనలో కొట్టుకుపోతున్న నిన్ను, మరికొంత మందిని ఇక్కడికి తీసుకొచ్చారు. వాళ్ళలో పిల్లలెవరూ లేరు!" ఆ మాటలు వినగానే కంపించిపోయింది అమృత. గుండెలవిసేలా రోధించింది. కాస్త తేరుకోగానే ఎదురుమొండి వచ్చింది. తమ ఊరును చూస్తుంటే గుండె తరుక్కుపోయింది ఆమెకు. కళ్ళనిండా ఆశల్ని నింపుకొని ఊరంతా గాలించింది. తమ ఇంటి ఆనవాలే లేదు. అసలది ఊరులా లేదు. అంతా స్మశానంలా ఉంది. గుట్టలు గుట్టలుగా శవాల దహనం సాగుతోంది.  పంచాయితీ ప్రెసిడెంటు రామలింగం మేడ, భవనం మినహా అన్నీ శిధిల అవశేషాలే. కడదాకా ఉంటానన్నవాడు కడలి కాటుకు బలైపోయాడు. పేగు తెంచుకున్న బంధం ప్రకృతిలో కలిసి పోయింది. అమృత కళ్ళలో నీళ్ళు ఇంకిపోయాయి. "అమృత కదూ"! దగ్గరగా వస్తూ పలకరించాడు ప్రెసిడెంటు రామలింగం. ఆయన పలకరింపుతో బావురమంది అమృత. రమణా, శ్రీనూ కనిపించడం లేదు బాబు! " శ్రీను గురించి తెలియదు అమృత! వెంకటరమణ మటుకు లేడు. అనాధ శవమై సామూహికంగా దహనమైపోయాడు " అమృతతో మాట్లాడుతుంటే రామలింగానికి ఏడుపు తన్నుకొచ్చింది.

తన దగ్గరే పడుకునే కొడుకును రమణ ఏనాడూ వేరు చేయలేదు. కానీ ఆ వేళ . . . అయ్యో . . . రమణ అలా వేరు చేయకపోతే బిడ్డ దక్కేవాడేమో, కనీసం చివరి క్షణంలోనైన దగ్గరగా ఉండేదాన్ని. ఎవరో పిండేస్తునట్లు  తల్లడిల్లుతున్న తల్లి మనసు. బతికేందుకు  కారణమే కనిపించడంలేదు. పక్కనే ఉన్న మర్రి చెట్టు నీడన కూలబడిపోయింది అమృత. "నాకు అమృత కావాలి" అదే పనిగా ఏడుస్తున్న శ్రీను మారాం. దయగా జాలిగా చూసి వానిని దగ్గరకు తీసుకుంది రామసీత. "అమ్మ వస్తుందిరా . . . తప్పకుండా వస్తుంది" ఓపికగా సముదాయిస్తూ అంది . "ఎప్పుడూ?" ఆ ప్రశ్నకు జవాబులేదు ఆమె దగ్గర. అనాధలుగా మిగిలిన ఇరువైమంది పిల్లలను బుజ్జగించడం ఓ ఎత్తు శ్రీను ఒక్కడినీ ఓదార్చడం ఓ ఎత్తు అవుతోంది రామసీతకు. అక్కడ  ఆటపాటలు, ఆహరం, ఓదార్పు మిగిలిన పిల్లల్లో తల్లితండ్రులను మురిపింపచేశాయి కాని, శ్రీనూను మాత్రం మురిపించలేకపోయాయి.

"అమ్మ ఎప్పుడువస్తుంది?" వెక్కిళ్ళ మద్య తడబడే మాటలతో అడిగాడు శ్రీను. "తొందరలోనే వస్తుంది" అన్నం ముద్ద  నోట్లో పెడుతూ ఓదార్పుగా అంది. రామసీత. " . . . "మీ అమ్మను వెతికి తెమ్మని గోవిందును, రాజు భయ్యాను పంపించాను. నువ్వు గొడవ చేయకుండా మిగతా పిల్లలతో కలసి ఆడుకో. నేను మీ అమ్మను తీసుకొస్తాను. "నిజ్జంగా . . . " వాడి కళ్ళలో మెరుపు, మనసులో ఆశ ప్రస్పుటమవుతున్నాయి. వీధి లైటు వెలుతురు కిటికీగుండా అమృత ముఖం మీద పడుతోoది. వెలుతురును తప్పించడానికి చేతిని కనురెప్పలను అడ్డుగా పెట్టుకుంది. ఎక్కడ ఎదురుమొండి, ఎక్కడ హైదరాబాద్. అక్కడ అందర్నీ కోల్పోయి, ఇక్కడ ఒoటరిగా ఈదుతున్న బతుకు. ఒక్క భానుమతి తప్ప ఎవరితోను దగ్గరితనం లేదు. బహుశా ఇరువురు సర్వం కోల్పోయి ఒకే గూటి పడవలో ఉండడమనే దగ్గరితనం అయి ఉండచ్చు అది. అమృత ఇంటి పక్కనే ఉండేది భానుమతి. ఉప్పెనలో తనూ అందరినీ కోల్పోయింది. రోజూ కూలి పనికి వెళ్ళడం, వారం వారం బట్వాడా తెచుకోవడం, ఇదంతా ఎవరికోసం ఎందుకోసమో అమృతకు అర్ధం కావడం లేదు. కూలి పని గుర్తుకు రాగానే రంగనాయకులు తెరపైకి వచ్చాడు. ఇంత అందం నేను మామూలు మనుష్యులలో చూడలేదు".  కాంట్రాక్టర్ రంగనాయకులు ఆమె వైపు ఆరాధనగా చూస్తూ అన్నాడు.

"అంటే మీ ఉద్దేశం?" చీరచెంగుతో ముఖంతుడుచుకుంటూ పల్చగా నవ్వింది అమృత". నీ గురించి అంతా విన్నాను "బిస్లరీ వాటర్ తాగి, మూత బిగించి పక్కన పెడుతూ అన్నాడు రంగనాయకులు. మధ్యానపువేళ అప్పటి వరకు చేసిన ఫ్లై ఓవర్ బ్రిడ్జి కన్‌స్ట్రక్షన్స్ పనులు ఆపి, అలసిపోయిన కూలీలు కాసింత తిని చెట్టు నీడన ఒదిగిపోయారు. తిన్న గిన్నెల్ని పంపు దగ్గర కడుగుతూ అమృత రంగనాయకులకేసి చూసింది. "నీ భర్త అదృష్టవంతుడు. ఓ రకంగా దురదృష్టవంతుడు. అదృష్టం నీతో సహజీవనం.  "కనుమరగడం నా దురదృష్టం" అమృత ముక్త సరిగా పలికింది. భానుమతి వెంట హైదరాబాద్‌కి వచ్చి కూలి పనికి కుదిరిన మొదట్లో రంగనాయకుల్నీ చూసి భయపడింది అమృత. కాని తోటి ఆడకూలీలందరూ అతణ్ణి మంచివాడుగానే చిత్రీకరిస్తారు. స్త్రీలకు సంభందించింనంత వరకు అతడికి రాముడనే ముద్ర వేశారు. 'మరి ఈ పరీక్ష తనకేమిటీ?.  "ఇంతవరకు కట్టుకున్నదాన్ని మినహా ఏ స్త్రీని ఇంత గాఢంగా ఇష్టపడట్లేదు. మధ్యానపు సూర్య కిరణం అమృత కళ్ళల్లో చురుక్కుమంది. రంగనాయకులకేసి తీక్షణంగా చూసింది. ఆ తీక్షణతని అతడు కొద్దిసేపు అనుభవించాడు. అమృత చూపు తిప్పుకుంది. "నా కోరికలో కేవలం వాంఛ మాత్రమే ఉందనుకుంటే పొరపాటే. ఓ గొప్ప సౌందర్యం నా సొంతం అని అందరూ అనుకుంటుంటే నాకు తృప్తి. ఆడది ఒంటరిగా ఉంటే అందరూ అందుబాటులోదే అనుకుంటారు. ఓ మనిషికి దత్తతయినప్పుడు ఆ తీరు వేరు. చెప్పుకుపోతున్నాడు రంగనాయకులు అమృతకేసి ఆశగా , ఆరాధనగా చూస్తూ ఆ మాటలు వినలేక ఆమె శరీరం కంపించింది. అతడి తీరు భరించలేక చకచకా అక్కడి నుంచి వెళ్ళిపోయింది.

