|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
తేలు కుట్టిన దొంగ
అదేపనిగా మోగుతున్న ఫోన్‌వైపు అదేపనిగా అలా చూశాడు వటపత్రశాయి. అలా మోగిమోగి ఆగిపోవటం... ఒక్కసారి అలుముకున్న నిశ్శబ్దం.
పెద్దశబ్దంతో గట్టిగా నిట్టుర్చాడు వటపత్రశాయి. ఆశబ్దాన్ని ఆలకించిన తటిల్లత " ఏమయ్యిందండీ?" అనడిగింది కంగారుగా.
భార్య తటిల్లతకు తటాలున జవాబు చెప్పేంతలో ఫోన్ మళ్ళీరింగయ్యింది.
ఆ ఫోన్‌కాల్ తప్పకుండా బంగార్రాజు నుంచే అయివుంటుందనుకున్నాడు.
రిసీవర్ తీసి "హలో" అన్నాడు.
బంగార్రాజు ఫెళ్ళున నవ్వాడు.
" ఏమిటింత ఆలస్యం? అవునూ... చెప్పడం మరిచాను. స్టేజిమీద అటువైపు ఎమ్మేల్యే కటకం కంటకమూర్తి, ఇటు వైపు చైర్మన్ కురాకుల సకల కళావతి. ఇహ మధ్యలో సకల కళానిధి ఈ బంగార్రాజు ఉండాలి... తెల్సిందా?"... అనడిగాడు.
" తప్పకుండా సార్... అంతా మీరు చెప్పినట్టే మరి నా సంగతి" గుటకలు మింగాడు వటపత్రశాయి.
" చూస్తాను లేవోయి... ముందు ఏర్పాట్లన్నీ ఘనంగా ఉండేటట్లు చూడు... ఆ తర్వాత నేను... అని బంగార్రాజు తనదైన స్టయిల్లో భళ్ళున నవ్వాడు. " మొదట మీరు ఘనంగా విదిలిస్తే తర్వాత అన్నీ జరుగుతాయి" బలహీనంగా నవ్వాడు వటపత్రశాయి.
" ఓకొస నుండి అతనికి మండుకొస్తోంది బంగార్రాజుమీద, కానీ ఏమీ అనటానికి వీల్లే కుండా ఉంది పరిస్ధితి. అతను ప్రస్తుతం తాను చేసే ఘనసన్మానానికి గ్రహీత అయి కూర్చున్నాడు. అతి కష్టం మీద ఆవేశాన్ని అణచుకున్నాడు సాయి.
వటపత్రసాయి కొంచె విరామం తీసుకోవడంతో నరకాసుర యుద్ధబాధ్యతను అందుకున్న సత్యభామలా రిసీవర్‌ని అందుకుంది తటిల్లత.
" సన్మాన పత్రం రెడీ అవుతోంది అన్నది తటిల్లత బంగర్రాజును మరింత సంతోషపెట్టటానికి
" అమ్మాయ్... పత్రం నా బరువుకు సరితూగాలి. మీ వల్ల అవకపోతే నా బరువుకు తగ్గట్టు నేనే రాయించుకు వస్తాను. మిగిలిన వ్యవహారాలు మీరు చూసుకోండి... సరేనా?". హుంకారం చేశాడు బంగర్రాజు కొంచెం వెరైటీగా...
" సరే... ఇంతకీ అసలు సంగతి" నీళ్ళు నమిలింది తటిల్లత... ఎందుకుంటే బంగార్రాజు కాపీనం టైపు మనిషి... అందుకే ఆయనతో బ్యాలెన్స్డ్‌గా వ్యవహరించలి.
" సర్లే... ఈ సంగతులు మామూలేగానీ ప్రోగ్రాం మాత్రం భయంకరంగా సక్సెస్ కావాలి... నభూతో మాదిరిగా.. బంగార్రాజు పోయినా ఈ బంగార్రాజు పేరును ఎవరూ మర్చిపోకూడదు... మరేం చేస్తారో... మీరే చూస్కోండి" చివరిసారిగా బంగర్రాజు తన మార్కు వికటట్టహాసాన్ని చేసి ఫోన్ పెట్టేశాడు.
