www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

నింగినీడలు

'అది  అంతే'  ఒకింత స్వరాన్ని పెంచుతూ అన్నాడు కమలాకరం. సిరిమల్లికి మొదట్లో అర్ధం కాలేదు. చూస్తుంటే అసలు ఆ మనిషే అర్ధం కాకుండా ఉన్నాడు.

'నా చేతిలో ఏముంది చెప్పండి. అన్నింటికీ ఆ పైవాడి మీద భారం వేయడం తప్ప'

'భారాలు, తులాభారాలు సరే, అసలు ఎవరి భారాలు వారికి ఉంటాయ్ కమలాకరం మాటల్లో ఒకింత అసహనం కనిపిస్తోంది.

'దానికి నేను చేసేదేముంది' ఎడం వైపు ఒత్తిగిల్లుతూ అంది సిరిమల్లి.

'ఇవిగో బలానికి ఇంజక్షన్లు, టానిక్‌లు. ఈ పళ్ళు తీసుకుంటే కడుపులో బేబీగ్రోత్ బాగుంటుంది. ఆరోగ్యం బాగా చూసుకోవలసిన భాద్యత నీదే! బ్యాగ్‌ని ప్రక్కనే ఉన్న టీపాయ్ మీద పెడుతూ అంది దాక్షిణ్య.

సిరిమల్లె వాటి వైపు చూసుకుంది. కొంతకాలమైనా తనను గురించి పట్టించుకునే మనుషులు. కానీ అదే మనుషుల్లో కొంత స్వార్థం, అవసరం తాలూకు ఉద్దేశాలు. వారంతా గత తొమ్మిది మాసాలుగా అంతకు ముందు కొన్నినెలలుగా తన ఇంటిచుట్టూ, తన పేదరికం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.

వాళ్ళ అవసరం వారిది... తన అవసరం తనది.

'ఇదిగో మల్లీ ఖర్చులు క్రింద ఈ ఐదువేలూ ఉంచు. మళ్ళీ కానుపు నాటికి కనిపిస్తాము. ఇప్పుడున్న ఆయా ముసల్ది. కావాలంటే రెండు వందలు ఎక్కువ పడేసి కనిపెట్టుకుని ఉండే పనిమనిషిని చూసుకో. 

మనసులోనే నవ్వుకుంది సిరిమల్లి. అసలు తనదే ఓ పనిమనిషి బ్రతుకు. రెక్కాడినపుడే డొక్కాడటం తమకు తెలుసు. అటువంటి తమకు పనులు చేసిపెట్టడానికి మరో పనిమనిషి. గత కొన్ని నెలలుగా ఈ భోగాన్ని అనుభవిస్తూనే ఉంది సిరిమల్లి.

'అమ్మాయికి ఐదు వేలు ఇచ్చాను. జాగ్రత్తగా చూసుకోండి. డాక్టరు సదాశివంతో కూడా మాట చెప్పి ఉంచాను కానుపునాటికి మేమిద్దరం గాని... కనీసం దాక్షిణ్య గాని వస్తుంది. బ్యాగ్ సర్దుకుంటూ అంటున్నాడు కమలాకరం.

'డాక్టరు బాబుని మరోమారు హెచ్చరించి వెళ్ళయ్యా, ఇంజక్షను చేయడానికి నర్సమ్మలు భలే 'ఇది' చూపిస్తున్నారు. టేబుల్ మీద పెట్టిన యాపిల్స్‌ని సరిచూసుకుoటూ అంటోంది నాగరత్నం.

'కావాలంటే ఓ యాభై వాళ్ళ ముఖాన కొట్టండి. ఎక్కడా తేడా రాకూడదు', కారు వెనుక డోరు మూస్తూ అంది దాక్షిణ్య.

కారు ముందుకు సాగిపోయింది. అందులోని కమలాకరం, దాక్షిణ్య ముందుకు కదిలిపోయారు.

సిరిమల్లిలో ఓ నిశ్చింత... మరో వైపు ఏదో అనిశ్చితి.

