|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం | మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
చిట్కాలు
వంటగదికి సంబంధించినవి
అన్నం వండుతున్న సమయంలో పాత్రలో నీరు మరగడం ప్రారంభించగానే మంటను బాగా తగ్గించండి. ఒక సారి మరిగిన నీరు అలా మరుగుతూనే ఉండేందుకు పెద్ద మంట అనవసరం. పెద్ద మంటలో వంటకు పట్టే సమయం తగ్గుతున్నది అపోహ మాత్రమే.
అప్పడాల్ని నిల్వ చేసేటప్పుడు వాటి మీద కొద్దిగా కారం, ఇంగువ చల్లితే పురుగులు, చీమలు దరిచేరవు
అల్లం తడి గుడ్డలో చుట్టి నీళ్ళ కుండ పైన ఉంచితే వారం, పది రోజుల వరకూ తాజాగానే ఉంటుంది.
ఆకుకూరలను ఒకటి, రెండు రోజుల కంటే ఎక్కువ రోజులు ఉంచకండి.
ఆయిల్ పలుసార్లు వండడం వలన మడ్డిగా తయారయిందా? దాంట్లో ఒక చిన్న బంగాళదుంప స్లయిస్ వేసి ఒక రోజంతా అలా ఉంచండి. ఆ ఆయిల్ మరల ఉపయోగించుకునేందుకు సిద్దం.
ఇంట్లో పార్టీ ఏదైనా జరిగి, గాజు పింగాణీ వస్తువులు ఎక్కువగా కడగాల్సి వచ్చినప్పుడు సింక్ లో రెండూ మందపాటి పాత టవల్స్ని పరిస్తే ఒకవేళ చేయిజారినా పగలకుండా ఉంటాయి.
ఉదయం కొబ్బరి చిప్పలను బాగా తురిమి, ఆ కోరును ఒక రోజంతా ఎండబెట్టాలి. అలా బాగా ఎండిన కొబ్బరి కోరును ఒక సీసాలో వేసి గట్టిగా మూత పెట్టి ఉంచి కావలసినప్పుడల్లా తీసి వాడు కొని మళ్ళీ మూత పెట్టేస్తూ ఉండాలి. ఇలా ఎండ పెట్టిన కొబ్బరి కోరు నెల రోజులు నిల్వ ఉంటుంది.
ఉప్పు డబ్బాలో ఏవైనా రెండు ఎండు గింజలను వేస్తే ఉప్పు ముద్ద కాకుండా తేలికగా చల్లుకోవటానికి వీలుగా ఉంటుంది.
ఉల్లిపాయ పొట్టు తీసి ఉప్పు నీటిలో కొంచెం సేపు ఉంచి తింటే నోరు వాసన రాదు.
ఉల్లిపాయ ముక్కల మీద కొంచెం ఉప్పు చల్లి తడి అయ్యే దాకా మెదిపి వాటిని పిండిలో కలిపి వేసిన పకోడీలు కరకరలాడుతాయి.
ఉల్లిపాయలు తరిగే సమయంలో నోట్లో చూయింగ్ గమ్ ఉంచుకోండి, ఉల్లిఘాటు మీ కళ్ళనుండి నీటిని రప్పించలేదు. మీ కళ్ళు మండవు కూడా.
ఎండు మిరపకాయలు కారం ఆడించే సమయంలో ఆవనూనె 4 చుక్కలు వేశారంటే కారానికి మంచి రంగు వస్తుంది.
ఎండు మిరపకాయలు కారం పట్టించే ముందు కొంచెం ఉప్పు కలిపితే పురుగు పట్టకుండా ఎక్కువ కాలం నిలవ వుంటుంది.
ఎగ్స్ బాయిల్ చేసే సమయంలో పై షెల్స్ క్రాక్ అవ్వకుండా ఉండేందుకు కొంచెం ఉప్పు వేయండి చాలు.
ఒకవేళ అన్నం మాడిపోయి మాడువాసన వస్తుంటే, కొంచెం ఉప్పువేస్తే చాలు ఆ వాసన పోతుంది.
