www.telugudanam.co.in         చీరాల

తెలుగు పాఠాలు

చిన్నపిల్లల కోసం

మాగురించి

పత్రికలలో తెలుగుదనం

               మా అనుబంధ వెబ్‌సైట్..

సంస్కృతి, సంప్రదాయాలు

వనితల కోసం

సైట్‌మ్యాప్

తెలుగుదనం బ్లాగు

సాహిత్యం

అందరికోసం

సలహాలు

మా గీతా.కో.ఇన్

వంటలు (కొన్ని)

పచ్చి బూరెలు

కావలసిన వస్తువులు:

బియ్యం - 1/2 కిలో.

పంచదార - 300 గ్రాములు.

కొబ్బరికాయ - ఒకమాదిరిది ఒకటి.

నూనె - 1/2 కిలో.

యాలుకలు - మూడు.

తయారు చేసే విధానం:

బియ్యాన్ని ఒక రోజు నానబెట్టాలి. దీనిని మిక్సీలో గాని, తడిబియ్యం మరలో కానీ పిండి పట్టించాలి. పిండిని రెండుసార్లు జల్లించుకోవాలి. ఆ పిండిలో పంచదార, పచ్చి కొబ్బరి తురుమును కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని రెండు గంటలపాటు మూత పెట్టి ఉంచాలి. ఇప్పుడు పంచదార కరిగిందేమో పరిశీలించాలి. పంచదార పూర్తిగా కరగకపోతే ఇంకొంచెంసేపు ఉంచాలి. ఆ పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసి బూరెలు ఒత్తుకొని నూనె కాగిన తరువాత లైట్ బ్రౌన్ కలర్ వచ్చేలా కాల్చుకోవాలి. వీటిని మరీ ఎక్కువగా కాల్చితే బాగుండవు.

కొబ్బరి స్వీట్

కావలసిన వస్తువులు:

పచ్చికొబ్బరి తురుము - 4 కప్పులు.

పంచదార - 2 కప్పులు.

యాలుకల పొడి - 1/4 స్పూన్.

నెయ్యి - 1/2 కప్పు.

జీడిపప్పు - 1/4 కప్పు.

కిస్‌మిస్ - 1/4 కప్పు.

తయారు చేసే విధానం:

ఓ గిన్నెలో పంచదార వేసి కొద్దిగా నీరు పోసి పొయ్యి మీద పెట్టి పాకం పట్టుకోవాలి. తరువాత కొబ్బరి తురుమును అందులోవేసి బాగా ఉడికించాలి. ఆ మిశ్రమానికి నెయ్యి, యాలుకల పొడి కలపాలి. ముద్దగా అయ్యేంత వరకూ ఉడికించాలి. ఆ తర్వాత ఓ పళ్లానికి నెయ్యి రాసి, అందులో ఈ ముద్దను వేసి సమంగా సర్ధాలి. దీనిపై నేతితో వేయించిన జీడిపప్పు, కిస్‌మిస్ లను అద్దాలి. చల్లారాక నచ్చిన ఆకారంలో ముక్కలు కోసుకోవాలి.

గోధుమ పిండితో పూర్ణాలు

కావలసిన వస్తువులు:

గోధుమ పిండి - 1/4 కిలో

పచ్చి శనగపప్పు - 1/4 కిలో

బెల్లం - 1/4 కిలో

పచ్చికొబ్బరి - 1 చిప్ప

యాలుకలు - 10

నూనె - 1/2 కిలో

తయారు చేసే విధానం:

పచ్చి శనగపప్పు రాళ్ళు లేకుండా చేసుకోవాలి. బెల్లం తరగాలి. యాలుకలను పొడి కొట్టుకొని ఉంచుకోవాలి. పచ్చికొబ్బరి తురమాలి. గోధుమ పిండి జల్లించుకోవాలి. పచ్చి శనగపప్పును రెండు గంటలు నానబెట్టి నీళ్ళన్నీ ఒంపేసి కుక్కర్‌లో ఉడక బెట్టాలి. ఉడికిన తరువాత పప్పును బాగా ఆరనివ్వాలి. తరువాత రోట్లోగానీ, మిక్సీలోగాని వేసి మెత్తగా తయారు చేసి అందులో తురిమిన బెల్లం కలపాలి. చివరగా కొబ్బరి, యాలుకల పొడిని కలపాలి. ఈ పిండి, ముద్దకు రాకపోతే అందులోని తేమ పోయే వరకు పొయ్యిమీద పెట్టి అడుగంటకుండా తిప్పాలి. తరువాత దానిని మనకు కావలసిన సైజులో ఉండలు చేసుకోవాలి. గోధుమ పిండిలో నీళ్ళు పోసి కొంచెం ఉప్పు వేసి జారుగా కలుపుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి నూనె పోసి కాగనివ్వలి. కాగిన తరువాత పూర్ణం ముద్దను గోధుమ పిండిలో ముంచి నూనెలో వేయాలి. కాలిన తరువాత తీసి వేయాలి. ఇవి చాలా రుచిగా ఉంటాయి.