డీలా పడిపోయాడు వటపత్రశాయి. మొహాన్ని గోడకేసి కొట్టుకున్నాడు కసిగా. ఎన్నిసార్లు అడిగినా ఈ బంగార్రాజు డబ్బుల గురించి దాటేస్తున్నాడు.
ముందుగ ఆహ్వాన పత్రాలు మల్టీకలర్‌లో అచ్చువేయించాలి. ఇంకా కొన్ని పన్లకి ఇంకొంత మందికి అడ్వాంసులివ్వాలి. ఈ బంగార్రాజు సన్మానానికి తను తొందరపడి అంగీకరించానేమో అనుకున్నాడు. కానీ అంతకంటే గత్యంతరం లేదు. మరో మనిషి దొరకలేదు.
ఇంతకీ ఈ సన్మానం జరుగుతుందా? తన అనుమానాన్ని భార్య దగ్గర బయట పెట్టాడు. ఆమె ఓమాదిరి అందంగా నవ్వి కళ్ళతోటే ధైర్యాన్నిచ్చింది. అసలు ఆ నవ్వును చూసే వటపత్రశాయి తటిల్లతను నవ్వుకోసం ప్రేమించి నవ్వుకోసమే పెళ్లి చేసుకున్నాడు.
వటపత్రశాయి తటిల్లత వాళ్ళ నాన్నగారు ప్రక్కవీధిలోనే ఉండేవాడు. చిన్నతనం నుండే తనో పెద్ద సాహితీవేత్తగా ఫీలవుతూ సభలూ సన్మానాలు చిన్న చిన్నగ్గా నడుపుతూ ఉండేవాడు. తనకు చదువు పెద్దగ అబ్బక పోయినా తన మనసులో వటపత్రశాయి బొమ్మను నిలుపుకోసాగింది. ఎపుడూ తను పాత సినిమాల్లో హీరోలా, తను పాత సినిమాల్లో హీరోయిన్‌లా ఫీలవుతూ... ఊహల్లో విహరిస్తూ ఊండేది.
క్రమంగా కూతురు ప్రేమ పిచ్చి అర్ధమవసాగింది కాసుల కామయ్యమూర్తికి. చూస్తే కుర్రాడు బాగనే ఉన్నాడు. కూతురికి తగిన మొగుడు... తనకు సరి అయిన అల్లుడని మనసులోనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. వెంటనే తటిల్లత వటపత్రశాయి ప్రేమకోసం తంటాలుపడుతోందేగాని అతను మటుకు అభినవ ప్రవరాఖ్యుడిలా ప్రవర్తించడం నచ్చలేదు కామయ్యకి.
'దానికేముంది అందరికీ సన్మానాలు చేసే స్ధాయికి మీరే ఓ సన్మానం ఏర్పాటు చేసేస్తే సరి!, పెళ్ళాం వకుళ సలహా ఎంతగానో నచ్చింది కామయ్యమూర్తికి. వెంటనే తటిల్లత చేత ఓ అభినందన కమ్ సన్మాన కర్యక్రమం ఏర్పాటు చేసేశాడు. తన ప్రక్క వీధిలోనే ఉంటున్న అందాల భరణి, మాటల మాగాణి చేత సన్మాన చేయించుకోవడంతో వటపత్రశాయి యువ హృదయం పులకించిపోయింది.
వెంటనే చిరుగాలి తాకిన మబ్బుల్లా చలించి ప్రేమవర్షం కురిపించడం మొదలు పెట్టాడు. మొత్తానికి తటిల్లత కలల పంట, ఊహల హరివిల్లు వటపత్రశాయితో పెళ్ళి జరిగిపోవడం, తర్వాత కాలంలో తటిల్లత సాహితీ సాంస్కృతిక సంస్ధ స్ధాపించడం జరిగిపోయింది. 'తమ సంస్ధ తరపున ఓ పురస్కారం ప్రవేశపేడితే బాగుండు' మనసులో మాట బయటపెట్టాడు వటపత్రశాయి. తటిల్లత ఎప్పుడూ మొగుడు ఊహలకు ఊపిరి పొస్తూనే ఉంటుంది. జేబులు తడుముకున్నడు.