తనకడుపు వైపు చూసుకుంది. నిండుగా ఉంది. సంపూర్ణ పున్నమిలా ఉంది. మరో నెల రోజుల కానుపు తరువాత మళ్ళీ తనూ... తన కొరగాని బ్రతుకు. ఆమె గుండెలోతుల్లోని సముద్రాలు... గిరులు.. ధరులు అన్నీ ఒక్క పెట్టున ఘోషిస్తున్నాయి. పరకాయ ప్రవేశం చేసినట్లు వ్యక్తిత్వం సన్నగిల్లి తనదిగాని ఓ బ్రతుకులా ముందుకు సాగుతూ వేస్తున్న ప్రతీ అడుగు ప్రామాణిక లేమితో అతలాకుతలం అవుతున్నట్లుంది.

చేతులు అప్రయత్నంగా పొట్టను తడుముకున్నాయి. పరాధారమై పూర్ణం కూరిన కజ్జికాయలా ఉంది. కిటికీ లోంచి బయటి ఆకాశం కనిపిస్తోంది. ఓ విలక్షణమైన  భావవైరుధ్యం... పేదరాశి పెద్దమ్మ నూలు వడుకుతున్నట్టుగా తెల్లనిమబ్బులు ముద్దముద్దలుగా పోగులు పెడుతున్నాయి.

'వెచ్చాలు నిండుకున్నాయి. పేరయ్య గుప్త కిరాణాకి ఆరొందలు కట్టాలి.' కూతురు ముఖంలోకి చూడలేక చూస్తూ అంది నాగరత్నం.

'పాలోడికి రెండొందలు కూడ ఇచ్చేస్తే సరి!' తలదిండు క్రిందన్న ఏభైరూపాయిల కట్టను తల్లికి అందిస్తూ అంది సిరిమల్లి.

పేదరికం పేరుతో సికరాజు నిర్ధయగా తనను ఒదిలి ఎక్కడికో పారిపోయాడు. అపుడు బ్రతుకు చుక్కాని లేని నావగా మారినప్పుడు ఉన్న కన్నతల్లికి తాను బరువై జీవితాన్ని మనగల్గుతున్నప్పుడు సిరిమల్లికి తాను చేస్తున్న ఈ పని తప్పుగా అనిపించడం లేదు.

తన ఆ నిర్ణయంలో కొండంత మనోనిబ్బరం కనిపిస్తోంది. చాలా మంది దిగువ మధ్యతరగతి మహిళల్లా పేదరికం అవసరాలు అనే నేపధ్యం ఆమెను 'అద్దె అమ్మ'గా మార్చాయి. సాంకేతికంగా, ఎంతగానో ముందుకు పోతున్న సమాజంలో అమ్మల ఔట్ సోర్సింగ్ జాబితాలో తానూ చేరిపోయింది.

మొదటలో ఇదో వ్యాపారమనుకున్నా, మానవవనరులతో బాటు మాతృత్వమూ కారుచవక అనుకున్నా అమ్మతనం నిరంతరం అమ్ముడుపోతూనే ఉంది. తద్వారా కొనడానికి కొందరు సంతాన యాత్రికులు పోటీలు పడుతూనే ఉన్నారు.

ఆనాడు తను నివసించే మురికివాడ మొదట్లో ఉన్న మేడ డాక్టరు సదాశివం మాటలు గుర్తుకువచ్చాయి సిరిమల్లికి.

'చూడమ్మాయ్ మీ సంగతి నాకు తెలుసు. మంచి పిల్లవి. కమలాకరం అని పట్టణంలో పేరు మోసిన గ్రానైట్ వ్యాపారి. ఆయన భార్య దాక్షిణ్య. వారికి బోలెడంత స్థితి ఉంది. కానీ ఆమెకు సంతానయోగం లేదు. ఇంకా చెప్పాలంటే దాక్షిణ్యకు గర్భసంచి లేదు. ఆయనకు పిల్లలు కావాలి. నా దగ్గర సలహాకి వస్తే నిన్ను సజెస్ట్ చేశాను. నువ్వా వయసులో ఉన్న దానివి. కష్టాల్ని మోయగల్గిన సమర్ధురాలివి.

