|
www.telugudanam.co.in చీరాల |
పత్రికలలో తెలుగుదనం |
మా అనుబంధ వెబ్సైట్.. |
|||
| తెలుగుదనం బ్లాగు | |||||
| మా గీతా.కో.ఇన్ |
వృద్ధ తరంగం - విశేషాలు
60 లేదా 60 సంవత్సరాలకు మించిన వ్యక్తులను ఐక్యరాజ్య సమితి జనాభా విభాగం వారు వయసుమళ్ళిన వారిగా భావిస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి 10 మందిలో ఒక వ్యక్తి 60 లేదా అంతకు మించిన వయసు కలిగివున్నారు. 2050 నాటికి మన జనాభాలోని 27 శాతం, 80 లేక అంతకుమించిన వారితో కూడివుంటుంది. వయసు మళ్ళిన వారిలో అధిక సంఖ్యాకులు ఆడవారు. 80 అంతకు మించి వయసున్న వారికో ఆడవారి శాతం 65. ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న వయసుమళ్ళినవారి సంఖ్య ప్రభుత్వాల వరకూ, సాంఘిక, ఆర్ధిక సిద్ధాంతాలతోపాటు సామాజిక సాంస్కృతికపరమైన సమస్యలను తెచ్చిపెడుతున్నప్పటికీ వయసు మళ్ళీన తరువాత కూడా సమాజాభ్యుదయంలో పాలుపంచుకున్న వారెందరో ఉన్నారు. 90 దాటిన వారిలో ఎందరో ఉత్సాహవంతులూ ఉన్నారు. 100కి చేరినా నవ యువకులతో పోటీ పడుతూ సాంఘిక కార్యకలాపాలలో పాలుపంచుకుని వృద్ధాప్యం శాపం కాదని ఋజువు చేసిన మహనీయులూ ఉన్నారు.
రోమన్ దేశస్థుడైన కాటో (క్రీ.పూ. 234-149) రాజనీతిజ్ఞుడు, రచయిత. ఇతడు తన 80వ ఏట గ్రీకు భాషను అభ్యసించాడు.
గోథె (1749-1832) వెయిమర్ వద్ద చివరివరకు కష్టపడుతూ 80 సంవత్సరాలు పూర్తిగా నిండిన తరువాత తన ఫౌస్ట్ను పూర్తి చేశాడు.
వాల్టర్ సావేజ్ లాండర్ (1775-1864) ప్రముఖ రచయిత. పెరిక్లస్ అస్పాసియాలో ప్రేమను చిత్రించే తన సుప్రసిద్ధ రచన "ఇమేజినరీ కాన్వర్సేషన్స్"ను తన 85వ ఏట రచించాడు.
గ్లాడ్‌స్టోన్ (1809-1898) తన 83వ ఏట ఇంగ్లాండు ప్రధానమంత్రి పదవీ బాధ్యతలను నిర్వహించాడు.87వ ఏట పెద్ద పెద్ద సభలలో ఉపన్యసించాడు.
బెంజమిన్ దిస్రేలి : సామ్రాజ్యపు బాధ్యతను వహించే ప్రధాన మంత్రి బాధ్యతను ఇతడు తన 75వ ఏట చేపట్టాడు. అంతేకాకుండా మంచి నవలలను వ్రాశాడు.
వికటర్ మారీ హ్యూగో (1802-1885) : అద్భుతమైన తాజాతనంతోనూ, శక్తితోనూ తన 83వ ఏట చనిపోయేవరకూ రాస్తూనే వున్నాడు.
టెన్నిసోన్ : ప్రపంచ ప్రఖ్యాతి పొందిన తన రచన "క్రాసింగ్ ది బార్"ను ఇతడు తన 80వ ఏట పూర్తి చేశాడు.
రాబర్ట్ బ్రౌనింగ్ : తన రెండు అద్భుతమైన కవితలను రివెరి, ఎపిలోగో టు అసొలాండో లను తన 77వ ఏట చనిపోవడానికి కొంత ముందు వ్రాశాడు.
వాన్ మోల్టకే : ఇతడు 70 ఏళ్ళ వయసులో జర్మనీకి సైన్యాధ్యక్షుడిగా ఉంటూ ఫ్రాన్స్‌కు విరుద్ధంగా పోరాటాన్ని నడిపాడు.