'మీ ప్రొబ్లం తెల్సింది. తెచ్చుకున్న వాడికే దండ....కొట్టించుకున్న వాడికే చప్పట్లు' ఏదో జీవిత సత్యాన్ని బోధిస్తున్న దానిలా అంది.' ఎవరిని ఎంపిక చేయాలన్న మీమాంస వచ్చింది. తెచ్చుకున్నవాడికే దండ...కొట్టించుకున్న వాడికే చప్పట్లు అనే సూత్రం ఎక్కడా వర్కవుట్ కావడం లేదు.
చాలా మందిని కదిపిచూశారు. సన్మానం చేయించుకోవడానికి చేతులూపారు. కానీ డబ్బులు అడిగే సరికి చేతులెత్తేయ సాగారు.
'మీరిచ్చే దాని బట్టి సన్మాన స్ధాయి ఉంటుంది నోరు విప్పి చెప్పాడు. " ససేమీరా!' అన్నమాటే గాని ' సై' అని ఎక్కడ నుంచీ రాలేదు.
'కుయ్' మంది తటిల్లత కోడిపెట్టలా వేళకానివేళ' ' పెట్టకూత' అర్ధం కాలేదు వటపత్రశాయికి. ' మన టూరింగ్ టాకీస్ బంగార్రాజు గారిని పట్టుకుంటే సమస్య సాల్వ్ అయిపోతుంది.
పాతాళంలో కూరుకుపోయిన పరువును పైకి తీసుకోచ్చి నిలబెట్ట గల భగీరధుడి కోసం ఎదురు చూస్తున్నాయి డబ్బింగ్ సిన్మాల బంగార్రాజు కళ్ళు.
'ఆసమయంలో వటపత్రశాయి, తటిల్లతలు' అపర భగీరదుల్లా' కనిపించసాగారు.
విషయం వివరించి చెప్పేసరికి ఎగిరి గంతులేశాడు. ఒకరి చేత సన్మానం. అది స్ధానిక ఎం.ఎల్.ఏ, చైర్మన్‌ల చేత ఉబ్బిపోతున్నాడు.
'తన ఖర్చులతో తనకు సన్మానం' అయినా ఒప్పేసుకున్నాడు. కార్యక్రమం ముగిసిన తరువాత డబ్బు సంగతి ఆలోచించ వచ్చులే అనిపించింది. వేయి సన్మానం... ఐదువేల సన్మానం..... పదివేల సన్మానం....' పదివేలకు కొంచెం దిగమని ప్రాధేయపడ్డాడు. ' పెద్దవాళ్ళ చేత సన్మానం పెద్దగానే ఉండాలి మరి' ఓ ఆడది, చెప్పడంతో సన్మానం పెద్దగానే ఉండాలి మరి ఓ ఆడది చెప్పడంతో మెత్తబడ్డాడు. అదే తటిల్లత నచ్చ చెప్పడంతో ' సై' అన్నాడు. సన్మానానికి సరదా పడ్డాడేగాని జేబులోని రూపాయిలు బయటకు రావడానికి మొండి కేస్తున్నాయి.
గెస్ట్‌లు వీళ్ళయితే సభ ఘనంగా ఉంటుంది. గజమాల అయితే నాకిస్టం. ఫలానా వళ్ళ చేత దండలు వేయించు పూలకిరీటం మెరుగ్గా ఉంటుంది. బ్యాక్ కర్టెన్ రంగు బేనర్ సైజు అల్పాహారం వివరాలు అన్నింటిలోను బంగార్రాజు చేయిపెట్టడం మంట పుట్టిస్తోంది వటపత్రశాయికి.
'మొత్తానికి ఫెయీల్యూర్ సిన్మాలా ముంచేటట్లు ఉన్నాడు. తటిల్లతను చూస్తూ అన్నాడు శాయి. అసలు అనుకున్న సొమ్ములు ఇచ్చే రకమో కాదో? ఒక వేళ ఇవ్వని పక్షంలో ...... పదివేల ఖర్చు. ఫంక్షన్ ఆపేస్తే పరువుపొతుంది. మళ్ళీ ఫోన్ మోగింది. తిట్టుకుంటూనే లిఫ్ట్ చేశాడు. " ఏర్పాట్లు ఎంత వరుకు వచ్చేయి ఫంక్షన్ మటుకు మంచి కలర్‌ఫుల్‌గా జరగాలోయ్ వచ్చిన వాళ్ళు అదిరిపోవాలి.