ఒలచి పెట్టిన కొబ్బరికాయలు తొందరగా కుళ్ళి పోకుండా ఉండాలంటే ఒక మార్గం ఉంది. వాటి పిలకలు పై వైపుగా ఉన్నట్టు పేర్చి ఉంచితే తొందరగా కుళ్ళి పోకుండా ఉంటాయి.
కాఫీ పొడిని ఫ్రిజ్ లో పెడితే సువాసన పోదు.
కాయకూరలు కొని నిల్వ చేస్తే వాడి పోతాయి. కాని అలా వాడి పోయినట్టుండే కాయ కూరలను ఉపయోగించే ముందు నిమ్మరసం కలిపిన మంచి నీటిలో ఒక గంట సేపో అరగంట సేపో నానపెడితే చాలు.
కారం పొడి డబ్బాలో చిన్న ఇంగువ ముక్క వేస్తే కారం ఎంత కాలమైనా నిల్వ ఉంటుంది.
కిచెన్లో ఉపయోగించే పాత నాప్కిన్ని వెనిగర్లో ముంచి ఫ్రిజ్ లోపలి భాగం శుభ్రం చేస్తే పురుగులు ఏమన్నా ఉంటే చనిపోతాయి.
కూరగాయలు వండిన తరువాత కూడా రంగు చెడకుండా ఉండాలంటే ముందుగానే కొంచెం ఉప్పు వెయ్యాలి.
కొన్ని దోస తొక్కలను వంటింట్లో ఉంచితే చీమలు ఆ దరిదాపులకు రావు.
కొబ్బరి కాయ కొట్టేటప్పుడు సరిగ్గా రెండుగా పగలటానికి చిన్న చిట్కా ఉంది. దాన్ని కొట్టే ముందు ఒక సారి నీళ్ళలో ముంచి అప్పుడు కొట్టి చూడండి. కాయ మధ్యనే పగులుతుంది.
కొబ్బరికాయ కొట్టిన తర్వాత రెండు చిప్పలు అవసరం లేదు. ఒకటే చాలు అనుకున్నారనుకోండి - అప్పుడు ఒకటి దాచి ఒకటి ఉపయోగించకూడదు. రెండిటిలో నుంచి సగం సగంగా తురుము కొని తక్కినవి దాచి ఉంచితే మళ్ళీ వాడు కోవలసి వచినప్పుడు, కుళ్ళు వాసనవేయకుండా ఉంటాయి.
కొబ్బరిచిప్ప నుంచి కొబ్బరి త్వరగా ఊడి రావాలంటే కొన్ని గంటలు కొబ్బరి చిప్పను ఫ్రీజర్లో ఉంచాలి.
కోడిగుడ్దు ఆమ్లెట్ వేయడానికి ముందు పెనం మీద టేబుల్ సాల్ట్ తో తుడిస్తే ఆమ్లెట్ అంటుకోకుండా చక్కగా వస్తుంది.
క్యాబేజీ ఉడికించేటప్పుడు ఆ నీటిలో చిన్న అల్లం ముక్క వేస్తే ఘాటైన వాసన రాదు. రుచి కూడా బాగుంటుంది.
గోరువెచ్చని నీటిలో కత్తిని ముంచితే ఆ కత్తితో డ్రై ఫ్రూట్స్ ను తేలిగ్గా కట్ చేయవచ్చు.
గ్యాస్ "స్టౌ"లో మంట చిన్నదిగా ఉండేలా చూడండి.
గ్యాస్ బర్నర్ని పెట్రోలుతో శుభ్రం చేస్తే నీలం మంటతో చక్కగా మండుతుంది.
గ్యాస్ స్టౌ లో సాధ్యమైనంతవరకు చిన్న బర్నర్నే వాడండి. పెద్ద బర్నర్ కంటే చిన్న బర్నర్ మీద వంట వండినప్పుడు పదిశాతం ఇంధనం కలిసి వస్తుందని పరిశోధనలు నిరూపించాయి. బర్నర్ బాగా లేకపోయినా, స్టౌ వత్తులు సరిగా లేకపోయినా స్టౌ సరిగా పని చేయదని గుర్తుంచుకోవాలి.