ఆ రోజు శ్రీను సహధ్యాయ శంకరం అమ్మా నాన్నలు వచ్చారన్న వార్త సమితి మొత్తం గుప్పుమంది. ప్రార్ధన చేస్తున్న పిల్లలందరూ అది ఆపేసి ఒక్కసారిగా బయటకు పరుగెత్తారు. నన్ను వదిలి ఎక్కడికి పోయారమ్మ! శంకరం తల్లిదండ్రుల్ని కావలించుకొని ఏడుస్తున్నాడు. శ్రీనుకూ ఏడుపు వచ్చింది. తల్లి గుర్తుకొచ్చింది. అరక్షణం కనిపించకపోతే శ్రీనూ అంటూ కలవరించే అమ్మ ఏదీ? ఎక్కడుందీ? శ్రీను కళ్ళు నీటి చెలమలయి బుగ్గల మీదుగా జారిపోయాయి. రామసీత శ్రీను కళ్లు తుడచి తన దగ్గరకు తీసుకుంది. అమ్మా, నాన్న వచ్చారు. మిమల్ని వదిలి వెళ్ళాలంటే దిగులుగానే ఉందిరా శ్రీను. అయినా వెళ్ళిపోతాను. "ఒకింత గర్వంగా చూస్తూ అన్నాడు శంకరం." తట్టుకోలేక శంకరాన్ని కావలించుకున్నాడు శ్రీను. "మా అమ్మ కూడా తప్పకుండా వస్తుంది. నేను వెళ్తాను" అమాయకంగా అన్న శ్రీను మాటల్లో నమ్మకం, గొంతులో దృఢ విశ్వాసం. వాణ్ణి సముదాయించడం రోజురోజుకి కష్టమవుతుంది రామసీతకు. శ్రీను తల్లిని నెమ్మదిగా మర్చిపోతాడులే అనుకునేదామె. కాని అలాజరగడంలేదు. అతడు ఎప్పుడూ అమ్మకోసం కలవరిస్తాడు. తన అమ్మే ఈ లోకానికి అమ్మ అనేలా మాట్లాడతాడు. ప్రతీసారి అతడి ఆవేదన చూసి చలించిపోతుంది రామసీత.

అంత చిన్న వయసులోనే వాడిలో ఎంత  ఎడ్మిరేషన్ అని అనుకునేదామె. ఒకరోజు "ఎవరైనా మంచి ఆడపిల్ల ఉంటే దత్తత తీసుకుందామనుకుంటున్నాం"  అంటూ వచ్చింది ఒకావిడ. ఆవిడ పేరు జాహ్నవి. "దానికేం మేడం మీరు అడగాలేగాని కాదనడానికి ఏముంది!" నవ్వుతూ అంది రామసీత. రామకృష్ణ సేవా సదనంలో అనాధలను పిల్లల లేని దంపతులు తీసుకెళ్ళి పెంచుకోవడం పొరపాటే. ఆ సదనంలో పిల్లలను మంచి క్రమశిక్షణ, విద్యా బుద్దులతో పెంచుతారని అందరి నమ్మకం. అందుకే ఆ సేవాసదనం నుండి బుద్ధిమంతులైన ఆడపిల్లలను దత్తత తీసుకోవాలని ఆమె ఆకాంక్ష. "అక్కడున్న పిల్లల్ని చూసి ఈ పిల్లవాణ్ణి తీసుకెళ్ళి పెంచుకుంటే మీకు అభ్యంతరమా! శ్రీనూను చూపిస్తూ అంది జాహ్నవి. "మరి మీరు ఆడపిల్ల కావాలన్నారు" అర్ధంగాక ప్రశ్నించింది రామసీత. "హీ ఈజ్ సో క్యూట్" అంది ముద్దుగా శ్రీనూను దగ్గరకు తీసుకుంటూ. "అయితే ఆ పిల్లవాణ్ణే అడిగి చూడండి". "మా యింటికి వెళ్దాం వస్తావా బాబు? ఎప్పుడూ అక్కడే ఉండిపోవచ్చు నువ్వు" వాడి చుబుకాన్ని పట్టుకుని ప్రేమగా అడిగింది. "మా అమ్మ వస్తుంది నేను రాను"  "నేను మీ అమ్మలా లేనా"! బ్యాగులోని లిటిల్ హార్ట్స్ బిస్కెట్ ప్యాకెట్ తీసి శ్రీనుకిస్తూ అంది జాహ్నవి. "మా అమ్మలా ఎవరూ ఉండరు". అంత బాగుంటుందా?".  "ఓ" ఎప్పుడూ తన జేబులోనే దాచుకొనే ఆ ఫోటో చూపించాడు శ్రీను. ఆ ఫోటో నలిగిపోయి ఉంది. అయినా అందులోని మనిషి బాగానే కనబడుతోoది. "నిజమే ఎంత బాగుందో" అనుకుంది జాహ్నవి. ఎంత నచ్చజెప్పడానికి ప్రయత్నించినా శ్రీను ఆమె వెంట వెళ్ళనన్నాడు.