ఆ దంపతులు సంతానం కోసం తపిస్తున్నారు. నీ కష్టాల్ని ఉంచుకోరు.' మొదట్లో విషయం అర్థం కాలేదు సిరిమల్లికి. అంతా విడమర్చి అర్థం అయ్యేలా చెప్పాడాయన. అమ్మతనాన్ని కొనడానికి సంతాన యాత్రికులు ఉంటారని వారి వారి అవసరాలకు వారధిలా వైద్యశాస్త్రం చేయూతనిస్తుందని సదాశివం మాటల ద్వారా అర్థమయ్యింది. ఆమెకు ఆలోచిస్తే డాక్టరుగారి మాటలు సహేతుకంగానే అనిపించాయి.

బాధల మేఘాలలో కప్పబడిన ఆమె మనోవీధిలో మిణుకుమనే భావనక్షత్రం ఒకటి మెరిసి మాయమైనట్లుంది. ఆ ఆవేదనే ఆనందం కన్నా గొప్పదీ, సుందరమైనదీ. ఎందుకంటే అది ఎప్పుడూ ప్రియతముల వల్లే కలుగుతుంది.

భర్త వీర్యకణాన్ని, అతని భార్య అండాన్నీ ఓ గాజునాళికలో ఫలదీకరించి ఆ పిండాన్ని మరో గర్భాశయంలో ప్రవేశపెట్టి తొమ్మిది నెలలు పెంచడం తన చుట్టూ ఉన్న సాంప్రదాయమనే గీతల్ని చెరిపేయడం లాంటిదే! ఈ ప్రతిసృష్టి ఎంతవరకు సహేతుకమన్న ప్రశ్నకు సిరిమల్లి దగ్గరే సమాధానముంది. తన దగ్గర పేదరికముంది, సమాజాన్ని ఎదిరించి నిలబడదగ్గ మనోధైర్యముంది, బ్రతుకు పట్ల విశ్వాసముంది. అన్నింటికీ మించి బయట డాక్టర్ల దగ్గర మంచి వైద్యశాస్త్రం ఉంది.

చివరికి మరొకరి బిడ్డను తన కడుపులో మోయడం తప్పేం కాదని ఆ క్షణాన సిరిమల్లి గట్టిగానే నిర్ణయించుకుంది. నాగరత్నం మొదట్లో ససేమిరా అన్నా చివరకు మెత్తబడక తప్పలేదు. క్రమేపీ కాలే కడుపు నవమాసాల నయా వ్యాపారానికి సై అంది. తమ జీవితం నవ్వులాట కాకూడదంటే సమాజం నవ్వే నవుల్ని బలవంతాన భరించక తప్పడం లేదు. వైద్యం గురించి తెలియనివాళ్ళు తాను ఎవరి ప్రక్కనో పడకొని శిశువుకు జన్మనిస్తోందన్న గాలి మాటలు సిరిమల్లి చెవిని పడుతూనే ఉన్నాయి. 

కానీ ఆమెలోని దృడమైన వ్యక్తిత్వం ముందర అన్నీ దూదిపింజల్లా చెదిరిపోతున్నాయి.

'ఈ యాపిల్ తీస్కోవే! వేళకు తిండి తినకబోతే ముప్పువస్తాది నాగరత్నం నిలేస్తోంది.  కమలాకరం వెళుతూ చేసిన హెచ్చరికలు సిరిమల్లికి పదే పదే గుర్తుకువస్తున్నాయి. ఓవైపు ఉడుకు మోత్తనం తన్నుకొస్తోంది.

ఆయనగారి షరతులు మనకేటి చెప్పు! మన సొమ్ము మనకి పడేస్తాడు. వాడి బిడ్డను వాడు తీసుకుపోతాడు. నాగరత్నం చాలా తేలిగ్గా అనేసింది. కూతుర్ని సముదాయించాలన్న ప్రయత్నం కనిపిస్తోంది ఆమెలో. కానీ అతగాడి మెలిక మాటలు సిరిమల్లికి ఉక్రోషాన్నీ తెప్పిస్తున్నాయి.

'అవునమ్మాయ్! గర్భం ధరించగానే నీ భాద్యత తీరిపోలేదు. పదినెలలు మోయాలి. చక్కగా కనాలి. తర్వాత...'

