|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్‌సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వింత అలవాట్లు
పుర్రెకో బుద్ధి, జిహ్వకో రుచి అంటారు. అంటే ఒకరి గుణం మరొకరికి ఉండదు. ఒకరికి నచ్చిన వంటకం మరొకరికి నచ్చదు. మరి కొందరిలో ఏదో ఓ వింత గుణం కనిపిస్తుంది. అది ఎదుటి వారికి విచిత్రంగా అనిపిస్తుంటుంది. అయినా వారు తమ అలవాట్లు మానుకోడానికి ఏమాత్రం ఇష్టపడరు. కొందరికి మాట్లాడుతూ అనవసరంగా నవ్వడం, మరికొందరికి ఊరికే ఉమ్ముతుండడం అలవాట్లుగా ఉంటే మరికొందరికి ఊరికే జుట్టు సవరించుకొవడంలాంటి అలవాట్లు ఉంటాయి. ఇంతవరకైతే పరవాలేదు. ఈ అలవాట్లు విపరీత ధోరణికొస్తేనే ప్రమాదం.
క్రీ.శ. 51-96కు చెందిన రోము చక్రవర్తి టిటస్ ప్లేవియస్ అగస్టస్ డొమిషియన్ వింత అలవాట్లకు, వెర్రిచేష్టలకు ప్రసిద్ధిపొందినవాడు. ఇతడికి తీరిక సమయాల్లో ఈగలను పట్టుకోవడం సరదా అంటే ఎవరికైనా ఆశ్చర్యం కలగక మానదు. అతడీ అలవాటును ఎందుకు చేసుకున్నాడో ఎవరికీ తెలియదు. ఇలా వింత అలవాట్లు ఉన్నవారు సరసులు, హాస్య గుణం కలవారుగా సాధారణంగా ఉంటారు. ప్రక్కవాళ్ళు చూసి నవ్వుతారనే జంకు వీళ్ళకు ఉండదు. తమ పనిని తాము చేసుకు పోతుంటారు. ఇలాగే క్రీస్తు పూర్వం 70-19కి చెందిన ప్రసిద్ధ రోము కవి వర్జిల్ ఇంటి ఈగను అతి శ్రద్ధాభక్తులతో పెంచేవాడు. ఆ ఈగ చచ్చిపోయినప్పుడు ఆయన విచారంలో మునిగిపోయేవాడు. లక్షలు వ్యయం చేసి తన ఈగకు అపరకర్మలు చేయించడమే కాక దాని జ్ఞాపకార్ధం పెద్ద గోరీ నిర్మించాడు. మనుషులకు మాత్రమే పరిమితమైన గోరీలు ఈగలకు కూడా నిర్మించడం వింతే కదూ?
సాధారణంగా కవులు తమ రచనల ద్వారా కీర్తిప్రతిష్టలు ఆర్జించాలని ఆశిస్తారు. అందుకోసం అహర్నిశలు కృషి చేస్తారు. ఐతే స్కాట్‌లాండ్ దేశపు ప్రసిద్ధ కవి, గాయకుడు బ్రెకెన్ రిద్జ్ (1790-1840) ఎక్కడో ఎవ్వరికీ కనిపించకుండా ఏకాంతంగా ఉండడమే కాకుండా తన పాటలు పాడేవారిని తిట్టేవాడు. మరికొన్ని రోజుల్లో మరణిస్తాడనగా తన రచనలన్నిటినీ తగులబెట్టి అందరినీ విస్మయానికి గురిచేశాడు. అలాగే మారిస్ బారింగ్ అనే ప్రఖ్యాత వాజ్ఞ్మయాభిలాషిది మరొ వింత అలవాటు. ఏ అచ్చు గ్రంథాన్ని చూసినా అందులో తనకు నచ్చిన అంశమేదైనా ఉంటే వెంటనే దాన్ని కత్తిరించి తన నోటు పుస్తకంలో అతికించేవాడు. ఈ విధంగా ఇతను ఏకంగా 70 ఏళ్ళపాటు చేశాడు. అంతేకాకుండా అస్తమానం ఇల్లు మారుతుండేవాడు. ఇల్లు మారే ప్రతిసారీ తను తయారుచేసిన పుస్తకాలను గ్రంధాలయాలకు బహుకరించి తిరిగి కొత్త నోటు పుస్తకాలను తయారుచేసేవాడు.
మరో చిత్ర విచిత్రమైన అలవాటున్న వ్యక్తి గురించి తెలుసుకుంటే మరింత ఆశ్చర్యం కలగక మానదు. ఇతడి పేరు మైకేల్ మాంటీగ్. ఇతడు ఫ్రాన్స్ దేశానికి చెందిన ప్రసిద్ధ రచయిత. 1533-32 మధ్య జీవించాడు. ఇతడికి మధ్య మధ్య, నిద్రలో మేలుకొంటేనే సౌఖ్యంగా ఉండేదట. నిద్ర సుఖాన్ని కోరుతుందంటారు. బాగా అలసిన వ్యక్తి ఇంత చోటు దొరికితే చాలు నిద్రపోడానికి ఉపక్రమించడం సర్వసాధారణం. అంత విలువైన నిద్రలో మధ్యమధ్యలో మేల్కొనడం మరెవరికైనా చికాకు తెప్పిస్తుంది. ఐతే మాంటీగ్ మాత్రం తనని అప్పుడప్పుడు నిద్ర నుంచి లేపమని తన సేవకుడికి చెప్పేవాడట. ఈ కోవలోనే ఇంగ్లాండ్‌కు చెందిన బహుభాషావేత్త, తత్వవేత్త చార్లెస్ కే ఆగ్‌డెన్ ఎప్పుడో తెల్లవారుజామునగానీ కునుకుతీసేవాడుకాదు. అతను రాత్రంతా లండన్, కేంబ్రిడ్జ్ లలో తిరిగేవాడు. ఇలాగే హెన్రీ లీవార్నర్ సాయంకాలం సూర్యాస్తమమైన తర్వాత ప్రారంభించి మర్నాడు సూర్యోదయం దాకా పుస్తకాలు చదివేవాడు. రోజూ తెల్లవారుజామున 4 గంటలకు భోజనం చేసి పడుకుంటే తిరిగి సాయంకాలం నిద్ర లేచేవాడంట. వింతగా లేదూ?
1711-1794కు చెందిన ఆస్ట్రియా యువరాజైన
వెంజెల్ రీట్బెర్గ్ రోజుకు 30 సార్లు బట్టలు మార్చేవాడు. ఈయన అలవాటు ఈవిధంగా ఉంటే
ఇంగ్లండ్ రాజు 1వ
జేమ్స్ వేసుకున్న బట్టలు చిరిగి పీలికలు
అయ్యే దాకా కొత్తబట్టలు
కొనేవాడుకాదు. ప్రపంచ ప్రఖ్యాత శాస్త్రవేత్త సర్ ఐజాక్ న్యూటన్ పరిస్థితి మరీ
విచిత్రం. ఆయన తన చొక్కా బొత్తాలు పెట్టుకోకుండానే యూనివర్సిటీ డైనింగ్ హాల్‌కి
వెళ్ళేవాడు. మరికొన్నిసార్లైతే
ప్యాంటు బొత్తాలు కూడా పెట్టుకోకుండానే వెళ్ళేవాడు.
పాకిస్తాన్‌ను పరిపాలించిన మొహమాద్ ఖాన్ రకరకాల బూట్లను సేకరించేవాడు. ఈయన అలవాటు
ఈవిధంగా ఉంటే ఇంగ్లాండ్‌కు చెందిన ఫ్రాన్సిస్ హెన్రీ ఎగర్టోన్ ఒక జోడు ఒక్కసారి
మాత్రమే వేసుకునేవాడు. డయానా భర్త చార్లెస్ రాకుమారునికి మరో వింత అలవాటు.
అతను లెట్రిన్ ప్లేట్లను వేలాదిగా సేకరించి భద్రపరిచాడు.
లోభులకు కూడ వింత అలవాట్లు ఉన్నాయంటే
నమ్మకతప్పదు మరి.
హైదరాబాద్ నైజామైన మీర్ ఉస్మాన్ ఆలి ప్రపంచంలోనే గొప్ప
ధనవంతుడైనప్పటికీ పరమ లోభి. అతను పాత దుప్పటిని పరుచుకొని నిద్రించేవాడు. అంతే
కాకుండా హంసతూలికా తల్పంలాంటి పట్టె మంచంపై నిద్రించే సకల సౌఖ్యాలున్నప్పటికీ
ఇనుప
మంచం మీద మాత్రమే నిద్రించేవాడు. ఇతని బాత్ రూం ఎప్పుడూ తాళం పెట్టేది ఉండేది.
దానిలో అమూల్యమైన వస్తువులున్నాయనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఆయనగారు రెండు
నెలలకొక్కసారి
మాత్రమే స్నానం చేసేవాడు మరి. ఇంగ్లండుకు చెందిన మడ్యూ రానిన్సన్ అనే
జమిందారు సదా నీటిలో మునిగి తేలుతూ ఉండేవాడు. గంటలకొద్దీ నీళ్ళలో గడిపేవాడు. ఇలా
కొందరి అలవాట్లు ఎదుటి వారికి వినోదాన్ని పంచుతుంటే ఇంగ్లండుకు చెందిన ఫ్రాంక్
బక్లాండ్ అలవాటు ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఆయన తినని ఆహారం అంటూ ఉండేది కాదు. ఎవ్వరూ
తినని మాంసాలన్నీ ఎంతో ఆప్యాంగా తినేవాడు. ఒకసారి యార్క్ ఆర్చ్ బిషప్‌తో విందు
ఆరగిస్తుండగా భద్రపరచిన 14వ లూయీ రాజు గుండెను అతగాడికి చూపించారట. అంతే. వెంటనే
దాన్ని లాక్కుని రాజు గుండె నేనెప్పుడూ తిన్లేదు అని దాన్ని బక బకా ఆరగించడం
ప్రారంభించాడట.
వింత అలవాట్లలో మన తెలుగు వారూ తక్కువేం కాదు. మనసు కవిగా పేరొందిన ఆత్రేయ చెన్నై నగరంలో రోజంతా కారులో తిరుగుతూ పాట రాసేవాడు. లేకపోతే ఆయనకు రాయాలనే మూడ్ వచ్చేది కాదట. వింత అలవాట్లకు మన రాజకీయ నాయకులు పెట్టింది పేరు. రాజకీయ నాయకులందరిలోనూ సాధారణంగా కనిపించే ఒకే ఒక్క మూకుమ్మడి అలవాటు వారు ప్రసంగిస్తూ "మరి" అనే మాటను ఎక్కువసార్లు వాడటం. ఈసారి జాగ్రత్తగా పరిశీలించండి "మరి".
ఇలా వింత అలవాట్ల వింతలు ఇన్నని చెప్పనలవి గాదు.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in