"ఏమిటా ఆలోచన?" సిమెంటుని కాంక్రీట్ మిక్సర్లో వేస్తూ అడిగింది భానుమతి. "నా శ్రీను నాకు దొరుకుతాడంటావా భాను!" హౌస్ పైప్ తో నీళ్ళు పడుతూ అంది అమృత. "ఏమిటా పిచ్చి అమృతా! అంత పెద్ద ఉప్పెన తరువాత చెట్టంత మనుష్యులే రాలిపోతే, ఇక పిల్లపిందలెక్కడ మిగులుతాయి. గుండె దిటవు చేసుకుని శ్రీనూను గుర్తురాగానే మిగుల్చుకో "జాలి నిండిన సర్వంతో పలికింది భానుమతి. పల్చటి వెన్నెల. ఓ చెట్టు నీడన భానుమతి, అమృత, వారికి కొంత దూరంలో అప్పటి వరకు పనిజేసి, అలసటపడుతున్న ఆడవాళ్ళు కొందరు. అవును గుండె దిటువు చేసుకోవాలి తనతో హైదరాబాద్ వచ్చిన భానుమతి ఆరు నెలల్లో అన్నీ మరచిపోగలిగింది. ఇప్పుడు, ఏమీ జరగని మామూలు మనిషిలానే ఉంది. కానీ తనే ఆరు సంవత్సరాలు దాటుతున్నా . . . భ్రమ కానీ, అంత ఉప్పెన ముంచెత్తిన తర్వాత మనిషి బట్ట కలడా? అమ్మా!అమ్మా! అని అరిగిపోని గ్రాముఫోను రికార్డులా శ్రీనూ పిలుపు, పనికి చేతులకు కాళ్లకు అడ్డం పడుతూ . . . తనకు విసుగు . . . అయినా ఎంత మురిపెం. "రంగనాయకుల్ని ఏం చేశావ్? అమృతా!" ఉన్నట్టుండి అడిగింది భానుమతి.

"ఏం చేయడమేంటి?" విసుగ్గా అంది అమృత. "నేనిలా అంటున్నానని తప్పుగా అనుకోకు. వయస్సులో ఉన్న స్త్రీని చూసి లోకం వెంటపడుతుంది. అదీ మొగుణ్ణి పోగొట్టుకున్న నీలాంటి అందమైన ఆడదైతే మరీను. నీ వయస్సుకి, అందానికి, కాపలాగ ఓతోడు అవసరమనుకుంటాను. అప్పుడే నీకంటూ ఒక రక్షణ . . . " చెప్పుకుపోతోంది భానుమతి. అదోలా, ఆమె కళ్లలోకి సూటిగా చూసింది అమృత. "అమృతా! ఈ కూలిపన్లు, ఈ కాయకష్టం నీవల్ల కాదు. సుఖంగా నీడ పట్టున బతుకు వెళ్ళదీయవలసినదానవు. పెళ్ళాం పిల్లలు ఉన్నారన్న మాటేగాని రంగనాయకులు నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటాడు!". నా బతుక్కి అర్థం కనిపించడం లేదు. అలాంటప్పుడు ఈ శరీరానికి రంగులు, మెరుపులు, పోషణ అవసరం అంటావా?" అంది అమృత.

ఫోను రింగవుతున్న శబ్ధం వినిపిస్తోంది. ఆఫీసులో ఎవరూ ఉన్నట్టు లేదు. ఫోను తీస్తున్న జాడ కనిపించడం లేదు. చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి లేచి పక్క గదిలోకి వెళ్ళి అందుకొంది రామసీత. "హలో! రామకృష్ణ సేవా సదనమా!" అవునండీ! మీరెవరు !" నేను జాహ్నవి విశ్వనాధం. కొద్ది రోజులక్రితం ఆడపిల్లను దత్తత చేసుకుందామని వచ్చాను. మీ దగ్గరుండే శ్రీనూని చూసి మనసు మార్చుకున్నాను. పిల్లవాడు ఒప్పుకోలేదు!".  "ఓహొ మీరా! మీకు ఏ విధంగాను సహాయపడలేక పోతున్నా" రామసీత మాటలకు నవ్వింది జాహ్నవి. "మీ సాయం గాదండి! నేనే మీకు సాయపడదామని ఫోను  చేస్తున్నాను".  "ద్యాంక్యూ మేడం! మీ సాయాన్ని ఆహ్వానిస్తున్నాం చెప్పండి."  "శ్రీనూ మదర్‌ని చూశాను."  "నిజంగా!...ఎక్కడ, ఎలా" అడ్రసు రాసుకోండి . . . "అని అడ్రసు చెప్పింది జాహ్నవి. అద్దంలో కనిపిస్తున్న ప్రతిబింబం తనదేనా అని విస్మయంగా చూసుకుంటూ కూర్చుండి పోయింది అమృత.

ఒంటికి నిగారింపు . . . మొహంలో మెరుపు, తను అసలు పాత అమృతేనా! రంగనాయకులు రంగప్రవేశం చేసిన తరువాత తన జాతకమే మారిపోయింది. ఒకనాడు అమ్మడూ అంటూ చొరవ తీసుకునే వాళ్లకి ఇప్పుడు అమ్మగారు అయిపోయింది తను అనుకుని నవ్వుకుంది అమృతా. "భానుమతి గారటమ్మా! మిమ్మల్ని చూడాలని వచ్చారు.  పంపించమంటారా?" అద్దంలో ఖరీదైన ఆ ప్రతిబింబం తనదేనా? అని విస్మయంగా చూసుకుంటున్న అమృత పని మనిషి పిలుపుతో ఉలిక్కిపడింది. లోపలికి పంపమని పని మనిషికి చెప్పిన అమృత తనే ఎదురెళ్ళి భానుమతిని సాదరంగా లోపలికి పిలిచింది. "భానూ! నీకు కూడా అమ్మగారినేనా? నేను నీకెప్పుడు పాత అమృతనే! మనసులో నాకు నేను ఉత్త అమృతనే!! రంగనాయకులు పనిమనిషిని కాను". స్థితి పరంగా ప్రస్తుతం ఎంతో ఎత్తులో ఉన్న అమృత తనతో ఇప్పటికీ అంతే చనువుగా, సన్నిహితంగా ఉండడం భానుమతికి ఆనందం కలిగించింది. అదే సమయంలో ఎందుకో కొద్దిగా  బాధగా కూడా అనిపించింది. "నిజమే అమృతా ! నీ కళ్లలో దిగులు నువ్వింకా పాత అమృతవనే చెప్తోంది. ఆ దిగులు . . . "భానుమతి మాటలు పూర్తి కాకుండానే. ఎవరో సేవాసదనం నుంచి మిమ్మల్ని చూడాలని వచ్చారమ్మా! పని మనిషి మళ్ళీవచ్చి చెప్పింది.

"సేవా సదనం నుంచా?" తనలో తాను అనుకుంటూ ఆశ్చర్యపోయింది అమృత. భానుమతి వైపు ఎవరై ఉంటారంటావ్ అన్నట్లు చూసింది. ఏమో అన్నట్లు  భానుమతి పెదవి విరిచి "చూద్దాం పద"  అంటూ గదిలోంచి బయటకు నడిచింది. ప్రధాన ద్వారం వద్ద ఓ పదకొండేళ్ళ పిల్లాడు ఆ పిల్లాడి చేయి పట్టుకుని ఓ మహిళా నిలుచుని ఉన్నారు. పిల్లాడు అటూ ఇటూ ఆశ్చర్యం కలియజూస్తున్నాడు. ఇంటి ఆవరణంలో చక్కటి లాను, పూలతోట, దారికి ఇరువైపులా క్రోటన్స్  పూల మొక్కలు. ఆవరణలో అక్కడక్కడా పళ్ళ చెట్లూ - పెద్ద ఇల్లు అందమైన డిజైను చెక్కి ఉన్న పెద్ద ద్వారం - అన్నిటినీ కళ్ళప్పగించి చూస్తున్నాడు వాడు. వాడు ఆశ్చర్యం నుంచి తేరుకోలేక పోతున్నాడు. మా అమ్మ! ఇక్కడ ఉండటమేమిటి!" అనే ప్రశ్నకు ఆ చిన్ని మనసులో సమాధానం దొరకటం లేదు. ఎండ, వెన్నెల లోపలికి తొంగి చూసే ఇల్లు. అందులో అమ్మ . . . మరి ఇదేమిటి. ఇంత పెద్ద ఇల్లు ...ఏవేవో తనెప్పుడూ చూడని వస్తువులు, పరిసరాలు . . . " వాడి మనసు ఒప్పుకోవడం లేదు. అమ్మ ఇక్కడుండదు. ఇదెవరిల్లో అనుకుంటున్నాడు. ఆ ఊహ మనసులో మెదలగానే వాడి ముఖం ముడుచుకుపోయింది. తన చేయిని పట్టుకున్న రామసీత చేతిలో వాడి చెయ్యి అప్రయత్నంగా బిగుసుకుంది. లోపలి గదిలోంచి హాల్లోకి వచ్చారు భానుమతి, అమృత. అమృత అడుగు ముందుకు వెయ్యబోయి ఆగిపోయింది. ఆమెకళ్ళు  విస్మయంతో పెద్దవయ్యాయి. ఒక్క నిముషం తలుపు దగ్గర ఉన్న పిల్లాడి మీద ఆమె చూపు స్థిరంగా నిలిచిపోయింది. భానూ! అంటూ భానుమతి చేతుల్ని గట్టిగా పిడికిలి బిగించి పట్టుకుంది అమృత.

శ్రీను...నా కొడుకు శ్రీను . . . భానుమతీ!" భానుమతీ పిలుపును, తననుందుకోబోయిన భానుమతి చేతిని వినిపించుకోకుండా విదిల్చుకుని పరుగుతీసింది అమృత. అప్పటికే శ్రీను ఊహలు ఎక్కడో తిరుగాడుతున్నాయి. అమ్మ అన్న ఆశతో వచ్చాడు. కానీ తమది కాని ఇంటి వాతావరణం వాడిని నిరాశతో ముంచేసింది. నెమ్మదిగా తానే చొరవ తీసుకుని అడుగులు ముందుకు కదిపింది రామసీత నమస్తే. నా పేరు రామసీత. రామకృష్ణ సేవా సదన్‌లో పని చేస్తుంటాను. అమృత ఆమె మాటలు విన్నది కానీ ప్రతి నమస్కారం చేయలేదు. ఆవిడ వైపు ఓసారి చూసి, మళ్ళీ ఆమె పక్కనున్న పిల్లాణ్ణి చూస్తుండిపోయింది. మీ బాబు శ్రీను అంటూ వాడి భుజం మీద చెయ్యేసి ముందుకు వెళ్ళమన్నట్లు వాడికి సైగ చేసింది శ్రీను . . . తల్లినే సర్వస్వం అనుకున్న శ్రీను. అమ్మ కావాలంటూ ఇన్నేళ్ళుగా కలవరిస్తూనే ఉన్నాడని" అని ఇన్నాళ్ళుగా వాడు పడ్డ ఆవేదన, ఆరాటం, తపన . . . ఒక్కొకటిగా వివరించి చెప్పింది రామసీత. ఆ మాటలు వింటుంటే అమృత గొంతు బొంగురుపోతుoది. షెల్ఫ్‌కున్న అద్దంలో తన ప్రతిబింబం కనిపిస్తుంది అమృతకు!

తన ఒంటి నునుపు . . . ముఖంలో మెరుపు...రంగనాయకుల వంటి పరగతి గలిగిన మనిషితో సాంగత్యం. ఇన్ని సంవత్సరాలుగా తన ఒంటరి బ్రతుకులో సంభవించిన పెనుమార్పులు ఒక్కొక్కటి..అన్నీ కలిసి హృదయాన్ని ఒక్కసారిగా ఆక్రమించి అతలాకుతలం జేస్తున్నాయామెను. ఎదురుగా చేతికందేంత దూరంలో కన్న కొడుకు. ఇన్నేళ్ళుగా . . . ఇప్పటికీ తను ఎవరికోసం అలమటిస్తోందో ఆ కన్నకొడుకు. బాబూ! అంటూ ముందుకు దూకాలనుంది అమృతకు. కానీ అంతలోనే ఏదో అపరాధ భావన. వాణ్ణి తను దూరం చేసుక్కున్న భావన. వాడికి అమ్మను దూరం చేసిన భావన కట్టి పడేస్తోంది. అక్కున జేర్చుకుని ఇన్నాళ్లుగా తనలో నిక్షిప్తమై ఉన్న మాతృత్వపు మమకారంతో ముంచెత్తాలనుంది ఆమెకు. కానీ తను అప్పటి అమృత కాదు, ఇప్పుడు తన బాబుకు తెలిసిన తల్లికాదు . . . మనసు మూగగా రోధిస్తోంది.

శ్రీను తల్లి వంకే చూస్తున్నాడు. తెలిసినట్లే ఉంది. తన తల్లి లానే ఉంది. కాని మనిషి ఇలా ఉందేమిటీ? అసలు అమ్మ మారిపోతుందా?  అమ్మే . . . అమ్మే . . . ఉహూ కాదు . . . అచ్చం అమ్మలానే ఉన్నట్లుంది. కాని అమ్మ కాదు . . . కాదు. తెలిసీ తెలియని వాడు పసిమనసులో ఎన్నో ప్రశ్నలు... సందేహాలు . . . సుడులు తిరుగుతున్నాయి. 'ఉహూ అమ్మలా లేదు . . . ముమ్మాటికీ అమ్మ కాదు' అనుకున్నాడు చివరగా. "శ్రీనూని మీకు అప్పగించి పోవాలని వచ్చాను". రామసీత మాటలు ఇటు అమృతకు, అటు భానుమతికి  అమితానందం కల్గించాయి. కాని ఏదో దిగులు . . . అధైర్యం. అమృతను పట్టిలాగేస్తున్నాయి. హరించుకుపోతున్న ధైర్యాన్ని గొంతులో పోగుచేసుకొని పలికింది అమృత. "మీరు అనుకున్న అమృత ఇక్కడ లేదు . . . బహుశా పొరబడి వచ్చి ఉంటారు". వారించబోయింది భానుమతి. కానీ తన చేతుల చుట్టూ బిగుసుకున్న అమృత చేతులు భానుమతిని ఇక ముందుకు సాగనివ్వలేదు. రామసీత అమృతను తేరిపార చూసింది ఆపాదమస్తకమూ. "మీరు అమృత కాదా? " ఆమె స్వరంలో ఓకింత ఆశ్చర్యం. "కాదు" దృడంగా ఉంది అమృత సర్వం. "మీరు పొరబడ్డారు. నాకు అసలు పిల్లలే లేరు". అమృత మాటలు రామసీతకు విచిత్రమనిపించాయి. "మీరెందుకో కావాలనీ అలా. ఆమె మాటలకు అడ్డుపడుతూ చూడండి, నాకూ కొడుకంటూ ఉండాలని అనుకుంటున్నాను. కానీ నా కొడుకు కాని వాణ్ణి దగ్గరకు తీసుకోలేను. మీరు వెళ్ళొచ్చు అనేసి లోపలికి వెళ్ళిపోయింది.