చక్కెర గడ్డ కడితే డబ్బా మూతకి ఒక తడిబట్ట కట్టి రాత్రంతా ఉంచండి.
చింతపండు ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే, ఇంగువ, ఉప్పు నీటిలో కలిపి ఆ నీటిని చింతపండు పై చిలకరించి చింతపండును బాగా ఎండలో ఆరబెట్టాలి. ఆరాక మంచి కంటెయినర్లో ఉంచుకుంటే ఎంత కాలమైనా చింతపండు నిల్వ ఉంటుంది.
చింతపండుని మిక్సీలో యధాతధంగా వేయకండి. మిక్సీ బ్లేడ్స్ పాడయిపోతాయి. రసం పిసికి ఆ రసం పోయండి.
జాం గట్టిగా మారితే సీసాను కాసేపు వేడి నీళ్ళలో ఉంచితే జాం వాడుకోవడానికి అనువుగా తయారవుతుంది.
జీడిపప్పు, ఎండుద్రాక్ష, బాదం వంటి డ్రైఫ్రూట్స్ ఎక్కువ కాలం చెడిపోకుండా నిల్వ ఉండాలంటే, వాటి మధ్య నాలుగు లవంగాలు ఉంచాలి.
టీ కలుపుతున్నప్పుడు చిటికెడు వంట సోడా అందులో వేశారనుకోండి ప్రతిసారి చంచాడు టీ పొడిని ఆదా చేసినట్టే.
టీ తయారు చేసే సమయంలో రోజ్ వాటర్ ఎసెన్స్ ఒక్క డ్రాప్ వేయండి. ఆ టీ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది.
డైనింగ్ టేబుల్మీద గాని, ఫ్రిజ్ మీద గాని మామిడి, జామ వంటి పళ్ళను వెదురుబుట్టలో అమర్చండి. వీటి నుంచి వెలువడే తీయని వాసన కూడా చక్కని ఫీలింగునిస్తుంది.
తక్కువ పాలతో చిక్కటి టీ కావాలి. టీ రడీ అయ్యాక, బిస్కెట్ పొడి కాస్త ఆ పలచని టీ లో కల్పండి అంతే చిక్కని టీ రడీ.
తగినన్ని నిమ్మకాయ ముక్కలు దంచిన ఉప్పులో ఉంచితే రెండు మూడు రోజులైనా చెడిపోకుండా ఉంటుంది.
తేనెసీసాలో రెండుమూడు మిరియాలు వేస్తే ఎక్కువకాలం నిల్వ ఉంటుంది, చీమలుకూడా పట్టవు.
తోడుపెట్టిన పాలల్లో చిన్న కొబ్బరి ముక్కవేస్తే పెరుగు కమ్మగా ఉంటుంది.
దుంపలను ఉప్పు కలిపిన నీటిలో ఓ పావుగంట నానబెట్టి ఆ తర్వాత ఉడికించండి. త్వరగా ఉడుకుతాయి.
దోసకాయ ముక్కలు క్రష్ చేసి కిచెన్ చుట్టు ప్రక్కల ఉంచారంటే, బొద్దింకలు దూరం దూరం.
నారింజ పండు పులుపుగా ఉన్నప్పుడు తొనలు వలచి, పైన కాస్త సున్నం (తాంబూలానికి వాడేది) అద్దితే పులుపుపోతుంది. పండు తియ్యగా ఉంటుంది.
నిప్పులను ఆర్పాలంటే నీరు చల్లటం వలన, మళ్ళీ వెంటనే అవసరమయితే అంటించటం కష్టం కనుక పాతడబ్బాలో నిప్పును వేసి గాలి పోకుండా మూత పెడితే వెంటనే ఆరి పోతాయి.
నిమ్మ కాయలు ఎండిపోకుండా కొద్ది రోజుల పాటు తాజాగా ఉండటానికి వాటిని రోజూ గంట సేపు మంచి నీటిలో పడవేసి ఉంచి తీస్తూ ఉంటే చాలు.