అద్సరేగానీ పెద్దల చేత చేతికి బంగారు కడియం తొడిగించుకోవాలని కోరికగా ఉందోయ్! కంగారుపడకు నా దగ్గరున్న బంగారు కడియం పంపిస్తున్నాను. ఎం.ఎల్.ఏ గారితో సన్మాన సభలో నాచేతికి తొడిగించాలోయ్! సువర్ణ కంకణధారణ అని ఇన్విటేషన్‌లో కూడా వేయించు. కాదనలేకపోయాడు వటపత్రశాయి.
తటిల్లత సాహితీ సాంస్కృతిక సంస్ధ పురస్కార సభ వైభవంగా ఏర్పాటు చేయబడింది. పురప్రముఖులు... 'సకల కళానిధి భూడిగంత బంగార్రాజు గారికి పౌరసన్మానం, సువర్ణకంకణధారణ' వెనక బేనర్ అందర్నీ ఆకట్టుకుంటోంది.
పైసా మటకు తీయకుండా ఇంత పెద్ద సభ ఏర్పాటు... తనకు బంగారు కడియం తొడగటం... ఆ పైన సన్మానం మధురమైన అనుభూతిగా తోస్తొంది.
ప్రక్కనే ఉన్న సకల కళావతి ముఖంలోకి చూశాడు. ' యు ఆర్ గ్రేట్ మై డియర్' అన్నట్లు చూసింది. ఖర్చుకూడ చెప్పిన పదివేలకుమించి అవుతుంది. వటపత్రశాయికి, తటిల్లతకు కూడ బంగార్రాజుగారిని తమ సంస్ధ తరపున సన్మానించడం బాగుంది.
తమ సంస్ధ ఇంతపెద్ద కార్యక్రమం నిర్వహిస్తున్నందుకు ఆనందం ఆకాశాన్ని అంటుతోంది. ఎందరెందరో పెద్దలు ప్రముఖులు మాట్లాడి వెళుతున్నారు. తర్వాత సన్మాన కార్యక్రమం. ఆయన అనుకున్నట్టుగానే సువర్ణ కంకణధారణ జరిగింది. సభలో తప్పట్లు మిన్ను, ముట్టుతున్నాయి. ఆనందంతో తన చేతికి తొడిగిన కంకణాన్ని తృప్తిగా చూసుకున్నాడు.
ఒక్కసారి షాక్ కొట్టినట్లయింది. బంగర్రాజుకి గోంతు ఎండిపోయినట్లయింది. పరీక్షగా మరోసారి చూసుకున్నాడు. అనుమానం లేదు. అది తను ఇచ్చిన బంగారు కడియం కాదు. తదేకంగా పరిశీలించి చూసుకున్నాడు. నకిలీ కంకణం .... గిల్టుమీద బంగరు పూత పూసిన కంకణం అది.
అసలు కన్న సిసలు అక్కడి లైటింగ్‌లో తళతళమెరుస్తోంది. బంగర్రాజు కడుపులో మండిపోతుంది. ఒక్కసారి నిర్వాహకుల వైపు చూశాడు. వటపత్రశాయి, తటిల్లత ముఖంలో ఒక మంచి కర్యక్రమం నిర్వహిస్తున్నామన్న ఆనందం కనబడుతోంది. ఎక్కడో దేవినట్లుంది బంగర్రాజుకి, ప్రేక్షకుల వైపు చూశాడు. వారి ముఖాలలో ఆనందమే ఆనందం.
ఇక తప్పక వారితో తనూ జతకలిపాడు. ఆ క్షణంలో ఆయన ముంజేతి కంకణం మటుకు మెరుపులతో మరింతగా మురిపిస్తూనే ఉంది. ఆ మెరుపుకు బంగార్రాజు కళ్ళు చీకట్లు కమ్మి అంతా శూన్యంగా తోచి కుర్చీలో కూలబడ్డాడు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in