శ్రీనూకి ఆ మాటలు అర్ధం కాక రామసీత వంక చూశాడు. ఆమె శ్రీనును చూసి వాడి తల నిమిరి దగ్గరకు తీసుకుని లోపలికి వెళ్ళిపోతున్న అమృతను చూస్తుండిపోయింది. రెండు నిమిషాల తర్వాత శ్రీను వంక చూస్తూ "పద శ్రీను వెళ్ళిపోదాం. నీకిక అమ్మ లేదు. మీ అమ్మ ఎప్పటికీ దొరకదు". అని వెనుదిరిగింది, వాడి చేయి పట్టుకుని. శ్రీను హాలంతా ఒకసారి కలియచూశాడు. అక్కడే నిలుచుని ఉన్న భానుమతి వంక చూశాడు తర్వాత తల దించుకుని రామసీతను అనుసరించాడు. "అమ్మ ఇక దొరకదా?" నడుస్తూ వాడు బిక్కమొహంతో, ఏడుపు స్వరంతో రామసీతను అడగడం లోపలి గదిలో ఉన్న అమృతకు వినిపించింది. అమృత కళ్ళు నీటి చెలమలై పారుతున్నాయి. అవును అమ్మ పట్ల . . . అమ్మతనం పట్ల  ఓ అద్భుతమైన సజీవ శిల్పాన్ని నిర్మించుకున్నాడు శ్రీను. కాని ఆ శిల్ప సౌందర్యం వెనుక దాగి ఉన్న ఈ నీలినీడల స్త్రీమూర్తి. తన వాస్తవిక అనుభూతులకు ఆలంబన కాదు అని గ్రహిస్తే...తట్టుకోగలడా!

ఆ ఊహలు, ఉద్దేశాలు మధురంగా, చిరంజీవిగా నిరంతరం వాడిలో ఉండిపోవాలి! ఈ వాస్తవిక పరిస్థితిలో ఆకాశానంటుతున్న వాడి ఊహల హారివిల్లును చిన్నాభిన్నం చేయడం . . . అమ్మపట్ల వాడు కటుకున్న అనురాగసౌధాన్ని కూల్చేయడం ఇష్టంలేదు. చెప్పుకుపోతుంది అమృత. ఎంత దిటవు చేసుకుందామనుకున్నా అమృత మాతృహృదయం. దూరన గర్జిస్తున్న సముద్రం . . . అక్కడ ఏదో అయిపోయిన భావన . . . కాలు కింద పెట్టేసరికి సుడిలోకి లాగేస్తున్న నీళ్ళు . . . చీకటి శూన్యంలో చేతుల్ని ఆధారం కోసం విసిరి . . . శ్రీనూ అని కేక వేయడం . . . ఆనాటి ఉప్పెన ఈనాటి అమృతలో! దూరంగా రామసీత చీర కుచ్చెళ్లలో వెక్కుతూ నడుస్తున్న శ్రీను, వాణ్ణి పొదివి పట్టుకుని అడుగులేస్తున్న రామసీత. నడుస్తున్నదల్లా ఆగిపోయి భుజంమీదుగా తల వెనక్కి తిప్పి చూసింది. ఆ చూపులో లోపలి మనుష్యుల్ని చీరేసే ఎన్నో భావాలు, ప్రశ్నార్ధకాలు!

మూలం: మనసు మూలాల్లోకి........


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 01-10-2008 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in