నిమ్మకాయ కావలసి వచ్చి, ముక్కలుగా తరుగుతాం. మనకు ఒక్క ముక్కే కావాలి. తక్కినవి అలా వదిలేస్తే పాడవుతాయి. ఏం చెయ్యాలి? ఆ తక్కిన ముక్కల్ని ఉప్పు జాడీలో పడేయండి. మూడూ, నాలుగు రోజుల వరకు పాడవకుండా అలాగే ఉంటాయి.
నిమ్మకాయ రసం పిండివేశాక, ఆ నిమ్మడిప్పల్ని పారవేయకుండా వాటితో ప్లాస్టిక్ సామానును రబ్ చేయండి. మురికిపోయి అది మెరిసిపోవటాన్ని మీరు గుర్తించగలుగుతారు.
నిమ్మకాయల్ని తడిబట్టలో చుట్టి పాలిథిన్ కవర్లో ఉంచితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి.
నిమ్మరసం ఎక్కువగా రావాలంటే పది నిముషాలపాటు గోరువెచ్చటి నీటిలో వేసి ఉంచాలి. ఒకవేళ ఫ్రిజ్ లో ఉంటే రసం తీయటానికి పది నిమిషాల ముందు బయట పెట్టాలి.
నువ్వులు త్వరగా పురుగు పడుతుంది. నిలవ పెట్టుకొనేటప్పుడు, ఆ నువ్వుల డబ్బాలో నాలుగైదు ఉప్పు గడ్డలు పడేస్తే పురుగు పట్టదు.
నూనెలో కాని, నెయ్యిలో కాని కొంచెం బెల్లం ముక్కని వేస్తే దానిని గడ్డ కట్టకుండా ఆపుతుంది.
నెయ్యి బాగా మరగించి, దాన్ని నిల్వ ఉంచితే చాలా కాలం నిల్వ ఉంటుంది.
నెయ్యి మరిగించే సమయంలో రెండు చిటికెలు ఉప్పు దానిలో వేశారంటే నెయ్యి చాలా కాలం నిల్వ ఉంటుంది.
పచ్చిమిరపకాయలు పండకుండా ఉండాలంటే గాలి చొరబడని గట్టి మూతగల సీసాలో ఉంచి, చిటికెడు పసుపు చల్లి ఎండ తగిలేలా ఉంచాలి.
పప్పు ధాన్యాలు చెడిపోకుండా నిల్వ ఉండాలంటే పప్పుల్లో నాలుగు ఇంగువ పలుకులు వేసి ఉంచితే చాలు! పప్పులకు పురుగుపట్టదు. ఎంతకాలమైనా నిల్వఉంటాయి.
పప్పులు పురుగులు పట్టకుండా ఉండాలంటే కొద్దిగా నెయ్యి రాసి డబ్బాలలో గట్టిగా మూతపెట్టి వుంచితే సరి.
పాత చేతి రుమాళ్ళు రెండింటిని తీసుకొని మూడు పక్కల కలిపి కుట్టి ఒక పక్క వదిలేయాలి. సంచిలా తయారైన దీనిని తడిపి అందులో ఆకుకూరలు పెట్టి ఫ్రిజ్లో ఉంచితే వాడిపోకుండా తాజాగా ఉంటాయి.
పిల్లలు టీ త్రాగుతామంటే, లైట్ గా టీ తయారు చేసి దాంట్లో ఓ బ్రిటానియా బిస్కెట్ పొడి కొట్టి వేయండి. వెరైటీ టేస్టు వారు ఎంజాయ్ చేస్తారు.
పుట్టగొడుగులు ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే వాటిని ప్లాస్టిక్ కవర్ లో కాకుండా చక్కగా పేపర్లో చుట్టి ఫ్రిజ్ లో పెట్టుకోవాలి.
పుదీనా ఆకుల్ని ఒక సీసాలో వేసి వంటింట్లో ఉంచితే ఈగలు రాకుండా ఉంటాయి.
ఫ్రిజ్ లేని వాళ్ళు వేసవి కాలంలో గుడ్లను నాలుగైదు రోజుల పాటు తాజాగా ఉంచు కోవటానికి ఒక చిన్న ఉపాయం ఉంది. గుడ్ల పెంకుల మీద ఆవనూనె గాని, వనస్పతి నూనె గాని పూసి ఉంచితే చాలు. గుడ్లు చెడిపోకుండా ఉంటాయి.
ఫ్రిజ్ లో అక్కడక్కడ పుదీనా ఆకులు ఉంచితే దుర్వాసన రాదు.
ఫ్రిజ్ లో కూరగాయలు పెట్టుకునే షల్ఫ్లో అడుగున పేపర్ వేసి ఉంచితే కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.
బిస్కెట్ టిన్స్ విప్పేసిన తరువాత ఇంకా బిస్కెట్లు మిగిలిపోతే, అవి చాలా కాలం తాజాగా, కరకర మంటూ ఉండవు. ఐతే ఒక చిన్న పని చేస్తే తాజాగా ఉంటాయి. ఒక చంచాడు చక్కెర ఆ డబ్బాలో వేసి చూడండి. వారం పదిరోజుల వరకు కరకరమంటూ తాజాగా ఉంటాయి. విడిగా బిస్కెట్లు కొన్నా కూడ డబ్బాలో వేసి, చక్కర కూడ వేసి మూత పెడితే అవి అలాగే ఉంటాయి.
బీట్రూట్ కొనేటప్పుడు గట్టిగా, గుండ్రంగా, ముదురు ఎరుపు రంగులో నునుపుగా ఉండేవాటినే ఎంచుకోవాలి.
మెంతి కూరను నిల్వ చేయాలంటే తాజా మెంతి కూరను తీసుకొని ఆకుల్ని, కాడల్ని వేరుచేయాలి. వీటిని ఒక పేపరు మీద ఆరబెట్టాలి. బాగా ఎండిపోయేలా ఆరనివ్వాలి. ఆకు కూరను ఆరబెట్టేటప్పుడు దానిని ఎండలో కాకుండా నీడలో ఆరనివ్వాలి. ఎండలో పెడితే వాటి, రంగు, రుచి, సువాసన తగ్గిపోతాయి.
రాత్రి కుక్కర్ కడిగిన వెంటనే గాస్కెట్ తీసి విడిగా తగిలిస్తే గాస్కెట్ చాలా కాలం వస్తుంది.
వంటకు తక్కువ లోతు కల్గిన, వెడల్పైన పాత్రలను వాడండి.
వంటగదిలో మంటలు రేగితే కొద్దిగా సోడా బైకార్బొనేట్ చల్లండి. మంటలు, పొగ వ్యాపించకుండా అది నిరోధిస్తుంది.
వంటింటి గట్టు, డైనింగ్ టేబుల్ ను ఉప్పు నీటిలో ముంచిన వస్త్రంతో తుడవాలి. చీమలు, పురుగుల బెడద ఉండదు.
వండే పాత్రల మీద మూతలు పెట్టండి. అప్పుడు ఉడికే అన్నం, కూరలు వగైరాల నుంచి వేడి బయటకు పోదు. దాంతో వంట త్వరగా అవుతుంది. గ్యాస్ ఆదా అవుతుంది.
వెన్న కాచేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తే నెయ్యి ఎక్కువ కాలం నిలువ ఉంటుంది.
వెల్లుల్లిని పై పొట్టు ఒలిచి ప్లాస్టిక్ కవర్లో పెట్టి ఫ్రిజ్లో ఉంచితే ఎక్కువకాలం నిల్వ ఉంటాయి.
వేడి నీరు, అమోనియా కలిపిన ద్రావణంలో గ్యాస్ స్టవ్ బర్నర్లను నానబెట్టాలి. ఒక వైర్ బ్రెష్ తో బర్నర్ రంధ్రాలను శుభ్ర్రపరిచి ఎండబెడితే స్టవ్ మంట బాగా వస్తుంది.
స్టెయిన్ లెస్ స్టీలు పాత్రలకన్నా అల్యూమినియం పాత్రలు తొందరగా వేడెక్కి వంటకు పట్టే సమయాన్ని తగ్గిస్తాయి.