మొదట్లో ఆ మాటలు వింతగా అనిపించసాగాయి. నెమ్మదిగా అతని సంకుచిత ధోరణి బయట పడుతోంది.

అదే నువ్వు ఎలాగైనా సరే పండంటి బిడ్డను కకనివ్వాల్సిందే! 

"అంటే" నిర్వేదనగా చూసింది సిరిమల్లి.

'కూరల మార్కెట్లో నేనెపుడూ తాజా వంకాయల్నే ఏరుకుంటాను. పుచ్చువంకాయలు కనబడితే ఏరి ప్రక్కన పడేస్తాను.

'..............'

'చక్కని పండంటి బిడ్డను కనివాల్సిన భాద్యత నీది! మీ దరిద్రపు బ్రతుకుల్లోనే వాళ్ళకు అవకరాలన్నీ పుట్టుకొస్తాయి. పుట్టే శిశువుకు కాలూ, చేయీ,కన్నూ అన్నీ సక్రమంగా ఉంటేనే నేను అంగీకరించేది!'

'...............'

'చెప్పాగా నాకు నచ్చని వంకాయ అయినా, కడుపున కాసిన కాయ అయినా ఒక్కటిగానే చూస్తాను.' ఖచ్చితంగా అన్నాడు.

'అవును సిరిమల్లీ! మొన్నీ మధ్య ఇటువంటి వ్యవహారమే పేపర్లో చూశాం. సంతానం కోసం ఇంత డబ్బు పోస్తే చివరికి కాలువంకరోణ్ణి కనిపడేసింది ఓ మహాతల్లి. వాణ్ణి తీసుకెళ్ళక పోతే కుదరదని ఆ అమ్మాయి, తీసుకెళ్ళలేమని అవతలివాళ్ళు ఇద్దరూ వీధిన పడ్డారట. గుట్టుగా మర్యాదగా బ్రతుకుతున్న వాళ్ళం. అన్నివిధాల శిశువు ఆరోగ్యంగా ఉంటేనే మేము అంగీకరించేది. తేడా వస్తే కన్న ఆమెదే భాద్యత అంతా!

మనసు చివుక్కుమంది సిరిమల్లికి. ఎదురింటి పిట్టగోడ మీద గాలికి ఊగుతున్న సన్న జాజితీగ కేసి దృష్టి మళ్ళింది. అది స్వత్రంతంగా స్వేఛ్చగా ఒరుగుతున్న గోడని అల్లుకుని మధురోహాల సువాసనల్ని వెదజల్లుతోంది. డబ్బు అనే చట్రంలో బలవంతాన బంధింపబడి సృష్టి సూత్రానికి వ్యతిరేకమై ఒక అనుభవపు  అంపశయ్యపై... తానుగా... ఒంటరిగా...'  మూగరోదన ఆమె  ముఖంలో ప్రస్ఫుటమవుతోంది.

పుట్టిన శిశువు సరిగా ఒకవేళ పుట్టకపోతే వాళ్లకి ఏ విధంగానూ సంబంధం లేదట. నచ్చకపోతే నిర్ధాక్షిణ్యంగా వదిలిపోతారట. అసలు ఆ దుష్ట ఆలోచన వాళ్ళకు ఎలా వచ్చిందో? తన కడుపు టెస్ట్ ట్యూబ్ కాదు కాంట్రాక్టు గర్భం. అయినా నెలనెలా కడుపులో బిడ్డ పెరుగుతున్న కొద్దీ ఆమె మనసులో కొంత ప్రేమ పెల్లుబుకుతూనే ఉంది. తనకు తెలియకుండానే చేతిని కడుపుపై వేసుకుని ప్రేమగా నిమురుకుంది.

'అమ్మాయ్ మల్లీ! కమలాకరం గారితో ఒప్పందం నీకు మంచి  మలుపు అవుతుంది. నువ్వు పండంటి బిడ్డను ఇవ్వాలే గానీ ఆయన చేత యాభైకి యాభై  నీకు ముట్ట జెప్పిస్తాను. కమలాకరం మంచి బిజినెస్ మేగ్నెట్. డబ్బుకు కొదవలేదు.' మెడికల్ చెకప్ కని హాస్పటల్‌కి వెళ్ళినపుడు డాక్టర్ సదాశివం అన్న మాటలు ఆమెకు ఊరటను కల్గింపకబోగా కొంత ఉద్రేకాన్ని పెంచాయి.