రాబర్ట్స్ : దక్షిణాఫ్రికాలో బోయర్స్ను ఎదిరించి (1899-1902) పోరాటాన్ని జరిపారు. వయసు తక్కువ విన్న యుద్ధ జనరల్స్ విఫలులు కాగా పరిస్థితి చలా అపత్కరంగా తయారయింది. దాదాపుగా 70 సంవత్సరాల వయసున్న జనరల్ రాబర్ట్స్కు సైన్యాధ్యక్ష పదవి ఇవ్వబడింది. చూస్తుండగానే ప్రజలు రానున్న భయంకర పరిస్థితులను గురించి భయపడుతున్న తరుణంలో బ్రిటిష్ సైన్యాన్ని గెలుపు మార్గం వైపుకు తీసుకెళ్ళగలిగారు.
విన్స్టన్ చర్చిల్ : 80 ఏళ్ళ పైబడ్డ వయసులో రెండవ ప్రపంచ యుద్ధం ముమ్మరంగా జరుగుతున్నప్పుడు తన దేశ ప్రధాన మంత్రి పదవిని చేపట్టి బ్రిటిష్‌ను కాపాడగలిగాడు.
కల్నల్ సాండర్స్ : తన 65వ ఏట దివాలా పరిస్థితిని ఎదుర్కొన్నా ఇతడు సుప్రసిద్ధ "కెంటుకీ ఫ్రయిడ్ చికెన్ రెస్టారంట్"ను స్థాపించాడు. ఆ తరువాత 10 సంవత్సరాలకు అతడొక మల్టీ మిలియనీర్ కాగలిగాడంటే అతడు ఉండకుండా తాను అనుకున్నట్లు ఉండగలగడం వల్లే కాగలిగాడు.
మహాత్మా గాంధి : తన 79వ ఏట కూడా చివరి శ్వాస వరకు దేశ పురోభివృద్ధికే పాటుపడ్డాడు.
అలాగే రాజాజీ, పెరియార్ రామస్వామి నాయకర్లు దక్షిణ హిందూ
దేశపు మేధా సంపన్నులైన రాజకీయవాదులు. వీరు కష్టపడి పనిచేసిన సంఘ సంస్కర్తలు. 80
ఏళ్ళ వయసులో కూడా వీరు తమ కార్యకలాపాలను కొనసాగించారు.
భారతీయ క్రికెట్ మాంత్రికుడు దేవధర్ నూరు సంవత్సరాలు జీవించాడు. చివరి వరకూ క్రికెట్ ఆట పురోభివృద్ధికి పాటుబడ్డాడు.
బాబా ఆంటే 8 దశాబ్దాలుగా తన సంఘ సేవా కార్యక్రమాలను నిర్విఘ్నంగా కొనసాగిస్తూ వచ్చాడు.
డాక్టర్ మోక్షగుండం విస్వేస్వరయ్య పేరుమోసిన ఇంజనీరు. దేశభక్తుడు. ఇతడు 100 సంవత్సరాల 7 నెలలు జీవించాడు.
చివరి వరకు మెదడు పని చేస్తుండగా భారత మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ 100 ఏళ్ళ వరకు చురుగ్గా ఉండేవారు.
ప్రభుత్వ ఉద్యోగం నుండి పదవీ విరమణ పొందిన తరువాత డాక్టర్ ఏ. లక్షణ్ స్వామి మొదలియార్ మద్రాస్ విశ్వ విద్యాలయపు ఉపాధ్యక్షుడయ్యారు. ఆయనా పదవిని 27 సంవత్సరాలపాటు తన 80వ ఏట కూడా ఏకధాటిగా, ఎంతో సమర్ధవంతంగా నిర్వహించాడు.
సి.సుబ్రహ్మణ్యం రెండవ స్వాతంత్ర్య సంగ్రామం జరపాలన్న ఉద్యమానికి, నిరక్షరాస్యతనూ, పేదరిక నిర్మూలనకూ పిలుపునిచ్చి దాన్ని సాధించేందుకు తన 90వ ఏట కూడా పాటుపడ్డాడు.
82 సంవత్సరాల వయసు వచ్చేంత వరకూ విక్టోరియా మహారాణి అతి విశాల బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పాలించింది.
అమెరికన్ వ్యాసకర్త, వేదాంతి అయిన రాల్ఫ్ వాల్డో ఎమర్సన్ (1803-1882) తన ముసలితనాన్ని చిరునవ్వుతోనూ, సంతోషంగానూ స్వీకరించాడు. దీనిని అతడు యవ్వనాన్ని స్వీకరించినంత ఆనందంగా స్వీకరించాడు.
జూలియావర్డ్ హోవే అను అమెరికన్ ధర్మదాత మరియు కవయిత్రి "నా ఆరోగ్యం చాలా సజావుగా ఉంది.నాలో ఇంకా యవ్వనం ఉంది" అని తన 91వ యేట చెప్పింది.
90వ ఏట ప్లాబో పికాసో చిత్రాలు వేశాడు, శిల్పాలు చెక్కాడు.
91వ ఏట ఏమన్ డి వాలెరా ఐర్లండ్ అధ్యక్ష్య పదవి స్వీకరించాడు.
84వ ఏట సోమర్సెట్ మాం "పాయింట్స్ ఆఫ్ వ్యూ" రచించాడు.
82వ ఏట చర్చిల్ "హిస్టరీ ఆఫ్ ది ఇంగ్లీష్ స్పీకింగ్ పీపుల్" రచించాడు".
93వ ఏట జార్జ్ బెర్నార్డ్ షా "ఫార్‌ఫెచ్‌డ్ ఫేబిల్స్" నాటకాన్ని రచించాడు.
100వ ఏట గ్రాండ్మో మోసెస్ వర్ణ చిత్రాలు వేస్తుండేది.
ఇటీవల తన 83వ ఏట అమెరికా మాజీ అధ్యక్షుడు సీనియర్ బుష్ పారాచూట్ విన్యాసం చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యచకితుల్ని చేశారు.
మీరు మీ విశ్వాసమంత చిన్నవారు. మీ సందేహాలంత ముసలివారు. మీ ఆత్మవిశ్వాసం అంత చిన్నవారు. భయపడినంత ముసలివారు. మీ ఆశలు కోరికలంత మీరు చిన్నవారు. మీ నిరాశలంత ముసలివారు. మనల్ని మనం అర్ధం చేసుకోవడం మన విలువల్ని తెలుసుకోవడం అన్నవి మన జీవితపు ప్రతి మజిలీలోనూ, ముఖ్యంగా విశ్రాంతి పుచ్చుకున్న తరువాతనూ (దీన్నే మనం బంగారపు వయసు అంటాము) చాలా ముఖ్యమైనవి. ఈవిధంగా అర్ధం చేసుకోవడం ద్వారానే మన భవిష్యత్తుకు ఒక ప్రణాళికను తయారుచేసుకుని దాని ప్రకారం నిర్ణయించుకోవచ్చును. దాని ఆధారంగానే ఈ భూమిపై మన జీవిత పద్ధతిని, శైలిని పూర్తి చేసుకునే నిర్ణయం తీసుకుని మన ఇంద్రియాలనూ, మన మనుగడ ఉద్దేశాన్నీ పూర్తిచేసుకోవచ్చు. వయసుమళ్ళిన కాలం అన్నది మనం దాన్ని తయారుచేసుకునే విధానాన్నిబట్టి ఉంటుందన్న పాఠాన్ని మనం తప్పక నేర్చుకోవాల్సివుంటుంది. జీవితంలో అనారోగ్యం అన్న చీకటి ఆవరించినా దాన్ని ధైర్యంతోనూ, దృఢ నిర్ణయంతోనో ఎదుర్కోవాలి. మంచి వెలుగుతో కూడిన కాలం కారు చీకటి తరువాత వచ్చే కాంతివంతమైన ఉదయంలాగా తప్పక వస్తుంది. ముసలితనాన్ని ధైర్యంతోనూ, ఆత్మవిశ్వాసంతోనూ ఎదుర్కోవడాన్ని నేర్చుకుందాం. మన వయసుమళ్ళిన జీవితాన్ని కార్యకలాపాలతో నింపుకుని హుందాగా ముసలితనాన్ని ఆహ్వానిద్దాం.
వెనుకకు | మొదటి పేజీ | ఆఖరి సారి మెరుగు పరిచిన తేది: 25-03-2009 | హక్కులు: తెలుగుదనం.కో.ఇన్ | రూపకర్త: గీతా.కో.ఇన్ | ప్రశ్నలు, సలహాలు, సూచనలకు: editor@telugudanam.co.in