శుభ్రతకు సంబంధించినవి
ఇత్తడి బకెట్లు, ఇత్తడి వస్తువుల్ని కడిగేటప్పుడు నిమ్మ చెక్కని వాడితే తెల్లగా వస్తాయి.
ఇత్తడి వస్తువులను ఆపిల్ తొక్క లోపలి భాగంతో తోమితే శుభ్రపడతాయి.
ఉప్పునీటి మూలంగా స్టీలు బక్కెట్ల అడుగున తెల్లగా పొరలా పేరుకుంటుంది. కిరోసిన్ చుక్కలు వేసి గంట తర్వాత సబ్బునీటితో కడిగేయాలి.
ఏ పాత్రపై అయినా తుప్పు మరక పడితే, ఆలివ్ ఆయిల్లో కార్క్ ముంచి రుద్దితే మరక పోతుంది.
ఒక పెద్ద టబ్ లో చెంచా సర్ఫ్ వేసి నీళ్లు పోయండి. వంటకాలకు ఉపయోగించిన పాత్రలన్ని ఆ టబ్ లో వేసి నానబెట్టండి. ఇది రాత్రి పూట చేస్తే మంచిది. మరుసటి రోజు కొంచెం రుద్ది నీటితో కడిగేస్తే చాలు తళతళలాడే పాత్రలు సిద్ధం.
ఒక స్పూన్ డెట్టాల్, ఒక స్పూన్ నిమ్మరసం, రెండు స్పూన్ల డిటర్జెంట్ పౌడర్, కలిపి కిచెన్ టైల్స్ తుడిస్తే, అవి శుభ్రంగా ఉండటమే కాదు తళతళ లాడిపోతాయి.
గిన్నెలపై ఉన్న మచ్చలు పోయి అవి తళతళ లాడాలంటే వాటిని కాసేపు బ్లీచింగ్ పౌడర్ కలిపిన నీటిలో ఉంచాలి.
డికాషన్ తయారు చేశాక ఉపయోగించిన కాఫీ పొడిని చాల మంది పార వేస్తుంటారు అలా కాకుండా ఆ కాఫీ పొడిని జిడ్డుగా వుండే పాత్రలు తోమటానికి ఉపయోగించి చూడండి. ఆ పాత్రల జిడ్డు ఎంత త్వరగా వదిలి పోతుందో.
నిమ్మకాయతో రాగి పాత్రలకు మెరుపు తేవచ్చు. ఉప్పులో ముంచిన నిమ్మచెక్కతో రుద్ది, వేడినీటిలో కడిగి, ఆ పై పొడిబట్టతో తుడవాలి.
బాగా మాడి నల్లబడిన పాత్రలను రాత్రంతా ఉప్పునీటిలో ఉంచి తెల్లారి తోమాలి.
బియ్యం ఎక్కువ కాలం నిలువ ఉండాలంటే కొంచెం ఉప్పు పొడిని కలిపితే చాలు పురుగులు పట్టదు.
బియ్యం కడగటానికి ఉపయోగించిన కడుగు నీటిని విడిగా ఒక పెద్ద పాత్రలో పోసి ఉంచుకొని అందులో శుభ్రం చేయవలసిన చిన్న చిన్న పాత్రలను కాసేపు వేసి ఉంచి బయటకు తీసి కడిగితే ఆ పాత్రలు ముఖ్యంగా స్టీలు పాత్రలు, గాజు సామాన్లు నిగనిగలాడుతుంటాయి.
బియ్యంపిండి లేదా శనగపిండి, ఉప్పు, వెనిగర్ల మిశ్రమంతో తోమితే రాగి వస్తువులు తళతళలాడతాయి.
భోజనం చేసిన తరువాత ఉప్పుతో రుద్ది చేతులు కడుక్కుంటే జిడ్డు వదులుతుంది.
స్టీలు సామాగ్రి కొన్నప్పట్టి మెరుపు ఉండాలంటే రోజూ చింతపండు వేసి తోమాలి.
స్టెయిన్ లెస్ స్టీల్ సింకులో పడిన మరకలను వెనిగర్లో ముంచిన గుడ్డతో తుడిస్తే పోతాయి.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in