telugudanam.co.in

      telugudanam.co.in

   

వీధి నాటకాలు

ఇప్పుడంటే రంగ స్థలం హాలు, కర్టెన్లు - ఇలా ఎన్నో విధాల అభివృద్ది చెందిందిగాని, ఒకనాడు వినోద ప్రదర్శనలు అన్నీ వీథిల్లోనే జరిగేవి. ఒకనాడు వీధులకు ఎంతో ప్రాధాన్యం ఉండేది. పాఠశాలలన్నీ వీధుల్లోనే ఉండవి. అందుకే వాటిని వీధి బడులు అనే వారు. నడి వీధిలోనే దేవదాసి నృత్యాలు, మేజువాణీలు జరిగేవి. పురాణ గాధలను కూడా పండితులు వీధులలోనే చెప్పేవారు. వీధికి అంతటి ప్రాముఖ్యత ఉండేదానాడు. అలాగే నాటకాలు కూడా. నాటకాలను వీధుల్లో ఆడేవారు గనుక వాటిని వీధి నాటకాలు అనేవారు. వాటిని ప్రదర్శించేవారిని భాగవతులు అనేవారు. అసలు ఒకనాడు గ్రామ పంచాయితీల పాలనా వ్యవహారాలన్నీ వీథుల్లోనే ఏ వేప చెట్టుక్రిందో, ఏ రావి చెట్టు క్రిందో జరిగేవి. ప్రధానంగా రామాయణం, భారతం, భాగవత, గాథలూ, బసవపురాణ కథలూ వీథి నాటకాలుగా ప్రదర్శిస్తూండడం పరిపాటి. వీటిని దేశి నాటక ప్రదర్శనలు అంటే సరిపోతుందనుకుంటాను. ఈ దేశి నాటకాల పురోగతి శివకవుల ఆద్వర్యంలోనే జరిగింది.


వీధి నాటకాలు                                  


క్రీ.శ.16వ శతాబ్దం నుంచి ఆంధ్రదేశంలో ఎక్కువగా యక్షగానాలు రచించడం జరిగింది. అప్పటికే దోరసముద్రపునటులు వీథి నాటకాలను అనేక రీతులలో ప్రదర్శించినట్లు, అలాగే కూచిపూడి భాగవతులు, జంగాలు వీథి నాటకాలను ప్రదర్శిస్తుండేవారనీ తెలుస్తూంది. యక్షగానాల్లో నాటకోచితమైన రచనా విధానాలు ప్రవేశ పెట్టబడినట్లు సుగ్రీవ విజయం సాక్ష్యంగా చెప్పుకోవచ్చు. సుగ్రీవ విజయం నాటకంలోని కొన్ని కొన్ని పాత్రలలో పాటలు పాడేవారనీ, తక్కిన సంధి వచనాలూ మొదలయినవి ఒకరిద్దరు సూత్రధారులు పఠించడం వల్ల సుగ్రీవ విజయం వంటి యక్షగానాన్ని వీధి నాటకంగా ప్రదర్శించేవారనీ, శ్రీ నేలటూరి వెంకట రమణయ్య వంటి చరిత్రకారులు పేర్కొనే ఉన్నారు.

కూచిపూడి భాగవతుల పేరు 15వ శతాబ్దం నాటికే ప్రచారంలో ఉందనడానికి 1502 నాటి మచ్చుపల్లి కైఫీయత్ ఆధారం. నాటినుంచి నేటివరకు కూచిపూడివారు ప్రదర్శించేవన్నీ వీథి నాటకాలే. ప్రధానంగా కూచిపూడి భాగవతుల వారి ఇతివృత్తాలన్నీ పురాణాలకు సంబంధించినవే. ఆధ్యాత్మికమైనవే. నాట్యరూపంలో వీరు ప్రదర్శించే అన్నిటా మనకు భారత, భాగవత, రామాయణ గాథలే ప్రధానం. వీరి ప్రదర్శనల్లో ప్రధానంగా పేర్కొనవలసినవి - త్యాగరాయ కృతులు, జయదేవుని అష్టపదులు, మువ్వగోపాల పదాలు, భద్రాచల రామదాసు కీర్తనలు, నారాయణ తీర్థుల తరంగాలు, సారంగపాణి కీర్తనలు, తుంగతుర్తి కృష్ణదాసు కృష్ణలీలలు, అన్నమాచార్య పదాలు, సింహపురి పదాలు, చిదంబరం ఉషాపరిణయం, సుబ్రహ్మణ్యకవి ఉషాపరిణయం, గొల్లకలాపం, భామాకలాపం, దాదినమ్మ వేషం, దశావతారాలు, ప్రహ్లాద పట్టాభిషేకం, పరశురామస్తవం, రామపట్టాభిషేకం, బాలగోపాలతరంగం వంటివి మరెన్నో ప్రదర్శనలు ఇస్తుంటారు. సిద్దేంద్రుని ఆశీస్సులతో వెలుగొందిన కూచిపూడి భాగోతుల కీర్తి దేశం నలుమూలలా ప్రచారం పొందింది. అగ్రహారాన్ని దానంగా అంది పేరుపొందింది.

Telugudanam.co.in
వెనుకకు | మొదటి పేజీ | తెలుగుదనం బ్లాగు | మాగురించి | సలహాలు | పత్రికలలో తెలుగుదనం                                సందర్శకుల సంఖ్య: