|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
కోడి రామమూర్తి
ఆంధ్ర ప్రదేశ్ విజయనగరం దగ్గర నాగావళి నది గట్టు మీద వీరఘట్టము అనే గ్రామంలో జన్మించిన కోడి రామమూర్తి (1885-1942) శరీర దారుఢ్యము, సౌష్టవముతో మూర్తీభవించిన బలము. మన పురాణాలలో బల శబ్దానికి భీముడు, ఆంజనేయుడు పర్యాయ శబ్దాలైనట్లు ఆంధ్ర ప్రదేశంలో ఇతడి పేరు బలానికి పర్యాయపదంగా పరిగణించబడింది. ఇతడు చిన్ననాటి నుంచి తాలింఖానాలలో చేరి ఎక్కువగా శరీర వ్యాయామమును అభ్యసించి మంచి శరీర బలాన్ని ఆర్జించాడు. మద్రాసు సైదాపేట కాలేజిలో శరీర వ్యాయామాన్ని అభ్యసించి వ్యాయామ శిక్షణోపాధ్యాయుడుగా సర్టిఫికేట్ పొందాడు. తరువాత విజయనగరం ప్రొవిన్షియల్ లోయర్ సెకండరీ పాఠశాలలో వ్యాయామ అధ్యాపకుడుగా చేరాడు. ఇంతలో ఒక సర్కసు సంఘాన్ని కల్పించి తెలుగు జిల్లాల్లో ప్రదర్శనలు ఇస్తూ 1912లో మద్రాసు చేరాడు. 21 సంవత్సరాల వయసులోనే ఇతడు రొమ్ముపై 1 1/2 టన్నుల భారాన్ని మోసేవాడు. తరువాత 3 టన్నుల భారాన్ని కూడా మోయగలిగాడు.
సర్కస్‌లో ఆటగాళ్ళ ప్రదర్శనములతోపాటు రామమూర్తి శరీరానికి కట్టిన ఉక్కు గొలుసును ఊపిరి బిగపట్టి తెంపుట, రొమ్ముపై పెద్ద పెద్ద రాతి బండలను పెట్టుకుని సమ్మెటలతో మోదించుకొనుట, రొమ్ముపై ఏనుగును భరించుట, వడిగా పోతున్న మోటారు కారును ఆపుట మొదలైన అపూర్వ ప్రదర్శనలు ప్రజలను ఆకర్షించాయి. భారతదేశపు గవర్నర్ జనరల్ లార్డ్ మింటో రామమూర్తిని సర్కస్ గ్రౌండ్లలో కలుసుకుని వేగంగా పోతున్న తన కారును ఆపాలని చెప్పాదు. కారు వెనక భాగానికి లావుపాటి త్రాడును ఒక కొన కట్టి రెండవ కొన చేతిలో పట్టుకుని వేగంగా పోతున్న కారును ఆపుజేశాడు. దానికి గవర్నర్ జనరల్ ఆశ్చర్యపడి అతడి బలానికి ఎంతో మెచుకున్నాడు. ఒకసారి 7000 పౌండ్ల భారం గల ఒక పెద్ద ఏనుగును తన రొమ్ముపై మోపాడు. ఇతడు లండన్ నగరంలో ఒకసారి రొమ్ముపై రెండు కార్లను అతి సులభంగా మోసి ప్రేక్షకులను ఆశ్చర్యచకితుల్ని చేశాడు. స్పెయిన్‌లో ఇతడు భయంకరమైన ఎద్దుతో పోరాడి కొమ్ములను పట్టుకుని నేలపై అణిచిపెట్టాడు. ఈవిధంగా తన అపూర్వ ప్రదర్శనలతో ప్రజలను ఆకర్షించి ఆశ్చర్యం కలిగించాడు. చివరి రోజుల్లో రామమూర్తి బలంఘీర్ పాట్నాలో కల్వండే పరగణా ప్రభువు పోషణలో జీవితం గడుపుతూ మరణించాడు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in