'అయితే లక్షలు ఈయడానికి వెనకాడరన్న మాట!'

'అవునమ్మా దాక్షిణ్య సంతానం కోసం తపించిపోతోంది. అసలే కలవారి గారాలపట్టి.'

'పురిటిలో నాకు జరగరానిది ఏమైనా జరిగితే... నా కడుపులోని వారి సంతానానికి ఏమైనా అయితే....!'

నువ్వు అలాంటి ఆలోచనల్ని దరిచేరనీయకూడదు. హాయిగా ఉంటే అన్నీ సవ్యంగా జరిగితీరాయి.

మరి కమలాకరం గారికి వచ్చిన ఆలోచన ఏమిటి? పుట్టినవాడు సవ్యంగా లేకపోతే తమకు సంబంధంలేదట. ఆ శిశువు భాద్యత తర్వాత అంతానాదేనట!.

'సర్లేనమ్మా! అటువంటిదే జరిగితే వాడి పెంపకానికి మరో యాభైవేలు ఇప్పిస్తానులే!! గమ్మునుండు.'

సిరిమల్లిలోని ఆడతనం కలుక్కుమంది. అంతా వ్యాపారం పెనవేసుకుపోయిన సమాజం. మనుషులు పైకి రంగుల్ని పులుముకుని సంకుచిత ధోరణులతో బ్రతికేస్తున్న మృగమానవులు. ఆర్థికంగా బలవంతుడు బలహీనులపై ప్రయోగిస్తున్న అణచివేత దృశ్యం కనిపిస్తోందామెకు. కళ్లలో నీళ్లు చిప్పిల్లి నాయ్.

కడుపులో బిడ్డ కదులుతున్నప్పుడు అల్లరి పిల్లాడమ్మ అంటూ మురిసిపోతోంది. కాళ్ళతో తన్నుతున్నప్పుడు కళ్ళు తన్మయత్వంతో అరమోడ్పులవుతున్నాయి.

తనకు సంబంధంలేని ఓ బీజం తనదై తన హృదయాన్ని, రక్తాన్ని కలిసి పెంచుకొని పెరుగుతూ....

నిజంగా ఆ అనుభవం దారుణంగా అనిపిస్తోంది సిరిమల్లికి. అంతలోనే హృదయం చిప్పిల్లి ఓ ప్రేమావేశం. తల్లి కాని తల్లిగా గుండెగదుల్లో నిద్రాణమైన మమకారం పెల్లుబుకుతోంది.

పెరిగే పసికందుతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిసినా... పుట్టి నేల మీద పడ్డ మరుక్షణం ఎవరో నిర్దయగా తనకు దూరంగా లాక్కుపోతారని తెలిసినా... ఆ సున్నిత క్షణాల సర్దుబాటు కోసం మనసును లక్షలసార్లు సర్ది చెప్పుకున్నా సిరిమల్లెలో ప్రేమ పరవశిస్తూనే ఉంది.

వ్యాపార సూత్రాన్ని తూచ తప్పకుండా పాటించే డాక్టరు సదాశివం... ఆయన హాస్పిటల్ సిబ్బంది. 'నీ కడుపులోని శిశువుతో నీకు ఎలాంటి సంబంధం లేదు. కనివ్వడం వరకే నీ భాద్యత.' అంటూ అనునిత్యం నూరిపోస్తూనే ఉన్నారు.

ఇంతకు ముందు ఎన్నడూ ఊహించని విధంగా నర్సులు తనను కాలు కదపనీయడం లేదు. సకలభోగాలు అనుభవింపజేస్తున్నారు. మంచి ఆహారం... మంచి వాతావరణం... టైముకి మందులు... అన్నిటికీ మించి కమలాకరం దగ్గర నుండి కొంచెం కొంచెం పైకం చేతికి అందుతూనే ఉంది.