కొబ్బరి బూరెలు

కావలసిన వస్తువులు:

పచ్చి కొబ్బరి చిప్పలు - 2.

గోధుమపిండి - 1/2 కేజి.

బియ్యపు పిండి - 1/4 కేజి.

నెయ్యి - 100 గ్రా.

యాలుకలు - 4.

బెల్లం - 1/2 కేజి.

నూనె - తగినంత.

తయారు చేసే విధానం:

 ముందుగా గోధుమపిండి, బియ్యపు పిండి రెండింటిని ఒకే గిన్నెలోకి తీసుకొని, పక్కన ఉంచుకోవాలి. కొబ్బరి చిప్పలను కోరుకోవాలి. ఒక మందపాటి గిన్నెలో బెల్లాన్ని తీగపాకం పట్టుకోవాలి. యాలుకల పిండివేసి ఇందాకటి పిండిని పోస్తూ కలియబెడుతూ కొబ్బరి కోరు కూడా వేసి సన్నని సెగపై కొద్ది సేపు ఉంచి నెయ్యివేసి దించుకోవాలి. చల్లారిన తరువాత ఈ ముద్దను చిన్న చిన్న ఉండలుగా తీసుకొని పాలిధిన్ కవర్‌పై నెయ్యి రాసి మందంగా నొక్కి వేయించినట్లైయితే బూరలు తయారౌవుతాయి. నేతిలో వేయించుకుంటే మరింత రుచిగా ఉంటాయి.

కొబ్బరి పాలతో పాయసం

కావలసిన వస్తువులు:

కొబ్బరికాయ - 1.

 బియ్యం - 1/4 కిలో.

 బెల్లం - 1/4 కిలో.

 జీడిపప్పు - 10 గ్రాములు.

 నెయ్యి - 50 గ్రాములు.

 యాలుకలు - 5.

కిస్‌మిస్ - 5 గ్రాములు.

 పచ్చ కర్పూరం - కొంచెం.

తయారుచేసే విధానం:

కొబ్బరి తురుముకోవాలి. ఈ తురుమును మిక్సీలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి మెత్తగా చేయాలి. దీనిని పలుచని బట్టలో వడకట్టాలి. మరల కొద్దిగా నీళ్ళు పోసి ఈ పిప్పి వేసి మరలా మిక్సీ పట్టాలి. మరలా వడకట్టాలి. ఈ పాలను కొద్దిసేపు కదల్చకుండా గిన్నెలో పోసి ఉంచాలి. పైన నీరు తేరుకుంటుంది. పై నీరు వంచి వేయాలి. బియ్యాన్ని శుభ్రంగా కడిగి నానబెట్టాలి. యాలుకలు పొడి చేసుకోవాలి. జీడిపప్పు, కిస్‌మిస్‌లను నేతిలో దోరగా వేయించుకోవాలి. వెడల్పాటి గిన్నెలో కొబ్బరి పాలను పోసి కాగనివ్వాలి. ఇవి పొంగు వచ్చాక బియ్యం వేయాలి. ఉడికిన తరువాత  యాలుకల పొడి, జీడిపప్పు, కిస్‌మిస్, మిగిలిన నెయ్యి వేసి కలపాలి. దించిన తరువాత పచ్చ కర్పూరం కూడా పొడిచేసి కలపాలి. ఇది మంచి సువాసనతో నోరూరించేలా చాలా రుచిగా ఉంటుంది.

మైదాపిండితో పాల బూరెలు

కావలసిన వస్తువులు:

మైదాపిండి - 1/2 కిలో.

పంచదార లేక బెల్లం - 400 గ్రా.

 నూనె - 1/2 కిలో.

యాలుకలు - 10.

 పాలు - సరిపడా.

తయారుచేసే విధానం:

మైదా పిండిని శుభ్రంగా జల్లించుకోవాలి. పాలల్లో పంచదార లేక బెల్లాన్ని నాననివ్వాలి. మైదాపిండిని కలపాలి. అట్లపిండి కన్నా గట్టిగా కలుపుకోవాలి. యాలకుల పొడి కూడా వేసి కలపాలి. రేపు ఉదయం బూరెలు చేసుకోవాలంటే ఈ రోజు సాయంత్రమే పిండి కలుపుకోవాలి. పొయ్యి మీద బాండీ పెట్టి నూనెపోసి కాగనివ్వాలి. నూనె కాగిన తరువాత చుక్కలు పడకుండా గరిటెతో ఈ పిండి పోయాలి. ఇవి బాగా ఎత్తుగా పొంగుతాయి. ఇవి మెత్తగా ఎంతో రుచిగా ఉంటాయి. లోపల పొరలు పొరలుగా వచ్చి చాలా బాగుంటాయి. ఇవి రెండు రోజులు నిల్వ ఉంటాయి 


వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్  | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in