కూతురు ద్వారా నాగరత్నానికి కూడా సదుపాయాలు బాగానే సమకూరుతున్నాయి. తన కూతురు శీలం చెడగొట్టుకున్నది గాదు. ఓ గొప్పింటి దంపతులకు వెలుగు చూపిస్తున్న త్యాగమూర్తి.

తమ ఇంటిలోకి ఖాళీ పోర్షనుని ఇతరులకు అద్దెకివ్వడం లేదా? తద్వారా నెలనెలా కొంత సంపాదించడం లేదా! అలాగే ఇదీనూ. కాకపోతే కూతురు తన గర్భాన్ని పదినెలలబాటు అద్దెకిచ్చిందంటే దీనిలో మానవ సంబంధాలు మృగ్యం అన్న ప్రశ్నే కనిపించడంలేదు ఆమెకు. అలా తమని తాము సమర్ధించుకుంటూనే ఉంది నాగరత్నం.

నువ్వు చాలా అదృష్టవంతురాలివమ్మాయ్! బంగారంలాంటి కొడుకును కన్నావ్. కుర్రాడు చక్కగా ఉన్నాడు. విషయం తెలిసి దాక్షిణ్య కమలాకరం ఎంతగా పొంగిపోతున్నారో! ఆమె తన కొడుకుని ఎప్పుడు చేతుల్లోకి తీసికుంటానా అంటూ తొందరపడిపోతుంది.

'...............'

'ఆయనగారు క్యాంపులో ఉన్నారట. పదిరోజుల్లో వచ్చి మిగతా ఇవ్వాల్సిన డబ్బు నీకు ఇచ్చేసి తీసుకెళ్ళేందుకు వస్తామన్నారు.'  చెప్పుకు పోతున్నాడు డాక్టర్ సదాశివం.

".............."

'నీ వల్ల మా హాస్పటల్‌కి కూడా ఎంతో కొంత పేరు వచ్చినట్లయింది.' నోటి మాట కరువయింది సిరిమల్లికి.

ప్రక్కలోని శిశువు గుక్క పెట్టి ఏడుస్తోంది. ఆ ఏడుపు ఎంతో ఇంపుగా వినిపిస్తోంది. ప్రేమగా చేతుల్లోకి తీసుకుంది. గుండెలకు హత్తుకుంది.

కొన్ని గంటలక్రితమే ఊపిరిపోసుకున్న కొత్తప్రాణి అమ్మపాలతో ఆకలి తీర్చుకుంటోంది. ఉద్విగ్నంగా కళ్ళు మూసుకుంది సిరిమల్లి. ఒక అమ్మ స్పర్శ... బ్రతుకు సాఫల్యమైనట్లుందామెకు. ఆ ఏడుపు ఒక్కసారిగా మాయమైంది. ఆ స్పర్శ చాలా హాయిగా అనిపిస్తోంది. గిలిగింతలు పెడుతోంది. మధురమైన మంద్రత స్థితి ఆమెలో.

ఓ ప్రక్క సంతోషం, మరో వైపు ఆందోళన.

'సెలవు చూసుకొని పదిరోజుల్లో బిడ్డను తీసుకెళ్ళడానికి వస్తామన్నారు.' డాక్టర్ సదాశివం మాటలు పదేపదే గుర్తుకువస్తున్నాయి. మరోవైపు దు:ఖం తన్ను కొస్తోంది. బాబును వదలబుద్ధి కావడంలేదు.  క్రమేపీ అనుబంధమూ పెనవేసుకుంటోంది.

'అవునమ్మాయ్! ఇంత డబ్బు ఖర్చు పెడుతున్నామంటే పుట్టిన ప్రాణిలో ఏ శారీరక లోపాలు లేకుండా ఉండాలనుకోవడం తప్పు కాదంటాను. ఒకవేళ ఏమైనా లోపాలతో పుట్టిన పక్షంలో నువ్వే భరించాల్సి ఉంటుంది. మాకు ఏమాత్రం సంబంధం లేదు. బల్లగుద్ది మరీ మాట్లాడిన కమలాకరం మాటలు పదేపదే గుర్తుకువచ్చి సిరిమల్లిని క్రుంగదీస్తున్నాయి. ప్రక్కలోని ప్రాణిని కనులారా చూసుకుంది. సృష్టిలోని అన్ని అందాల్నీ ఆనందాల్నీ సంతరించుకొని అమ్మపాలు త్రాగి కేరింతలు కొడుతున్నాడు.

ఆమె మనసు పొరల్లోని ఆలోచనల్ని ఆ చిన్ని ప్రాణి చుట్టూనే అల్లుకుని పరిభ్రమిస్తున్నాయి. తనకు పెద్దగా చదువులేకపోయినా న్యాయం ఎక్కువ తెలియక పోయినా లోకం గురించి బాగానే తెలుసుకుంది. ఈ విషయంలో ఎలాంటి చట్టాలు లేవని మాత్రం తెలుసు. ఆర్ధిక అవసరాలు డామినేట్ చేస్తున్నప్పుడు మరొకరి అందాలతో గర్భం ధరించాల్సిరావడం అనాలోచనంగా జరిగిపోయింది. తరువాత క్రమంలో జరిగిన పరిణామాలు మానసికంగా సిరిమల్లిని అమ్మతనానికి దగ్గరగా చేస్తున్నాయి.

క్రమంగా మనసును దిటవు చేసుకొని కమలాకరంను ఉత్తరం వ్రాయడానికి సమాయత్తమయింది.

కమలాకరం గారికి.... నమస్కారం.

మానవీయ అనుబంధాలకు అతీతంగా నేను తీసుకున్న ఈ నిర్ణయానికి మొదటగా నన్ను నేనే నిందించుకుంటున్నాను. కరెన్సీ కట్టల్ని ప్రక్కన పెట్టి బంధాల చట్రం  గురించి ఆలోచిస్తే నాలోని మాతృస్పర్శ చిక్కనైన చిత్రంగా రూపుదిద్దుకొంది. మిమ్మల్ని తప్పు పట్టడం కాదు గాని ఒక వేళ పుట్టినవాడు అన్నిరకాలుగా సరిగా లేకపోతే దాని పూర్తి బాధ్యత నాదేనన్న మీ వితండవాదన నన్ను ఈ ఆలోచనకు సమాయత్తం జేసింది. ఒక విధంగా నాలోని వ్యక్తిత్వాన్ని క్రుంగదీసి పడేసింది.

ఒక వేళ మీరన్నట్లుగానే జరగకూడనిదే జరిగితే గాలిలోని దీపం లాంటి నా బ్రతుకు స్థితి ఏమిటి చెప్పండి?

ఆ కోణంలోంచే ఆలోచించాను. క్రమేపీ వీడు నా రక్తం పంచుకొని పుట్టిన కొడుకు అన్న భావన నాలో దృఢ పడసాగింది.

నేను పొయ్యను మాత్రమే... రొట్టెపై నాకు ఏవిధమైన హక్కులేదని మీరు వాదించినా, వేగిపోయిన రొట్టె ఎగిరి పొయ్యిలో పడి మాడి మసైతే ఆ బాధ్యతను నేను భరించాలన్న మీ అవాస్తవిక ధృక్కోణం నాలో కొత్త పుంతలకి తెరతీసింది.

తొమ్మిది నెలలుగా మరొకరి పిండాన్ని మోయడానికి చేసుకున్న ఒప్పందం చెల్లదని నిరూపించదల్చుకున్నాను. మీ తోటి ఆర్ధిక లావాదేవీలు ఏమైనా సరే ఇక మీదట అప్రస్తుతంగా నిలుస్తాయనీ గుర్తు చేస్తున్నాను.

కాబట్టివాడు నా రక్తాన్ని పంచుకుపుట్టిన కొడుకు. వచ్చి మీ ఆశీర్వచనాలు అందించవలసినదిగా కోరుచున్నాను.

మరోసారి చదివి ఉత్తరం మడిచి కవర్లో పెట్టింది సిరిమల్లి. తల్లి నిర్ణయం సహేతుకమే అంటూ ఆ చిన్నారి బోసి నవ్వులు చిందిస్తున్నాడు.    

మూలం: మనసు మూలాల్లోకి........


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in